ఏపీకి అప్పులే దిక్కా? ఆర్ధిక పతనానికి జగన్ విధానాలే కారణమా?

  ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర ఆదాయం ఊహించనిస్థాయిలో గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం ఆశించినమేర రాలేదు. ఒకవైపు ఖర్చుల భారం పెరగడం... మరోవైపు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందకపోవడంతో... ఆ ప్రభావం తప్పనిసరిగా అమలుచేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. అయితే, ఊహించనివిధంగా గాడితప్పుతోన్న ఆర్ధిక వ్యవస్థను దారిలోపెట్టేందుకు ఏం చేయాలో తెలియక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అయోమయంలో పడింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణాశాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కు ...అధికారులు కళ్లు బైర్లు కమ్మే నిజాలు చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిపోయిందని లెక్కలతో సహా వివరించారు. ముఖ్యంగా ఇసుక నిలిపివేత, బెల్టుషాపుల రద్దు... ఏపీ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయని వివరించారు. లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిపోవడంతో ఆదాయం కూదా అదే స్థాయిలో పడిపోయిందని తెలిపారు. ఇక ఇసుక నిలిపివేతతో నిర్మాణరంగం కుదేలైందని, అదే-సమయంలో సిమెంట్, ఐరన్ రేట్లు తగ్గడంతో పన్ను రాబడి పతనమై రాష్ట్ర ఖజానాకు దెబ్బపడిందన్నారు. అలాగే వాహన రంగంలో మంద గమనంతో జీఎస్టీ తగ్గిందని వివరించారు. మొత్తంగా వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా, కేవలం 5.3శాతం మాత్రమే నమోదైందని అధికారులు లెక్కతేల్చారు. అంటే రావాల్సిన దానికంటే 8.7శాతం ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఇది భారీ మొత్తం కావడంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కొత్త ఆదాయ వనరులపై దృష్టిపెట్టాలని, కొత్త మార్గాలను ఆన్వేషించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అలాగే, సెప్టెంబర్ రెండు నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటంతో... ఆ సమయానికల్లా సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే, ఈ ఆర్ధిక సంవ్సరం చివరి నాటికి ఆదాయాలు మెరుగుపడతాయని, అనుకున్నమేర 14శాతం వృద్ధిని సాధిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక సెప్టెంబర్లో జీఎస్టీ పరిహారం కింద సుమారు 6వందల కోట్లు వస్తాయని సీఎంకు  తెలియజేశారు  అయితే, ఆర్ధిక మాంద్యంతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అంత ఈజీగా మెరుగుపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. పతనమవుతున్న ఆర్ధిక వ్యవస్థకు ఏపీ పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితికి జగన్ ప్రభుత్వ విధానాలూ ఒక కారణమంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే అప్పులు చేయక తప్పదని చెబుతున్నారు.

ఆందోళనలో తెలంగాణ ప్రభుత్వం... లెక్క తప్పుతోన్న అంచనాలు

  2019-20 బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మాంద్యంతో ఎన్నికల హామీల అమలు కత్తి మీద సాములా మారిందనే మాట వినిపిస్తోంది. అందుకే ఆదాయం, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కచ్చితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు అంత సులువు కాదంటున్నారు అధికారులు. ఆర్ధిక మాంద్యంతో ఇప్పటికే ఆదాయం పడిపోవడంతో, అది ముందుముందు ఏ స్థాయిలో ఉంటుందో అంచనాకి రాలేకపోతున్నారు. గత రెండు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ అభివృద్ధి పనులకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఒకవైపు భారీ సాగునీటి ప్రాజెక్టులు... మరోవైపు పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ పథకాలు....ఇంకోవైపు కొత్తగా ఇచ్చిన ఎన్నికల హామీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఒక్క రైతు రుణమాఫీకే 24వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు... ఇక ఉద్యోగుల పీఆర్సీ అమలు చేస్తే మరో భారం... మరోవైపు మిషన్ భగీరథ, నీటి, విద్యుత్ ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పుల వాయిదాలు చెల్లించడం మొదలవడంతో... వీటన్నింటికీ కేటాయింపులు చేయడం అంత ఈజీ కాదంటున్నారు. ఆర్ధిక మాంద్యంతో కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయి, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోతే తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే, పరిస్థితి చేయి దాటకముందే అప్రమత్తం కావాలని, లేకపోతే ఆర్ధిక ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తగ్గిన ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటే, భారీ ప్రాజెక్టులు, వివిధ సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందా? ఎన్నికల ముందున్న కోపం ఇప్పుడు లేదా?

