పట్టుదల, అంకిత భావం పంచుమర్తి విజయ రహస్యం

పార్టీ పట్ల అంకిత భావం, పని పట్ల శ్రద్ధ, సాధించాలన్న పట్టుదల ఇవే పంచుమర్తి అనూరాథ ప్రత్యేకతలు. కష్టంలోనూ కర్తవ్యాన్ని విస్మరించకపోవడం, పదవుల కన్నా ప్రజాసేవే మిన్న అన్న భావం ఆమెను ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయతీరాలకు చేర్చాయి. రాజకీయ ప్రవేశంతోనే ఆమె  విజయవాడ నగర మేయర్ గా ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పంచుమర్తి అనురాధ సరిగ్గా 23 ఏళ్ల కిందట రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్‌గా  ఎన్నికయారు?  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన  అనంతరం   పంచుమర్తి విజయం విజయం తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణమూ సంచలనమే . ఆమె కుటుంబానికి  రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు.  తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్‌ఎస్‌. ఆదాయపన్నుశాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.  ప్రాథమిక విద్య హైదరాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో చదివిన పంచుమర్తి అనూరాథ హైస్కూల్‌, ఇంటర్‌ విద్యను విజయవాడలోనూ,  పూర్తి   బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు.  ఆ తర్వాత  ఆమె   నాగార్జున యూనివర్సిటీ నుంచి నుంచి జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధంలేకపోయినా ఆమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చారు.  2000 సంవత్సరంలో 26 ఏళ్ల పిన్న వయస్సులో విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. విజయవాడ మేయర్ పోస్టును మహిళలకు రిజర్వ్ చేసిన విషయాన్ని వార్తా పత్రికలో చదికి ఆసక్తితో  తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో   మేయర్‌ పదవికి డైరెక్ట్ ఎలక్షన్ జరిగేది.   తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మేయర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాదు, విద్యారంగపైన   అనురాధకు చక్కటి అవగాహన ఉందని గ్రహించిన చంద్రబాబు ఆమెనే ఎంపిక చేశారు. అప్పుడు జరిగిన మేయర్ ఎన్నికలలో   కాంగ్రెస్‌ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్‌ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల ను ఓడించి 6800 కు పైగా ఓట్ల మెజారిటీతో  అనురాధ విజయం సాధించారు. డైరెక్ట్ ఎన్నికలలో మేయర్ గా ఎన్నికైన అనురాధ తొలి నాళ్లలో రాజకీయ అనుభవం లేక ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అనతి కాలంలోనే అన్ని విషయాలలోనూ నైపుణ్యం సంపాధించారు.  మేయర్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె భావించలేదు. కానీ  2007 నుంచి మళ్లీ తెలుగుదేశంలో క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆక్రమంలో  2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ సీటు  బీజేపీకి  తెలుగుదేశం కేటాయించింది.   దీంతో పోటీ చేయడం కుదరలేదు. అయితే పార్టీలో పలు పదవులు నిర్వహించారు.  అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.

రాహుల్ పై అనర్హత వేటు పడింది!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యుడైన రాహుల్‌గాంధీని డిస్‌క్వాలిఫై చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్నది. ఈ అనర్హత గురువారం  (మార్చి 23, 2023) నుంచి అమల్లోకి వస్తుందని లోక్ సభ సెక్రటరీ జనరల్   శుక్రవారం (మార్చి 24) ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు.   ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.  ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు 30 రోజుల బెయిలు ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  

వైసీపీ సీన్ రివర్స్.. పంచుమర్తి విజయం జగన్ భవిష్యత్ పతనానికి దర్పణం?

వైసీపీకి సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉగాదికి ముందు రోజు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ పరాజయం, ఉగాది మరునాడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం. అయితే ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం లేని వైసీపీ నాయకులు అసలు గ్యాడ్యుయేట్ లు తమ ఓటర్లే కాదని డిజోన్ చేసుకున్నారు. సమాజంలో వారో చిన్న భాగం మాత్రమేననీ, తమ ఓటర్లే వేరే ఉన్నారనీ గంభీర ప్రసంగాలు చేశారు.  గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలలోనూ పరాజయం పాలైన తరువాత వైసీపీ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి గ్యాడ్యుయేట్లు తమ ఓటర్లు కాదని చెప్పారు. వారెవరూ తమ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదని నిస్సంకోచంగా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే.. చంద్రబాబు వారిని ప్రలోభాలకు గురి చేసి తమ అభ్యర్థి ఓటమికి కారకుడయ్యారే తప్ప తాము ఓడిపోలేదని కొత్త భాష్యం చెప్పుకున్నారు. పోనీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అంటే సజ్జల గారు దానికి కూడా తనదైన ప్రత్యేక శైలిలో  ఇదేమీ ఉద్యోగం కాదు తప్పు చేశారని తేలగానే చర్యలు తీసుకోవడానికి ఇది రాజకీయం.. సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని అంటున్నారు.  ఇంతకీ సజ్జలగారి భాష్యం ఏమిటంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ ఓ స్థానాన్ని కోల్పోవడానికి తమ ఓటమి కారణం కాదట.. చంద్రబాబు తమను ఓడించారు అని చెబుతున్నారు. అంతే కాదు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే పాటి ధైర్యం కూడా లేని దయనీయ పరిస్థితికి వైసీపీ దిగజారిందని సజ్జల మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వని జగన్ ఇప్పుడు వారికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయంతో వణికిపోతున్న పరిస్థితికి ఇది అద్దం పడుతోందని చెబుతున్నారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న భయం వారిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే.. ఉప ఎన్నిక ఎదుర్కొనవలసిన అనివార్య పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే.. కోరి కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందన్నది జగన్ భయంగా పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతో ఉన్న కాస్త పాటి పరువూ గంగలో కలుస్తుందన్న బెరుకు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.  అసలు పార్టీపై, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై జగన్ పట్టు సడలడం ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన సమయంలోనే తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులలో అసమ్మతి, ఆగ్రహం ఒక్క సారిగా భగ్గుమన్నాయి. బతిమాలో, బామాలో ఎలాగోలా ఆ పరిస్థితిని నుంచి బయటపడిన జగన్ ఇప్పుడు ఈ ఓటముల తరువాత ఇప్పటి వరకూ తాను ఎవరిపైనైతే పెత్తనం చెలాయంచారో వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామని భావించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్థానంలో ఎదురైన పరాజయంపై వైసీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ  పరాభవం పార్టీ శ్రేణుల్లో కూడా నిరాశను నింపేసిందని అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధినేత ఆదేశాన్ని ధిక్కరించడం, క్యాంపులు ఏర్పాటు చేసి, ఒకటికి నాలుగు సార్లు మాక్ ఓటింగ్ చేయించినా క్రాస్ ఓటింగ్ జరగడం వైసీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇక ముందున్నది అంతా గడ్డుకాలమే అన్న నిర్ణయానికి వైసీపీ అధినాయత్వం వచ్చేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

