బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్.. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి సంబంధించిన ఈడీ దర్యాప్తు జోరందుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించిన ఈడీ.. బుధవారం (ఆగస్టు 6) హీరో విజయ్ దేవరకొండను విచారించనుంది.  నిషేధానికి గురైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి స్టార్ సినిమా నటుల వరకూ పలువురిపై నజర్ పెట్టిన ఈడీ వారికి నోటీసులు పంపి వరుసగా విచారణకు పిలుస్తున్నది.  బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుని బలవన్మరణాలకు పాల్పడిన వారెందరో ఉన్నారు. అటువంటి బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలే ప్రమోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈడీ వారిని విచారణ చేస్తున్నది. అందులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండను ఈడీ విచారించనుంది. ఇక ఇదే కేసులో మరో నటుడు దగ్గుబాటి రాణాను ఈ నెల 11న, నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మిని ఈ నెల 13న ఈడీ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ ను గత నెల 30 దాదాపు ఐదుగంటల పాటు విచారించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.  

బీఆర్ఎస్‌తో బాల్క సుమన్‌కు రుణం తీరిపోయిందా?

గులాబీ పార్టీలో ముఖ్యనేతలకు అత్యంత వీరవిధేయుడు మాజీ ఎంపీ కమ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. పార్టీలోని ముఖ్య నాయకులలో ఒకరిగా ఎదిగిన దళిత, విద్యార్ధి నాయకుడాయన.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు..  తెలంగాణ ఆవిర్భావం తర్వాత తన రాజకీయ గురువు,  ఆర్ధికంగా ప్రోత్సహించిన గడ్డం వివేక్‌పై పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. తర్వాత తెలంగాణ ముందస్తు ఎన్నికల్ల చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో అప్పటి వరకూ అంత హడవుడి చేసిన సుమన్ ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.   ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం, టీఆర్ఎస్వీకి 2007లో అధ్యక్షుడిగా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీకి 2010లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.  2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ పై గెలుపొందారు.  2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలిచారు. తర్వాత బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముందు నుంచి అత్యంత సన్నిహితుడైన  బాల్క సుమన్  2022 జనవరి 26న గులాబీ  పార్టీ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా తెగ హడావుడి చేసిన బాల్క సుమన్ దళిత కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే కేటీఆర్ ఆశీస్సులున్నా..  కేసీఆర్ మాత్రం ఆయనకు మంత్రిగా అవకాశమివ్వలేదు. చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి దళిత కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన సుమన్ ప్రభుత్వ విప్ పదవితో తృప్తి పడాల్సి వచ్చింది.  సీన్ కట్ చేస్తే ఆ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదంట.  గత ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్ కు దమ్ము ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన బాల్క సుమన్ ఓటమి పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట.కేవలం తన అవసరానికి చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు.. ఓడిపోయాక కనీసం ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని  బీఆర్ఎస్ వర్గాలే చర్చించుకుంటున్నాయట. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే  పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్ కూడా తలో దారి అన్నట్టు అయ్యారట..  చెన్నూరు నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అడపాదడపా వచ్చే నాయకులు తప్ప బీఆర్ఎస్‌కు చెన్నూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకుండా పోయిందట.. ఏదిఏమైనా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళనైనా   మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో అడుగుపెడతారా? లేక చెన్నూరు నియోజకవర్గంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నారా? వేచి చూడాలి మరి.

మరో విమాన ప్రమాదం.. ఉత్తర అరిజోనాలో నలుగురి మ‌ృతి

ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్‌లో మంగళవారం( ఆగస్టు 5)  వైద్య రవాణా విమానం కుప్పకూలిపోయింది. విమానంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.  చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో  విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక పేషెంట్‌ ఉన్నారు. ఈ నలుగురూ కూడా మృత్యువాత పడ్డారు. అయితే  ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన సీఎస్ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం..  ఫీనిక్స్‌కు ఈశాన్యంగా 483 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు  తెలిపారు.  ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఎఫ్ఏఏ  దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. కాగా.. జనవరిలో ఫిలడెల్ఫియాలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయి ఎనిమిది మంది మరణించారు. ఆ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయడం లేదని తెలిపింది.

భార‌త్ పై ట్రంప్ కి ఇంత మంట ఎందుకంటే?