    బీజేపీపై ఆంధ్రుల్లో వ్యతిరేకత తగ్గిపోతోందా? ఎన్నికల ముందున్న కోపం ఇప్పుడు లేదా? ప్రత్యేక హోదా ఇష్యూలో బీజేపీపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఇప్పుడు కరిగిపోతుందా? ఏపీ రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే నిజమేనంటున్నారు పరిశీలకులు. జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీకి దేశవ్యాప్తంగా ఆదరణ, అభిమానం పెరిగిందని, ఈ పరిణామమే ఏపీలోనూ బీజేపీకి అనుకూలంగా మారిందనే మాట వినిపిస్తోంది. మోడీని ఢీకొట్టగలిగే నాయకుడు ప్రస్తుతం దేశంలో ఎవరు లేరనే అభిప్రాయానికి ఆంధ్రులు వచ్చారని, దాంతో బీజేపీపై సానుకూల దృక్పథం కనిపిస్తోందని అంటున్నారు. ఒకవైపు మోడీపై రోజురోజుకీ పెరుగుతోన్న అభిమానం... మరోవైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో... ఏపీలో బలపడటానికి ఇదే మంచి సమయమని కమలనాథులు భావిస్తున్నారు. పోలవరం, అమరావతి, రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్షలాంటి దుందుడుకు నిర్ణయాలతో వివాదాల్లో చిక్కుకుంటున్న జగన్ సర్కారును ఇప్పటికే ఇరకాటంలో పెడుతున్న కమలనాథులు... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే మోడీతో మాత్రమే సాధ్యమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఎంతకాదన్నా, బీజేపీకి బలం...హిందుత్వవాదమే. అందుకే మతపరంగానూ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఏపీలో క్రైస్తవులంతా గంపగుత్తగా జగన్ కు ఓట్లేయడంతో, వైసీపీకి వ్యతిరేకంగా హిందువులను సంఘటితం చేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మతానికి సంబంధించిన భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తేలిక, అందుకే జగన్ ప్రభుత్వం... క్రైస్తవులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై మతపరమైన దాడి మొదలుపెట్టిన బీజేపీ.... ‘రావాలి యేసు-కావాలి యేసు‘ అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వ విధానం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కమలదళం అస్త్రశస్త్రాలను సిద్దంచేసుకుంటోంది.

రాజధాని విషయంలో వైసీపీ, బీజేపీ కలిసి గేమ్స్ ఆడుతున్నాయా?

  రాజధాని విషయంలో కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ.. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైసీపీ సర్కార్ రాజధానిని మార్చే అవకాశముందని ప్రచారం మొదలైంది. ఒకవైపు అమరావతి ప్రాంత రైతులు.. ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం ఒకవైపు బొత్స వ్యాఖ్యలు సమర్ధిస్తూనే.. మరోవైపు రాజధాని మార్పు అనేది కేవలం ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై కొత్త అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చన్న టీజీ వెంకటేష్.. ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. రాజధాని అంశంపై ఇప్పటికే సీఎం జగన్ బీజేపీ అధిష్టానంతో చర్చించారని, అందులో భాగంగానే నాలుగు రాజధానుల ప్రతిపాదన వచ్చిందని అన్నారు. ఈ విషయం తనకు బీజేపీ అధిష్టానమే చెప్పిందని టీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీజీ వెంకటేష్ బీజేపీ అధిష్టానం మాటనే తన మాటగా చెప్పారా? లేక ఈ మధ్య జనాల్లో తన పేరు అంతగా నానట్లేదని లైం లైట్ లోకి రావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు టీజీ వెంకటేష్ వ్యాఖ్యల వెనుక.. వైసీపీ ఉందా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీజీ వ్యాఖ్యలను రెండు తెలుగు ప్రధాన పత్రికలు వేరువేరు కోణాల్లో రాసుకొచ్చాయి. "రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరు.. రాజధాని నిర్మాణాన్ని కొనసాగివ్వబోమని, నాలుగు ప్రాంతాల్లో నాలుగు రాజధానులు పెట్టే యోచనలో వైసీపీ సర్కార్ ఉందని" టీజీ వ్యాఖ్యానించినట్టుగా ఈనాడులో ప్రచురితమైంది. సాక్షిలో మాత్రం.. "అమరావతిలో అభివృద్ధి శూన్యం, అక్కడ రాజధాని ఏర్పాటు స్థానికులకు ఇష్టంలేదు, అందుకే లోకేష్ ను ఓడించారని" అని టీజీ అన్నట్టుగా ప్రచురితమైంది. ఈ రెండిట్లో ఏది నిజం?. సరే రెండిట్లో వచ్చింది నిజమే అనుకుందాం. అసలు టీజీ వెంకటేష్ ఉన్నట్టుండి రాజధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు?. నిజంగానే రాజధానిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉందా? ఈ విషయం బీజేపీకి కూడా తెలుసా? రెండు కలిసే రాజధాని విషయంలో గేమ్స్ ఆడుతున్నాయా?. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి అంటున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయో ఏంటో.

జగన్ అమెరికా టూర్ అభిమానుల్లో ఆవేదన మిగిల్చిందా? డల్లాస్ లో అసలేం జరిగింది?