ఉగాది పురస్కారాల్లో 'తెలుగు వన్'కి రెండు అవార్డులు

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. మొత్తం 23 విభాగాలకు గాను వందల సంఖ్యలో జర్నలిస్టులు పోటీ పడగా.. వారి ప్రతిభ, వారు రాసిన కథనాల ఆధారంగా ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేశారు. ఈ పురస్కార గ్రహీతల జాబితాను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాలో తెలుగు వన్ రెండు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. సినిమా విభాగంలో సీనియర్ జర్నలిస్టు బుద్ధి యజ్ఞమూర్తి, అగ్రికల్చర్ విభాగంలో సీనియర్ జర్నలిస్టు ఎస్. కె సలీం ఉత్తమ జర్నలిస్టులుగా పురస్కారాలు గెలుచుకున్నారు. అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఉగాది పురస్కారాల ద్వారా సత్కరించి, గౌరవించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు అన్నారు. అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇటువంటి ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని చెప్పారు. జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణిని దాటి.. జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలోనే ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు.

భారీ ర్యాలీతో టీడీపీ గూటికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

వైసీపీ తిరుగుబాటు  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం (మార్చి 24) తెలుగుదేశం గూటికి చేరనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో గిరిధర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.     నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపిన గిరిధర్ రెడ్డి.. నెల్లూరు నుంచి 300 కార్లతో భారీ ర్యాలీగా అమరావతి చేరుకోనున్నారు.    గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా తెలుగుదేశంలో చేరనున్నారు.    గిరిధర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆ నేపథ్యంలోనే వైసీపీను వీడాలని గిరిధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ముందు ముందు గిరిధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. గురువారం (మార్చి 23) జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని కాదని ఆత్మప్రభోదానుసారం ఓటు వేసిన సంగతి తెలిసిందే.  

ఎవరా నలుగురు.. ఏమా కథ.. వేటేనా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇంతవరకు ఓ లెక్క ..ఇకపై మరో లెక్క, అన్నట్లుగా మారి పోయాయి. గత సార్వత్రిక ఎన్నికల మొదలు ఇంతవరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఓటమి చూడలేదన్న అహంకారంతో విర్రవీగుతున్న అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు దిమ్మతిరిగే షాకిచ్చాయి. నిన్నగాక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అక్కడితో ఆగలేదు...అక్కడ గ్రాడ్యుయేట్స్  అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్’ ఇస్తే,  ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మైండ్ బ్లాక్ అయ్యే మరో షాక్ ఇచ్చారు. నేను మోనార్క్ ను నా మాటే శాసనం అన్నట్లుగా తమకు తిరుగులేదని విర్ర వీగిన జగన్ రెడ్డికి సొంత పార్టీ ఏమ్మేల్యేలు ఝలక్ ఇచ్చారు. పకడ్బందీ వ్యూహంతో పావులు కదిపినా ఒకరు ఇద్దరు కాదు  ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు సాహసించారు. జగన్ రెడ్డి హుకుంను ధిక్కరించారు. టీడీపీ  అభ్యర్ధి పంచుమర్తి అనురాధను గెలిపించారు. అయితే ఇప్పడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? జగన్ రెడ్డిని పరాభవానికి  గురి చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ రెడ్డి స్పందన ఏమిటి? ఇక ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి చేస్తారు? ఎమ్మెల్యేల ధిక్కారాన్ని దిగమింగి ఊరుకుంటారా? ఆ నలుగురిని గుర్తించి వేటు వేస్తారా? ఉప ఎన్నికలకు సాహసిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  నిజానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం అనూహ్యం అయితే కావచ్చును కానీ కచ్చితంగా ధర్మ విజయం. ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఒక అభ్యర్ధి గెలవాలంటే  22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీడీపీ బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేల్లో కరణం బలరాం, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ అధికారికంగా తెలుగు దేశం ఏమ్మేల్యేలుగా కొనసాగుతూనే  వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభలో టీడీపీ  వాస్తవ సంఖ్యా బలం 19కి తగ్గింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా టీడీపీ విప్‌ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల నుంచి గానీ ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుందని భావించింది. అయితే.. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన  ఆ నలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే..  ముందుగానే అత్మప్రభోధం మేరకు ఓటి వేస్తామని బహిరంగంగా ప్రకటించిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు కలిపినా టీడీపీకి పడాల్సింది -21 ఓట్లు మాత్రమే. దీంతో అనూరాధ కు ఓట్లు వేసిన ఆ ద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ముందుగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఇదే సమయంలో.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పేరూ ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో.. వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఉండవల్లి శ్రీదేవి కూడా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉదయమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలిశానని.. తాను ఎందుకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతానని ప్రశ్నించారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో అధికార వైసీపీలో మళ్లీ కొత్త చర్చలు మొదలయ్యాయి. వీరందరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోతే.. ఆ పని ఎవరు చేశారనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఏడుకు.. ఏడు స్థానాలు గెలవాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ముందుకెళ్లారు. అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లు వేస్ట్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఓట్లు వేస్ట్ కాలేదు గానీ.. క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. దీనిపై జగన్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. వారిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అనురాధ విజయంపై వైకాపాలో సంబురాలు

