కడియం, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు 

బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.  కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతోపాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో కేసులో హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది.కడియం శ్రీహరి బిఆర్ఎస్ లో  కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో  స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తప్పించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చి కెసీఆర్ గెలిపించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ లో బిఆర్ఎస్ ఘోరంగా పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ఇచ్చిన స్టేట్ మెంట్ తెలంగాణలో చర్చకు దారితీసింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బిఆర్ఎస్ అధికారంలో వస్తుందని కడియం ప్రకటించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరారు. ఇది బిఆర్ఎస్ కు కంటగింపుగా మారింది. దీంతో కడియంపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఎపిలో ఇవ్వాళ పెన్షన్లు లేనట్టే 

పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది.ఈ నేపథ్యంలో మే 1న పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఖాతాలు లేనివాళ్లకు సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. అయితే మే 1 (ఈరోజు) కార్మికుల దినం. ఈరోజు బ్యాంకులకు సెలవు. ఈ క్రమంలో... ప్రతి ఏడాది మాదిరే మేడే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్ధిదారులు గమనించాలని... దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో, ఈరోజు పెన్షన్ల పంపిణీ లేనట్టే. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల వేళ వృద్దులు, వింతువులు, వికలాంగులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందజేసే పెన్షన్లపై ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నేప‌థ్యంలో ‘సెర్ప్’ అధికారులు కీల‌క నిర్ణణయం తీసుకున్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసే బదులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాల‌ని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఒక రకంగా ఇది అధికార పార్టీకి ఈసీ కండీషన్ పెట్టినట్లుగా ఉన్నప్పటికి..పెన్షన్ దారులకు మాత్రం ఒకింత ఇబ్బందిని కలిగించే నిర్ణయమని లబ్దిదారుల్లో ఉన్న వృద్దులు అసహం వ్యక్తం చేస్తున్నారు.

మణిపూర్ మహిళల అత్యాచారంలో పోలీసుల పాత్రః సీబీఐ

మణిపూర్ లో ఎంత మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఓ వర్గం.. వారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించింది. అప్పుడు పోలీసులు ఎలా వ్య‌వ‌హ‌రించారు. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్ల‌రి మూక‌ల‌కు అప్ప‌గిస్తే ఫ‌లితం ఎలా వుంటుందో మ‌ణిపూర్ మ‌హిళ‌ల అత్యాచార సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖ‌లు చేసిన చార్జి షీట్‌లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.  కార్గిల్‌ యుద్ధవీరుడి భార్య అయిన ఓ బాధితురాలు... తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని పోలీసులను వేడుకుంటే.. ‘జీపు తాళాలు లేవు’ అని పోలీసులు బుకాయించారని సీబీఐ ఛార్జిషీటు లో పేర్కొంది. చార్జిషీట్ వివరాల ప్రకారం, తమ గ్రామంపై జనాలు పలు బృందాలుగా విడిపోయి దాడి చేయడం ప్రారంభించగానే ముగ్గురు మహిళలు తమ కుటుంబాలతో కలిసి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కానీ, గ్రామంపై దాడి చేస్తున్న మూక వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చింది. ఈలోపు గుంపులోని కొందరు బాధితులకు పోలీసులను ఆశ్రయించమని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు సమీపంలోని పోలీసు జీపు వద్దకు వెళ్లి అందులోని ఇద్దరు పోలీసుల సాయం అర్థించారు. కానీ, పోలీసులు వారిని తీసుకెళ్లి దాడిచేస్తున్న గుంపు ముందు దిగబెట్టారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఇద్దరు మహిళలతో పాటు ఉన్న పురుషుడిని చంపేశారు. దుండగుల దృష్టి ఇద్దరు మహిళపై ఉండగా మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మరోవైపు, తమకు చిక్కిన ఇద్దరు మహిళలను.. దుండగులు నగ్నంగా ఊరేగించి చివరకు గ్యాంగ్ రేప్ చేశారు.   మైతీ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ -జోమి వర్గానికి చెందిన మహిళల  సామూహిక అత్యాచార  ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత జులైలో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశాన్ని కుదిపేసింది. ఈ అకృత్యాలపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గువాహటిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన కుకీ తెగ తండ్రీ కొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరు లేని నదిలోకి విసిరేసినట్లు తెలియజేశారు. మైతీ మూకలు, పోలీసు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పరారైనట్టు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు కాపాడ‌కుండా, ఆ అల్ల‌రి మూక‌ల‌కే అప్ప‌గించిన విష‌యాన్ని సీబీసీ తెలిపింది.  ఈ దాడి మొత్తం ముందస్తు ప్రణాళికతో చేసిందని సీబీఐ పేర్కొంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌  

రెండో విడతలోనూ బీజేపీకి మైనస్సే?