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేశారు. ఎప్పటిలాగే పాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అయితే, జగన్ అమెరికా టూర్ పై ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డల్లాస్ సభ అనుకున్నట్లుగానే సాగిందా? లేక ప్రవాసాంధ్రుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందా? జగన్ అమెరికా నుంచి వచ్చేశాక ఇప్పుడిలాంటి ప్రశ్నలేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే, జగన్ అమెరికా పర్యటనను విజయవంతం చేయడంలో ఆర్గనైజర్లు పూర్తిగా ఫెయిలయ్యారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా డల్లాస్ సభలో జరిగిన తప్పులకు లెక్కే లేదంటున్నారు. సభకి జనం బాగానే వచ్చారు. భోజనాలూ బాగానే పెట్టారు. జగన్ స్పీచ్ కూడా ఆకట్టుకుంది. అయితే, జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు, పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడినవాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందట. పార్టీ కోసం ఫండింగ్ ఇస్తూ, వైసీపీ అధికారంలోకి రావడం కోసం తమ వంతు పాత్ర పోషించిన అభిమానులను ఆర్గనైజర్లు అడ్డుకున్నారట. జగన్ ను కలవకుండా అడ్డంకులు సృష్టించారట. జగన్ బసచేసిన హోటల్ దరిదాపులకు కూడా రానివ్వలేదని తెలుస్తోంది. జగన్ అండ్ వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే కాదు... కమ్యూనిటీ పెద్దలకు కూడా తీవ్ర అవమానం జరిగిందని చెబుతున్నారు. లక్కిరెడ్డి హనిమిరెడ్డిలాంటి పెద్దలు కూడా గంటల తరబడి హోటల్ రూమ్ దగ్గర పడిగాపులు పడినా, కలవనీయకుండా చేశారట. దాంతో జగన్ అభిమానులు, కమ్యూనిటీ పెద్దలు తీవ్ర మనస్తాపానికి అసంతృప్తికి గురయ్యారని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవాళ్లను కాదని, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారని మండిపడుతున్నారు. ఇక డల్లాస్ సభలో స్టేజీపై లక్కిరెడ్డికి కుర్చీవేసిన ఆర్గనైజర్లు, ఆ తర్వాత ఆయనను కుర్చీ తీసేసి, స్టేజ్ పై ఒక మూలన నిలబెట్టారు. దాదాపు గంటపాటు స్టేజీపై నిలబడ్డ ఆ పెద్దాయన... చివరికి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక కమ్యూనిటీ పెద్దలు పైళ్ల మల్లారెడ్డి, ఆటా హనుమంతరెడ్డిదీ ఇదే పరిస్థితి. కనీసం వీళ్లకి సీట్లు కూడా కేటాయించకపోవడంతో, జనరల్ సీటింగ్ లో ఎవరో లేచి కుర్చీ ఇస్తే కూర్చొని సరిపెట్టుకున్నారు. అలా చోటామోటా నాయకులందరికీ డల్లాస్ సభలో తీవ్ర అవమానం జరిగింది. దాంతో తీవ్ర నిరాశ, అసహనం, కోపానికి గురయ్యారు. ఆర్గనైజర్లంతా కుర్రకారు కావడంతో పెద్దలంటే లెక్కలేకుండా కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని అంటున్నారు. ఇక వీవీఐపీలకు, ఎన్నారై కమిటీ సభ్యులకు కనీసం ట్యాగ్ లు ఇవ్వకపోవడంతో ఆర్గనైజర్లతో గొడవలు జరిగాయి. ఎవరికి వాళ్లే పక్కనున్న షాషింగ్ మాల్స్ కు వెళ్లి ట్యాగ్ లు తెచ్చుకుని పెట్టేసుకోవడం తీవ్ర గందరగోళం మధ్య సభ జరిగిందట. అలాగే 10లక్షలపైన డొనేట్ చేసిన వారికి జగన్ తో ఫొటో అన్నారు. చివరికి అది కూడా లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, వందల డాలర్లు ఖర్చు పెట్టుకొని, జగన్ కోసం అమెరికా నలుమూలల నుంచి వస్తే, జగన్ ను కలవనీయకుండా ఆర్గనైజర్లు అడ్డుకున్నారని అభిమానులు రగిలిపోతున్నారు. అయితే, జగన్ టూర్ లో ఆర్గనైజర్ల అరాచకాలను, లోపాలను ఎత్తిచూపుతూ, తమ బాధను చెప్పుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వైసీపీకి పెద్దఎత్తున ఈ-మెయిల్స్ వస్తున్నాయట. దీనంతటికీ విజయసాయిరెడ్డే కారణమని ఆరోపిస్తున్నారట. విజయసాయి సూచనల మేరకే ఆర్గనైజర్లు అలా చేశారని, ఇందులో చంద్రగిరి ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి... తన స్పీచ్ తో అక్కడ అందరినీ ఆకట్టుకున్నా... ఆర్గనైజర్ల అరాచకాలతో తమ ప్రియమైన నేతను స్వయంగా కలవలేకపోయామనే మాత్రం ప్రవాసాంధ్రులను వెంటాడుతోంది.

తెలంగాణ యోగి ఎక్కడ? బీజేపీ పక్కన పెట్టేసిందా?