 అవును. మీరు చదివింది కరెక్టే. అందులో అచ్చు తప్పులేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. అది సహజం. కానీ టీడీపీ అభ్యర్ధి అనురాధ విజయంపై టీడీపీ  నాయకులు శ్రేణుల కంటే, వైసీపీ నాయకులు ఎక్కువ సంతోష పడుతున్నారు. అయితే తెలుగు దేశం సంబురాలకు, వైసీపీ సంబురాలకు ఓ చిన్న తేడా అయితే వుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకుంటుంటే, వైసీపీ నేతలు లోలోపలే మురిసి పోతున్నారు. అదేదో సినిమాలో శృతిహాసన్ లోలోపల డాన్స్ చేసినట్లుగా, వైసీపీ నేతలు కొందరు లోలోపల ఏకంగా ఆనంద తాండవం చేస్తున్నారు. తెలుగు దేశం మిత్రులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.   ఇంతకీ వైసీపీ నాయకులు ఎందుకు అంతగా సంతోష  పడుతున్నారంటే.. వారి  సంతోషానికి కారణం లేక పోలేదని అంటున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో సంపూర్ణ ఓటమితో కొంత కిందికి దిగివచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ ఓటమితో మరో మెట్టు దిగివస్తారని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు ఎమ్మెల్యేలను చివరకు మంత్రులను కూడా చులకన చేసి మాట్లాడడం, తానొక్కడే పునీతుడు, సర్వ శక్తిమంతుడు మిగిలిన వారంతా పనికి మలిన వారు అన్న విధంగా వ్యవహరించడం వంటి ముఖ్యమంత్రి విపరీత పోకడలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇతర ముఖ్యనేతలు చాలా కాలంగా లోలోపల కుమిలి పోతున్నారు. అలా విసిగి పోయిన నాయకులు ఇప్పటికైనా జగన్ రెడ్డి దారికి వస్తారని ఆశిస్తున్నారు. అందుకే సంబురాలు చేసుకుంటున్నారని, అంటున్నారు.  కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన అనురాధను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ మేం 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారు. చివరికి అదే 23వ తేదీన అదే 23 ఓట్లతో మీ ఓటమి.. మా గెలుపు. ఇది కదా దేవుడి స్క్రిప్ట్‌ అంటే అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు. తెదేపా అభ్యర్థి విజయం సాధించడం పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా పతనం ఆరంభమైందని అన్నారు.

జగన్ రెడ్డికి బిగ్ బిగ్ షాక్

 దెబ్బ మీద దెబ్బ.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో  బిగ్ ..బిగ్ షాక్. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం సాధించారు. నలుగురు తెలుగు దేశం ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుని, అత్యాశకు వెళ్ళిన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పరాభవం తప్పలేదు. తెలుగు దేశం పార్టీ టికెట్ పై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి వైసేపీలో వైపు వెళ్ళారు. ఆ   విధంగా  తెలుగు దేశం పార్టీకి 19 ఎమ్మెల్యేలే మిగిలారు. మొత్తం ఏడు స్థానలకు ఎన్నికలు జరిగాయి. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉండడంతో ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి అంటే 22 ఓట్లు అవసరమవుతాయి. ఆ లెక్కన జగన్ రెడ్డి కేవలం 19 ఓట్లే ఉన్న టీడీపీ అభ్యర్హ్ది అనురాధనును సునాయాసంగా ఓడించగలమనే లెక్కలు వేసుకుని  ఏడుగురు అభ్యర్ధులను బరిలో దింపారు. అయితే, జగన్ రెడ్డి ఒకటి తలిస్తే, దేవుడు మరో స్ర్కిప్టు రాశాడో ఏమో, అధి కార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి, అనురాధను గెలిపించారు.  నిజానికి, వైసేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది కోలుకోలేని దెబ్బగానే పరిశీలకు భావిస్తున్నారు. నిన్న గాక మొన్నపట్టా భద్రులు గట్టి మొట్టి కాయలు వేశారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడుకు మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు విజయం సాధించారు. చివరకు జగన్ రెడ్డి సొంత  నియోజక వర్గం పులివెందులలోనూ పట్టభద్రులు ఆయన్ని చిత్తుగా ఓడించారు.  ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోక ముందే సొంత ఆపార్టీ ఎమ్మెల్యేలే జగన్ రెడ్డి ని గట్టి దెబ్బ తీశారు. నిజానికి అధికార పార్టీలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా వుంది..అందుకే నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటే నిదర్శనం.   నిజానికి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  జగన్ రెడ్డి  అన్ని జగ్రత్తలూ తీసుకున్నారు.   క్యాంపులు నిర్వహించారు. ఎమ్మెల్యేల పై నిఘా పెట్టారు. హెచ్చరికలు చేశారు.  అయినా అవేమీ ఫలించలేదు. విజయం తెలుగుదేశం పార్టీనే వరించింది. అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం ఎదురైన క్షణం నుంచే జగన్ రెడ్డిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా పరాభవం తప్పదన్న దిగులు మొదలైందని చెప్పాలి. ఇద్దరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఆత్మ ప్రబోధం మేరకే ఓటేస్తామని ప్రకటించేశారు. దాంతో మిగిలిన ఎమ్మెల్యేలలో ఆత్మప్రభోదానుసారం ఓటేసేవారింకెంత మంది ఉన్నారో అన్న గుబులు మొదలైందని చెప్పాలి. అందుకే ఆయన పట్టభద్రుల మొట్టికాయల తరువాత నుంచీ తన నీడను చూసి తానే భయపడే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.  సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం కోల్పోయి నిఘా పెట్టారు.  నాలుగేళ్లుగా ఎన్నడూ లేనిది ఆయనే స్వయంగా ఫోన్ చేసి మరీ బుజ్జగింపు మాటలు మాట్లాడారు. స్టార్ హోటళ్లలో క్యాంపులు ఏర్పాటు చేసి సకల మర్యాదలూ చేశారు. అయినా దెబ్బ తిన్నారు. చివరికి ఆయన భయమే నిజమైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారని తేలిపోయింది. 

ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ జయకేతనం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో  టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాథ జయకేతనం ఎగురవేశారు.  మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలలో వంద శాతం ఓటింగ్ జరిగింది. అంటే  మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా అన్నీ ఓట్లూ చెల్లుబాటు అయ్యాయి. ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ 22 ఓట్లు అవసరం. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు 22 చొప్పున ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు 23 ఓట్లు వచ్చాయి.  వాస్తవంగా టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 19 మంది ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఆమెకు 23 ఓట్లు రావడం గమనార్హం. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని భావించినా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని పంచుమర్తి అనూరాథ విజయం ద్వారా తేలిపోయింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించగా,  వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్, ఏసురత్నం, పోతుల సునీత,  సూర్యనారాయణరాజు, మర్రి రాజశేఖర్ గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ   విజయం సాధించారు.  

