జీతాలు వేసినా వాతలు తప్పవులే!

మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి. నలుగురైదుగురు ప్రభుత్వోద్యోగులు ఒకేచోట వుంటే అందరి ఫోన్లకూ ఒకేసారి మెసేజ్‌లు వచ్చాయి. ఈ మెసేజ్‌లు ఏమిటా అని చూసిన ఉద్యోగులు ఆశ్చర్యపో్యారు... ఆ మెసేజ్‌ల సారాంశం ఏమిటంటే, వారి నెల జీతం బ్యాంక్‌లో డిపాజిట్ అయింది. దాంతో వాళ్ళందరూ కళ్ళు నులుముకుని, చేతులను గిల్లుకుని ఇది కలయా.. నిజమా వైష్ణవ మాయా అనుకున్నారు.. ఎందుకంటే, గత నాలుగున్నర ఏళ్ళుగా ప్రభుత్వం ఏనాడూ వాళ్ళకి మొదటి తారీఖునే జీతం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్క జీతం విషయంలోనే మాత్రమే కాదు. ఉద్యో్గులకు అందాల్సిన అనేక ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం జగన్ ప్రభుత్వానికి భజన చేస్తున్నారు. దీనికి వెనుక వారి స్వప్రయోజనాలు తప్ప మరేమీ లేవు. అలాంటి వారు మినహా  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా వున్నారు. ఈసారి ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని ఓటుచ్చుకుని కొట్టడానికి సిద్ధంగా వున్నారు. ఇలాంటి సమయంలో వారిని కూల్ చేయడానికి మొదటి తేదీనే జీతాలు పడ్డాయన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఫస్ట్ తేదీనే ప్రభుత్వం జీతాలను పంపడం పట్ల సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగుల వాట్పాప్ గ్రూపుల్లో ఇప్పుడు ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ అయింది. ఎన్నికల పోలింగ్ దగ్గరకి వచ్చింది కాబట్టి, ఈ నాలుగున్నర ఏళ్ళలో ఫస్టు తారీఖునే జీతాలు వేశారని, జీతాలు వేసినా ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి వాతలు తప్పవని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.

షర్మిల ఎంట్రీతో జగన్ ధైర్యం, స్థైర్యం జావగారిపోయాయా?

సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్  నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్  గూటికి చేరి ఆ పార్టీ  రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.  షర్మిల కాంగ్రెస్ లో చేరిక నిస్పందేహంగా జగన్ కు నష్టం చేకూరుస్తుందన్నవిషయంలో వైసీపీ నేతలకూ, శ్రేణులకూ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో  వైసీపీ విజయంలో షర్మిల అఅత్యంత కీలక పాత్ర పోషించారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీలో షర్మిలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా పొగబెట్టి మరీ పార్టీని వీడే పరిస్థితులను కల్పించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె రాష్ట్ర వీడి పొరుగురాష్ట్రంలో సొంత కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేశారు. అయితే అక్కడా ఆమెను స్థిమితంగా ఉండనీయకపోవడం, ఆమె పార్టీకి ఎటువంటి సహాయసహకారాలూ అందకుండా అడ్డుకోవడంతో ఇప్పుడు ఆమె జగన్ కు వ్యతిరేకంగా ఏపీలోనే రాజకీయం మొదలు పెట్టారు. వైఎస్ వారసత్వం కోసం అన్నతోనే పోటీ పడుతున్నారు. ఈ పోటీలో ఆమె జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య విషయంలో షర్మల జగన్ పై సంధిస్తున్న విమర్శనాస్త్రాలు వైసీపీకి సమాధానం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాయి. అలాగే ఆమె వైఎస్ వివేకా హత్య కేసులో  తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ8 అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా కడప లోక్ సభ బరిలో నిలవడంతో ఆ ప్రభావం మొత్తం జిల్లాపై కనిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా  జగన్ కు ఒకింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేశాయి. దీంతో జగన్ నైతిక స్థైర్యం దెబ్బతింది. ఆ కారణంగానే ఇంత వరకూ షర్మిలపై విమర్శలకు పార్టీ నేతలు, పార్టీ  సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం చేసి తాను సంయమనం పాటించిన జగన్.. పులివెందులపై షర్మిల ప్రభావం కనిపిస్తుండటంతో స్వయంగా తానే సొంత చెల్లిపై విమర్శలకు దిగారు. ఇది నిస్సందేహంగా ఆయన స్థైర్యం కోల్పోయారనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెల్లెలు కట్టుకున్న చీర రంగు  గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏ స్టేజికి చేరిందో తెలియజేశాయి. అలాగే కడపలో షర్మిలకు డిపాజిట్ కూడా రాదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు   చెల్లెలిపై అంత ప్రేమ ఉంటే అవినాష్ ను పోటీ నుంచి తప్పించొచ్చుకదా అంటూ ఆమె ఇచ్చిన రిటార్డ్ వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మొత్తం మీద అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ గెలుపు ఆశలను షర్మిల మరింత ఆవిరయ్యేలా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మాజీ జడ్జి ఇంటిపై వైసీపీ పిశాచ మూకల దాడి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్‌ని మించిన ఆటవిక రాజ్యం నడుస్తోంది. వేధింపులు, దాడులు వైసీపీ నాయకులకు మామూలు విషయంలా మారిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులు, సామాన్య ప్రజల విషయంలో మాత్రమే కాదు... మాజీ జడ్జి విషయంలోనూ వైసీపీ పిశాచాలు తమ ఆటవిక ప్రవృత్తినే ప్రదర్శిస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోటలో రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ ఇంటి మీద వైసీపీ మూకలు మంగళవారం అర్ధరాత్రి దాడిచేశాయి. వేటకొడవళ్ళతో రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించిన ఈ మూకలు విధ్వసాన్ని సృష్టించాయి. కారు, ఫర్నిచర్, కిటికీలు.. ఇలా ఏది కనబడితే దాన్ని ధ్వంసచేసేశారు. గతంలో కూడా వైసీపీ మూకలు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశాయి. ఈ విషయమై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు 