  స్వామి పరిపూర్ణనంద... హిందూధర్మ పరిరక్షణలో దూకుడుగా వెళ్తూ కాంట్రవర్సీ కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫ్యామస్ అయిన స్వామీజీ. ఇదే బీజేపీ హైకమాండ్ ను ఆకర్షించింది. అంతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలోకి రప్పించి రాష్ట్రమంతా తిప్పారు. పరిపూర్ణానంద కూడా బాగానే హడావిడి చేశారు. తన వాడివేడి ప్రసంగాలతో తెలంగాణ యోగిగా పార్టీ నేతలు కీర్తించేలా చేసుకున్నారు. సొంత హెలికాఫ్టర్‌పై తిరుగుతూ... లక్ష్మణ్‌కు పోటాపోటీగా, సభలు సమావేశాలు, ర్యాలీలతో అనధికార స్టార్ క్యాంపెయినర్‌గా చక్రం తిప్పారు. మతం, జాతీయవాదం పేరుతో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పై ఓ రేంజ్‌లో చెలరేగిపోతూనే... కాంట్రవర్సీ కామెంట్స్ తో కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. దాంతో భవిష్యత్తులో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేది స్వామీజీనే అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత కథ అడ్డం తిరిగింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఉన్న సీట్లను కూడా చేజార్చుకొని ఒక్కసీటుకే పరిమితమైంది. స్వామిజీ తిరిగిన ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. పైగా డిపాజిట్లు కూడా రాలేదు. రాజాసింగ్ సొంత ఇమేజ్‌తో గెలిచాడు. తన ప్రయోగం విఫలం కావడంతో పరిపూర్ణానంద కలత చెందారట. ఇక ఏదేదో ఊహించుకున్న పార్టీ అధిష్టానం కూడా, స్వామిజీ ప్రభావం శూన్యమేనని భావించి, ప్రాధాన్యత తగ్గించిందట. దాంతో స్వామిజీ కూడా పార్టీకి దూరం జరిగారు.  అయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ వెనువెంటనే వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో, అసెంబ్లీ అనుభవంతో, ఒక్క ఎంపీ సీటూ కూడా రాదని స్వామిజీ అంచనా వేశారట. అయితే, ఈసారి కూడా అంచనా తప్పింది. పార్లమెంట్‌ పోరులో, అందరి అంచనాలను తలకిందులుచేస్తూ... నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో మరోసారి అవాక్కవడం స్వామిజీ వంతయ్యింది. ఒకవేళ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వామిజీ ప్రచారం చేసి ఉంటే, తన వల్లే నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పుకునే అవకాశం దక్కేది. పార్టీలో భవిష్యత్‌ లీడర్‌గా ఒక వెలుగు వెలిగేవారు. కానీ ప్రచారం చేయలేదు కాబట్టి, చెప్పుకునే ఛాన్సే లేకుండా పోయింది. దాంతో, ఇప్పుడెక్కడా కనిపించకుండా సెలైన్స్ మెయింటైన్ చేస్తున్నారట స్వామీజీ. అయితే, పార్టీకి ఆదరణ లేనప్పుడు పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ పుంజుకుంటున్నప్పుడు పట్టించుకోకపోవడం స్వామిజీకి రుచించడం లేదట. పైగా కొందరు నేతలు పరిపూర్ణానందను అవమానించారని, అందుకే దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే, స్వామీజీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం కొందరు ముఖ్యనేతలకు నచ్చడంలేదనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి, పరిపూర్ణానంద పరిస్థితిని తలుచుకుని... పాపం స్వామిజీ అంటున్నారట బీజేపీ కార్యకర్తలు.

కవిత సైలెన్స్ కి రీజనేంటి? కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయమేంటి?

  ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపరైనా తనకు తిరుగులేదని అసెంబ్లీ అండ్ లోకల్ ఎలక్షన్స్ లో రుజువు చేసుకుంది టీఆర్ఎస్. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ లెక్క తప్పింది. ఎవరూ ఊహించనివిధంగా బీజేపీ ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కూడా మూడు సీట్లను గెలుచుకుని ఫర్వాలేదనిపించుకుంది. ఇక కారు-సారు(కేసీఆర్)-పదహారు అంటూ బరిలోకి దిగిన టీఆర్ఎస్... 9 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ తొమ్మింటిలోనూ రెండు స్థానాలను బొటాబోటీ మెజారిటీతో దక్కించుకుంది. ఇదంతా పక్కనబెడితే కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కరీంనగర్ లో... కూతురు కవిత నిజామాబాద్ లో దారుణ పరాజయం పాలవడంతో గులాబీ బాస్ షాక్ తిన్నారు. అయితే, తన కూతురుపై ప్రజాగ్రహాన్ని ముందే గుర్తించిన కేసీఆర్... కవిత గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. నిజామాబాద్ లో పట్టున్న మండవ లాంటి లీడర్లను అప్పటికప్పుడు పార్టీలోకి రప్పించి కవితను గట్టెక్కించేందుకు ప్రయత్నించారు. అయినాసరే నిజామాబాద్ ప్రజలు కేసీఆర్ అండ్ కవితకు తిరుగులేని షాకిచ్చారు. అయితే, ఓటమి తర్వాత సైలెంటైపోయిన కవిత భవిష్యత్ ఏంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. కవిత ఓటమిని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో మెరుపులా మెరిసి, ఇప్పుడు సైలెంటైపోవడంతో ఆమె అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే, కరీంనగర్ లో ఓడిపోయిన వినోద్ కుమార్ ను కేబినెట్ ర్యాంకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.... కూతురు కవితకు కూడా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన కీలక పదవిని అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని, అలాగే పార్టీకి-ప్రభుత్వానికి మధ్య కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది.  అయితే, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కవితను నియమిస్తారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. కేబినెట్‌ ర్యాంకున్న ఈ పదవిని, కవితకు ఇస్తే బాగుంటుందన్న చర్చ తెలంగాణ భవన్‌లో జరుగుతోంది. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడానికి రైతుల ఆందోళనే ముఖ్య కారణం. అందుకే, రైతులతో మరింత మమేకమయ్యేందుకు, ఈ పదవి ఉపకరిస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో వెళ్తారా? లేక పార్టీకి, ప్రభుత్వానికి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారా? లేదంటే రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కొత్త బాధ్యతలు చేపడతారో చూడాలి.

