ఆరోగ్యం గురించి భయపడితే గుండెజబ్బు ఖాయం

ఆరోగ్యం అనేది ప్రకృతి మనకిచ్చిన వరం. అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. జన్యుపరమైన కారణాల చేతనో, నానాటికీ తగ్గిపోతున్న రోగనిరోధకశక్తి వలనో ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య ముంచుకువస్తుందో ఊహించడం కష్టం. అలాగని నిరంతరం ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుందేమో అని భయపడితే... ఆ భయం నిజమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   ఓ నార్వే పరిశోధన నార్వేకు చెందిన డా॥ ఇడెన్ బెర్గ్‌ ఆధ్వర్యంలోని పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 50 ఏళ్లు పైబడిన ఒక ఏడువేలమంది జీవితాలను పరిశీలించారు. వారి అనారోగ్య సమస్యలు, బరువు, రక్తపోటు, అహారపు అలవాట్లు, విద్య... వంటి కీలక వివరాలను సేకరించారు. తిరిగి ఒక 12 ఏళ్ల తరువాత వీరిలో ఎంతమంది గుండెకు సంబంధించి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారో చూశారు.   జో డర్‌గయా పరిశోధన కోసం ఎన్నుకొన్న ఏడువేలమందిలో ఒక పదిశాతం మందికి తమ ఆరోగ్యం గురించి అనవసరమైన భయందోళనలు ఉన్నట్లు తేలింది. తరువాత కాలంలో ఇలా భయపడినవారిలోనే గుండెజబ్బులు ఎక్కువగా బయటపడ్డాయి. అది కూడా కాస్తో కూస్తో కాదు... ఇతరులతో పోల్చుకుంటే ఆరోగ్యం గురించి నిరంతరం భయపడేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఏకంగా 70 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కారణాలు   - మనలో ఏదో ఒక అనారోగ్యం ఉందని నిరంతరం ఒత్తిడికి లోనవ్వడం వల్ల మన శరీరంలోని కార్టిసాల్, అడ్రినలిన్‌ వంటి హార్మోనులు గుండె పనితీరు మీద ప్రభావం చూపుతాయి.   - అనారోగ్యం గురించి నిత్యం భయపడేవారు వ్యాయామం చేయడం, ఉపవాసం ఉండటం వంటి కఠినమైన పనులకు దూరంగా ఉంటారు. వాటివల్ల తమ సున్నితమైన ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుందని భయపడుతుంటారు.   - మానసిక సమస్యలతో బాధపడేవారు, తమ ఆరోగ్యం గురించి కూడా కంగారుపడే అవకాశం ఉంది.   - నిరంతరం మనం దేని గురించైతే కంగారుపడతాయో, దాని గురించి అతిగా శ్రద్ధ తీసుకోవడం వల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంది.   - అనారోగ్యం గురించి కలుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు కొందరు సిగిరెట్లు, కాఫీ, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవి నిజంగానే గుండెకు చేటు కలిగిస్తాయి.   - అనారోగ్యం ఉందన్న భ్రమతో చిన్నచిన్న సమస్యలకి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, ఏవో ఒక బిళ్లలు మింగుతూ ఉండటం వల్ల కూడా అసలుకే మోసం వస్తుంది.   అతి సర్వత్ర వర్జయేత్‌ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచిదే! కానీ నిరంతరం మన శరీరానికి ఏదో ఒక ఉపద్రవం ముంచుకు వస్తుందని భయపడటాన్ని ‘హైపోకాండ్రియా’ అనే మానసిక రోగంగా భావిస్తుంటారు. అందుకని లేనిపోని ఆరోగ్య సమస్యల గురించి ముందుగానే భయపడే బదులు... చక్కటి ఆహారాన్ని తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదన్నా అవాంఛిత లక్షణం కనిపించినప్పుడు సకాలంలో వైద్యుని సంప్రదించి, శరీరాన్ని దారికి తెచ్చుకోవాలి. అలా కాకుండా నిరంతరం అనారోగ్యం గురించి భయపడుతూ కూర్చుంటే ప్రతిక్షణమూ నరకంగానే మారుతుంది. చివరికి మన భయమూ నిజమవుతుంది.     - నిర్జర.