మూడో సారి అధికారం తథ్యం అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో షాక్ తగిలిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తొలి విడతలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య శూన్యమేనన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. పెట్టని కోటగా బీజేపీ భావిస్తున్న ఉత్తరప్రదేశ్ లో సైతం బీజేపీకి ఆ పార్టీ ఊహిస్తున్న విధంగా సానుకూలత లేదని తొలి విడత పోలింగ్ స్పష్టం చేసిందంటున్నారు. ఇక రెండో విడతలోనూ బీజేపీకి భంగపాటే ఎదురైందని అంటున్నారు. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ రెండు విడతల్లో దేశ వ్యాప్తంగా 190 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ రెండు విడతల్లోనూ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలకే సానుకూలంగా పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే బీజేపీలో అంతర్మథనం మొదలైందని, అందుకే మోడీ పరిధులు మరిచి మరీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం ఆరంభించారని చెబుతున్నారు.  ఎన్నికల నియమావళిని ఇసుమంతైనా పట్టించుకోకుండా  మతపరమైన పోలరైజేషన్‌ కోసం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ కు గురి చేశాయి. మైనారిటీ వ్యతిరేకతను ఈ పదేళ్లుగా ముసుగులో దాచేసిన ఆయన ఒక్కసారిగా ముసుగు తీసేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయన చేస్తున్న ప్రసంగాల పట్ల ఎన్నికల కమిషన్ స్పందించలేదు.   ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికీ నేటికీ   దేశ రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్స్‌ బహిర్గతం అవ్వడంతో ఆ బాండ్ల వల్ల అధిక లబ్ధి పొందిందెవరన్నది ప్రస్ఫుటంగా దేశ ప్రజలందరికీ బ్లాక్ అండ్ వైట్ లో అవగతమైపోయింది. ఆ తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం  దేశ రాజకీయాలలో సంచలనానికి కారణమైంది. ఈ కేసులో ఇంత కాలం ఊరుకుని సరిగ్గా ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ఈడీని ప్రశ్నించడం.. ఈ అరెస్టు రాజకీయపరమైనదేననే భావన ప్రజలలో కలిగింది.  వేర్వురు పార్టీలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఈడీ, సీబీఐ, ఐటీల నుంచి రక్షణ పొందాలంటే బీజేపీలో చేరడమొక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారనీ, అటువంటి వారిని దరికి చేర్చుకుని బీజేపీ అవినీతి పరులకు ఆశ్రయ కేంద్రంగా మారిపోయి తద్వారా రాజకీయలబ్ధి పొందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజజలలో ఆ అసంతృప్తి ఎన్నికలలో ప్రతిఫలిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశలలోనూ ప్రస్ఫుటంగా కనిపించిందని అంటున్నారు.  ఇక గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లిన నిరుద్యోగం కారణంగా యువతలో కూడా పదేళ్ల మోడీ పాలనపై అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలోని 30 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   రైతు ఆదాయం రెట్టింపు అంటూ ఊరూవాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న మోడీ సర్కార్ వారికి కనీస మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమైంది. తమ సమస్యలపై గళమెత్తిన రైతులపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం మోడీ సర్కార్ పై  కన్నెర్ర చేసిన పరిస్థితి ఉంది.వెరసి ఈ వర్గాలన్నీ మోడీ సర్కార్ తీరు పట్ల తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఎన్నికలలో ఓటు ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించుకోవడం వల్లనే బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు.   

16 నెలల జైలు.. పదేళ్లుగా బెయిలు! జగన్ కు గుర్తు చేస్తున్న నెటిజనులు!

ఎదుటి వారు చేసేవన్నీ తప్పులు.. నేను మాత్రమే సుద్దపూసను అన్నభ్రమల్లో జగన్ పూర్తిగా మునిగిపోయారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఎన్నడూ  మీడియా ముందుకు రాలేదు కానీ.. ఎన్నికలలో ఓటమి భయం వెంటాడుతుంటే.. అనివార్యంగా తన గురించి తను చెప్పుకోవడానికి ఏం లేకపోయినా.. విపక్షాలపై విమర్శలు గుప్పించడానికి ఆయన వద్ద ఉన్న పడికట్టు రాళ్ల వంటి మాటలను మరో సారి విసర్జించేందుకు జగన్  మీడియా ముందుకు వచ్చారు. ఇందు కోసం ఆయన ప్రెస్ మీట్ ఏమీ పెట్టలేదు. ఒక ప్రముఖ జాతీయ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఆ ఇంటర్వ్యూలో మరో సారి పర నింద.. అంటే మరేమీ లేదు చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుకోవడానికే పరిమితమయ్యారు. అలా చేసే క్రమంలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టై 52 రోజులు జైలులో ఉండటానికి కారణం ఆయన తప్పు చేయడమేనని చెప్పారు. బెయిలు వచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదనీ వాకృచ్చారు. బెయిలు పొందే హక్కు, అవకాశం అందరికీ ఉంటుందని, అలాగే చంద్రబాబుకూ బెయిలు వచ్చిందనీ చెప్పారు. అంతే కాదు స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకోలేరనీ కూడా జోస్యం చెప్పారు.  పాపం విపక్ష నేతపై ఆరోపణలు, విమర్శలు గుప్పించే తొందరలో తాను 16 నెలలు జైలులో ఉండి బెయిలు మీదే బయటకు వచ్చారన్న సంగతి కన్వీనియెంట్ గా మర్చిపోయారు.  కానీ నెటిజనులు మాత్రం ఈ ఇంటర్యూ ఆధారంగా జగన్ ను ఏకి పారేస్తున్నారు.  చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉంటే నేరం చేశారనుకుంటే, మరి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్  ఎంత నేరం చేశారో? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే జగన్ గత పదేళ్లుగా బెయిలు మీదే ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు.  ఇక ఇంటర్వ్యూలో తనకెదురైన ఏ ప్రశ్నకూ జగన్ సూటిగా సమాధానం చెప్పలేదు. తాను మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగానూ, అంత కంటే ముందు బటన్ నొక్కుడు సభల సందర్భంగానే ఇచ్చిన ప్రసంగాలనే  ప్రతి ప్రశ్నకూ సమాధానంగా చెప్పేశారు. కొన్ని ప్రశ్నలకైతే సమాధానం దాట వేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే గెలిపిస్తారు అన్న విశ్వాసం ఉన్నప్పుడు అంత మంది సిట్టింగులను ఎందుకు మార్చారన్న ప్రశ్నకు ఇది చాలా పెద్ద ప్రశ్న అంటూ ఇప్పుడు సమాధానం చెప్పడానికి వీలు కాదన్నట్లుగా దాటవేశారు.  