బ్రిక్స్ దేశాలు ఎన్ని? ఈ దేశాలు కొత్త క‌రెన్సీ ఏర్పాటు చేసుకుంటున్నాయా?  ఆ భయమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను భయపెడుతోందా? బ్రిక్స్ కూటమికి భారత్ సారథ్యం కారణంగానే ట్రంప్ ఇండియాపై  కారాలూ, మిరియాలూ నూరుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.   బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా ఇలా మొత్తం 11 దేశాలు బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు.   అయితే.. బ్రిక్స్ దేశాలు ఇప్ప‌టి వ‌ర‌కూ తమ సొంత కరెన్సీని ఏర్పాటు చేయలేదు కానీ.. ఇప్ప‌టికే ఈ దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక కరెన్సీల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.. ఆపై తమ సొంత చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా యూరో, డాల‌ర్ తో స‌మానంగా ఒక క‌రెన్సీ రూపొందించే దిశ‌గా ఈ దేశాలు అడుగు వేస్తున్నాయి. ఇదే ట్రంప్ కి కంట‌కింపుగా మారింది. ఆయ‌న ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించే నాటో యురోపియ‌న్ దేశాల‌కు సొంత క‌రెన్సీ ఉండొచ్చు.  అదే ఏషియ‌న్ దేశాల‌కు ఉండొద్దన్నదే ఆయన ఉద్దేశం. అందుకు భిన్నంగా బ్రిక్స్ దేశాలు అడుగులు వేయడంతోనే ట్రంప్ ఉలికిపాటుకు, ఉక్రోషానికి గురైతున్నారు.   ఉక్రెయిన్ లో మార‌ణ హోం జ‌రుగుతుంటే ర‌ష్యా నుంచి చ‌మురు ఎలా కొంటార‌ని ప్ర‌శ్నించే ట్రంప్.. మ‌రి అంత ర‌క్త‌పాతం జ‌రుగుతుంటే.. ఉక్రెయిన్ లో ప‌దేళ్ల ఖ‌నిజ త‌వ్వ‌కాలకు అమెరికా ఒప్పందం ఎందుకు, ఎలా చేసుకున్నట్లు?  ఈ విష‌యంలో ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌రు. ఎక్క‌డా దాన్నొక అనైతిక వ్య‌వ‌హారంగా భావించ‌రు. త‌న చేతుల‌కు ఇంత‌టి ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించుకుని.. ఇత‌రుల‌ నైతికతను ప్రశ్నిస్తారు. ఓవ‌రాల్ గా భార‌త్  ర‌ష్యా, చైనాతో స‌మానంగా స్వ‌యంప్ర‌తిప‌త్తిగ‌ల దేశంగా ఎద‌గడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎళ్లకాలమూ   డిపెండెంట్ లాగానే ఉండాలి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకూడదన్నదే అమెరికా అధ్యక్షుడి ఉద్దేశంగా కనిపిస్తోంది.  అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గ‌జ సంస్థ‌ల్లో భార‌తీయుల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆయా సంస్థలకు హుకుంలాంటి సూచన చేశారు. తాజాగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్ర‌క‌ట‌న‌బ‌ట్టీ చూస్తే.. అమెరికాలో అమ్మే ఐ ఫోన్లలో  త‌యార‌వుతున్న‌వే ఎక్కువ‌ని తేలింది.  దానికి తోడు భార‌త్ ని ఫ్రాన్స్ వంటి దేశాలు నాయ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కోర‌డం. గ్లోబ‌ల్ సౌత్ కి మోడీ సైతం నేతృత్వం వ‌హించేలాంటి అడుగులు వేయ‌డం.. వంటివి ట్రంప్ కి అస్స‌లు గిట్ట‌డం లేదు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ లో మోడీ ఆయుధాల‌పై దృష్టి సారించ‌డం. ఆపై కొన్ని బ్రిక్ దేశాల‌కు ఆయుధాల‌ను చౌక‌గా స‌ర‌ఫ‌రా చేసే సామ‌ర్ధ్యం క‌లిగి ఉండ‌టంతో.. ట్రంప్ తమ ఆయుధ వ్యాపారానికి మోడీ రూపంలో భార‌త్ అడ్డు త‌గులుతుండ‌టం కడుపుమంట కలిగిస్తోంది. అందుకే అన‌వ‌స‌రంగా వీసాల ర‌ద్దు, స్టూడెంట్స్ అని కూడా చూడ‌కుండా వేధింపులు,  అక్క‌డ నివ‌సించే భార‌తీయులు త‌మ సొంత కుటుంబాల‌కు డ‌బ్బు పంపాల‌న్నా సుంకాల విధింపు.. తాజాగా  25 శాతం సుంకాల‌ు,  జ‌రిమానాగా అద‌న‌పు వడ్డింపులు.. వంటి   చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ‌కు బ‌ద్ధ శ‌తృవైన ర‌ష్యాతో భార‌త్ చెలిమి చేయ‌కూడ‌దంటారు ట్రంప్. మ‌రి భార‌త్ కి ఆగ‌ర్భ శ‌తృవైన  పాకిస్థాన్ లో త‌మ కుటుంబ సంస్థ డ‌బ్ల్యూఎల్ఎఫ్ చేత పెట్టుబ‌డులు పెట్టించ‌వ‌చ్చు. ఆపై పాకిస్థాన్ లో పెట్రోలు నిల్వ‌ల కోసం కోట్ల డాల‌ర్లు  కుమ్మ‌రించి ప‌రిశోధ‌న‌లు చేయించ‌వ‌చ్చు. ఆ దేశం భార‌త్ కి వ్య‌తిరేకంగా టెర్ర‌రిస్టుల‌ను పెంచి పోషించ‌డానికి వీలుగా ప్ర‌పంచ బ్యాంకు వంటి సంస్థ‌ల ద్వారా ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా వేల కోట్ల రుణాలు ఇప్పించ‌వ‌చ్చు. భార‌త్ కి వ్య‌తిరేకంగా ట్రంప్ ఇన్ని చేయొచ్చుగానీ.. భార‌త్ మాత్రం.. త‌న స్వ‌యం  స‌మృద్ధిని మాత్రం కాంక్షించ‌వ‌ద్దు.   ఇదెక్క‌డి లెక్క‌? అని ప్ర‌శ్నిస్తోంది స‌గ‌టు భార‌తీయం.  అందుకే  కేంద్ర మంత్రి  ఎస్ జైశంక‌ర్  భార‌త ప‌రిపాల‌న వాషింగ్ట‌న్ డీసీలోని వైట్ హౌస్ నుంచి జ‌ర‌గ‌ట్లేదు.. కావాలంటే వారు పాకిస్థాన్ని అక్క‌డి నుంచి ప‌రిపాలించుకోవ‌చ్చు. మాకెలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు. మ‌రి చూడాలి ఈ సుంకాల యుద్ధం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో. 