రాహుల్ గాంధీ పై వేలాడుతున్న అనర్హత వేటు?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఆయనలో వచ్చిన మార్పుకు, ఆయన చుట్టూ అల్లుకుంటున్న వివాదాలకు ఏమైనా సంబంధం వుందో లేదో కానీ, ఆయన వార్తల్లో వ్యక్తిగా అయితే నిలుస్తున్నారు.  జోడో యాత్ర తర్వాత  బ్రిటన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో  చేసిన ప్రసంగం, విలేకరుల సమావేశంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు, ఎంతగా వివాదాస్పద మయ్యాయో వేరే చెప్పనక్కరలేదు. విదేశీ గడ్డపై నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే కాదు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రతిస్థంభనకు కూడా కారణమయ్యాయి.  అదలా ఉంటే గతంలో ఎప్పుడో ప్రధార మంత్రి ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.  ఎప్పుడో 2019లో రాహుల్ గాంధీ, “మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 2019లో  మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని అర్ధం వచ్చేలా విమర్శించిన సంగతి విదితమే. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే  గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాంధీపై కేసు పెట్టారు.  దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ గతంలో పలు మార్లు హాజరయ్యారు కూడా.  కాగా మోడీ ఇంటి పేరు ఉన్న వారందర్నీ రాహుల్ గాంధీ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే స్పష్టం చేసింది.మోడీ  ఇంటి పేరు ఉండి పరారీలో ఉన్న నీరవ్ మోడీ, లలిత్ మోడీల గురించే రాహుల్ ప్రస్తావించారని,  ఇది మోడీపై రాజకీయ విమర్వే తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదనీ స్పష్టం చేసింది. అయితే కోర్టు మాత్రం రాహుల్ వ్యాఖ్యలు క్రిమినల్ డిఫమేషన్ కిందకే వస్తాయంటూ  రెండేళ్ల జైలు శిక్ష విధించింది.  కోర్టు శిక్ష  నేపథ్యంలో లో రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యత్వం పై వేటు పడే ప్రమాదం లేక పోలేదని, అయన  మెడపై అనర్హత కత్తి వేలాడుతున్నట్లేనని అంటున్నారు.  ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ మంజూరు చేసినా, శిక్ష ఖారారైనందున ఆయనకు న్యాయపరమైన చిక్కులు తప్పవని అంటున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడుతుంది. అంతేకాదు సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చు. రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించి వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు జరిపించవచ్చని న్యాయవాదులు, న్యాయ నిపుణులు అంటున్నారు. అలాగే ఫై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్‌ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీకు కూడా అనర్హులవుతారని అంటున్నారు.  అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్  అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. అటు తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.మరోవైపు పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు. మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టు తీర్పును స్వాగతించారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ ఇచ్చింది. మరోవంక బీజేపీ చట్టం  తనపని తానూ చేసుకు పోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కాదని పేర్కొంది.

మళ్లీ కాంగ్రెస్ కు డ్యామేజీ.. ఈ సారీ కోమటిరెడ్డే కారణం!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువగిరి ఎంపీ కొంటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ మారుతున్నారా? మారే ఆలోచన చేస్తున్నారా?  అన్న చర్చ ఫుల్ స్టాప్, కామా అన్నది లేకుండా సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. సాగుతోంది అనడం కంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డే స్వయంగా ఈ చర్చను సాగదీస్తున్నారనీ, అందుకోసం ఆయన విరామం లేకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారనీ పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నా లేనట్లే.. పోనీ లేరనుకున్నా ఉన్నారాయె.   పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూసిన నాటి నుంచి, కోమటి రెడ్డిలో అసమ్మతి జ్వాల అలా రగులుతూనే ఉంది.  సందర్భం ఉన్నా లేకపోయినా కోమటిరెడ్డి తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడానికి లేని అవకాశాలు కూడా సృష్టించుకుంటున్నారు. ఆయన ఇంతగా పార్టీ లైన్ ను భిన్నంగా, పార్టీ  ప్రతిష్ట మసకబారే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా, పార్టీ మార్పు సంకేతాలు ఇస్తున్నా కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. పార్టీ ఇచ్చిన క్రమశిక్షణా రాహిత్యం నోటీసులు చెత్త బుట్టలో పారేశానని స్వయంగా ప్రకటించినా కూడా కోమటిరెడ్డిపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సాహసించడం లేదు. ఆయన దారి ఆయనదే.. పట్టించుకోకుండా ముందుకు సాగండి  అన్న సంకేతాలే పీసీసీకి ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.   ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతర పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలవక తప్పదంటూ ఆయన చేసిన కామెంట్లు రాష్ట్రంలో బలంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించాయి.   అన్నిటికీ మించి ఆయన ‘చేయి’ వదిలేసి కమల దళంలో చేరేందుకు మార్గం సుగమం చేసుకునే పనిలో భాగంగానే హంగ్ వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలూ వినవచ్చాయి. అలాగే.. ఒక వేళ తన అంచనా నిజమై  హంగ్ అసెంబ్లీ ఏర్పడి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపితే  కోమటి రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారు. అలా కాకుండా  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  అప్పుడు ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమా, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే విషయంలో ఓక నిర్ణయం తీసుకుంటారనీ, అప్పటి వరకూ కాంగ్రెస్ కు ఆయన కంట్లో నలుసుగా, చెప్పులో రాయిలా అడుగడుగునా వెనక్కు లాగేలా వ్యవహరిస్తూనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.   అసలు కాంగ్రెస్ హై కమాండ్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న విశ్వసం లేశమాత్రంగా ఉన్నా ఈ సరికే కోమటి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఆయనపై చర్య     తీసుకుని ఉండేది. బహిష్కరణ వేటు కాకపోయినా కనీసం సస్పెండ్ అయినా చేసి ఉండేది. అలా చేయడం లేదంటే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం లేకపోవడం వల్లనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం (మార్చి 23) ప్రధాని మోడీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. దాదాపు 20 నిముషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఆయన మీడియాతో షరామామూలుగా తాను మోడీని కలవడానికి రాజకీయాలు కారణం కాదనీ, తన నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికేనని చెప్పారు. తాను పార్టీ మారే ప్రశక్తే లేదని పునరుద్ఘాటించారు.   అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గాలే నమ్మడం లేదను కోండి అది వేరేసంగతి. మొత్తం మీద కోమటిరెడ్డి తీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్టను మసకబార్చి ఆ మేరకు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. 