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  నువ్వెంతా.. నీ బతుకెంతా.. ఒక్క రోజు ఉంటావో రెండు రోజులు ఉంటావో.. ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావ్... ఇవన్నీ ఎవరో సామాన్యులు తిట్టుకునే తిట్లు కావు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ సభలో చేసిన విమర్శలు. తానొక ప్రజాప్రతినిధిననే విషయం మరిచి రెచ్చిపోతున్న వైనం.. ఇది ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. వైసీపీ శ్రేణుల్లోనూ ఆయన తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. 

కొంపలు ముంచిన కోవీషీల్డ్!

కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది. కరోనా సమయంలో దేశంలో జనానికి కోవీషీల్డ్ కరోనా టీకాలు వెంటపడి మరీ గుచ్చిగుచ్చి వదిలిపెట్టారు. ఎవరైనా కోవీషీల్డ్ వేసుకోనంటే వాళ్ళని మర్డర్ చేసినవాళ్ళ కంటే పెద్ద నేరస్తులన్నట్టు చూశారు. కోవీషీల్డ్ టీకాతోపాటు మరో టీకా కోవాక్సిన్ అనే మరో టీకా కూడా వచ్చిందంటగా, అది వేస్తారా అంటే, ‘హుష్‌కాకీ.. అయిపోయాయి’ అని చెప్పి అందరికీ కోవీషీల్డే గుచ్చారు. అయినవారికి కంచాల్లో, కానివారికి ఆకుల్లో పెట్టినట్టుగా, ప్రధాని మోడీ లాంటి ప్రముఖులు, సెలబ్రిటీలు, డబ్బున్నవాళ్ళు, పలుకుబడి వున్నవాళ్ళు, రాజకీయ నాయకులకు మాత్రం సదరు కోవాక్సిన్ టీకా ఇచ్చారు. మిగతా వాళ్లందరికీ కోవీషీల్డే దిక్కు. ఆ దిక్కుమాలిన కోవీషీల్డ్ వల్ల ఎన్నెన్నో సైడ్ ఎఫెక్టులు.. ఎంతోమంది చనిపోయారు. ఆరోగ్యంగా వున్నవారు కూడా అకస్మాత్తుగా చనిపోయారు. ఇదెక్కడి ఘోరమయ్యా అని అడిగితే, ఏమో మాకు తెలియదు అని మొన్నటి వరకు ప్రభుత్వ వర్గాలు అన్నాయి. ఇప్పుడు కోవీషీల్డ్ తయారు చేసిన అమెరికాకి చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా అసలు విషయాన్ని బయటపెట్టింది. మా కోవీషీల్డ్ టీకాకి సైడ్ ఎఫెక్టులు వున్నాయని, మా టీకావల్ల చాలామందికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయని, చాలామంది చనిపోయారని, చనిపోయినవారి కుటుంబాలకు మా సానుభూతి అని చావుకబురు చల్లగా చెప్పింది. అమెరికాకి చెందిన ప్రముఖ ఫార్మాకంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సటీ సంయుక్తంగా కోవీషీల్డ్ టీకాని రూపొందించాయి. ఇండియాలో ఈ టీకాని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. కరోనా సమయంలో అత్యధికంగా ఉపయోగించిన టీకా కోవీషీల్డే. కరోనా వచ్చి వెళ్ళిపోయిన ఇన్నేళ్ళ తర్వాత ఆస్ట్రాజెనికా అసలు విషయాన్ని బయటపెట్టింది. నిజమే.. మా టీకా తీసుకున్న వాళ్ళలో అరుదైన సందర్భాల్లో (థాంబ్రోసిస్) రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందని చెప్పింది. ఈ సమస్యల వల్ల చాలామంది చనిపోయారని, వారి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పింది. అయినప్పటికీ, తమ సంస్థ జనాల ప్రాణాలను కాపాడ్డానికి కట్టుబడి వుందని చెప్పుకొచ్చింది. టీకాలతోపాటు అన్ని రకాల ఔషధాల తయారీలో ప్రమాణాలను పాటిస్తాయని చెప్పింది. మరి అన్ని ప్రమాణాలూ పాటిస్తే, ఈ కోవీషీల్డ్ టీకా ఇలా ఎందుకు ఏడిచిందో మరి?! ఈ తప్పు ఒప్పుకునే కార్యక్రమం సదరు సంస్థ స్వచ్ఛందంగా ఏమీ చేయలేదు.. కోవీషీల్డ్ టీకాల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కోర్డును ఆశ్రయించినప్పుడు, కోర్టులో ఈ సంస్థ తమ తప్పును ఒప్పుకుంది. అంతేలే.. దొరికిందాకా అందరూ దొరలే. కోవీషీల్డ్ వల్ల ఇప్పటికే ఎన్నో ఘోరాలు జరిగాయి.. భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో. ఇలాంటివెన్ని జరిగినా సదరు కార్పొరేట్ సంస్థలు సారీలు, సానుభూతులు చెప్పేసి చేతులు దులుపుకుంటాయి..