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ప్రచారంపై డ్రోన్లతో నిఘా

పులివెందుల అంటే జగన్ అడ్డా. అలాంటి అడ్డాలో జగన్ పార్టీ ఎదురీదుతోంది. ఔను పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ చమటోడుస్తోంది. అయినా కూడా విజయంపై ఆ పార్టీ శ్రేణులకు విశ్వాసం కలగడం లేదు. వాస్తవానికి పులివెందులలో ఇజ్పుడు జరగనున్నది ఒక మండలానికి సంబంధించిన  జడ్పిటిసి  ఉప ఎన్నిక. అయినా కూడా రాజకీయ వేడి అమాంతంగా పెరిగిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు మించిన టెన్షన్ వాతావరణం నెలకొంది.   శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారంపై డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.   వివాదాలకు తావు లేకుండా, ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఇందుంలో భాగంగా  జిల్లా ఎస్.పి  ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు  అత్యాధునిక డ్రోన్ కెమెరా ద్వారా నిఘా  పెట్టారు.   మంగళవారం (ఆగస్టు 5) పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లి, నల్లపురెడ్డి పల్లి, రాగిమాని పల్లి, రాయలాపురం ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. వివిధ పార్టీల అభ్యర్థులు చేస్తున్న ప్రచారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.   పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న అంచనాతో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేపడుతున్నారు. నేరుగా ఆయనే  పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నిక ప్రశాంతంగా సాగేందుకు చర్యలు చేపట్టారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొరసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం (ఆగస్టు 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 27 కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఆగస్టు5) శ్రీవారిని మొత్తం 72 వేల951 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 143 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం క్యైలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్న, జల ప్రసాదాలను పంపిణీ చేస్తున్నది. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసింది.

