రాహుల్ గాంధీ పై వేలాడుతున్న అనర్హత వేటు?
posted on Mar 23, 2023 @ 4:53PM
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఆయనలో వచ్చిన మార్పుకు, ఆయన చుట్టూ అల్లుకుంటున్న వివాదాలకు ఏమైనా సంబంధం వుందో లేదో కానీ, ఆయన వార్తల్లో వ్యక్తిగా అయితే నిలుస్తున్నారు. జోడో యాత్ర తర్వాత బ్రిటన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగం, విలేకరుల సమావేశంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు, ఎంతగా వివాదాస్పద మయ్యాయో వేరే చెప్పనక్కరలేదు. విదేశీ గడ్డపై నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే కాదు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రతిస్థంభనకు కూడా కారణమయ్యాయి.
అదలా ఉంటే గతంలో ఎప్పుడో ప్రధార మంత్రి ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఎప్పుడో 2019లో రాహుల్ గాంధీ, “మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 2019లో మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని అర్ధం వచ్చేలా విమర్శించిన సంగతి విదితమే.
దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ గతంలో పలు మార్లు హాజరయ్యారు కూడా. కాగా మోడీ ఇంటి పేరు ఉన్న వారందర్నీ రాహుల్ గాంధీ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే స్పష్టం చేసింది.మోడీ ఇంటి పేరు ఉండి పరారీలో ఉన్న నీరవ్ మోడీ, లలిత్ మోడీల గురించే రాహుల్ ప్రస్తావించారని, ఇది మోడీపై రాజకీయ విమర్వే తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదనీ స్పష్టం చేసింది. అయితే కోర్టు మాత్రం రాహుల్ వ్యాఖ్యలు క్రిమినల్ డిఫమేషన్ కిందకే వస్తాయంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
కోర్టు శిక్ష నేపథ్యంలో లో రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యత్వం పై వేటు పడే ప్రమాదం లేక పోలేదని, అయన మెడపై అనర్హత కత్తి వేలాడుతున్నట్లేనని అంటున్నారు. ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ మంజూరు చేసినా, శిక్ష ఖారారైనందున ఆయనకు న్యాయపరమైన చిక్కులు తప్పవని అంటున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడుతుంది. అంతేకాదు సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చు. రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించి వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు జరిపించవచ్చని న్యాయవాదులు, న్యాయ నిపుణులు అంటున్నారు.
అలాగే ఫై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీకు కూడా అనర్హులవుతారని అంటున్నారు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు.
అటు తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.మరోవైపు పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు. మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టు తీర్పును స్వాగతించారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ ఇచ్చింది. మరోవంక బీజేపీ చట్టం తనపని తానూ చేసుకు పోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కాదని పేర్కొంది.