మాజీ ప్ర‌ధాని మనవడు ప్రజ్వల్ శృంగార లీలలుః మోదీ మౌనం

మాజీ ప్ర‌ధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హసన ఎంపీ, JDS యువనేత ప్రజ్వల్  మాజీ ప్రధాని దేవెగౌడకు స్వయానా మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కుమారుడైన ప్రజ్వల్.. యువతులను ప్రలోభాలకు గురిచేసి, లైంగిక దాడి చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది.  తాజాగా ఈ కేసులో మరో సంచలనం బయటపడింది. ప్రజ్వల్‌పై లైంగిక దాడి కేసు పెట్టిన బాధిత మహిళ (47).. ఆయనకు బంధువే. ప్రజ్వల్ తల్లి భవానీకి ఆమె మేనత్త కుమార్తె.   అమ్మ ఇంట్లో లేని సమయంలో.. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు బాధిత మహిళకు పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్‌లో వంట మనిషిగా అవకాశం కల్పించారు. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని బాధిత మహిళ కంప్లెయింట్‌లో పేర్కొంది. ఇంట్లో చేరిన 4 నెలల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై లైంగిక దాడి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. తన కుమార్తెకు కూడా వీడియో కాల్‌ చేసి ప్రజ్వల్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.   ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు. ఏప్రిల్ 26న కర్ణాటకలో  14 సీట్లకు పోలింగ్ జరిగిన స్థానాలలో హసన్ సీటు కూడా ఒకటి. ఇక్కడ పోలింగ్ జరిగిన తర్వాత రేవణ్ణపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో అసభ్యకర వీడియోలు సర్క్యూలేట్ అయ్యాయి. ఈ వీడియోల ద్వారా మహిళలపై లైంగిక వేధింపు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది . ఒకవేళ అది కుంభకోణం అయితే, ప్రస్తుతం అంత పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే ఓటింగ్ పూర్తయింది. ఆరోపిత వీడియోలున్న పెన్ డ్రైవ్‌లు కేవలం హసన్ నగరంలో మాత్రం సర్క్యూలేట్ అయ్యాయి. కర్ణాటకలో తొలి దశ ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం లేదు. కానీ, మిగిలిన 14 సీట్లలో మహిళా ఓట్లను ఆకర్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే, అప్పుడు నైతికంగా బీజేపీని సవాలు చేయగలదు. సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణల నేపథ్యంలో  ప్రజ్వల్‌ జర్మనీ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఒకవేళ ప్రజ్వల్‌ విదేశాలకు వెళితే అతడిని వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్‌దేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ఈ కుంభకోణం బీజేపీకి ఒక అస్త్రంగా మారింది. భవిష్యత్‌లో జేడీఎస్‌ను శాసించేందుకు వీలు కల్పించనుంది.  జేడీఎస్ పార్టీని బీజేపీ కబళించడానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ 'సెక్స్ స్కాండల్'  జేడీఎస్ ముగింపుకు చివరి దశకు తీసుకొచ్చింది. బీజేపీ నుంచి జేడీఎస్ వేరుకావడానికి ఇది దారితీస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే, జేడీఎస్ నేతలలో ఆందోళన చెలరేగి, వారు బీజేపీలో చేరతారు.   - ఎం.కె.ఫ‌జ‌ల్‌

కడియం, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు 

బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.  కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతోపాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో కేసులో హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది.కడియం శ్రీహరి బిఆర్ఎస్ లో  కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో  స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తప్పించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చి కెసీఆర్ గెలిపించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ లో బిఆర్ఎస్ ఘోరంగా పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ఇచ్చిన స్టేట్ మెంట్ తెలంగాణలో చర్చకు దారితీసింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బిఆర్ఎస్ అధికారంలో వస్తుందని కడియం ప్రకటించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరారు. ఇది బిఆర్ఎస్ కు కంటగింపుగా మారింది. దీంతో కడియంపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఎపిలో ఇవ్వాళ పెన్షన్లు లేనట్టే 

పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది.ఈ నేపథ్యంలో మే 1న పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఖాతాలు లేనివాళ్లకు సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. అయితే మే 1 (ఈరోజు) కార్మికుల దినం. ఈరోజు బ్యాంకులకు సెలవు. ఈ క్రమంలో... ప్రతి ఏడాది మాదిరే మేడే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్ధిదారులు గమనించాలని... దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో, ఈరోజు పెన్షన్ల పంపిణీ లేనట్టే. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల వేళ వృద్దులు, వింతువులు, వికలాంగులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందజేసే పెన్షన్లపై ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నేప‌థ్యంలో ‘సెర్ప్’ అధికారులు కీల‌క నిర్ణణయం తీసుకున్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసే బదులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాల‌ని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఒక రకంగా ఇది అధికార పార్టీకి ఈసీ కండీషన్ పెట్టినట్లుగా ఉన్నప్పటికి..పెన్షన్ దారులకు మాత్రం ఒకింత ఇబ్బందిని కలిగించే నిర్ణయమని లబ్దిదారుల్లో ఉన్న వృద్దులు అసహం వ్యక్తం చేస్తున్నారు.

మణిపూర్ మహిళల అత్యాచారంలో పోలీసుల పాత్రః సీబీఐ

మణిపూర్ లో ఎంత మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఓ వర్గం.. వారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించింది. అప్పుడు పోలీసులు ఎలా వ్య‌వ‌హ‌రించారు. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్ల‌రి మూక‌ల‌కు అప్ప‌గిస్తే ఫ‌లితం ఎలా వుంటుందో మ‌ణిపూర్ మ‌హిళ‌ల అత్యాచార సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖ‌లు చేసిన చార్జి షీట్‌లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.  కార్గిల్‌ యుద్ధవీరుడి భార్య అయిన ఓ బాధితురాలు... తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని పోలీసులను వేడుకుంటే.. ‘జీపు తాళాలు లేవు’ అని పోలీసులు బుకాయించారని సీబీఐ ఛార్జిషీటు లో పేర్కొంది. చార్జిషీట్ వివరాల ప్రకారం, తమ గ్రామంపై జనాలు పలు బృందాలుగా విడిపోయి దాడి చేయడం ప్రారంభించగానే ముగ్గురు మహిళలు తమ కుటుంబాలతో కలిసి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కానీ, గ్రామంపై దాడి చేస్తున్న మూక వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చింది. ఈలోపు గుంపులోని కొందరు బాధితులకు పోలీసులను ఆశ్రయించమని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు సమీపంలోని పోలీసు జీపు వద్దకు వెళ్లి అందులోని ఇద్దరు పోలీసుల సాయం అర్థించారు. కానీ, పోలీసులు వారిని తీసుకెళ్లి దాడిచేస్తున్న గుంపు ముందు దిగబెట్టారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఇద్దరు మహిళలతో పాటు ఉన్న పురుషుడిని చంపేశారు. దుండగుల దృష్టి ఇద్దరు మహిళపై ఉండగా మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మరోవైపు, తమకు చిక్కిన ఇద్దరు మహిళలను.. దుండగులు నగ్నంగా ఊరేగించి చివరకు గ్యాంగ్ రేప్ చేశారు.   మైతీ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ -జోమి వర్గానికి చెందిన మహిళల  సామూహిక అత్యాచార  ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత జులైలో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశాన్ని కుదిపేసింది. ఈ అకృత్యాలపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గువాహటిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన కుకీ తెగ తండ్రీ కొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరు లేని నదిలోకి విసిరేసినట్లు తెలియజేశారు. మైతీ మూకలు, పోలీసు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పరారైనట్టు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు కాపాడ‌కుండా, ఆ అల్ల‌రి మూక‌ల‌కే అప్ప‌గించిన విష‌యాన్ని సీబీసీ తెలిపింది.  ఈ దాడి మొత్తం ముందస్తు ప్రణాళికతో చేసిందని సీబీఐ పేర్కొంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌  

రెండో విడతలోనూ బీజేపీకి మైనస్సే?