మార్కులు తక్కువ వచ్చాయన్నందుకు...

వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బెంగళూరులోని బసవశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పద్మజ అనే మహిళ కుమార్తె ఇంటర్మీడియట్ పాస్ అయింది. అయితే ఆమెకు మార్కులు తక్కువ వచ్చాయి. దానికి పద్మజ తన కూతుర్ని మార్కులు తక్కువ వచ్చాయేంటని కోప్పడింది. దాంతో ఆ కూతురు కోపంతో రగిలిపోయింది. కిచెన్‌లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి తన తల్లి మీద దాడి చేసింది. కత్తితో తల్లిని నాలుగుసార్లు పొడిచింది. కత్తిపోట్లకు గురైన తల్లి మరో కత్తిని తీసుకుని కూతురి మీద ఎదురుదాడి చేసి, తాను కూడా కత్తిపోట్లు పొడిచింది. కత్తిపోట్లకు తీవ్రంగా గురైన కుమార్తె అక్కడికక్కడే మరణించింది. ఇల్లంతా రక్తసిక్తమైపోయింది. కూతుర్ని చంపిన తర్వాత తల్లి కూడా కుప్పకూలిపోయింది. కూతురు చనిపోయింది. ఇప్పుడు తల్లి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో వుంది. 

మూడు నెలల వరకు మంచి రోజులు లేవ‌ట‌! శుభముహూర్తాలకు బ్రేక్!

సాధార‌ణంగా ఎలాంటి శుభ‌కార్యాలు జ‌ర‌గాల‌న్న మంచి ముహూర్తాలు ఉండాల్సిందే. మంచి ముహుర్తాలు లేకుంటే శుభ‌కార్యాలు చేయ‌రు. ప్ర‌స్తుతం మూఢ‌మి వ‌చ్చేసింది. మూడు నెల‌ల వ‌ర‌కు శుభ‌కార్యాల‌కు విరామం అనే చెప్ప‌వ‌చ్చు. దీంతో ప‌లు రంగాల వారిపై ప్ర‌భావం ప‌డ‌నుంది. ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. నిన్న‌టి నుంచి అదే.... ఏప్రిల్‌ 29 నుంచి ఆగస్టు 8వరకు, మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవ‌ని వేద పండితులు తేల్చిప‌డేశారు. అంతే ఇక  వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యం కాదు. మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌.  శుభకార్యాలకు బ్రేక్‌ పడటంతో పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం వుంటుంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్‌లు నిర్వహించే కళాకారుల ఉపాధికి కూడా మూడు నెలలపాటు గండిపడిన‌ట్లే.  పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఆగిపోయినట్టే. ఈ మూడు నెలల పాటు వంటల వారు, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. వీరితో పాటు బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు నెలకొన్నాయి.  ఇక‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకుల‌కు గిరాకీ లేక ఈగ‌లు తోలుకోవాల్సిందే. క‌నీసం మెయింట్‌నెన్స్‌ చార్జీలు కూడా రావని ఫంక్ష‌న్ హాళ్ల నిర్వాహ‌కులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు.  ప్రతి సంవత్సరం మే నెలలో అత్యధిక వివాహాలు జరుగుతుంటాయి. కానీ, ఈ సారి ఆ అవకాశం లేదు. సోమవారం నుంచే శుభకార్యాలకు బ్రేక్‌ పడింది.  సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుందని ఈ సమయంలో ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహుర్తాలు పెట్టడం సాధ్యం కాని పురోహితులు చెబుతున్నారు.  మూడాల కారణంగా   ముఖ్యంగా శుభ‌కార్యాల‌కు గురు, శుక్ర గ్ర‌హాల బ‌లం ముఖ్యం. ఆ రెండు గ్ర‌హాలు సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ప్పుడు వాటి శ‌క్తిని కోల్పోయి బ‌ల‌హీన‌మ‌వుతాయి. కాబ‌ట్టి అలాంటి స‌మ‌యం, ఎటువంటి శుభ‌కార్యాల‌కు ప‌నికి రాద‌ని పంచాగ క‌ర్త‌లు చెబుతున్నారు.  మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

TDP కూట‌మిలో రెట్టించిన జోష్‌! సంక్షేమం-అభివృద్ధి వైపే ఏపీ ఓట‌ర్!

టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది. వాస్త‌వానికి ప్ర‌జ‌లు ఎప్పుడూ, సంక్షేమంతో పాటు అభివృద్ధినే కోరుకుంటారు. కానీ గ‌త ఐదేళ్ళ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎక్క‌డా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచివేసిందనే అస‌హ‌నం ఏపీ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఆ అస‌హ‌న‌మే ఇప్పుడు ఓట్ల రూపంలో చూప‌నున్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్ప‌వ‌చ్చు.   తన వల్ల మేలు జరిగితేనే తనకు ఓటేయాలని.. లేకుంటే వద్దని ఆయ‌నే చెబుతున్నాడు. కేవ‌లం సంక్షేమ పథకాలనే జగన్ నమ్ముకున్నారు.  మ‌రోవైపు.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. అమ‌రావ‌తిని విధ్వంసంచేశార‌ని.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రా కుండా చేశార‌ని.. దీని వ‌ల్ల రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చెబు తోంది. దీనినే ప్ర‌చారం కూడా చేస్తోంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప‌థ‌కాల‌కు మించి, సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తామ‌ని టీడీపీ చెబుతోంది. చంద్ర బాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అంటూ కూటమి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. తెలుగుదేశం అంటేనే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే పార్టీ. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రజాగళం పేరుతో చంద్ర‌బాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం కంటే, మెరుగైన సంక్షేమం అందిస్తామ‌ని కూట‌మి మేనిఫెస్టో విడుద‌ల చేసింది. కూట‌మి సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌తో మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. అధికార, విపక్ష కూటమి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీకి ఎలాంటి నాయ‌కుడు అవ‌స‌రం అనేదే, ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అదే జ‌నం మాట్లాడుకుంటున్నారు.  జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌, అలాగే చంద్ర‌బాబు 14 ఏళ్ల పాల‌న‌...వీరిలో ఎవ‌రు స‌రైన నాయ‌కుడో ఏపీ ప్ర‌జ‌లు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వ‌నున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

టీడీపీ-జనసేన శుభవార్త: లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘ప్రజాగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది. మిగతా విషయాన్నిటి గురించి తర్వాత ముచ్చటించుకుందాం.. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఒక ముఖ్యమైన శుభవార్త గురించి. ఆ శుభవార్త మరేదో కాదు.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. ప్రజాకంటక వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల రైతుల భూమి వాళ్ళ చేతిలో వుండదు.. ఎవరైనా అక్రమ మార్గాల ద్వారా స్వాధీనం చేసుకుంటే, రైతులు జీవితాంతం పోరాటం చేసినా ఫలితం వుండదు. అపురూపంగా దాచుకునే భూమి డాక్యుమెంట్లకు బదులు ఒక జిరాక్స్ కాగితం రైతు చేతికి వస్తుంది. మొత్తమ్మీద తరతరాలుగా వస్తున్న భూమి, కష్టపడి సంపాదించుకున్న సొంతం భూమి మీద అధికారం వుండదు.. ఆ అధికారమంతా ప్రభుత్వానికి, ధనబలం వున్నవారికి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాల మీద తన ఫొటో పెట్టుకోవడం లాంటి తెంపరితనాన్ని ప్రదర్శించిన జగన్ ఈసారి రైతుల భూమికే ఎసరుపెట్టడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చాడు. ఈ చట్టం తాజాగా అమల్లోకి రావడంతో రైతులు, భూమి వున్నవారు వణికిపోతున్నారు. ఈ దరిద్రపు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన నుంచి వచ్చిన మేనిఫెస్టోలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  రద్దు’ అనే శుభవార్త చూసి ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

చత్తీస్ గడ్ లో ఆగని  ఎన్ కౌంటర్లు ...బస్తర్ లో ఈ ఏడాది 88 మంది నక్సలైట్లు దుర్మరణం 

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్ మాడ్ అటవీప్రాంతం ఈ ఉదయం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టేక్ మెట్ట, కాకూరు గ్రామాల మధ్య ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సీనియర్ మావోయిస్టు నేతలు సమావేశమవుతున్నారన్న సమాచారంతో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పక్కా ప్రణాళికతో అబూజ్ మాడ్ అటవీప్రాంతంలో ప్రవేశించాయి.  కాకూరు గ్రామం వద్దకు చేరుకునే సరికి ఇరు వైపులా కాల్పులు ప్రారంభం అయ్యాయి. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో ఏడు మృతదేహాలను కనుగొన్నట్టు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు.  ఇదిలా ఉండగా చత్తీస్ ఘడ్ లోని కంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కంకేర్ జిల్లా చోటేబెతియ ప్రాంతంలోని బినగుండా ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోలు చనిపోయారు.. ఓ ఇన్స్పెక్టర్ తో పాటు ఇద్దరు బిఎస్ఎఫ్  జవాన్లకు గాయాలు అయ్యాయి. .మావో అగ్ర నాయకుడు శంకర్ రావు ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఆయననను పట్టుకున్న వారికి ప్రభుత్వం 25 లక్షల రివార్డు గతంలో ప్రకటించింది.మావోల నుంచి అత్యాధునిక ఆయుధాలు స్వాదినం చేసుకున్నారు. ఎకె  47 రైఫిల్ తో ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు విప్లవ సాహిత్యం ఘటన స్థలంలో లభించాయని ప్రాథమిక సమాచారం. బిఎస్ఎఫ్ బలగాలతో పాటు  బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. చత్తీస్ ఘడ్ లో. ఇదే నెల 11వ తేదీన   చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. బిజాపూర్ లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. నది వద్ద నిర్మస్తున్న వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడున్న పలు వాహనాలకు వారు నిప్పు పెట్టారు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు మృతి చెందగా, మిగిలిన వారి కోసం కూంబింగ్ చేపట్టారు. అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో సమీపంలోని అడవులను జల్లెడ పడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్ల  నుంచి తేరుకోకమునుపే ఇవ్వాళ మరో ఏడుగురు నక్సలైట్లు మృత్యువాత పడటం నక్సలైట్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది. ఎన్ కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు 88 మంది మావోయిస్టులు హతమయ్యారు.