కర్ణాటకలో ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి టిప్పు సుల్తాన్ వివాదం

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో ఓ వంక  రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో వంక, మత ఉద్రిక్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ముమ్మర మయ్యాయి. నిజానికి, ఒక్క మతం  కార్డును మాత్రమే కాదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజీపీ ఇటు మతం కార్డును, అటు కులం కార్డును ఒకే సారి, ప్రయోగించేందుకు ఒక పథకం ప్రకారం పావులు కదుపుతోంది. ఈ విషయంలో  బొమ్మై ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడడం లేదన్నది విపక్షాల ఆరోపణ. నాలుగేళ్ళ బీజేపీ పాలనలో అవినీతిని పెంచి పోషించి,  40 పెర్సెంట్ సర్కార్ గా  అప్రతిష్ట పాలైన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం కులం పేరిత, మతం పేరిట ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి అక్రమ పద్దతిలో ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తోందని  ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  నిజానికి కర్ణాటకలో టిప్పు సుల్తాన్‌ వివాదం ఇప్పటిది కాదు.  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఈ వివాదం రగులుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ ను దేశ భక్తుడు అంటుంటే.. బీజేపీ టిప్పును దేశ ద్రోహిగా వర్ణించడమే కాకుండా టిప్పు అనుచరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదని అంటోంది.  అప్పట్లోనే, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్  ఈ వివాదానికి తెర తీశారు.  అప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మొదలు బీజేపీ నేతలు తరచూ ఈ వివాదాన్ని తెర మీదకు తెస్తూనే ఉన్నారు. కర్నాటక రాష్ట్రంలో హనుమాన్ భక్తులుండాలా లేదా టిప్పు వారసులుండాలా ?అనే ప్రశ్నను తెర మీదకు తెస్తూనే ఉన్నారు. తెర మీదకు తేవడం మాత్రమే కాదు..  కర్ణాటక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, టిప్పు సుల్తాన్ ను దేశ ద్రోహిగా చిత్రించే డాక్యుమెంటరీ చిత్రీకరణకు సిద్దమైంది. ఇప్పడు అదే క్రమంలో కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ కార్యదర్శి  సి.టి.రవి మళ్ళీ మరోమారు అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ.. తాను టిప్పు సుల్తాన్‌ సమయంలో పుట్టి ఉంటే ఊరి గౌడ, నంజే గౌడలా తిరుగుబాటు చేసేవాడినని పేర్కొన్నారు. పాత మైసూర్‌ ప్రాంతంలోని  కొన్ని వర్గాలు, ఈ ప్రకటనకు మద్దతుగా నిలిచాయి. టిప్పు సుల్తాన్‌తో వక్కలిగ పాలకులు ఊరి గౌడ, నంజే గౌడ యుద్ధం చేసి టిప్పును హతమార్చినట్లు వీరు నమ్ముతారు. ఇదే ఇప్పుడు వివాదానికి బీజం వేసింది. చిక్‌మగళూరులో జరిగిన  సభలో సి.టి.రవి మాట్లాడుతూ  టిప్పు పాలించే సమయంలో పుట్టి ఉంటే, నేనూ ఊరిగౌడ, నంజే గౌడలానే ఉండేవాడిని. తిరుగుబాటు చేసేవాడిని. ఓ మతపరమైన వ్యక్తిపై ఖడ్గం ఎత్తిన వాడిగా గుర్తింపు పొందేవాడిని  అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బలమైన వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన  నేతల్లో రవి కూడా ఒకరు. నిజానికి   టిప్పు మరణంపై గతంలో చర్చ జరిగింది. అయితే.. గతేడాది ‘టిప్పువిన నిజ కనసుగలు’ పేరిట ఓ నాటకం విడుదలైన సమయంలో ఊరి గౌడ, నంజే గౌడ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి రంగాయణ డైరెక్టర్‌ అడ్డనాడ కరియప్పా దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లను విమర్శించడానికి బీజేపీ దీనిని వాడుకొంటోంది. మరోవైపు బీజేపీ ప్రకటనను ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉరి గౌడ, నంజే గౌడ అనే పాలకులు లేరని.. కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతున్నాయి.అయితే, కర్ణాటక రాజకీయాల్లో కులం, మతం ప్రభావాన్ని తక్కువగా చూడ లేమని అంటున్నారు.

పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపం.. మేమే పరిహారం చెల్లిస్తాం.. కేసీఆర్