Foods That Cause Cancer

Cancer is not new to mankind. But most of the earlier cases used to be a result of inherited genes. Now, with a drastic change in our lifestyle and environment... 90% of the cases are being reported due to unhealthy living. This is the reason why organisations like WHO is worried that Cancer could be a major cause of deaths in future.    Microwave Popcorn After the controversy over Noodles, most of the Indians have adopted microwave popcorn as their homely fast food. But none of them are aware that these kinds of Popcorns might contain perfluorooctanoic acid which is a potential carcinogen. Further the artificial butter spread over such popcorn contains Diacetyl which is toxic for our lungs.     Refined Sugar Cancer cells love a body filled with carbohydrates and refined sugar could be the best source for them. Now a day, sugar is being obtained from Genetically Modified crops. Further, it is processed to such an extent that you may find more chemicals than food in a grain of sugar.   Hydrogenated Oils The process of adding Hydrogen to cooking oils is known as hydrogenation. Such Hydrogenated oils could match the requirements of manufactures, but could result in Transfats. It is no secret that such oils could alter the cell membranes and thereby leads to cancer. So it’s good to prefer foods which are manufactured with ‘Edible Vegetable oils’ or at least those which declare ‘No Transfats’.   Potato chips Potato chips might be yummy and crunchy. But they can be potential carcinogens as well. There are lot of factors that lead to a conclusion that Potato Chips are harmful. 1- They are fried in hydrogenated oils and may contain Transfats. 2- They contain a lot of sodium which can heavily alter our blood pressure levels. 3- A harmful chemical known as Acrylamide gets released during the process of frying them. 4- Potato chips are abundant in carbohydrates and fats.   White Flour White Flour is the utmost refined part of wheat grains. It has nothing left in it except the carbohydrates. Such flour has a high level of glycemic index, which means that the carbohydrates in it are immediately converted into sugar when consumed. Further the bleaching process induces harmful chemicals to make it appear white. And remember! There isn’t any fibre left in it, making it harder to digest.   Well! The above list isn’t exclusive. There are various foods like carbonated beverages, canned foods, grilled meat, French fries, artificial sweeteners... that could all be potential carcinogens. And you can find something common amongst them! They aren’t a part of our traditional foods!   - Nirjara.

పాము విషంతో నొప్పి మాయం

  పాము విషాన్ని మందులలో వాడటం చాలా అరుదు. పాము కాటుకు విరుగుడుగానే వాటి విషాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు  Blue Coral Snake అనే ఒక పాము విషంతో నొప్పి మాత్రలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.   ఆసియాకే పరిమితం Blue Coral Snake ఆగ్నేయ ఆసియాలో మాత్రమే కనిపించే ఒక విషపూరితమైన పాము. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్‌, బర్మా వంటి దేశాలలోనే ఇది కనిపిస్తుంది. శరీరం అడుగున నీలంగానూ, పైభాగంలోనూ నల్లగానూ ఉండే ఈ పాము తల, తోకా మాత్రం ఎరుపు రంగులో ఉండి దూరం నుంచే భయపెడుతుంటుంది.   కిల్లర్‌ ఆఫ్ కిల్లర్స్‌ Blue Coral Snake ఎక్కువగా మిగతా పాములని తినేందుకే ఇష్టపడుతుంది. అది కూడా అలాంటి ఇలాంటి పాములను కాదు... తాచుపాముల్ని సైతం ఇది దిగమింగేస్తుంది. అందుకనే దీనికి ‘కిల్లర్‌ ఆఫ్ కిల్లర్స్’ అని పేరు పెట్టారు. ఆరగుడుల వరకూ పొడవు పెరిగే ఈ పాముల కోరలు మిగతాపాములన్నింటికంటే పెద్దవిగా ఉంటాయి. వాటి శరీరంలో నాలుగో వంతు కోరలతో... కాటు వేసిన వెంటనే శత్రువుని చంపేయగల ప్రభావం వీటికి ఉంటుంది.   విషం తీరే వేరు సాధారణంగా పాము విషాలలో న్యూరోటాక్సిన్స్‌ ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థను దెబ్బతీసి శత్రువుని నిదానంగా చంపేస్తాయి. ఇలాంటి పాములు కరిచినప్పుడు శత్రువు నిస్త్రాణంగా మారిపోయి, తనకు తెలియకుండా మృత్యువు మత్తులోకి జారిపోతాడు. కానీ పాముల్ని సైతం చంపి తినాలంటే అంతకు మించిన విషం ఉంటేనే సాధ్యం కదా! అందుకనే Blue Coral పాము విషం వెనువెంటనే కండరాల మీద పనిచేసేదిగా ఉంటుంది. అందుకనే ఇప్పటి వరకూ ఈ పాము విషానికి విరుగుడు కూడా కనుక్కోలేకపోయారు.   నొప్పికి విరుగుడుగా Blue Coral పాము విషం మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది కేలియోటాక్సిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తుందట. ఈ రసాయనం మనలోని సోడియం ఛానల్స్ అనే కణాలను ప్రభావితం చేసినట్లు తేలింది. మనిషికి నొప్పి తెలిసేందుకు ఈ సోడియం ఛానెల్సే కారణం. ఈ ఒక్క సూత్రం ఆధారంగా Blue Coral పాము నుంచి నొప్పి మందుని సేకరించగలిగితే అది చికిత్సా రంగంలో అద్భుతమే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇలా తయారుచేసే మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవట.   దురదృష్టం ఏమిటంటే తరగిపోతున్న అడవుల కారణంగా Blue Coral పాములలో 80 శాతం జీవులు అంతరించిపోయాయి. ఎక్కడో ఒకటీ అరా తప్ప మనుషులకు కనిపించడం మానేశాయి. ఆ ఒకటీ అరా పాముల్ని వెతికి పట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కారణంగా అయినా పాపం వాటి జాతి అంతరించిపోకుండా ఉంటుందేమో చూడాలి.   - నిర్జర.  