ఉత్తరాఖండ్‌ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతు

  ఉత్తరాఖండ్‌ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో వరద ఉధృతికి ధరాలీలోని హార్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంప్‌లో ఉన్న జేసీవో సహా ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. మరోవైపు.. వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు.  హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ప్రకృతి విలయంలో 60 మందికి పైగా ప్రజలు గల్లంతైన విషయం తెలిసిందే. 20-25 హోటళ్లు, నివాసాలు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సైన్యం సహాక చర్యలు చేపట్టింది.

నా తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో నేను లేను..మంత్రి కీలక వ్యాఖ్యలు

  మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందించారు.  మంత్రి పదవిపై తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు.  తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో తాను లేనంటూ వెంకట్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌లో తాను సీనియర్‌ మంత్రి అయినప్పటికీ హైకమాండ్‌ నిర్ణయమే కీలకమని చెప్పారు.  సీఎం, పీసీసీ చీఫ్‌ కలిసి పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాను మంత్రి పదవి ఇచ్చే.. ఇప్పించే పరిస్థితుల్లో లేనని తెలిపారు. అంతా హైకమాండ్‌, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. నేనే కాదు, ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.  కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారని మంత్రి అన్నారు. సినీ కార్మికుల వేతనాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని నిర్మాతలు మొండిగా ఉండకుదన్నారు. కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని, జీతాలు పెంచాలని సూచించారు.ఇదే విషయంపై పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రతకు లింకులు

  సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌ కోర్టులో గోపాలపురం పోలీసులు హాజరుపర్చారు. కస్టడీలో సంచలన విషయాలను పోలీసులు రాబట్టారు. పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.  అంతే కాకుండా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి అక్రమాలు జరిపినట్టు నిర్దారించారు. . గతంలో పిల్లల్ని అమ్ముతూ.. అరెస్ట్ అయిన నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఒక్కొక్క పిల్లాడిని రూ.3 నుంచి రూ.5 లక్షల రూపాయలకు నమ్రత కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు. పిల్లల అమ్మకాలతో పాటు యువతి యువకులను కూడా నమ్రత గ్యాంగ్ ట్రాప్ చేసిందని చెప్పారు.  యువతి , యువకుల వీర్యకణాలు అండాలను సేకరించి అమ్మేవారని పోలీసులు స్పష్టం చేశారు. నమ్రత ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్‌ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్‌ హెడ్స్‌తో కథ నడిపించారు

పేప‌ర్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాలి : కేటీఆర్

  దేశంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  కారు గుర్తును పోలిన సింబ‌ల్స్ దాదాపు 9 వ‌ర‌కు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు 2019 ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరిలో 5 వేల ఓట్ల‌తో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గెలిచారు. త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన బూర న‌ర్స‌య్య ఓడిపోయారు. కారు గుర్తును పోలిన రోడ్డు రోల‌ర్‌కు 27 వేల ఓట్లు వ‌చ్చాయి.  ఇలా ఎన్నో సంద‌ర్భాల్లో మా పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రిగింది. మొన్న జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 14 స్థానాల్లో 6 వేల కంటే త‌క్కువ ఓట్ల‌తో ఓడిపోయాం. కారు గుర్తును పోలిన గుర్తుల వ‌ల్లే న‌ష్టం జ‌రిగింది.  ఆ గుర్తులను కేటాయించవద్దని ఈసీకి కేటీఆర్ విన్నవించారు. అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే, జ‌ర్మ‌నీ, ఇట‌లీ కానీ, ఇంకా చాలా దేశాలు కొంత‌కాలం వ‌ర‌కు ఈవీఎంల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల్లో వాటిపై విశ్వాసం లేకుండా పోయింది.  ఈ క్ర‌మంలో ఈవీఎంల‌ను ర‌ద్దు చేసి పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో దాదాపు 100 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతున్న‌దని కేటీఆర్ తెలిపారు. పార్టీలు ఎన్నికల వాగ్థనాలు విస్మరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కేటీఆర్ కోరారు.  

ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా సిద్దం : రాజగోపాల్‌రెడ్డి

  మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో 33/11 కేవి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదని హాట్ కామెంట్స్ చేశారు.  తనకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమని ఇంతకంటే దిగజారి బతకలేన్నారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని  రాజగోపాల్‌రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇచ్చి తనలాంటి సీనియర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోదలచుకోలేదన్నారు. మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.   పదవి, పైసలు అన్ని వారే తీసుకుపోతున్నారని, కనీసం పదవి లేకున్నా పైసలు మునుగోడుకు రావాలి కదా అని కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీపడేది లేదని డిసైడ్ అయ్యానని, మీరు కూడా (ప్రజలు) డిసైడ్ అయ్యారా లేదా అంటూ ప్రశ్నించారు.  