ప్రకృతి వైపరీత్యాల విషయంలో కూడా కేసీఆర్ కేంద్రంతో తగవుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా  పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పంట నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచి దండుకోవడమే తప్ప తెలంగాణకు ఇవ్వడం తెలియదని అన్నారు. గతంలో పంపిన నివేదికలకు సంబంధించిన పరిహారమే ఇప్పటి వరకూ కేంద్రం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఈ సారి పంట నష్టం వివరాలను కేంద్రానికి పంపే ప్రశక్తే లేదనీ, రైతలను తమ ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు.  ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.  ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను   ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (మార్చి 23) పరిశీలించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడిన ఆయన పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో పంపిన వాటికే మోడీ సర్కార్ ఇంత వరకూ పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.   బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న  దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేసీఆర్ బాధిత రైతులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆయనకు విజ్ణప్తి చేశారు.  రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సొంత పార్టీ.. మరి బీఆర్ఎస్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కుంటున్నారా? ఆయన ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోందా?  ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయా? అంటే అవుననే అనవలసి వస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. నో.. నో ... మనం ఇప్పడు మాట్లాడుకుంటోంది ఉగాది పంచాంగంలో వివరించిన ముఖ్యమంత్రి జాతకచక్రం, గ్రహ స్థితులు, కష్టాలు నష్టాల  గురించి కాదు. క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీఆర్ఎస్  అనే సంకేతాలే స్పష్టంవుతున్నాయన్న దానిపైనే. నిజానికి 2014 తర్వాత చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా,  తెరాసకు (అదే పేరుతో ఉన్నంత వరకు) కేసీఆర్  నాయకత్వానికి ఎదురన్నదే లేదు.  ఆయన భయపడిన, డిఫెన్స్ లో పడిన  సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ  ఇప్పడు అంటే తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ లో బెరుకుదనం బయట పడుతోంది., ఒక విధమైన భయం తొంగిచూస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల వరకూ అవసరం లేదు.. ఆయనలో తడబాటు, బెరుకు సామాన్యులకు కూడా అర్థమయ్యేలానే ఉన్నాయి. ముఖ్యంగా, మంచైనా చెడైనా టీఆర్ఎస్) మన పార్టీ, మన తెలంగాణ పార్టీ, కేసీఆర్ మన నాయకుడు అని నమ్మి తొమ్మిదేళ్ళుగా కేసీఆర్ కు అండగా నిలిచిన తెలంగాణ వాదులు, పార్టీ క్యాడర్, అభిమానుల ఆలోచనలలో పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తరువాత వస్తున్న మార్పే  ముఖ్యమంత్రి కేసీఆర్ లో కలవరానికి కారణం అంటున్నారు.  ఏదిఏమైనా ఎన్నికల సంవత్సరంలో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వంద సీట్లకు పైగా గెలుస్తామనే ఒకప్పటి ధీమా ఇప్పుదు పార్టీ క్యాడర్ లో కానీ, నాయకత్వంలో కానీ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ముఖ్యంగా వామపక్షాలు చెయ్యేస్తేనే గానీ, మునుగోడు గెలవలేని పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఎన్నికల భయం కనిపిస్తోంది. అలాగే, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న  వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించారు. అందుకే, పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. ఒక విధంగా ఇది ఆయనలోని భయాన్ని బయట పెట్టే  వేడుకోలు లేఖగా ఉందని, బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది .  అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్  పై ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ ప్రజానీకం చేస్తున్న ప్రధాన ఆరోపణ కుటుంబ పాలన. కుటుంబ అవినీతి.  నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు వినిపించక ముందు నుంచే,  కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొదలు అనేక ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఒక విధంగా చూస్తే లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రాక ముందు నుంచే, సామాన్య  ప్రజానీకంలో సైతం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందనే ‘పర్సెప్షన్’ బలపడుతూ వచ్చింది.  అందుకు తగ్గట్టుగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి కాక ఇద్దరు మంత్రులు ( కేటీఆర్, హరీష్ రావు), ఒక రాజ్యసభ ఎంపీ (సంతోష్)  ఒక ఎమ్మెల్సీ ( కవిత) కాక, బంధు వర్గానికి చెందిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి వారు నామినేటెడ్ పదవులలో కొలువు తీరడంతో ప్రజలలో సహజంగానే, ఇందు కోసమేనా .. ఒక కుటుంబం కోసమేనా  తెలంగాణ తెచ్చుకుంది అనే భావన బలపడుతూ వచ్చిందని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమికను పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ వంటి ఉద్యమనేతలు గళమెత్తుతూ వచ్చారు. ప్రజలను జాగృత పరిచి మరో తెలంగాణ ఉద్యమం దిశగా అడుగులు  వేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం స్కాం, టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజి వ్యవహరం బయటకు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా  కఠిన సవాళ్లను ఎదుర్కుంటున్నారనడంలో సందేహం లేదు. నిజానికి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరకు ఏమవుతుంది అనేది పక్కన పెడితే, కుటుంబ పాలన, కుటుంబ అవినీతిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మాత్రం నిస్సందేహంగా బలం చేకూరింది.  నిజానికి గతంలోనూ కాసినో అవినీతి కేసులోనూ కవిత పేరు విన్పించిన నేపధ్యంలో ఇప్పడు ఢిల్లీ  మద్యం కుంభకోణంలో కీలక భూమిక ఆరోపణకు బలం చేకురిందనే చెప్పాలి.  అదే సమయంలో వెలుగులోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ  వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా, ప్రతిష్టను మసకబార్చేదిగా  మారింది.  ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ లీకేజీ వ్యవహారం ఉంది. దీంతో అసలే ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు మరింతగా ప్రభుత్వంపై  ఫైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారిలో విశ్వాసం నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. నిజానికి, టీఎస్పీఎస్సీ  లీకేజి వ్యవవహారం, కొంత అలజడి తరువాత సద్దుమణుగుతుందనుకున్నారు.  కానీ, ప్రభుత్వ పక్షం నుంచి, కమిషన్ పక్షం నుంచి కూడా సమస్యను ఎదుర్కొనడంలో సమర్థత, సమయస్ఫూర్తి వ్యక్తం కాలేదు. పైగా, ప్రభుత్వం కలవరపడుతున్నదని  ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని ప్రస్ఫుటంగా తెలిసిపోతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అన్నిటినీ మించి, తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మీద ఉన్న విశ్వాసం బీఆర్ఎస్ మీద లేదన్న విషయం తేటతెల్లమైందనీ,  ఇప్పడు కేసీఆర్ ముందున్నప్రధాన సమస్య ఇదేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ!?

భారత్ రాష్ట్ర సమితి.. తెలంగాణకే పరిమితమైన జాతీయ పార్టీ. ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన ఉద్యమ నేత. ఎనిమిదేళ్ల పాటు కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన తన పార్టీ పేరును మార్చి ఆ పేరులోని తెలంగాణను తొలగించి భారత్ ను చేర్చి ఇక నుంచి తమది జాతీయ పార్టీ అని ప్రకటించేశారు. అంతే కాదు.. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే తమ పార్టీ ధ్యేయమని  ఉద్ఘాటించారు. అయితే ఇంత వరకూ సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వినా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీ కాలూనలేదు.  తెరాస జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత కేసీఆర్ కు వరుస చిక్కులే ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలేవీ కనిపించకపోవడం,  జాతీయ పార్టీ ప్రకటనకు ముందు కూడా ఉన్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఆ తరువాత దూరం జరగడంతో అసలు బీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టి కీలకంగా ఎదగగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. అటువంటి తరుణంలో ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళిక రెడీ చేశార్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఆ పార్టీ అడుగుపెట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలలోనూ, అలాగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ పోటీకి దిగి ఉనికి చాటాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నాయి.   ఆయా రాష్ట్రాలలో పార్టీ ఇన్ చార్జిల నియామకంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేతలే చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ చార్జిల నియామకంపై కేసీఆర్ పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారంటున్నారు.  మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో బీఆర్ఎస్ కాలూనేందుకు ఇదే మంచి తరుణం అని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.  మహా లోకల్ బాడీ ఎన్నికలలోనూ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాలతో బీఆర్ఎస్ సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్  మహారాష్ట్రలోని కాందార్‌లోహ సభలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.   తెలంగాణ ఎమ్మెల్సీ, తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలను పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఒక అవకాశంగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు.  త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని స్థానాలలో (తెలుగువారు అధికంగా ఉన్న స్థానాలను ఎంచుకొని) పోటీ చేసి విజయంతో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కలిసి వచ్చినా రాకున్నా ముందుకు సాగాలన్న నిర్ణయంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. కర్నాటకలో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతుందన్నది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.   