చలికాలం వస్తే గుండెపోటు తప్పదా!

  నవంబరు నెల రావడంతోనే మనకు చలిగాలుల ఉధృతి మొదలైపోతుంది. ఇక రోజులు గడిచేకొద్దీ పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. జలుబు దగ్గర్నుంచీ కీళ్లనొప్పుల వరకూ ఏదో ఒక ఉపద్రవం లేకుండా చలికాలాన్ని దాటడం కష్టం. ఇవన్నీ ఒక ఎత్తయితే చలికాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. ఇవీ కారణాలు   - చలి వాతావరణం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా రక్తనాళాలను అడ్డుపరిచేలా కొన్ని హానికారక ప్రొటీన్లు కూడా తయారవుతాయని తేలింది.   - బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. దీని వలన గుండె ధమనులు కుంచించుకుపోతాయట. ఫలితంగా గుండెకు రక్తం, ఆక్సిజన్‌ సరఫరాలో లోపం ఏర్పడుతుంది.   - మందపాటి దుస్తులను ధరించకుండా చలిగాలుల్లో తిరగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనిని హైపోధర్మియా అంటారు. ఈ హైపోధర్మియా కూడా గుండెపోటుకి దారితీస్తుంది.   - చలికాలంలో మనకు తగినంత విటమిన్ డి లభించదు. దీని వలన మన గుండె ఆరోగ్యం తప్పకుండా ప్రభావితం అవుతుందని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.   - చలికాలంలో శరీరాన్ని తగినంత వేడిగా ఉంచేందుకు ‘Brown Fat’ అనే కొవ్వు పదార్థం ఉత్పత్తి అవుతుందట. ఇది మన ధమనులలో పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది. నివారించేందుకు మార్గాలు   - చలికాలం ఎంతగా పనిచేసినా కూడా చెమట పట్టదు, అలసట తెలియదు. కాబట్టి ఒకోసారి అలవాటు లేని బరువైన పనులు కూడా అలవోకగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వలన గుండె మీద ఒకోసారి ఎక్కువ భారం పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రక్తపోటు, గుండెసంబంధ సమస్యలు ఉన్నవారు చలికాలంలో మోతాదుని మించిన శ్రమకి దూరంగా ఉండాల్సిందే!   - గుండెజబ్బులు ఉన్నవారు ఉదయం వేళ ఇంకా చలి తగ్గని సమయాలలో జాగింగ్‌ చేయడంకంటే, సాయంవేళ వాహ్యాళికి బయల్దేరడం ఉత్తమం.   - వాతావరణం చలచల్లగా ఉందికదా అని మద్యపానం, సిగిరెట్లని విచ్చలవిడిగా సేవించేస్తుంటారు. ఒళ్లు వేడెక్కడం మాటేమో కానీ వీటి వల్ల ఇటు మెదడు మీదా, అటు రక్తప్రసారం మీదా విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతుంది.   - చలికాలం తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల మనలోని జీవగడియారం అదుపు తప్పుతుంది. ఫలితంగా తగినంత గాఢనిద్ర ఉండదు. ఇటు జీర్ణశక్తి కూడా సవ్యంగా ఉండదు. అందుకనే శరీరానికి తగినంత నిద్ర, ఆహారం ఉండేట్లు గమనించుకోవాలి.   - గుండెపోటు వచ్చే ముందు మన శరీరానికి చాలా సూచనలు అందుతాయి. ఎడమ చేయి లాగుతూ ఉండటం, గుండె దగ్గర కండరాలు బిగువుగా తోచడం, పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం, ఆయాసం... లాంటి చిహ్నాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి.   తగినంత వ్యాయామం చేయడం, వేళ తప్పకుండా నిద్ర, వేళ దాటిపోకుండా ఆహారం, అశ్రద్ధ చేయకుండా మందులు వేసుకోవడం, డి విటమిన్‌ కోసం శరీరానికి తగినంత సూర్యరశ్మి అందేలా గమనించుకోవడం, రక్తపోటు స్థాయి ఎప్పటికప్పుడు అదుపులో ఉందో లేదో చూసుకోవడం... ఇవన్నీ పాటిస్తే నూరు చలికాలాల పాటు నిబ్బరరంగా ఉండే ఆరోగ్యం మన సొంతమవుతుంది.     - నిర్జర..