కూటమి మేనిఫెస్టో సూపర్!.. జగన్ శిబిరం బేజార్!

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. అదే సమయంలో చంద్రబాబు గ్యారంటీలతో పాటుగా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల సామాన్య జనం నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   అందుకు భిన్నంగా జగన్ 2019లో ప్రకటించిన నవరత్నాలు కొద్దినగదు పెంపుతో  పాతమేనిఫెస్టోనే ప్రకటించడం ఆ పార్టీ నాయకులు , అభ్యర్థులలోనే అసంతృప్తి వక్తం అవుతోంది.  రైతు రుణ మాఫీ, పింఛన్లునాలుగు వేలకు పెంపు, రైతు భరోసా భారీ పెంపు ,మెగా డీఎస్సీ  వంటివి జగన్ మేనిఫెస్టోలో ఉంటాయని అంతా బావించారు. కానీ జగన్ వీటి వేటి ఊసూ తన మేనిఫెస్టోలో ఎత్తలేదు.  అలాగే జగన్ తాను ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమం ఖర్చు నెలకు 70వేల కోట్లు అవుతుందన్నారు. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు నెలకు లక్షా ఇరవై నుంచి 50వేలకోట్ల రూపాయలు వరకూ అవుతుందని,అది అసాధ్యమని జగన్ విమర్శలు గుప్పించారు. దీనిపై విపక్ష తెలుగుదేశం కూటమి నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, వైసీపీ శ్రేణుల నుంచీ కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నెలకు రూ.70వేల కోట్లు సమకూరడమే గగనమని చెబుతున్న జగన్ తన ఐదేళ్ల పాలనలో లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేసారని నిలదీస్తున్నారు.  ఇక తెలుగుదేశం కూటమి నేతలైతే తాము  సంక్షేమం తో పాటు అభివృద్ధి చూపిస్తామని, సంపద సృష్టికి, అభివృద్ధికి అసలు సిసలు చిరునామా చంద్రబాబు అని చెబుతున్నారు.  జగన్ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారన్నారు. అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనిపించలేదు. విడతలవారీగా మద్యపానం నిషేధం అన్నారు. కానీ   ఆచరణలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలను అడ్డూ అదుపూ లేకుండా పెంచేశారని విమర్శిస్తున్నారు.  సంక్షేమం అంటూ రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోతో మేనిఫెస్టో కంటే ముందే తెలుగుదేశం ప్రకటించిన గ్యారంటీలు ఎంతో గొప్పగా ఉన్నాయని అభివృద్ధి సంక్షేమానికి పూచిపడుతున్నాయని ప్రశంసించారు.  ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి తన మేనిఫెస్టోను ప్రకటించేసింది. ఇందులో 25 అంశాలను పొందుపరిచింది. దీంతో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండటంతో జగన్ శిబిరం బేజారైపోతోంది. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు 1.మెగా డీఎస్సీపై తొలి సంతకం 2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000 3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000 4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం 6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు  7.రూ.3000 నిరుద్యోగ భృతి  8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000 9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి  11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000  12.ఉచిత ఇసుక  13.అన్నా క్యాంటీన్లు  14.భూ హక్కు చట్టం రద్దు  15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ 16.బీసీ రక్షణ చట్టం  17.పూర్ టూ రిచ్ పథకం 18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ 19.కరెంటు చార్జీలు పెంచం 20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ 21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం  22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం  23.పెళ్లి కానుక రూ.1,00,000/- 24.విదేశీ విద్య పథకం 25.పండుగ కానుకలు

ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు తొలగింపు?

గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన రాష్ట్రంలో 21 అసెబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలలో  కూటమిలోని మిగిలిన పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీలో లేని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం కూటమి అభ్యర్థులకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును  ఇతరులెవరికీ కేటాయించవద్దని కోరుతూ తాము ఎన్నికల కమిషన్ ను కోరినట్లు పేర్కొన్నది. ఒక సారి కాదు రెండు సార్లు ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ను కోరామని పేర్కొంది. జనసేన పోటీ లో లేకపోయినా ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులకు ఇండిపెండెంట్లకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడం వల్ల నష్టం జరుగుతుందనీ, ఓటర్లలో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందనీ పేర్కొంది. ముఖ్యంగా జనసేన పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్లుగా నిలబడిన రెబల్ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించడం కూటమి అభ్యర్థుల అవకాశాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.   దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇటువంటి వినతులపై 24 గంటలలో నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు జనసేన పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఇదే అంశంపై తెలుగుదేశం కూడా సప్లిమెంటరీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోలేదనీ, ఏమీ చెప్పకపోవడం అంటే నిరాకరించడం కాదనీ పేర్కొనడాన్ని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు విచారణను బుధవారం (మే1)కి వాయిదా వేసింది. 