మూడో సారి అధికారం తథ్యం అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో షాక్ తగిలిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తొలి విడతలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య శూన్యమేనన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. పెట్టని కోటగా బీజేపీ భావిస్తున్న ఉత్తరప్రదేశ్ లో సైతం బీజేపీకి ఆ పార్టీ ఊహిస్తున్న విధంగా సానుకూలత లేదని తొలి విడత పోలింగ్ స్పష్టం చేసిందంటున్నారు. ఇక రెండో విడతలోనూ బీజేపీకి భంగపాటే ఎదురైందని అంటున్నారు. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ రెండు విడతల్లో దేశ వ్యాప్తంగా 190 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ రెండు విడతల్లోనూ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలకే సానుకూలంగా పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే బీజేపీలో అంతర్మథనం మొదలైందని, అందుకే మోడీ పరిధులు మరిచి మరీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం ఆరంభించారని చెబుతున్నారు.  ఎన్నికల నియమావళిని ఇసుమంతైనా పట్టించుకోకుండా  మతపరమైన పోలరైజేషన్‌ కోసం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ కు గురి చేశాయి. మైనారిటీ వ్యతిరేకతను ఈ పదేళ్లుగా ముసుగులో దాచేసిన ఆయన ఒక్కసారిగా ముసుగు తీసేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయన చేస్తున్న ప్రసంగాల పట్ల ఎన్నికల కమిషన్ స్పందించలేదు.   ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికీ నేటికీ   దేశ రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్స్‌ బహిర్గతం అవ్వడంతో ఆ బాండ్ల వల్ల అధిక లబ్ధి పొందిందెవరన్నది ప్రస్ఫుటంగా దేశ ప్రజలందరికీ బ్లాక్ అండ్ వైట్ లో అవగతమైపోయింది. ఆ తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం  దేశ రాజకీయాలలో సంచలనానికి కారణమైంది. ఈ కేసులో ఇంత కాలం ఊరుకుని సరిగ్గా ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ఈడీని ప్రశ్నించడం.. ఈ అరెస్టు రాజకీయపరమైనదేననే భావన ప్రజలలో కలిగింది.  వేర్వురు పార్టీలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఈడీ, సీబీఐ, ఐటీల నుంచి రక్షణ పొందాలంటే బీజేపీలో చేరడమొక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారనీ, అటువంటి వారిని దరికి చేర్చుకుని బీజేపీ అవినీతి పరులకు ఆశ్రయ కేంద్రంగా మారిపోయి తద్వారా రాజకీయలబ్ధి పొందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజజలలో ఆ అసంతృప్తి ఎన్నికలలో ప్రతిఫలిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశలలోనూ ప్రస్ఫుటంగా కనిపించిందని అంటున్నారు.  ఇక గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లిన నిరుద్యోగం కారణంగా యువతలో కూడా పదేళ్ల మోడీ పాలనపై అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలోని 30 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   రైతు ఆదాయం రెట్టింపు అంటూ ఊరూవాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న మోడీ సర్కార్ వారికి కనీస మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమైంది. తమ సమస్యలపై గళమెత్తిన రైతులపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం మోడీ సర్కార్ పై  కన్నెర్ర చేసిన పరిస్థితి ఉంది.వెరసి ఈ వర్గాలన్నీ మోడీ సర్కార్ తీరు పట్ల తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఎన్నికలలో ఓటు ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించుకోవడం వల్లనే బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు.   

16 నెలల జైలు.. పదేళ్లుగా బెయిలు! జగన్ కు గుర్తు చేస్తున్న నెటిజనులు!

ఎదుటి వారు చేసేవన్నీ తప్పులు.. నేను మాత్రమే సుద్దపూసను అన్నభ్రమల్లో జగన్ పూర్తిగా మునిగిపోయారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఎన్నడూ  మీడియా ముందుకు రాలేదు కానీ.. ఎన్నికలలో ఓటమి భయం వెంటాడుతుంటే.. అనివార్యంగా తన గురించి తను చెప్పుకోవడానికి ఏం లేకపోయినా.. విపక్షాలపై విమర్శలు గుప్పించడానికి ఆయన వద్ద ఉన్న పడికట్టు రాళ్ల వంటి మాటలను మరో సారి విసర్జించేందుకు జగన్  మీడియా ముందుకు వచ్చారు. ఇందు కోసం ఆయన ప్రెస్ మీట్ ఏమీ పెట్టలేదు. ఒక ప్రముఖ జాతీయ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఆ ఇంటర్వ్యూలో మరో సారి పర నింద.. అంటే మరేమీ లేదు చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుకోవడానికే పరిమితమయ్యారు. అలా చేసే క్రమంలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టై 52 రోజులు జైలులో ఉండటానికి కారణం ఆయన తప్పు చేయడమేనని చెప్పారు. బెయిలు వచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదనీ వాకృచ్చారు. బెయిలు పొందే హక్కు, అవకాశం అందరికీ ఉంటుందని, అలాగే చంద్రబాబుకూ బెయిలు వచ్చిందనీ చెప్పారు. అంతే కాదు స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకోలేరనీ కూడా జోస్యం చెప్పారు.  పాపం విపక్ష నేతపై ఆరోపణలు, విమర్శలు గుప్పించే తొందరలో తాను 16 నెలలు జైలులో ఉండి బెయిలు మీదే బయటకు వచ్చారన్న సంగతి కన్వీనియెంట్ గా మర్చిపోయారు.  కానీ నెటిజనులు మాత్రం ఈ ఇంటర్యూ ఆధారంగా జగన్ ను ఏకి పారేస్తున్నారు.  చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉంటే నేరం చేశారనుకుంటే, మరి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్  ఎంత నేరం చేశారో? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే జగన్ గత పదేళ్లుగా బెయిలు మీదే ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు.  ఇక ఇంటర్వ్యూలో తనకెదురైన ఏ ప్రశ్నకూ జగన్ సూటిగా సమాధానం చెప్పలేదు. తాను మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగానూ, అంత కంటే ముందు బటన్ నొక్కుడు సభల సందర్భంగానే ఇచ్చిన ప్రసంగాలనే  ప్రతి ప్రశ్నకూ సమాధానంగా చెప్పేశారు. కొన్ని ప్రశ్నలకైతే సమాధానం దాట వేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే గెలిపిస్తారు అన్న విశ్వాసం ఉన్నప్పుడు అంత మంది సిట్టింగులను ఎందుకు మార్చారన్న ప్రశ్నకు ఇది చాలా పెద్ద ప్రశ్న అంటూ ఇప్పుడు సమాధానం చెప్పడానికి వీలు కాదన్నట్లుగా దాటవేశారు.  