ఆరోగ్యాన్నీ, వ్యాపారాన్నీ దూరం చేసే పరిమళాలు

  ఏదన్నా కార్యాలయంలోకి అడుగుపెట్టండి- వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు వారు విచ్చలవిడిగా వెదజల్లిన పరిమళాలు మీ ముక్కుపుటాలను అదరగొట్టేస్తాయి. ఏదన్నా శుభకార్యంలోకి ప్రవేశించండి- తోటివారి మధ్య గుప్పుమనేందుకు జనాలు చల్లుకునే అత్తరులు మీ మతిని పోగొట్టేస్తాయి. అక్కడా ఇక్కడా ఎందుకు? మన ఇంట్లోనే బాత్రూం దగ్గర్నుంచీ డ్రెస్సింగ్ టేబుల్‌ వరకూ నానారకాల పరిమళాల వరకూ వాడేస్తుంటాము. కానీ వీటి గురించి ఇప్పుడు వచ్చిన ఓ పరిశోధన కళ్లని తెరిపిస్తోంది.   ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘అనే స్టెనమెన్‌’ అనే పరిశోధకురాలు అమెరికా, ఆస్ట్రేలియాల్లోని వేయికి పైగా వ్యక్తులని గమనించారు. వారంలో ఒక్కసారైనా పరిమళాల మధ్య ఉన్నవారు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. తమ ఇంట్లో వాడే పరిమళమా, బయట ఎక్కడన్నా ఆఘ్రాణించినదా అన్న తేడా లేకుండా 34.7 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యకు లోనయ్యారట.     ఎయిల్‌ ఫ్రెషనర్లు, డియోడరెంట్లు, షాంపూలు, సబ్బులు, లోషన్లు... ఇలా ఒక్కటేంటి, పరిమళాలకి సంబంధించి ఎలాంటి రసాయనాలని పీల్చినా కూడా అనారోగ్యం తథ్యం అంటున్నారు ఈ పరిశోధకురాలు. తలనొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా, చర్మవ్యాధుల వంటి రకరకాల సమస్యలు వీటితో తలెత్తుతున్నట్లు గమనించారు. డియోడరెంట్లు, ఎయిర్‌ ఫ్రెషనర్ల వల్లే అధికశాతం సమస్యలు వస్తున్నట్లు తేలింది.   పరిమళాలకీ, వ్యాపారానికీ పొసగకపోవడం ఈ పరిశోధనలో తేలిన ఓ చిత్రమైన విషయం. ఎందుకంటే ఒక 20 శాతం మంది జనం, తాము ఏదన్నా వ్యాపారసంస్థలోకి అడుగుపెట్టగానే అక్కడి గాఢమైన పరిమళాన్ని పీల్చగానే ఇబ్బండి పడ్డామని చెప్పుకొచ్చారు. వీలైనంత వెంటనే ఆ ప్రదేశం నుంచి తప్పుకోవాలని వారికి తోచిందట.       పరిశోధనలో తేలిన మరో ముఖ్య విషయం... వినియోగదారుల అమాయకత్వం! పరిమళాలను వాడేవారికి అవి ఎలా రూపొందుతాయో, వాటిలో ఎలాంటి హానికారక పదార్థాలు ఉంటాయో అన్న విషయాల మీద ఏమాత్రం అవగాహన కనిపించలేదు. పెట్రోలియం ఉత్పత్తులతో కూడా సహజమైన పరిమళాన్ని తలపించే సువాసనలను సృష్టించవచ్చనీ, వీటిలో వాడే కొన్ని రసాయనాలతో వాయుకాలుష్యం ఏర్పడుతుందనీ, మరికొన్ని రసాయనాలతో క్యాన్సర్‌ సైతం సంభవిస్తుందనీ చాలామందికి తెలియదు. దురదృష్టవశాత్తూ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని, కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో ఉన్న రసాయనాలన్నింటనీ లేబుల్ మీద ముద్రించకుండా తప్పించుకుంటున్నాయి.   ‘పరిమళాల వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా! మరి వీటి నుంచి దూరంగా ఉందాము’ అని ప్రయత్నించడం కూడా అసాధ్యమే! ఎందుకంటే దాదాపు 99.1 శాతం మంది వారంలో ఒక్కసారైనా ఏదో ఒక పరిమళం బారిన పడినట్లు తేలింది. కాకపోతే వ్యక్తిగతంగా వీటి వాడకానికి వీలైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే కృత్రిమమైన పరిమళాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండనే ఉండదంటున్నారు. ఇక మరీ అవసరమైన సందర్భాలలో కాస్త ఖరీదైనా కూడా పూలు, నిమ్మపండ్లు వంటి సహజసిద్ధమైన పదార్థాలతో రూపొందించిన పరిమళాలనే వాడమని సూచిస్తున్నారు.                      - నిర్జర.