60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు!

ఒకప్పుడు మూసీ నీరు.. సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేది. దాంతో హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కల్గిన మూసీ, నేడు కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.  దేశంలోనే అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగా  మారింది.  మూసీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోనే పుట్టి, తెలంగాణలోనే ప్రవహించి, తెలంగాణలోనే ముగుస్తున్న మూసీని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప‌ర్యావ‌ర‌ణ వేత్తలు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు.   హైదరాబాద్ లో డెవలప్ మెంట్ పేరుతో చేస్తున్న విధ్వంసమే ఈ పరిస్థితికి కారణమని ప‌ర్యావ‌ర‌ణ వేత్త వేత్త డా. లుబ్నా సార్వత్  ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మూసీ నదికి ఉన్న బోలెడు ఇన్ లెట్స్ ద్వారా కలుషిత నీళ్లు కలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నుంచి మూసాపేట వరకు చాలా చోట్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు మూసీలో కలుస్తున్నాయి.  జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియానే 267 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇలా నగరంలోని పలు చోట్ల నుంచి వ్యర్థాలు, కలుషిత నీళ్లు వివిధ ఇన్ లెట్ల ద్వారా మూసీలో కలుస్తున్నాయి.  హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగు నీరు కూడా మూసీలో కలుస్తుంది.  వర్షపు నీటిని తీసుకెళ్లాల్సిన చానళ్లన్నీ మురుగు నీరు, వ్యర్థాలను తీసుకుని చెరువుల్లో కలుస్తున్నాయి. అక్కడ నుంచి అవన్నీ మూసీలో చేరుతున్నాయి. ఎక్కడ వస్తున్న వ్యర్థాలు, మురుగు నీటిని అక్కడికక్కడ సమర్థంగా నిర్వహించడమే దీనికి ఏకైక పరిష్కారమని ప‌ర్యావ‌ర‌ణ వేత్త వేత్త డా. లుబ్నా సార్వత్ చెబుతున్నారు.  మూసీలోకి నీటిని తీసుకొచ్చే మార్గాలెన్ని ఉన్నాయి? నీటి నిల్వకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మూసీ ఫ్లడ్‌ లెవల్‌ ఎంతుంది? వరద ప్రభావిత ప్రాంతాలెన్ని?’’.  మూసీ అభివృద్ధికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఎంత భూమి అవసరం అవుతుంది? పరిహారం చెల్లించాల్సి వచ్చే నివాస ప్రాంతాలెన్ని ఉన్నాయి? అనే అంశాల‌పై రేవంత్ ప్ర‌భుత్వం స్ట‌డీ చేస్తోంది. మూసీ ప్రక్షాళనతోపాటు.. తొలి దశ అభివృద్ధి పనులకు సుమారు రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ అవసరం అవుతుందనే ప్రాథమిక అంచనాలను అధికారులు సీఎం ముందు పెట్టారు.  మొత్తం 60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది.  ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్  నియోజకవర్గంలోని  కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు., దానికి 4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. దీనికి హడ్కో  దాదాపు ఆమోద ముద్ర వేయబోతుందని పురపాలక అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు. మూసీ నది అనంతగిరి వికారాబాద్ పర్వతాల్లో పుట్టింది.  హైదరాబాద్​ నగరం గుండా ప్రవహిస్తూ వాడేపల్లి మిర్యాలగూడ వద్ద కృష్ణాలో కలుస్తున్నది. హైదరాబాద్ లో 1908 సెప్టెంబర్ 28 న వచ్చిన పెద్ద వరద కారణంగా దాదాపు 15,000 మంది చనిపోయారు. 80,000 మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో దీన్ని ఒక పెద్ద విపత్తుగా పరిగణించారు.   ప్రముఖ ఇంజినీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి నైజాం కోరిక మేరకు వరద బాధల నుంచి తప్పించాలని ఆనాడు మూసీనదిపై గండిపేట వద్ద ఉస్మాన్ సాగర్​ రిజర్వాయరును 1920లో,  మూసీ నది ఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్​ 1927 రిజర్వాయర్ ను,  రెండు జలాశయాలను నిర్మించి హైదరాబాద్  ప్రజలకు  తాగునీటి,  మురుగు నీరు వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు.    1997లో  నందనవనం పేరుతో మూసీ సుందరీకరణ కోసం ఉమ్మడి ఏపీ  ప్రభుత్వ కాలంలో..  కులీ కుతుబ్​షా అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ ఒక పథకం రూపొందించింది.  అనంతరం  వాటరు బోర్డు  అబెట్​మెంట్​ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ మూసీ రివర్  పేరుతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో  రూ. 405 కోట్లు నిధులు  ఖర్చు చేశారు . కాలుష్య నియంత్రణకు గ్రేటర్​ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  రూ .50 కోట్లతో రబ్బరు డ్యామ్ నిర్మించారు. కానీ, నిరుపయోగమైనది.   మూసీ యథావిధిగా దుర్వాసన కలుషితమైన నీరుతోనే కనబడుతున్నది. కలుషితమైన నీటితో పండించిన వ్యవసాయోత్పత్తులు కూడా పూర్తిగా రసాయనాలతో కూడి ఉన్నాయని ఒక స్టడీలో ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది.  పలు సంస్థలు, ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షలో  మూసీ పరీవాహకం భూగర్భ జలాలు కాలుష్యంతో నిండిపోయినట్లు తేలింది.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌

అడ్డెడ్డే.. పదేళ్ళలో ఎన్ని మార్పులు?

అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ పోటీలో నిలిచారు. ఆరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పులివెందులలోని జగన్ ఇంట్లోంచి ఓ కారు బయటకి వచ్చింది. వెనుక సీట్లో ఇద్దరు మహిళా మూర్తులు కూర్చుని వున్నారు. వారిద్దరూ ఎవరో కాదు.. ఒకరు జగన్ భార్య భారతి, మరొకరు జగన్ చెల్లెలు షర్మిల. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. జగన్‌దే విజయం అనే విశ్వాసం వారి ముఖాల్లో కనిపించింది. కార్లో వాళ్ళిద్దర్నీ చూసిన పులివెందుల వాసుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. వైఎస్ కుటుంబం అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. ఇద్దరూ ప్రయాణించిన కారు పోలింగ్ బూత్‌కి చేరుకుంటూ. వదినా మరదళ్ళు ఇద్దరూ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళి ఓటు వేసి బయటకి వచ్చారు. అప్పటికే బయట ఫొటోగ్రాఫర్లందరూ ఫొటోలు క్లిక్ చేయడానికి రెడీగా వున్నారు. వదినా మరదళ్ళు ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు నిల్చున్నారు. ఇద్దరూ ఇంకు మార్కు వున్న వేళ్ళని ఫొటోగ్రాఫర్లకు చూపించారు. వదిన అంటే ఎంతో చనువు వున్న షర్మిల భారతి భుజం మీద చెయ్యి వేసింది. వాళ్ళ స్నేహబంధాన్ని మీడియా వాళ్ళు, అక్కడ వున్న జనం అబ్బురంగా చూశారు. పదేళ్ళ కాలం గిర్రున తిరిగింది. అనుబంధాలకు మధ్య ఆస్తులు అనే అడ్డుగోడలు లేచాయి. అన్నా చెల్లెళ్ళ అనుబంధం అడుగంటిపోయింది. వదిన మరదళ్ళ ఆప్యాయత ఆవిరైపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం, ఈ కుటుంబం బద్ధ శత్రువులు. భుజాల మీద చేతులు వేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఒకరి మీద మరొకరులు విమర్శలు కురిపిస్తున్నారు. ఒకరి పరువు మరొకరు రోడ్డు మీదకి ఎక్కిస్తున్నారు. 

విజయవాడలో దారుణం.. ఐదుగురి అనుమానాస్పద మృతి

విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డి.శ్రీనివాస్  ఇంటి బయట చెట్టుకు ఉరి వేసుకుని మరణించగా, ఇంటి లోపట శ్రీనివాస్ తల్లి రమణమ్మ, భార్య ఉష, ఇద్దరు పిల్లలు శైలజ, శ్రీహాన్ రక్తపు మడుగులో పడి వున్నారు. డాక్టర్ డి.శ్రీనివాస్ విజయవాడలో శ్రీజ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నగరంలోని గురునానక్ కాలనీలో నివసిస్తున్నారు. కాగా, కుటుంబ సభ్యులను శ్రీనివాసే హత్య చేసి వుంటాడని, ఆ తర్వాత ఉరి వేసుకుని వుంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

ఏలూరులో దూసుకుపోతున్న కూటమి!

ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎదురౌతున్న సవాళ్లు, విమర్శల ప్రభావం ఇసుమంతైనా కూటమి అభ్యర్థులపై కనిపించడం లేదు. ఏలూరు లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పుట్టా మహేక్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూడా విస్తృతంగా పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఏలూరు లోక్ సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్దానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్ సభ స్థానంతో పాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలోనూ కూటమి అభ్యర్థులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమి శ్రేణుల్లో విశ్వాసం నింపడమే కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలలో అక్కడక్కడా తలెత్తిన అసమ్మతిని కూడా బుజ్జగించి కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా పని చేసేలా దిశానిర్దేశం చేశారు.   ఏలూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నూజువీడు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం మాజీ కన్వీనర్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అసమ్మతి రాగం ఆలపించారు. అయితే వెంటనే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, తెలుగుదేశం ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వెంటనే రంగంలోకి దిగారు. ముద్రబోయనను సముదాయించి, కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించారు. అలాగే దెందులూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ను నిలబెట్టే విషయంలో తెలుగుదేశం అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఆ నియోజకవర్గంలో చింతమనేని విజయాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. అలాగే పొత్తులో భాగంగా ఏలూరు లోక్ సభ పరిధిలోని   పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాకే కైకలూరు నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. ఈ మూడు నియోజకవర్గాలలోనూ కూడా కూటమి శ్రేణులు ఐక్యంగా కదం తొక్కుతున్నారు. మొత్తం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం జోరు స్పష్టంగా కనిపిస్తుంటే. అధికార వైసీపీలో మాత్రం జోష్ కానరావడం లేదు.