మార్కులు తక్కువ వచ్చాయన్నందుకు...

వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బెంగళూరులోని బసవశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పద్మజ అనే మహిళ కుమార్తె ఇంటర్మీడియట్ పాస్ అయింది. అయితే ఆమెకు మార్కులు తక్కువ వచ్చాయి. దానికి పద్మజ తన కూతుర్ని మార్కులు తక్కువ వచ్చాయేంటని కోప్పడింది. దాంతో ఆ కూతురు కోపంతో రగిలిపోయింది. కిచెన్‌లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి తన తల్లి మీద దాడి చేసింది. కత్తితో తల్లిని నాలుగుసార్లు పొడిచింది. కత్తిపోట్లకు గురైన తల్లి మరో కత్తిని తీసుకుని కూతురి మీద ఎదురుదాడి చేసి, తాను కూడా కత్తిపోట్లు పొడిచింది. కత్తిపోట్లకు తీవ్రంగా గురైన కుమార్తె అక్కడికక్కడే మరణించింది. ఇల్లంతా రక్తసిక్తమైపోయింది. కూతుర్ని చంపిన తర్వాత తల్లి కూడా కుప్పకూలిపోయింది. కూతురు చనిపోయింది. ఇప్పుడు తల్లి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో వుంది. 

మూడు నెలల వరకు మంచి రోజులు లేవ‌ట‌! శుభముహూర్తాలకు బ్రేక్!

సాధార‌ణంగా ఎలాంటి శుభ‌కార్యాలు జ‌ర‌గాల‌న్న మంచి ముహూర్తాలు ఉండాల్సిందే. మంచి ముహుర్తాలు లేకుంటే శుభ‌కార్యాలు చేయ‌రు. ప్ర‌స్తుతం మూఢ‌మి వ‌చ్చేసింది. మూడు నెల‌ల వ‌ర‌కు శుభ‌కార్యాల‌కు విరామం అనే చెప్ప‌వ‌చ్చు. దీంతో ప‌లు రంగాల వారిపై ప్ర‌భావం ప‌డ‌నుంది. ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. నిన్న‌టి నుంచి అదే.... ఏప్రిల్‌ 29 నుంచి ఆగస్టు 8వరకు, మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవ‌ని వేద పండితులు తేల్చిప‌డేశారు. అంతే ఇక  వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యం కాదు. మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌.  శుభకార్యాలకు బ్రేక్‌ పడటంతో పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం వుంటుంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్‌లు నిర్వహించే కళాకారుల ఉపాధికి కూడా మూడు నెలలపాటు గండిపడిన‌ట్లే.  పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఆగిపోయినట్టే. ఈ మూడు నెలల పాటు వంటల వారు, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. వీరితో పాటు బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు నెలకొన్నాయి.  ఇక‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకుల‌కు గిరాకీ లేక ఈగ‌లు తోలుకోవాల్సిందే. క‌నీసం మెయింట్‌నెన్స్‌ చార్జీలు కూడా రావని ఫంక్ష‌న్ హాళ్ల నిర్వాహ‌కులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు.  ప్రతి సంవత్సరం మే నెలలో అత్యధిక వివాహాలు జరుగుతుంటాయి. కానీ, ఈ సారి ఆ అవకాశం లేదు. సోమవారం నుంచే శుభకార్యాలకు బ్రేక్‌ పడింది.  సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుందని ఈ సమయంలో ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహుర్తాలు పెట్టడం సాధ్యం కాని పురోహితులు చెబుతున్నారు.  మూడాల కారణంగా   ముఖ్యంగా శుభ‌కార్యాల‌కు గురు, శుక్ర గ్ర‌హాల బ‌లం ముఖ్యం. ఆ రెండు గ్ర‌హాలు సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ప్పుడు వాటి శ‌క్తిని కోల్పోయి బ‌ల‌హీన‌మ‌వుతాయి. కాబ‌ట్టి అలాంటి స‌మ‌యం, ఎటువంటి శుభ‌కార్యాల‌కు ప‌నికి రాద‌ని పంచాగ క‌ర్త‌లు చెబుతున్నారు.  మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

TDP కూట‌మిలో రెట్టించిన జోష్‌! సంక్షేమం-అభివృద్ధి వైపే ఏపీ ఓట‌ర్!

టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది. వాస్త‌వానికి ప్ర‌జ‌లు ఎప్పుడూ, సంక్షేమంతో పాటు అభివృద్ధినే కోరుకుంటారు. కానీ గ‌త ఐదేళ్ళ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎక్క‌డా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచివేసిందనే అస‌హ‌నం ఏపీ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఆ అస‌హ‌న‌మే ఇప్పుడు ఓట్ల రూపంలో చూప‌నున్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్ప‌వ‌చ్చు.   తన వల్ల మేలు జరిగితేనే తనకు ఓటేయాలని.. లేకుంటే వద్దని ఆయ‌నే చెబుతున్నాడు. కేవ‌లం సంక్షేమ పథకాలనే జగన్ నమ్ముకున్నారు.  మ‌రోవైపు.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. అమ‌రావ‌తిని విధ్వంసంచేశార‌ని.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రా కుండా చేశార‌ని.. దీని వ‌ల్ల రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చెబు తోంది. దీనినే ప్ర‌చారం కూడా చేస్తోంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప‌థ‌కాల‌కు మించి, సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తామ‌ని టీడీపీ చెబుతోంది. చంద్ర బాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అంటూ కూటమి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. తెలుగుదేశం అంటేనే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే పార్టీ. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రజాగళం పేరుతో చంద్ర‌బాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం కంటే, మెరుగైన సంక్షేమం అందిస్తామ‌ని కూట‌మి మేనిఫెస్టో విడుద‌ల చేసింది. కూట‌మి సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌తో మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. అధికార, విపక్ష కూటమి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీకి ఎలాంటి నాయ‌కుడు అవ‌స‌రం అనేదే, ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అదే జ‌నం మాట్లాడుకుంటున్నారు.  జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌, అలాగే చంద్ర‌బాబు 14 ఏళ్ల పాల‌న‌...వీరిలో ఎవ‌రు స‌రైన నాయ‌కుడో ఏపీ ప్ర‌జ‌లు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వ‌నున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

టీడీపీ-జనసేన శుభవార్త: లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘ప్రజాగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది. మిగతా విషయాన్నిటి గురించి తర్వాత ముచ్చటించుకుందాం.. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఒక ముఖ్యమైన శుభవార్త గురించి. ఆ శుభవార్త మరేదో కాదు.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. ప్రజాకంటక వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల రైతుల భూమి వాళ్ళ చేతిలో వుండదు.. ఎవరైనా అక్రమ మార్గాల ద్వారా స్వాధీనం చేసుకుంటే, రైతులు జీవితాంతం పోరాటం చేసినా ఫలితం వుండదు. అపురూపంగా దాచుకునే భూమి డాక్యుమెంట్లకు బదులు ఒక జిరాక్స్ కాగితం రైతు చేతికి వస్తుంది. మొత్తమ్మీద తరతరాలుగా వస్తున్న భూమి, కష్టపడి సంపాదించుకున్న సొంతం భూమి మీద అధికారం వుండదు.. ఆ అధికారమంతా ప్రభుత్వానికి, ధనబలం వున్నవారికి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాల మీద తన ఫొటో పెట్టుకోవడం లాంటి తెంపరితనాన్ని ప్రదర్శించిన జగన్ ఈసారి రైతుల భూమికే ఎసరుపెట్టడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చాడు. ఈ చట్టం తాజాగా అమల్లోకి రావడంతో రైతులు, భూమి వున్నవారు వణికిపోతున్నారు. ఈ దరిద్రపు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన నుంచి వచ్చిన మేనిఫెస్టోలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  రద్దు’ అనే శుభవార్త చూసి ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

చత్తీస్ గడ్ లో ఆగని  ఎన్ కౌంటర్లు ...బస్తర్ లో ఈ ఏడాది 88 మంది నక్సలైట్లు దుర్మరణం 

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్ మాడ్ అటవీప్రాంతం ఈ ఉదయం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టేక్ మెట్ట, కాకూరు గ్రామాల మధ్య ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సీనియర్ మావోయిస్టు నేతలు సమావేశమవుతున్నారన్న సమాచారంతో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పక్కా ప్రణాళికతో అబూజ్ మాడ్ అటవీప్రాంతంలో ప్రవేశించాయి.  కాకూరు గ్రామం వద్దకు చేరుకునే సరికి ఇరు వైపులా కాల్పులు ప్రారంభం అయ్యాయి. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో ఏడు మృతదేహాలను కనుగొన్నట్టు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు.  ఇదిలా ఉండగా చత్తీస్ ఘడ్ లోని కంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కంకేర్ జిల్లా చోటేబెతియ ప్రాంతంలోని బినగుండా ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోలు చనిపోయారు.. ఓ ఇన్స్పెక్టర్ తో పాటు ఇద్దరు బిఎస్ఎఫ్  జవాన్లకు గాయాలు అయ్యాయి. .మావో అగ్ర నాయకుడు శంకర్ రావు ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఆయననను పట్టుకున్న వారికి ప్రభుత్వం 25 లక్షల రివార్డు గతంలో ప్రకటించింది.మావోల నుంచి అత్యాధునిక ఆయుధాలు స్వాదినం చేసుకున్నారు. ఎకె  47 రైఫిల్ తో ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు విప్లవ సాహిత్యం ఘటన స్థలంలో లభించాయని ప్రాథమిక సమాచారం. బిఎస్ఎఫ్ బలగాలతో పాటు  బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. చత్తీస్ ఘడ్ లో. ఇదే నెల 11వ తేదీన   చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. బిజాపూర్ లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. నది వద్ద నిర్మస్తున్న వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడున్న పలు వాహనాలకు వారు నిప్పు పెట్టారు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు మృతి చెందగా, మిగిలిన వారి కోసం కూంబింగ్ చేపట్టారు. అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో సమీపంలోని అడవులను జల్లెడ పడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్ల  నుంచి తేరుకోకమునుపే ఇవ్వాళ మరో ఏడుగురు నక్సలైట్లు మృత్యువాత పడటం నక్సలైట్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది. ఎన్ కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు 88 మంది మావోయిస్టులు హతమయ్యారు.