అమరావతి మునిగే ఛాన్సే లేదు... ఇవిగో ఆధారాలు... తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్

  అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రులు మాట్లాడుతున్నారా? అమరావతి నగరంపై మంత్రి బొత్సకు అసలు అవగాహన ఉందా? లేక విలేకరులు అడిగారని... తెలిసీ తెలియని సమాచారంతో అత్యుత్సాహంతో మాట్లాడేశారా? అసలింతకీ బొత్స చెబుతున్నట్లు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం ఉందా? లేదా? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రి బొత్స మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం బౌండరీస్ గట్టుపైన ఉన్నాయి. అది సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ ఎత్తును 25 మీటర్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు సైతం కృష్ణమ్మ... సముద్రమట్టానికి 21 మీటర్లు దాటలేదు. అంటే వరద ఇంకో 12 అడుగులు (3 మీటర్లు) మేర పెరిగినా రాజధాని అమరావతి ఇంచు కూడా మునగదు. ఇక ప్రకాశం బ్యారేజీ రోడ్ కూడా సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే రాజధాని అమరావతిలోకి నీళ్లు రావాలంటే, కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ పైనుంచి పొంగి పొర్లాలి. అదే జరిగితే అమరావతే కాదు... కృష్ణా డెల్టా మొత్తం మునిగిపోవాల్సి ఉంటుంది. ఇక కొండవీటి వాగు లిఫ్ట్ వల్ల... వాగులోకి వరద ఎదురుతన్నే ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు రాజధాని అమరావతి ఎలా మునుగుతుంది? ఒకవేళ అమరావతి మునగాలంటే... రెండు మూడు డ్యాములు బద్దలైతే తప్ప సాధ్యంకాదు.   ఇక కృష్ణా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లుకి, రాజధాని అమరావతికి అస్సలు లింకు పెట్టుకూడదు. ఎందుకంటే, చంద్రబాబు ఇల్లు ... గట్టుకి నదికి మధ్యన ఉంది. ఆ ప్రాంతం దాదాపు 250 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కట్టే ప్లాన్ లేదు. అక్కడ కేవలం రివర్ టూరిజం ప్రాజెక్ట్స్, ప్లే గ్రౌండ్స్, పార్కులు మాత్రమే వస్తాయి. మరి, అమరావతి మునిగిపోతుందని... మంత్రులు తెలిసి మాట్లాడుతున్నారో... తెలియక మాట్లాడుతున్నారో... లేక చంద్రబాబుపై కక్షతోనే మాట్లాడుతున్నారో తెలియదు గానీ, అమాత్యుల్లో అవగాహనారాహిత్యమైతే కనబడుతోంది.  ఇక ఏకపక్ష విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని కావాలని, అది ప్రపంచశ్రేణి నగరం కావాలని, ఏపీ భవిష్యత్ కోసం తమ భూములను త్యాగంచేసిన రైతులకు మంత్రులు ఏం సమాధానం చెబుతారు? వేలాది మంది రైతుల త్యాగాలను, ఉసురును ప్రభుత్వం మూటగట్టుకుంటుందా? ల్యాండ్ ఫూలింగ్ లో కేవలం ఆరేడు వందల ఎకరాల భూములివ్వని రైతుల కోసం పోరాడిన మేధావులు... ఇప్పుడు 33వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు?

రాజధాని మార్పు.. దొనకొండ భూముల రేట్లకు రెక్కలు, పోటీ పడుతున్న నేతలు!!

  ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ నేతలు అలాంటిదేం లేదని ఖండిస్తున్నారు. కానీ తాజాగా వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. జగన్ సర్కార్ కి రాజధానిని మార్చే ఆలోచన ఉందా అని సామాన్య ప్రజలకు సైతం అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఏపీ కొత్త రాజధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పుడు దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడానికి బడా నేతల నుంచి చోటా నేతల వరకు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కొద్ది రోజుల్లో ఇది కోట్లలోకి చేరుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం.. రాజధానిగా అమరావతి అనుకూలం కాదని బొత్స చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఈజీగా వ్యాఖ్యలు చేయరని, పరిస్థితి చూస్తుంటే సీఎం జగన్‌ త్వరలోనే దొనకొండను రాజధానిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దొనకొండ పేరు హోరెత్తుతుండడంతో చుట్టుపక్కల బడా బాబులు అక్కడి భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు అధికార పార్టీ నేతలు ఇప్పటికే అక్కడ పెద్ద మొత్తంలో భూములు కొని ఉంచారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఏపీ రాజధాని నిజంగానే మారనుందా? లేక ఇదంతా ప్రచారానికే పరిమితం కానుందా? అని జగనే తేల్చాలి.