మా భూమి పట్టా పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? పులివెందులలో వైఎస్ భారతిని నిలదీసిన రైతు!

కడప రాజకీయం మారిపోతోంది. ఆ జిల్లాలో వైఎస్ జగన్ ఆధిపత్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. అసలు వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన కడపలో ఈ ధిక్కారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ పులివెందులలో పర్యటించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో జనం నియోజకవర్గ సమస్యపై నిలదీశారు. నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో పరదాల చాటున తిరిగే జగన్ కు ప్రజలు పరదాలను చీల్చుకుని మరీ ఎదురుపడి నిలదీయడం ఇబ్బందికరంగా మారింది. అప్పట్లొ ఆయన జనం ప్రశ్నలకు తనదైన ప్రత్యేక చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్లి పోగలిగారు. కానీ ఎన్నికల వేళ ఆయన తరఫున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతికి మాత్రం అటువంటి వెసులుబాటు దక్కలేదు. జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని వదిలించుకు వెళ్లలేక తలవంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఔను భర్త జగన్ కోసం ప్రచారం చేస్తున్న వైఎస్ భారతికి ఓ సామాన్యుడు బాంబు లాంటి ప్రశ్న సంధించాడు. మా తాతముత్తాతల నుంచీ నాకు సంక్రమిచిన భూమి పట్టాపై ముఖ్యమంత్రి జగన్ పొటో ఎందుకని అతడు నిలదీశారు. ఆ వ్యక్తి పేరు భాస్కరరెడ్డి. అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అంతే కాదు..ఆయన వైసీపీకి చెందిన వ్యక్తే. కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్మరంపల్లె వచ్చిన భారతి మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్లి జగన్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. అయితే భాస్కరరెడ్డి, తమ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాన్ని చూపుతూ తన భూమి పట్టాపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు అని నిలదీశారు. అలాగే రైతు భరోసా పేరుతో జగన్ రైతులకు ఇస్తున్నదేమిటని నిలదీశారు. రైతు భరోసాలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందనీ, మరి జగన్ చేసిందేమిటని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్ములు పెంచాల్సిందిగా జగన్ కు చెప్పాలని భారతిని కోరారు. భాస్కరరెడ్డి సంధించిన ఈ ప్రశ్నలలో వేటికీ వైఎస్ భారతి సమాధానం చెప్పలేదు. భాస్కరరెడ్డి నిలదీస్తున్నంత సేపూ మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మాట్లాడకుండా అక్కడ నుంచి కదిలి వెళ్లిపోయారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలకు ప్రజల నుంచి డిమాండ్లు ఎదురు కావడం సహజమే. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ నిరసనలు ఎదురుకావడం కూడా కద్దు. అయితే పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని నిలదీసి ప్రశ్నించడం అంటే అదో అసాధారణ ఘటనే. అదీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని నిలబెట్టి ప్రశ్నించడం అన్నది ఎవరూ ఊహించను కూడా ఊహించలేరు. కానీ సోమవారం పులివెందులలో ప్రచారం సందర్భంగా ఈ చేదు అనుభవం సీఎం సతీమణికి ఎదురైంది. ఈ ఒక్క సంఘటన చాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చెప్పడానికి.  వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావడం, దానికి ఎత్తి చూపుతూ సొంత చెల్లి జగన్ పై విమర్శలు గుప్పించడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చిందనీ, నియోజకవర్గ ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారనీ ఈ సంఘటనను ఉదహరిస్తూ స్థానికులు చెబుతున్నారు.   

ఓటరుకి ప్రజాస్వామ్యానికి పెళ్ళంట! శుభలేఖ అదిరిందంట!

ఎన్నికల సందర్భంగా ఎవరి ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళది. రాజకీయ నాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. మధ్యలో ఇంకొంతమంది ఎవరికి తోచినట్టుగా వారు వినోదం పంచుతున్నారు. ఓటింగ్ మీద అవగాహన పెంచడం కోసం కొంతమంది వినోదాత్మక బాటను ఎంచుకున్నారు. ఓటరుకి, ప్రజాస్వామానికి పెళ్ళి చేస్తున్నామంటూ పూణెకి చెందిన కొంతమంది ఒక  వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వెడ్డింగ్ కార్డులో వధూవరుల పేర్ల స్థానంలో ప్రజాస్వామ్యం, ఓటరు అని రాసి వుంది. వివాహ వేదిక స్థానంలో ‘మీ పోలింగ్ కేంద్రం’ అని రాశారు. ‘ఓటు వేయడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశాన్ని సుసంపన్నం చేసే దిశగా ముందడుగు వేయాలంటే పార్లమెంటులో మన గళాన్ని ప్రతిధ్వనించే మన ఓటును వినియోగించుకోవడం చాలా ముఖ్యం’ అని ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.