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు తీర్పు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కీలక నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది.  దోంగలందరి ఇంటి పేరు మోడీ యే  ఎలా అవుతోందంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును విచారించిన కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.   నిరవ్ మోడీ, లలిత్ మోడీలతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 2019లో , మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని అర్ధం వచ్చేలా విమర్శించిన సంగతి విదితమే. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాందీపై కేసు పెట్టారు.     దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ గతంలో పలు మార్లు హాజరయ్యారు కూడా.  కాగా మోడీ ఇంటిపేరు ఉన్న వారందర్నీ రాహుల్ గాంధీ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. మోడీ  ఇంటి పేర్లు ఉండి పరారీలో ఉన్న నిరవ్ మోదీ, లలిత్ మోదీల గురించే ప్రస్తావించారని, ఇది మోడీపై రాజకీయ విమర్శకిందకే వస్తుందని పేర్కొంది. అయితే అయితే కోర్టు మాత్రం రాహుల్ వ్యాఖ్యలు డిఫమేషన్ కిందకే వస్తాయని పేర్కొంటూ  రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

వైసీపీ లో టెన్షన్ టెన్షన్!

అందరి చూపులు  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉన్నాయి. అధికార వైసీపీ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దింపితే.. ప్రతిపక్ష టీడీపీ   ఒక అభ్యర్థిని బరిలో నిలిపింది. మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడంతో.. అధికార పార్టీ  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందని..  ఆ క్రమంలో తాము బరిలో నిలిపిన మొత్తం అభ్యర్థులంతా గెలిచి తీరాలనే   లక్ష్యంతో    ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థి   పంచుమర్తి అనురాధ విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలలో    ఎమ్మెల్సీ విజయానికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు... వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేశ్‌కుమార్, కరణం బలరాం.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టారు. కానీ వీరు జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగా స్పీకర్ పరిగణించకపోవడంతో.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ జీత భత్యాలు అందుకొంటున్నారు.   ఇంకోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలంటూ..  తెలుగుదేశం వీప్   జారీ చేసింది. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. పంచుమర్తి అనురాధకు ఓటు వేస్తారా? అంటే సందేహమే అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరి  ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. పంచుమర్తి అనురాధకు ఓటు వేయకుంటే.. కేవలం 19 ఓట్లే వస్తాయి.  మరో మూడు ఓట్లు పడితేనే కానీ ఆమె ఎమ్మెల్సీగా విజయం సాధిస్తారు. అదలా ఉంటే జగన్ పార్టీలో అస్మమతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు...  ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇప్పటికే క్లియర్ కట్‌గా ప్రకటించేశారు.  అదీకాక  వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారంలో ఉంది. దీంతో వీరిరువురూ  తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకే ఓటే వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారని.. వారు కనీసం ఆరుగురు ఉంటారని చెబుతున్నారు. ఈ ఆరుగురూ కూడా తెలుగుదేశం అభ్యర్థికి   ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  అదే జరిగితే.. వైసీపీకి శృంగభంగం తప్పదని పరిశీలకులు అంటున్నారు.   ఏదీ ఏమైనా మార్చి 23వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. టీడీపీ తరపున బరిలో దిగిన ఒకే ఒక్క అభ్యర్థి పంచుమర్తి అనురాధ కనుక విజయం సాధిస్తే.. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలకు కొనసాగింపుగా ఈ ఫలితం వచ్చిందని.. భావించవచ్చు అనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీలో వణుకు దేనికి?

వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలను కలవడానికి కాదు, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడని ఆయన ఇప్పుడు పనిగట్టుకుని ఫోన్ చేసి మరీ క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు. ఖరీదైన స్టార్ హోటళ్లలో క్యాంపు చేయిస్తున్నారు. నియోజకవర్గానికి ఏం కావాలని ఆరా తీస్తున్నారు. తక్షణమే నిధుల విడుదలకూ ఓకే అంటున్నారు. అయినా భయపడుతున్నారు. నిఘా పెడుతున్నారు. ఎక్కడ కట్టు తప్పుతారో అని క్షణం క్షణం ఉలిక్కి పడుతున్నారు. ఇదంతా ఎందుకా అంటే.. ఎమ్మెల్మే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి భయం ఆయననువెన్నాడుతుండటమే కారణమని అంటున్నారు.  అందుకే ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా, నియోజకవర్గ పనులన్నీ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకే అప్పగించిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎక్కడ లేని విలువా ఇస్తున్నారు. సకల మర్యాదలూ చేస్తున్నారు. స్టార్ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసి వారేం అడిగితే అది చేయడానికి రెడీ అయ్యారు. సాధారణంగా విపక్షంలో ఉన్న పార్టీ తన సభ్యులను కాపాడుకోవడానికీ, పార్టీ కట్టు తప్పి వారు పక్క చూపులు చూడకుండా ఉండటానికీ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇప్పటి వరకూ చూశాం. కానీ వైసీపీ అధినేత జగన్ దీ, ఆయన ప్రభుత్వానిదీ వివర్స్ వ్యవహారం కనుక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలే క్యాంపుల్లో బందీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధినేత తమ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా అనిపించినా.. అసలు విషయం లెలిసిన ఎమ్మెల్యేలు మాత్రం అధినేత తీరు అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అన్నట్లుగా ఉందని అంటున్నారు.  ప్రస్తుతం   వైసీపీకి 149 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు, జనసేన నుంచి దూరం జరిగిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు.  ఇక విపక్ష తెలుగుదేశం పార్టీకి  అధికారికంగా 23 మంది ఉన్నా, నలుగురు ఆ పార్టీకి దూరం జరిగారు. అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం 19. ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించాలంటే.. కనీసం 22 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇక వైసీపీకి దూరంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఇప్పటికే ఆత్మ ప్రభోదానుసారం అని ప్రకటించడంతో వారిద్దరూ తెలుగుదేశం అభ్యర్థికే ఓటు వేస్తారనుకున్నా.. ఆ పార్టికి మరో ఓటు దక్కితే కానీ విజయం లభించదు.  లెక్కలు ఇంత క్లియర్ గా ఉన్నా వైసీపీ ఓటమి భయంతో వణికి పోతోంది. తమ పార్టీకే చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడు కట్టుకుని ఉందని అనుమానిస్తోంది. తెలుగుదేశం అభ్యర్థికి పాతిక వరకూ ఓట్లు వస్తాయోమోనని ఖంగారు పడుతోంది.   