ఇవి పాటిస్తే నిద్ర ఖాయం

సుఖంగా నిద్రపోవాలని ఎవరికి మాత్రం అనిపించదు. జీవితంలో ఏం సాధించినా, ఎంత సంపాదించినా... కంటికి నిండుగా నిద్రలేకపోతే అది లోటుగానే మిగిలిపోతుంది. నిద్ర పొందేందుకు ఎవర్ని కదిపినా రకరకాల చిట్కాలు చెబుతుంటారు. అంకెలు లెక్కపెట్టడం దగ్గర్నుంచీ ధ్యానం చేయడం వరకూ ఒకో మనిషిదీ ఒకో చిట్కా. మరి నిద్ర కోసం నిపుణులు చెప్పే మాటలు ఏమిటో చూడండి...   01. నిద్ర కోసం ఒకటే సమయం: నిద్ర పోయేందుకు, ఉదయాన్నే లేచి పనుల్లోకి ఉపక్రమించేందుకు ఒక నిర్ణీత షెడ్యూల్‌ ఉండాలంటారు. అప్పుడు మన శరీరంలోని జీవగడియారాన్న అదుపులో ఉంచుకున్నట్లవుతుంది. వీకెండ్స్‌ పేరిటో, టీవీలో మంచి సినిమా వస్తోందనో, పార్టీకు వెళ్లేందుకో... ఇలా తరచూ ఏదో ఒక సాకుతో ఈ వేళలలో మార్పులు చేయవద్దంటున్నారు.   02. వ్యాయామం: శరీరానికి వ్యాయామం ఉంటే అలసట ఖాయం. అలసటగా ఉన్నప్పుడు నిద్ర కూడా ఖాయమే! అందుకే రోజూ శరీరం అలసిపోయేలా కాస్త వ్యాయామం చేయమంటున్నారు. కాకపోతే ఈ వ్యాయామాన్ని నిద్రపోవడానికి ఓ నాలుగు గంటల ముందుగానే ముగించాలి.   03. నికోటిన్- కెఫిన్‌: కాఫీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్‌ వంటి పదార్థాలలో ఉండే కెఫిన్‌ నిద్రను అడ్డుకొంటుంది. అందుకనే నిద్రలేమితో బాధపడేవారు మధ్యాహ్నం నుంచే వీటికి దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఇక సిగిరెట్టులో ఉండే నికోటిన్‌ కూడా నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.    04. భారీ భోజనం: ఈ రోజుల్లో ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం సవ్యంగా సుష్టుగా చేసే సమయం మనకి దొరకడం లేదు. అందుకని రోజంతా కొరత పడిన ఆహారాన్ని, ఉదయం నుంచి దాచుకున్న జిహ్వ చాపల్యాన్ని రాత్రివేళ పూడ్చుకుంటాం. ఇలా పొట్ట నిండుగా ఉండటం వల్ల మత్తుగా అయితే ఉంటుంది కానీ నిద్ర మాత్రం పట్టదు. పైగా మాంసాహారం, మసాలాలు దట్టించిన ఆహారంతో ఇక నిద్ర సంగతి మర్చిపోవచ్చు.   05. మద్యపానం: చాలామంది మద్యపానం వల్ల నిద్రపడుతుందని అనుకుంటారు. నిజానికి మద్యం మత్తు దిగగానే నిద్ర కూడా వదిలిపోతుంది. పైగా అదే అలవాటైతే రోజూ మద్యపానం లేనిదే నిద్ర దరిచేరని పరిస్థితి వస్తుంది.   06. గోరువెచ్చని స్నానం: గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బడలిక తీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పైగా శరీరంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి వెనువెంటే తగ్గడంతో ఒళ్లు చల్లబడిన భావన కలుగుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది.   07. బలవంతం వద్దు: నిద్ర పట్టకపోయినా మంచం మీదే కూర్చుని పైకప్పు వంక చూడటం వల్ల చిరాకు పుడుతుందే కానీ నిద్ర మాత్రం రాదు. అందుకనే నిద్ర పట్టనప్పుడు లేచి అలా కాస్త తిరిగి రావడమో, ఏదన్నా పుస్తకం చదువుకోవడమో, ఏదన్నా సర్దుకోవడమో చేసి మగత కలిగినప్పుడే మంచం మీదకు చేరుకోవాలి.   08. తగిన వాతావరణం: నిద్రపోయేందుకు ఓ గంట ముందుగానే నిద్రకు సంబంధించిన వాతావరణం ఉండేట్లు చూసుకోవాలి. తక్కువ వెలుతురు ఉండే లైట్లు వేసుకోవడం, బెడ్‌రూం మరీ వేడిగా కానీ చల్లగా కానీ లేకుండా చూసుకోవడం వంటి వాతావరణంతో శరీరం నిద్రకు సిద్ధమవుతుంది.   09. మనసు ప్రశాంతం: రోజంతా ఎలాగూ ఏవో ఒక సమస్యలు తప్పవు. కానీ రాత్రివేళ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నా కూడా అవే సమస్యలు మెదడులో గిర్రున తిరుగుతూ ఉంటాయి. అవే నిద్రలేమికి కారణం అవుతాయి. ‘ఏదైతే అది జరుగుతుంది, రేపు ఉదయాన్నే చూసుకోవచ్చు,’ అన్న భరోసా ఒక్కటే మనసుని ప్రశాంతంగా ఉంచగలదు. కాసేపు ధ్యానం చేయడం, గాఢంగా శ్వాస పీల్చుకోవడం వంటి చర్యలతో మనసుని చికాకుల నుంచి విముక్తం చేయవచ్చు.   10. టీవీ-సెల్‌ఫోన్‌: చాలామందికి రాత్రి పొద్దుపోయే దాకా టీవీ చూసే అలవాటు ఉంటుంది. దీని వలన తెలియకుండానే నిద్రపోవాల్సిన సమయం దాటిపోతుంది. ఇక సెల్‌ఫోన్‌ వంటి పరికరాల వల్ల కూడా సమయం వృధా, బుర్ర ఖరాబు కావడమే కాకుండా... వాటి నుంచి వచ్చే వెలుతురు వల్ల నిద్ర తేలిపోతుందన్నది నిపుణుల అభిప్రాయం.   ఇవే కాదు! కొందరికి పాలు తాగితే నిద్ర పట్టవచ్చు, మరికొందరు మధ్యాహ్నం నిద్రను మానివేస్తే రాత్రివేళ సుఖంగా నిద్రపోవచ్చు. ఏం చేసినా తరచూ నిద్రపట్టకపోవడం, ఒకవేళ పట్టినా కూడా గాఢ నిద్ర లేకపోవడం వంటి కారణాలతో రోజూ బడలికగా నిద్ర లేవాల్సి వస్తుంటే మాత్రం ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది.   - నిర్జర.