కోర్టు వాయిదాలలో జ‌గ‌న్ రికార్డ్.. ఏళ్ల తరబడి బెయిలు మరో రికార్డ్ ?

ఏంటీ జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌పై ఉన్న 31 కేసుల‌లో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్ర‌పంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయ‌న 6904 కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు చేశారా?  ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   బేసిగ్గా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్న‌సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌నిపుడు సీఎం కాదుకదా...  క‌నీసం ప్ర‌తిప‌క్ష  నేత కూడా కారు. ఒక సాధార‌ణ ఎమ్మెల్యే,  అయినా స‌రే ఎందుకు వాయిదాలు తీసుకుంటున్నారో అర్ధం కాలేదంటారు కొంద‌రు. ఒక వేళ ఈ వాయిదాల లెక్క క‌రెక్టే అనుకున్నా.. ఇన్ని కోట్ల రూపాయ‌ల మేర లాయ‌ర్ల కోసం ఖ‌ర్చు చేశార‌న్న‌ది న‌మ్మ‌శ‌క్యం కాలేదంటారు ఇంకొంద‌రు. మామూలుగా అయితే ఈ న్యాయ‌వాదులు ఇంత తీసుకోవాల‌న్న మాన్యువ‌ల్స్ ఉన్నాయ్. ఒక వేళ ఓపెన్ మార్కెట్లో ఆ రేటు ఎక్కువ‌గానే ఉండొచ్చు. కానీ ఇంత భారీ మొత్తం తీసుకుంటారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తోంది.   ప్ర‌స్తుతం చెక్క‌ర్లు కొడుతున్న లెక్క ప్ర‌కారం  చూస్తే జ‌గ‌న్ ఒక వాయిదా అడ‌గ‌టానికి త‌న లాయ‌ర్ కి చెల్లిస్తున్న ఫీజు రూ. 2 కోట్ల రూపాయ‌లుగా తెలుస్తోంది. ఇంత డ‌బ్బు ఎక్క‌డిది?  తాను అధికారంలో లేను కాబ‌ట్టి ఆఫీసు రెంటు క‌ట్ట‌డానికే డ‌బ్బుల్లేవంటూ ఏకంగా పార్టీ కార్యాలయాన్నే ఎత్తివేసిన జగన్.. తన కేసులలో ఒక వాయిదా కోరడానికి  లాయ‌ర్ ఫీజుగా అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఇస్తున్నారన్నది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  జ‌గ‌న్ అయితే గ‌త పదేళ్లకు పైగా బెయిలు మీద ఉన్న మాట వాస్త‌వం. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల్సిందిగా గ‌తంలోనే ఈడీ, సీబీఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌కు మొర పెట్టుకున్న మాట కూడా వాస్తవమే.   అయినా కూడా  జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ఇన్నేళ్ల పాటు బెయిలుపై బ‌య‌ట ఉండ‌టం ఆశ్చర్యం అంటారు పరిశీలకులు.  ఆ మాట‌కొస్తే ఇంత కాలం ఒక వ్యక్తి బెయిలుపై ఉండటం ఒక రికార్డు అంటారు. ఇలా ఇన్నేసేళ్లు బెయిలపై ఉండటం అన్నది   జ‌య‌లలిత, లాలూ ప్ర‌సాద్ వంటి వారికే సాధ్యం కాలేదు. అలాంటిది జ‌గ‌న్ కి ఎలా సాధ్యమౌతోందన్న వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా వ్యక్తం  చేస్తున్నారు కూటమి నేత‌లు. కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే.. జ‌గ‌న్ , బీజేపీకి మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఒప్పందం ఉందంటున్నారు. అందుకు మ‌ద్యం కేసును ఉదాహరణగా చూపుతున్నారు.   ఈ కేసులో చెవిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు అరెస్ట‌య్యారంటే అది కూట‌మి ప్ర‌భుత్వం వేసిన సిట్ వ‌ల్లనే త‌ప్ప కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లైన ఈడీ, సీబీఐ వ‌ల్ల కానే కాద‌ంటున్నారు. నిజానికి మ‌ద్యం కేసులో ఈడీకి కావ‌ల్సినన్ని సాక్ష్యాధారులు ఉన్నా కూడా  ఇన్వాల్వ్ అయ్యే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.  ఇలాంటి ప‌రిస్తితుల్లో జ‌గ‌న్ అరెస్టు, బెయిలు రద్దు అన్నవి అంత సులభం కాదన్న మాట కూడా రాజకీయ వర్గాలలో కాస్లంత గట్టిగానే వినిపిస్తోంది.   ఏది ఏమైనా జగన్ కేసుల వాయిదాలే ఒక రికార్డు అయితే ఇక  ఇన్నేళ్ల పాటు జగన్ బెయిల్ మీద  ఉండటం అన్నది మరో రికార్డు అంటున్నారు నెటిజనులు.  

బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డు..దిగబడిన వాటర్ ట్యాంకర్

  హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షాలకు నగరం అల్లకల్లోలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబ‌ర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాట‌ర్ ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు క్లీన‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు.. డ్రైవ‌ర్, క్లీన‌ర్‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. భారీ వ‌ర్షం కార‌ణంగానే రోడ్డు కుంగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు కుంగిన ఏరియాలో నాలా పైప్‌లైన్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. రోడ్డు కుంగ‌డంతో ఆ ఏరియాతో పాటు స‌మీప ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. వాట‌ర్ ట్యాంక‌ర్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మార్గదర్శిపై కేసు కొట్టివేత

మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది.  మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. హిందూ అవిభాజ్య కుటుంబ కర్త మరణించడంతో  మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చలేరని మార్గదర్శి సంస్థ  కోర్టుకు వివరించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసును 2018లోనే హైకోర్టు కొట్టివేయడం.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై సుప్రీం కోర్టు గత ఏడాది ఏప్రిల్ లో ఈ పిటిషన్లను తిరిగి హైకోర్టుకు పంపింది.  వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఈ కేసును కొనసాగించాలా? లేదా? అనేది తేల్చాలని హైకోర్టును ఆదేశించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, 2024 సెప్టెంబరు 26న హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అయితే, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు కూడా క్లెయిమ్‌తో ముందుకు రాలేదు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది.

మళ్లీ వర్షాలు వచ్చేశాయోచ్..భారీ రెయిన్ అలెర్ట్

  ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు. ఇవాళ  కూడా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ.  రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.. అయితే, కొన్నిచోట్ల అది ఆరెంజ్‌ అలర్ట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు తెలంగాణ లోని మేడ్చల్ మల్కాజిగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి,  ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.  

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం‌.. కొట్టుకుపోయిన ఇళ్లు

  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.  క్లౌడ్‌బరస్ట్‌  కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్‌ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆకస్మిక వరదలు సంభవించాయి.పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధరాలీ గ్రామాన్ని  ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ విపత్తులో దాదాపు 60 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు.  

వివేకా హత్య కేసు.. ఇక వైఎస్ అవినాష్ ముందస్తు బెయిలు రద్దేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది. దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ సుప్రీం కోర్టుకు నివేదించడంతో.. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు, అలాగే ఈ కేసులో బెయిలుపై బయటకు వచ్చిన ఇతర నిందితుల బెయిళ్ల రద్దు అవుతాయా అన్న కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇక సీబీఐ సుప్రీం కోర్టుకు వివేకా హత్య చేసులో దర్యాప్తు ముగిసిందని తెలియజేయడమే కాకుండా.. సుప్రీం ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. అంతే కాకుండా దర్యాప్తుకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది. అలాగే వైసీపీ హయాంలో   ఎంపీ అవినాష్ రెడ్డి ఆ దేశం మేరకే కడప పోలీసులు సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్‌లపై కేసులు నమోదు చేశారని సీబీఐ న్యాయవాది సుప్రీం కోర్టుకి తెలిపారు.  వైఎస్ వివేకా హత్య కేసులో  నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి దీనిని తిరుగులేని నిదర్శనంగా సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. అలాగే అవినాష్ సహా ఇతర నిందితుల బెయిళ్లు కూడా రద్దు చేయాలని కోరింది. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సునీతా రెడ్డి తరపు వాదిస్తున్న సిద్ధార్ధ లుద్రా అభ్యర్థన మేరకు  ఈ కేసు విచారణను మధ్యాహ్నం తరువాత చేపడతామని జస్టిస్ ఎంఎం సుదరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీంతో అవినాష్ ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ విచారణ ఈ మధ్యాహ్నం తరువాత హియరింగ్ కు వచ్చే అవకాశం ఉంది.   సీబీఐ అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని బలంగా చెప్పడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ అవినాష్ బెయిలు రద్దు కావడం అంటూ జరిగితే వివేకా హత్య కేసు ముగింపునకు వచ్చినట్లే అవుతుందనీ, ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులకు చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశాలు ఎంతో దూరంలో లేవనీ అంటున్నారు. 

బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు గుడ్ బై

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. అచ్చంపేట నుంచి బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో బాలరాజు భేటీ అవ్వడంతో  ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ.. బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్లు సమాచారం. గువ్వల బాలరాజు  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ..  కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. ఇప్పుడు  బాలరాజు తన నిర్ణయంతో  రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. గులాబీ బాస్ కేసీఆర్ తనకు అండగా ఉన్నంతవరకు తనను  ఎవరూ టచ్ చేయలేరంటూ ఆయన గతంలో నేనే రాజు నేనే మంత్రి  అన్న చందంగా వ్యవహరించేవారు. అటువంటి  బాలరాజు గులాబీ పార్టీ  బీజేపీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పార్టీకి రాజీనామా చేయడం క్యాడర్ని అయోమయంలో పడేసిందంట. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్   అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గువ్వల బాలరాజుకు రాజకీయ భవిష్యత్ ను ఇచ్చింది గులాబీ పార్టీనే. మొదటినుండి దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన గువ్వల బాలరాజు.. అచ్చంపేట నియోజకవర్గంలో  తన మాటే శాసనం అన్నట్టుగా పెత్తనం చేశారని చెబుతారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కూడా బాలరాజు సంచలనంగా మారారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో పరాజయం చవిచూశాడు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన ఆయన అధిష్ఠానంతోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.   గువ్వల బాలరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపిన రాజీనామా లేఖలో  తానీ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకున్నది కాదనీ,  అయితే తనకు అవసరమైన సమయంలో పార్టీ నుంచి  మద్దతు రాకపోవడంతో మనస్తాపానికి గురై  రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తన రాజీనామాతో పాటుగా..   నియోజకవర్గంలో ఉన్న తన అనుచర గణాన్ని సైతం తన వెంట తీసుకువెళ్లేందుకు గువ్వల బాలరాజు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గువ్వల బాలరాజు నిర్ణయంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి . ఆయన గులాబీ నీడను వీడి కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం కొనసాగుతుంది.  దానికి అనుగుణంగానే గత కొద్దిరోజులుగా తన సన్నిహితులతో  ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి  మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చేందుకు గులాబీ పార్టీ నిర్ణయం తీసుకోవడమే బాలరాజు రాజీనామాకు కారణంగా తెలుస్తున్నది.  అదలా ఉంటే  గువ్వల బాలరాజు తన అనుచరుడితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్‌ని బిజెపిలో విలీనం చేస్తున్నారనీ.. అంతకంటే ముందే బిజెపి పార్టీలో చేరడం ఉత్తమం అని భావించి పార్టీకి రాజీనామా చేశానని బాలరాజు సదరు నాయకుడితో మాట్లాడినట్లు ఉన్న ఫోన్ కాల్  వైరల్ అవుతోంది. ఫైనల్ గా తాను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాను అనే విషయాన్ని ఈ నెల  9న ప్రకటిస్తానని బాలరాజు అంటున్న మాటలు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో  గువ్వల బాలరాజు టచ్‌లో ఉన్నారంటున్నారు.  బాలరాజుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందన్న టాక్ గులాబీ శిబిరంలో గుబులు రేపుతోందంటున్నారు.

బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై బండి సంజయ్ కూడా స్పందించారు. సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు.  మొదట జూలై 17న సిట్ నుంచి నోటీసుల అందుకున్న కేంద్ర మంత్రి జూలై 24న విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందే ఫిక్స్‌ అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు. మరోవైపు భార్యభర్తల బెడ్ రూమ్‌లో మాటలను ట్యాప్ చేయడాన్ని బీజేపీ అధిష్టానం ఇప్పటికే సీరియస్‌గా పరిగణిస్తోంది. అదేవిధంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ , కేటీఆర్ పాత్రపై ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ అంగీకరిండం, డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం‌పై జాతీయ స్థాయిలో చర్చకు కమలం పార్టీ సిద్ధమవుతున్నట్లుగా టాక్.