క్రమబద్దీకరిస్తామని చెప్పి కొలువులే పీకేసిన కేసీఆర్! రోడ్డున పడ్డ ఉద్యోగులు
తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు.. అంతా సర్కార్ ఉద్యోగులే ఉంటరు.. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిన్రు.. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరిని రెగ్యులర్ చేస్త.. ఇదీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాట..
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిండు.. ఏండ్ల తరబడి పని చేయించుకున్నరు. హోంగార్డుల పరిస్థితి అయితే దారుణంగా ఉండేది. కనీస వేతనాలు ఇచ్చేది కాదు. లేబర్ కేసు పెట్టమని నేనే చెప్పిన. నెలో, వారం రోజులో అంటే ఏదో అనుకుంటం. ఏండ్ల తరబడి పని చేయించుకుని ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ఎట్ల బతుకుతరు? ఇది దుర్మార్గం.. వాళ్లందరినీ రెగ్యులర్ చేస్తం. ఇది 27 అక్టోబర్ 2017న నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రకటన..
గత ప్రభుత్వాల్లో అర్థాకలితో అలమటించిన ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడంతో .. తెలంగాణలో లక్షకు పైగా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆనందపడిపోయారు. కానీ ఆరేండ్లయినా కేసీఆర్ హామీ అమలు కాలేదు.. వారి ఆశలు తీరలేదు. ఆర్థిక శాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను 2017లోనే సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుమారు లక్షా 28 వేల మంది ఇలా పని చేస్తున్నట్లు లెక్క తేల్చింది. అయితే రెగ్యులరైజేషన్ ప్రక్రియ మాత్రం అడుగు ముందుకు పడలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, డాక్టర్లు, నర్సులు ఇలా .. ఏ ఒక్కరినీ కూడా పర్మినెంట్ చేయలేదు కేసీఆర్ సర్కార్. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని మరోసారి ప్రకటించారు కేసీఆర్. ముందుగా ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నామన్నారు. ఐకేపీ ఉద్యోగులను ఆహార శుద్ది కేంద్రాల్లో వాడుకుంటామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ మొదలే కాలేదు..
ఆరేండ్లుగా కొలువులు క్రమబద్దీకరణ కాకపోగా.. చివరకు ఉన్న ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తెలంగాణలో నెలకొంది. గత ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన సీఎం కేసీఆర్.. తన పాలనలోనూ అదే వైఖరి అవలంబిస్తున్నారు. కరోనాతో ఏర్పడిన ఆర్థిక లోటును సాకుగా చూపి వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఖజానాపై భారం పడుతుందనే కారణంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సెక్షన్ల లెక్కన తీసేస్తూ ఇంటికి పంపిస్తోంది. 3 నెలల టైమ్‌లో ఉపాధి హామీ, భగీరథ, హార్టికర్టిల్చర్ డిపార్ట్ మెంట్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. కమర్షియల్ ట్యాక్స్ ,జీఎస్టీ విభాగాల్లో పని చేస్తున్న
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు డిసెంబర్ తో లెక్క సరి చేస్తోంది. కొత్త సంవత్సరంలో కొలువుకు రావద్దని కమర్షియల్ ట్యాక్స్ కాంట్రాక్టు ఉద్యోగులకు సందేశాలు ఇచ్చారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో పని చేస్తున్న మరో 11 వేల మంది చిరుద్యోగులకు ‘నో వర్క్.. నో పే విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకొన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తోంది కేసీఆర్ సర్కార్.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో 7,500మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తుండేవారు. వీళ్లంతా తమ డిమాండ్ల కోసం మార్చి 12న సమ్మె చేశారు. కరోనా వ్యాప్తితో 10 రోజుల్లోనే సమ్మె విరమించి డ్యూటీలో చేరడానికి వెళ్లగా అధికారులు చేర్చుకోలేదు. సమ్మె టైమ్‌లో డ్యూటీ చేసిన 247 మందినే తీసుకున్నారు. వీళ్ల కాంట్రాక్టునూ రెన్యువల్ చేయలేదు. సంబంధిత మంత్రిని, అధికారులను ఈజీఎస్ సిబ్బంది కలిసినా స్పందన లేదు. మిషన్ భగీరథ పథకం కోసం బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లను 2015లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. 11 నెలలుగా జీతాలివ్వకున్నా రేపో, మాపో ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయన్న ఆశతో వాళ్లంతా పనిచేస్తూ వస్తున్నారు. వీళ్లనూ జూలై 1న ప్రభుత్వం ఇంటికి పంపింది. హార్టికల్చర్ డిపార్ట్ మెంట్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా సుమారు 500 మంది పని చేసేవారు. బడ్జెట్ సాకుగా చూపి వీళ్లందరిని తొలగించింది.
కరోనా వల్ల మూతబడిన స్కూళ్లు, కాలేజీలు, వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పని లేకపోవడంతో సర్కారు జీతాలివ్వడం లేదు. రాష్ట్రంలోని 2,245 ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ వర్కర్లు 8 వేల మంది, ఎస్సీ గురుకులాల్లో పని చేసే అసోసియేట్ లెక్చరర్లు 300మంది, గిరిజన గురుకులాల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ వెయ్యి మంది, పార్ట్ టైమ్‌టీచర్లు 1,500 మంది, గురుకులాల్లో పని చేసే ల్యాబ్ అసిస్టెంట్లు 450 మంది, గిరిజన డిగ్రీ గురుకులాల లెక్చరర్లు 300 మంది ఉన్నారు. వీళ్లంతా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వీళ్లలో చాలా మందికి ఏటా ఏప్రిల్‌లో చేసే కాంట్రాక్టు రెన్యువల్ కూడా కాలేదు. ఈ విద్యాసంస్థల్లో పని చేసే పర్మనెంట్ స్టాఫ్‌కు మాత్రం ప్రభుత్వం జీతాలిస్తోంది. టూరిజం డిపార్ట్ మెంటులో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆ శాఖ సగం జీతమే ఇస్తోంది.
కరోనా పేరుతో ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తీసేయడంతో వందలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇంతకాలం పని చేయించుకుని వదిలించుకోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో కొందరు ఉద్యోగుల కూలీ పనికి వెళుతున్నారు. కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దిక్కులు చూస్తున్నారు. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియక, జీతం వస్తుందో రాదో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారు. తమను తెలిసిన చోటల్లా అప్పులు చేసి కాలం వెల్లదీస్తున్నారు. క్రమబద్దీకరణ కాదు ముందు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. జీతాలు సక్రమంగా చెల్లించి తమ జీవితాలు చీకటిమయం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీళ్లు కార్చుతున్నారు తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు..ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరిని రెగ్యులర్ చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించకపోగా.. వాళ్ల కొలువులనే తీసేస్తుండటంపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.