ఊయల మహత్యం

  పెద్దవాళ్లకి అట్లతద్ది రోజునే ఊయల గుర్తుకువస్తుందేమో! కానీ పిల్లలు మాత్రం ఏడాది పొడవునా ఊయలను తలుచుకుంటూనే ఉంటారు. గంటల తరబడి ఊయల ఊగమన్నా సిద్ధంగా ఉంటారు. ఇంతకీ ఊయలలో అంత మహత్యం ఏముంది! సాదాసీదాగా కనిపించే ఊయలతో మన ఆరోగ్యానికి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే లేకేం అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు నిపుణులు...   సంతోషం- నిదానం ఊయల ఒక చిత్రమైన సింహాసనంలాంటిది. మరీ ఉద్విగ్నంగా ఉన్నవారు ఊయల ఊగితే ప్రశాంతతను పొందుతారు. అదే సమయంలో నిర్లిప్తంగా ఉన్నవారు ఊయల ఊగితే కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. అంటే మనిషి మనఃస్థితిని బట్టి వారికి అనుగుణమైన అనుభూతి లభిస్తుందన్నమాట. ఊయలూగుతూ ముందుకీ వెనక్కీ కదలడం వల్ల, మన అంతర్‌ చెవిలో జరిగే ప్రక్రియ వలన ఇలా జరుగుతుందట.   కంటిచూపు మెరుగు పిల్లల్లో చూపు స్థిరపడటం ఒక సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా టీవీ వంటి సాధనాల ముందు అతుక్కుపోయి ఉన్నప్పుడు వారి కంటికి ఎలాంటి వ్యాయామమూ లభించదు. దీనికి విరుద్ధంగా ఊయల ఊగడం వలన వారి చూపు బలపడుతుందని భావిస్తున్నారు. ఊయల ఊగే సమయంలో పిల్లవాడి దృష్టి కేంద్రీకరించాల్సిన దృశ్యం మారుతూ ఉంటుంది. ఇది కంటికి ఒక గొప్ప వ్యాయామంలాగా పనిచేస్తుంది. ఏకాగ్రత అలవడుతుంది. ఇదే ఏకాగ్రత చదువులో కూడా ఉపయోగపడుతుందంటున్నారు. బడిలో భోజన విరామంలో ఊయల ఊగిన పిల్లలు తరువాత జరిగిన తరగతిలో పాఠాలకు బాగా ఒంటపట్టించుకున్నట్లు ఓ పరిశోధనలో కూడా తేలింది.   వ్యాయామం ఊయల ఊగేటప్పుడు శరీరంలోని ప్రతి అవయం మీదా ఒత్తిడి ఉంటుంది. బలంగా ఊపిరి పీల్చుకుని వదలడం, చేతులతో ఊయలను గట్టిగా పట్టుకోవడం, కాళ్లను నేలకి తొక్కి పెట్టి తిరిగి లేవడం, వెన్నుని నిటారుగా ఉంచడం, తలని బ్యాలెన్స్ చేసుకోవడం... ఇలా శరీరంలోని అన్ని అవయవాలకూ తగిన వ్యాయామం లభిస్తుంది. గంటసేపు కనుక ఊయల ఊగితే ఏకంగా 200 కేలరీలు ఖర్చవుతాయని ఓ అంచనా!   సమన్వయం సాధారణంగా మనం ఐదు ఇంద్రియాల గురించే మాట్లాడుకుంటాము. కానీ మన శరీరంలో Proprioception మరియు Vestibular system అనే రెండు వ్యవస్థలు ఉంటాయి. వీటి ఆధారంగా మన శరీరం ఏ భంగిమలో ఉంది? మన కదలికలు ఎటువైపుగా సాగుతున్నాయి? అని మన మెదడు నిర్ధారిస్తుంది. పిల్లల్లో ఈ వ్యవస్థ అభివృద్ధి చెందకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊయలతో అటూఇటూ ఊగడం వలన ఈ రెండు వ్యవస్థలనీ ప్రేరేపించినట్లు అవుతుంది. తద్వారా వారి శరీరంలో సమతుల్యమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.   కాబట్టి పెద్దలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకుకే కాదు, పిల్లల్లో మానసికశారీరిక వికాసానికి కూడా ఊయల ఊగడం గొప్ప ఫలితాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అందుకనే ఆటిజం వంటి ఎదుగుదలకి సంబంధించిన సమస్యలున్న పిల్లల్ని ఊయల ఊగించాలంటూ ప్రోత్సహిస్తున్నారు.   - నిర్జర.