టీఆర్ఎస్ భయపడుతోందా? కమలం కవ్వింపులకు కారు ఎందుకు షేక్ అవుతోంది?

  తాడిని తన్నేవాడు ఒకడుంటే... వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంటారు. తెలంగాణలో ఇప్పుడిలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు నేతలంతా గులాబీ గూటికి క్యూ కడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఏకఛత్రాధిపత్యంగా నడుస్తోన్న గులాబీ హవాకు మెల్లమెల్లగా గండిపడుతోంది. ఎందుకంటే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము. ఇప్పటివరకు తమకు తిరుగులేదని దీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌‌కు ఇప్పుడు బీజేపీ ఫీవర్ పట్టుకుంది. పదవులు దక్కని లీడర్లంతా కమలం గూటికి వెళ్లే ప్రమాదముందనే భయం కారు పార్టీని వెంటాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం స్లోగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, కేసీఆర్ కూతురు కవితను ఓడించి, తమ సత్తా ఏంటో చూపించిన బీజేపీ ఈసారి తెలంగాణపై సీరియస్ గా గురిపెట్టింది. దక్షిణాదిన కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణలో మాత్రమే పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన కాషాయ అధినాయకత్వం....సీరియస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏదో తూతూమంత్రంగా కాకుండా, 2023లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే కేవలం కాంగ్రెస్, టీటీడీపీ లీడర్లనే కాకుండా, అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త లీడర్లను గుర్తించి, కమలం గూటికి చేర్చేందుకు స్కెచ్ వేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వంపై బీజేపీ గురిపెట్టింది. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ వెన్నంటి ఉన్నా, పదవులు రాని లీడర్లకు గాలమేస్తోంది. 2014లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినా, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం నాన్చుడి ధోరణినే కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా, పదవుల పంపిణీ జరుగుతుందని ఆశించిన లీడర్లకు నిరాశే ఎదురైంది. దాంతో టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. అ అసంతృప్త నేతలంతా... ఇఫ్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ వ్యూహాన్ని, ఎత్తుల్ని పసిగట్టిన టీఆర్ఎస్... అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉందట. నామినేటెడ్ పోస్టుల ఆశ కల్పిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. అయితే, ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి లీడర్లు... కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లంతా త్వరలో తెలంగాణకు రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌‌షా ఆధ్వరంలో... కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకున్న కమలదళం... ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా చేపడుతోంది.

అమరావతి దెయ్యాల పట్టణంగా మారుతోందా? ఇంటర్నేషనల్ మీడియా ఏమంటోంది?

  అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని... హైదరాబాద్ ను తలదన్నేలా, వరల్డ్ టాప్-5 సిటీస్ లో ఒక్కటిగా, ప్రపంచస్థాయి మహాపట్టణం నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన హైదరాబాద్ ను మించిన ప్రపంచశ్రేణి పట్టణం నిర్మాణం కావాలని ఆంధ్రులు ఆకాంక్షించారు. అయితే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... తన తెలివి తేటలతో వరల్డ్ క్లాస్ డిజైన్స్ తో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. పునాదులు సైతం పడ్డాయి. అంతలోనే ఎన్నికలు రావడం, టీడీపీ పరాజయం పాలవడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, అమరావతి నిర్మాణానికి గండిపడింది. పనులు ఆగిపోయాయి, కార్మికులు వెళ్లిపోయారు. యంత్ర సామగ్రి తరలిపోయింది. దాంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమరావతిపై సీత కన్నేసిన జగన్ ప్రభుత్వం... తొలి బడ్జెట్ లో కేవలం ఐదొందల కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. అదేసమయంలో అమరావతికి భారీ రుణం ఇస్తామన్న వరల్డ్ బ్యాంకు వెనక్కివెళ్లిపోయింది. అలాగే మరో ఇంటర్నేషనల్ బ్యాంకైన ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌ సైతం అమరావతి నుంచి పక్కకు తప్పుకుంది... దాంతో అమరావతికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు బ్యాంకులు వైదొలగడానికి టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని జగన్ సర్కారు ఆరోపిస్తున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి రాజకీయ, ఆర్ధిక మద్దతు దొరకడం లేదనేది వాస్తవం. పైగా రాజధాని భూములపై జగన్ విచారణకు ఆదేశించడం కూడా అమరావతికి అవరోధంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా, అమరావతిపై జగన్ ప్రభుత్వానికి అనురాగం లేదని, అందుకే పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చూసీచూడనట్లు వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు మేజర్ బ్యాంకులు తప్పుకోవడం, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకోవడంతో... భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి భవిష్యత్ అంధకారంలో పడిందని, తమ త్యాగం వృథా అవుతోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వరల్డ్ క్లాస్ సిటీ లెవల్ నుంచి... దెయ్యాలు తిరిగే పట్టణంగా అమరావతి రూపాంతరం చెందుతుందంటూ ఇంటర్నేషనల్ మీడియా అంచనా వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తుపాను... జగన్ పై ఊహించనిస్థాయిలో జనాగ్రహం