కూటమి మేనిఫెస్టో సూపర్!.. జగన్ శిబిరం బేజార్!

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. అదే సమయంలో చంద్రబాబు గ్యారంటీలతో పాటుగా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల సామాన్య జనం నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   అందుకు భిన్నంగా జగన్ 2019లో ప్రకటించిన నవరత్నాలు కొద్దినగదు పెంపుతో  పాతమేనిఫెస్టోనే ప్రకటించడం ఆ పార్టీ నాయకులు , అభ్యర్థులలోనే అసంతృప్తి వక్తం అవుతోంది.  రైతు రుణ మాఫీ, పింఛన్లునాలుగు వేలకు పెంపు, రైతు భరోసా భారీ పెంపు ,మెగా డీఎస్సీ  వంటివి జగన్ మేనిఫెస్టోలో ఉంటాయని అంతా బావించారు. కానీ జగన్ వీటి వేటి ఊసూ తన మేనిఫెస్టోలో ఎత్తలేదు.  అలాగే జగన్ తాను ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమం ఖర్చు నెలకు 70వేల కోట్లు అవుతుందన్నారు. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు నెలకు లక్షా ఇరవై నుంచి 50వేలకోట్ల రూపాయలు వరకూ అవుతుందని,అది అసాధ్యమని జగన్ విమర్శలు గుప్పించారు. దీనిపై విపక్ష తెలుగుదేశం కూటమి నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, వైసీపీ శ్రేణుల నుంచీ కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నెలకు రూ.70వేల కోట్లు సమకూరడమే గగనమని చెబుతున్న జగన్ తన ఐదేళ్ల పాలనలో లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేసారని నిలదీస్తున్నారు.  ఇక తెలుగుదేశం కూటమి నేతలైతే తాము  సంక్షేమం తో పాటు అభివృద్ధి చూపిస్తామని, సంపద సృష్టికి, అభివృద్ధికి అసలు సిసలు చిరునామా చంద్రబాబు అని చెబుతున్నారు.  జగన్ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారన్నారు. అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనిపించలేదు. విడతలవారీగా మద్యపానం నిషేధం అన్నారు. కానీ   ఆచరణలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలను అడ్డూ అదుపూ లేకుండా పెంచేశారని విమర్శిస్తున్నారు.  సంక్షేమం అంటూ రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోతో మేనిఫెస్టో కంటే ముందే తెలుగుదేశం ప్రకటించిన గ్యారంటీలు ఎంతో గొప్పగా ఉన్నాయని అభివృద్ధి సంక్షేమానికి పూచిపడుతున్నాయని ప్రశంసించారు.  ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి తన మేనిఫెస్టోను ప్రకటించేసింది. ఇందులో 25 అంశాలను పొందుపరిచింది. దీంతో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండటంతో జగన్ శిబిరం బేజారైపోతోంది. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు 1.మెగా డీఎస్సీపై తొలి సంతకం 2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000 3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000 4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం 6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు  7.రూ.3000 నిరుద్యోగ భృతి  8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000 9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి  11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000  12.ఉచిత ఇసుక  13.అన్నా క్యాంటీన్లు  14.భూ హక్కు చట్టం రద్దు  15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ 16.బీసీ రక్షణ చట్టం  17.పూర్ టూ రిచ్ పథకం 18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ 19.కరెంటు చార్జీలు పెంచం 20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ 21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం  22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం  23.పెళ్లి కానుక రూ.1,00,000/- 24.విదేశీ విద్య పథకం 25.పండుగ కానుకలు

ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు తొలగింపు?

గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన రాష్ట్రంలో 21 అసెబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలలో  కూటమిలోని మిగిలిన పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీలో లేని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం కూటమి అభ్యర్థులకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును  ఇతరులెవరికీ కేటాయించవద్దని కోరుతూ తాము ఎన్నికల కమిషన్ ను కోరినట్లు పేర్కొన్నది. ఒక సారి కాదు రెండు సార్లు ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ను కోరామని పేర్కొంది. జనసేన పోటీ లో లేకపోయినా ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులకు ఇండిపెండెంట్లకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడం వల్ల నష్టం జరుగుతుందనీ, ఓటర్లలో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందనీ పేర్కొంది. ముఖ్యంగా జనసేన పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్లుగా నిలబడిన రెబల్ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించడం కూటమి అభ్యర్థుల అవకాశాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.   దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇటువంటి వినతులపై 24 గంటలలో నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు జనసేన పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఇదే అంశంపై తెలుగుదేశం కూడా సప్లిమెంటరీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోలేదనీ, ఏమీ చెప్పకపోవడం అంటే నిరాకరించడం కాదనీ పేర్కొనడాన్ని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు విచారణను బుధవారం (మే1)కి వాయిదా వేసింది.