గుండె బాగుండాలంటే చాక్లెట్‌ తినండి

  సైన్స్ పరిశోధనలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక రోజు కాఫీ మంచిది కాదన్న పరిశోధన బయటకు వస్తుంది. ఆ పరిశోధనని అనుసరించి మర్నాడు ఓ లోటాడు కాఫీ తాగుతూ దినపత్రికని చదవడం మొదలుపెడతామా.... కాఫీ ప్రాణాంతకం అని మరో పరిశోధన కనిపిస్తుంది.  ఏ పరిశోధనని ఎంతవరకూ నమ్మాలో తెలియని అయోమయంలో జనం ఉండిపోతారు. కానీ డార్క్‌ చాక్లెట్ల గురించి చాలా రోజులుగా మంచి విషయాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వెలువడిన ఓ పరిశోధన డార్క్‌ చాక్లెట్లు గుండెజబ్బుల నుంచి కాపాడుతుందని ఘంటాపథంగా చెబుతోంది.   ఇంతకీ డార్క్ చాక్లెట్‌ అంటే   డార్క్‌ చాక్లెట్‌ పూర్తిగా కోకో గింజల నుంచే తయారుచేస్తారు. ఇందులో పాలపదార్థాలు కానీ, కోకో గింజల నుంచే ఉత్పత్తి అయ్యే ‘కోకో బటర్’ కానీ చాలా తక్కువగా కనిపిస్తాయి. దీనికి విరుద్ధంగా మనకి బజార్లో ఎక్కువగా దొరికే ‘మిల్క్‌’ లేదా ‘వైట్‌’ చాక్లెట్లలో కోకో బటర్‌ లేదా పాలపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే రంగు, రుచి, వాసనల్లో ఏది సాధారణ చాక్లెట్టో ఏది డార్క్‌ చాక్లెట్టో పసిగట్టేయవచ్చు. నలుపు రంగులో, కాస్తంత చేదుగా, కోకో వాసన వచ్చే డార్క్‌ చాక్లెట్‌ గురించే ఇప్పుడు మనం చెప్పుకొంటున్నాం.   రోజుకో ముక్క   సైమన్‌ లీ అనే పరిశోధకుడు డార్క్‌ చాక్లెట్‌ ప్రభావం గురించి తెలుసుకొనేందుకు 1,139 వ్యక్తులకి వందకు పైగా సందర్భాలలో వాటిని అందించి చూశారు. తరువాత వీరి శరీరంలో వచ్చిన మార్పులను గమనించారు. ఆశ్చర్యకరంగా 200 నుంచి 600 మిల్లీగ్రాముల వరకూ డార్క్‌ చాక్లెట్‌ తిన్నవారిలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. వీరిలో ట్రైగ్లిజరైడ్స్‌ శాతం తగ్గినట్లు గమనించారు. మన రక్తంలో ఉండే ఒకరకమైన కొవ్వు పదార్థమే ఈ ట్రైగ్లిజరైడ్స్. ఇవి కనుక సాధారణ స్థాయికి మించి ఉంటే, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.   అంతేకాదు   డార్క్‌ చాక్లెట్‌ను తినడం వల్ల కేవలం ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే కాదు... శరీరానికి మంచి చేసే HDL కొలెస్టరాల్‌ కూడా పెరగడాన్ని నమోదు చేశారు. ఇంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయి కూడా అదుపులోకి వచ్చిందట. పైగా ఇన్సులిన్‌ పనితీరు కూడా మెరుగుపడింది. ఇక ధమనులలో వాపుని కలిగించే పరిస్థితులలో కూడా మార్పు కనిపించింది.   కొత్తేమీ కాదు   డార్క్‌ చాక్లెట్లు మితంగా తినడం ఆరోగ్యానికి మంచిదంటూ వార్తలు రావడం కొత్తేమీ కాదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందనీ, రక్తపోటు తగ్గుతుందనీ, చర్మానికి వన్నె తెస్తుందనీ, మెదడు పనితీరుని మెరుగురుస్తుదనీ.... ఇలా చాలా విషయాలే చెబుతూ వస్తున్నారు. అయితే ఈ తాజా పరిశోధనతో డార్క్‌ చాక్లెట్‌ గుండెకి కూడా మంచిదనీ, చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందనీ తేలింది. కాకపోతే ఒక్క ముక్కంటే ఒక్క ముక్క తీసుకుంటే ఈ ఉపయోగాలు ఉంటాయి. మరి మనం అంతటితో ఆగగలమా! - నిర్జర.