  దాదాపు 50శాతం ఓట్లు... 151మంది ఎమ్మెల్యేలు... 22మంది ఎంపీలు... ఇది మామూలు విజయం కానేకాదు... ఒకవిధంగా చెప్పాలంటే అసాధారణ గెలుపు... ఒకవైపు యువకుడు... మరోవైపు కొత్త పార్టీ... పైగా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఈ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారంటే... ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అది అలాంటిఇలాంటి నమ్మకం కాదు... జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. తమ జీవితాలను ఉద్దరిస్తాడని నమ్మారు. తమ బతుకులు బాగుపడాయని విశ్వసించారు. ఇంకా ఏవోవో అద్భుతాలు జరుగుతాయని ఊహించుకున్నారు. కానీ ప్రజల నమ్మకం వమ్ముకావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త ప్రభుత్వం రాకతో ఇసుక ఆగిపోయింది. దాంతో నిర్మాణరంగం మొత్తం కుదేలైంది. ఇసుకతో సంబంధమున్న అనేక విభాగాలకు అసలు పనే లేకుండా పోయింది. దాంతో ఇసుక కార్మికుడి నుంచి ఇంజనీర్ వరకు లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే కానీ పూట గడవని కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పుడు వీళ్లంతా జగన్ ని తిట్టిపోస్తున్నారు. తామేదో ఊహించుకుని ఓట్లేసి గెలిపించుకున్నామని, కానీ తమ బతుకులు ఇలా రోడ్డునపడతాయనుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కు ఓటేసినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటూ వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారు. ఇది వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించువచ్చు, కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలాగే ఉంది. విప్లవాత్మక నిర్ణయాలంటూ మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 20 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇసుక పాలసీని మాత్రం డిలే చేయడంలో ఆంతర్యమేంటో అర్ధంకావడం లేదు. పోనీ కొత్త పాలసీ తెచ్చేవరకు పాత విధానం కొనసాగిస్తే పెద్దగా జరిగే నష్టమేంటో తెలియడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇసుక తుపాను చెలరేగి విజృంభిస్తోంది. జనాగ్రహం రీడింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇది వైసీపీ ప్రభుత్వం ఊహించనిస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఫలితాలు రావడం ఖాయం.

ఏపీ రాజధానిని మార్చే కుట్ర.. అందుకే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదు!!

  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

టీడీపీ కీలక మీటింగ్ లో బద్దలైన అగ్నిపర్వతాలు... షాకైన చంద్రబాబు

  చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.

రివర్స్‌తో రిస్కే.... జగన్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ

  జగన్ ఆలోచనలకు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీని కార్నర్ చేయాలనో... లేక చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనో... తెలియదు కానీ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అటు కేంద్రం... ఇటు ప్రజలు తప్పుబడుతున్నా... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర జీవనాడైన పోలవరంపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టగా, ఇఫ్పుడు స్వయంగా పోలవరం అథారిటీయే షాకిచ్చింది. పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం అత్యంత బాధాకరమంటూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరులశాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం పెరగడంతోపాటు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ దాదాపు చేతులెత్తేశారు. సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్సే చేసింది పోలవరం అథారిటీ. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందని, వ్యయం భారీగా పెరుగుతుందని, చివరికి పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలవరం టెండర్ల రద్దు, ప్రీ-క్లోజర్ పై నాలుగైదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ... రివర్స్ టెండరింగ్ తో రిస్కేనని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అలాంటప్పుడు టెండర్లు రద్దు చేయడం ఎందుకుని అభిప్రాయపడింది. ఏదేమైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదన్న పోలవరం అథారిటీ... పునరాలోచించుకోవాలంటూ జగన్ సర్కారు సూచించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలవరం అథారిటీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంతోపాటు సంచలనంగా మారింది. మరి పోలవరం అథారిటీ కామెంట్స్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

జనసేన ఎమ్మెల్యే రూట్ మార్చారు.. పవన్ డైరెక్షనేనా?

  జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూట్ మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయనకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అసెంబ్లీలో పవన్ గొంతుకై వినిపిస్తారు, పవన్ గొంతుకై ప్రశ్నిస్తారు అని భావించారంతా. కానీ రాపాక మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో జన సైనికులే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాపాక రూట్ మార్చారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, దేశంలోనే ఏపీ చాలా వెనకబడి ఉందని రాపాక తెలిపారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అందుకే రాపాక రూట్ మార్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది.

సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్ల చెల్లింపులు!!