కింద పడినా.. పై చేయే.. బీజేపీ తీరు మారేదేలే!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక పరాన్న జీవి. రాష్ట్రంలో ఆ పార్టీకి  సొంత బలం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు రుజువైన ఈ వాస్తవం, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోసారి నిర్ద్వంద్వంగా తేలిపోయింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవ్ ఓటమి ఏపీలో కమలం ఒక చెల్లని నాణెం అని మరోసారి రుజువు చేసింది.  రాష్ట్రంలో బీజేపీ అధ్వాన స్థితిని మరో సారి తేటతెల్లం చేసింది.    2019 ఎన్నికల్లో ఒంటిగా పోటీ  చేసిన కమల దళం నిండా ఒక శాతం ఓటు కూడా తెచ్చుకోలేక పోయింది. బీజేపీ కంటే ‘నోటా’ కే ఆ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అయినా, బీజేపీ రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వచ్చినా అధికారం తమదే అంటుంటారు.  అదేమంటే, ఈశాన్య రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతుంటారు. సాధారణ ఎన్నికలను పక్కన పెడితే ఒకప్పుడు మండలి ఎన్నికల్లో, ముఖ్యంగా పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత బలం ఉందన్నది వాస్తవం.  వి.రామా రావు,  పీవీ చలపతి రావు,  జూపూడి యజ్ఞ నారాయణ, మన్నవ గిరిధర రావు,  డీఎస్పీ రెడ్డి  ఇలా బీజేపీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో పెద్దల సభకు ఎన్నికైన చరిత్ర ఉంది. అలాగే టీడీపీతో పొత్తులో ప్రస్త్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  పీవీ మాధవ్  ఎమ్మెల్సీ అనిపించుకున్నారు.  పొత్తు వద్దనుకుని ఇప్పుడు మాజీలుగా మిగిలారు.  అవును తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాంధ్ర సిట్టింగ్ సీటు సహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో  చెల్లని ఓట్లతో పోటీ పడి మరీ చిత్తుగా ఓడి పోయింది.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో, బీజేపీ, టీడీపీ, ఉమ్మడి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గెలిచారు. నిజానికి  ఆయన గెలవలేదు.  మిత్ర ధర్మానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీయే ఆయన్ని గెలిపించింది. ఈ సారి తెలుగుదేశంతో పొత్తు లేకపోవడం వలన  ఆయన ఓడి పోయారు. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు.. చెల్లని ఓట్ల  పాటి  ఓట్లు కూడా తెచ్చుకోలేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు ఉంటే.. మాధవ్ కు పదకొండు వేల ఓట్లు కూడా రాలేదు.  అంటే  ఒకప్పుడు  ఉత్తరాంధ్ర పట్ట భద్రులలో ఉన్న కొద్దిపాటి పట్టు కూడా కమల దళం కోల్పోయిందని మండలి తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి  ఇదే నియోజక్ వర్గం నుంచి గతంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఇటీవల కన్ను మూసిన పీవీ చలపతి రావు ( తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి)మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మాధవ్  ఆ వారసత్వాన్ని నిలుపుకోలేక పోయారు. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాతనే మాధవ్ కు జనసేన మిత్ర ధర్మాన్ని పాటించలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది. అలాగే వైసీపీతో రాష్ట్ర బీజేపీ అంటకాగుతోందన్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లిపోయిందనీ తెలిసొచ్చింది. చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం సమెతకు మాధవ్ వివరణ అతికినట్లు సరిపోతుంది. అయితే సామెత కోసమే కానీ.. నిజంగా జనసేనతో పొత్తును కొనసాగించాలని కానీ, మాటలలోనే కాకుండా చేతల్లో కూడా అధికార పార్టీకి దూరంగా ఉండాలన్న ఉద్దేశం కానీ రాష్ట్ర బీజేపీలో ఇసుమంతైనా కనిపించడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. మాధవ్ ఇప్పుడైతే తాము కోరినా జనసేనాని స్పందించలేదంటున్నారు కానీ, మిత్ర ధర్మాన్ని పాటించి పవన్ కల్యాణ్ వద్దకు వోళ్లి మద్దతు కోరిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.   కేంద్రంలో మోడీ అధికారంలో ఉంటే.. ఇక్కడ పెత్తనం చెలాయించినా అడిగే వారు కానీ, అడ్డుకునే వారు కానీ ఉండరన్న భావనతో  రాష్ట్ర బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే తమ  వైఫల్యాలను జనసేనాని మీదకు నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీతో తాము కలిసే ఉన్నామన్నది ప్రచారమేనని నమ్మింప చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత మాధవ్ మాటల సారాంశమిదేనంటున్నారు. జనం నమ్మే స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పుడు ఖండించడానికి కానీ, అధికార పార్టీపై విమర్శలు చేయడానికి కానీ, కనీసం ఆ పార్టీకి దూరం జరిగే ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలకు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతల వద్ద సమాధానం కరవైంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ పార్టీతో అంటకాగుతోందని ఆ పార్టీ నేతలే హస్తిన వెళ్లి మరీ ఫిర్యాదు చేసిన విషయాన్ని మాధవ్, సోము వంటి వారు తమ వివరణలో కన్వీనియెంట్ గా మర్చిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ఆ పార్టీ గుణపాఠంగా తీసుకోలేదనీ, ఇది కూడా జనసేనతో కటీఫ్ కు ఒక అవకాశంగానే భావిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. అంతే తప్ప రాష్ట్రంలో అధికార పార్టీతో అంట కాగడం వల్ల నామమాత్రంగా బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఓటు కూడా దూరమౌతోందన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు మాత్రం సిద్ధంగా లేరని అంటున్నారు.