  ఏపీ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి పే రోల్స్‌లో ఉన్న 8 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జీతాలు కూడా లక్షల్లో ఉండటం, అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఇప్పటికే 8 మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ బంధువు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ప్రజాసంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. 8 మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం, కారు, ఫోన్, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు.. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే.. ఇలా ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. జగన్ సభలలో మాట్లాడే స్పీచ్‌లు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి జీవీడీ క్రిష్ణమోహన్ కి ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే.. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారని తెలుస్తోంది. సీపీఆర్వోగా పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. 50 వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉంటూ మీడియా వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈయనను ఇప్పుడు సీపీఆర్వోగా నియమించారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అన్నీ కలిపి నెలకు.. రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదుగురికి కూడా.. ఇదే తరహాలో సలహాదారుల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనని చర్చ నడుస్తోంది. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్.. దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్.. ఇలా సలహాదారులు, వారి సహాయకుల కోసం.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే పర్వాలేదు కానీ.. తమ సొంత సంస్థలో జీతాలు తీసుకునేవారిని ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారత్ పాక్ యుద్ధం...తప్పదా ?

  కాశ్మీర్ అంశంలో మోడీ సర్కార్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సిద్దమవుతుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ నిన్న కీలక నిర్ణయాలను తీసుకుంది. భారత్ దౌత్య సంబంధాలను తెంచేసుకోవాలని నిర్ణయించుకున్న పాక్ యుద్దానికి వెనుకాడొద్దని సైన్యానికి పరోక్ష అలర్ట్స్ పంపింది. లాహోర్-ఢిల్లీ మధ్య బస్సు సర్వీసును కూడా నిలిపివేసిన పాకిస్తాన్ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని ఆదేశించింది.  ఆగష్టు 15ను బ్లాక్ డేగా నిర్వహించాలని, భారత్ హై కమిషన్ ను వెనక్కు పంపాలని, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ను వెనక్కు రావాలని ఆదేశాలిచ్చింది. ద్వైపాక్షిక  ఒప్పందాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని.. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన విషయంలోనే యుద్ధం వస్తుందని భావించినా పాక్ తేలు కుట్టిన దొంగలా ఉండిపోవడం వలన అది సద్దుమణిగింది.  అయితే ఆర్టికల్‌-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని, కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు.  కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళతామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా కూడా ప్రకటించారి. తాజాగా కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్‌ సైన్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి యుద్ధానికి వెనుకాడొద్దని, యుద్ధమంటే గెలుపోటముల కోసం చేసేది కాదని, గౌరవం కోసం, పరువు, ప్రతిష్ఠల కోసం చేసేదని చెప్పుకొచ్చారు.  ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని భార‌త్‌, పాక్ ప్ర‌జ‌లు ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌ధానంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని ఒక‌సారి గ‌మ‌నిస్తే.. ఇరుదేశాల మ‌ద్య యుద్ధం త‌ప్ప‌దేమోన‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.  చూద్దాం ఏమవుతుందో ?

జగన్ ఢిల్లీ టూర్...కాకా పట్టేందుకేనా ?

  ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈరోజు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయ‌న స‌మావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఆయ‌న వారితో చ‌ర్చించ‌నున్నారని అంటున్నారు. ఎన్నికల నాడు బాగానే ఉన్న జగన్ బీజీపీలు ఇప్పుడు కొంచెం ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు కేంద్రం మోకాల‌డ్డుతోంది. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను కేంద్రం వ్య‌తిరేకిస్తోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. ఈక్రమంలో జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు పీపీఏలపై సమీక్ష, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాలపై వారితో చర్చించనున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హోం మంత్రి అమిత్‌ షాతో, సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిని బ‌య‌ట‌పెట్టాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గానూ జ‌గన్ గుర్తించిన అస్త్రాలు పీపీఏ, పోల‌వం టెండ‌ర్లు. ఈ రెండింటిలో ఎక్కువ అవినీతికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పాల్ప‌డింద‌ని, పీపీఏల‌ను పున‌స‌మీక్షించి, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండరింగ్‌కు వెళ్ల‌డం ద్వారా చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాలని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, కేంద్రం జ‌గ‌న్‌ను అడ్డుకుంటోంది. పీపీఏల‌పై పున‌స‌మీక్ష వ‌ద్ద‌ని కేంద్రం జ‌గ‌న్‌కు ఉత్త‌రాల మీద ఉత్త‌రాలు రాస్తోంది. ఈ విష‌యాన్ని న‌రేంద్ర మోడీ తిరుప‌తి వచ్చిన‌ప్పుడు జ‌గ‌న్ ఆయ‌న దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. అలాగే పోల‌వరంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. స్వ‌యంగా పార్ల‌మెంటులో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్ప‌డం వైసీపీకి మింగుడు ప‌డ‌టం లేదు. అయినా వెన‌క‌డుగు వేయ‌ని జ‌గ‌న్ తాను నియ‌మించిన నిపుణుల క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు పోల‌వ‌రం కాంట్రాక్ట‌రు న‌వ‌యుగ‌ను త‌ప్పించారు. ఈ నిర్ణ‌యాన్ని కూడా కేంద్రం త‌ప్పుప‌ట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలన్నీ వారితో చర్చించేందుకే ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు మరి ఏమేరకు ఈ విషయాలలో జగన్ కేంద్రాన్ని ప్రభావితం చేస్తారో వేచి చూడాలి మరి.