How to Slow Down Your Age

As time moves on so do we also become senile and look gray. Though the process of aging is inevitable but we can influence the rate at which we go gray!! Well ageing doesn’t include only crumples of the skin but also heart diseases, weakening, osteoporosis, diabetes etc. There are some fabulous foods, which salvage us from the scare of being tagged as a senior citizen! Any kind of berries are filled with antioxidants and help in improving cell health Avocados are chocked full of Vitamin E, Antioxidants and Potassium which help in replenishing and repairing skin cells Few cloves of Garlic reduce Blood pressure and Cholesterol; increases immunity attack of our body; it decreases the growth and spread of cancer cells. Irrespective of the fact that because of garlic our mouth stinks, it is also anti-bacterial and anti-viral! Fiber rich grains like Oats, Brown Rice and Quinoa, get rid of unwanted & yucky stuff from our body through our bowel movements. It diminishes the risk of heart disease, stroke and Diabetes Green Veggies like Spinach and Kale are rich in antioxidants and are capable of fighting off the free radicals which usually promote age Nuts are great sources of Omega-3-Fatty acids for vegetarians. They are also brimming with Vitamin E and Calcium which help fighting off age- related issues Yogurt which usually not bothered about food, is rich in Calcium which is very essential in fighting off Osteoporosis Surprisingly even Chocolate resists the signs of ageing, it is having a special ingredient, the flavanols which help in preserving youthful blood vessels thereby lowering the risks of high blood pressure, Type 2 Diabetes, Kidney Diseases and Dementia Stay Young at Heart!! And Look Young!!

బిడ్డల క్షేమం కోసం బరువు తగ్గాల్సిందే

  ఊబకాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మారిపోతున్న జీవనశైలితోనూ, అదుపులేని ఆహారంతోనూ... ఇప్పుడు ఎవరిని కదిపినా ఊబకాయం గురంచి గంటల తరబడి చెప్పేయగలరు. దాంతో పాటుగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కూడా అందరికీ తెలిసిందే! కానీ గర్భం దాల్చే సమయానికి తల్లి కనుక ఊబకాయంతో బాధపడుతుంటే... అది వారికి పుట్టబోయే పిల్లలను జీవితాంతం వేధిస్తుందని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.   ఒకటి కాదు రెండు కాదు Lancet Diabetes and Endocrinology అనే పత్రికలో ఈ వారం ఏకంగా నాలుగు పత్రాలు ప్రచురితం అయ్యాయి. ఇవన్నీ కూడా జన్మనిచ్చే తల్లి ఊబకాయం వల్ల పిల్లలకు ఎలాంటి హాని ఏర్పడతాయో చర్చించినవే! ఊబకాయం వల్ల తల్లిలో రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపుతప్పే అవకాశం ఉంది. ఇలా అదుపు తప్పిన అనారోగ్యం వలన ఒకోసారి కడుపులోని బిడ్డ ప్రాణానికే హాని ఉంటుందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎలాగొలా బిడ్డ క్షేమంగా బయటపడినా, తరువాత కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బిడ్డ కడుపులో ఉండగా ఆమె మెదడు సరైన రీతిలో ఎదిగేందుకు అనేక పోషకాలు, హార్మోనులూ అవసరం అవుతాయి. తల్లి కనుక ఊబకాయంతో ఉంటే వీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిపోతుందట. ఫలితం! పిల్లవాడిలో ఆటిజం మొదలుకొని పక్షవాతం వరకు... మెదడుకి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.   ఇది ఒక విషవలయం అధిక బరువుతో ఉన్న తల్లికి పుట్టే బిడ్డలు కూడా రానురానూ ఊబకాయానికి లోనయ్యే ప్రమాదం ఉందట. దీంతో ఇది ఒక విషవలయంగా మారిపోనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా మరో పది సంవత్సరాలలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడే పరిస్థితి రానున్నదని ఊహిస్తున్నారు. ఇలాంటి వారికి పుట్టే పిల్లలలో ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఎలాంటి సమస్య అయినా తలెత్తవచ్చట.   ముందు జాగ్రత్త పిల్లల్ని కనాలన్న ఆలోచన ఉన్న స్త్రీలు ముందుగా తమ బరువు మీద దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ముందుగా తమ బరువుని తగ్గించుకోవాలి. అవసరమైతే ఇందుకోసం వైద్యుని సలహా సంప్రదింపులను పాటించేందుకు ఏమాత్రం జంకాల్సిన పనిలేదు. గర్భం దాల్చిన తరువాత కూడా ఎప్పటికప్పుడు తమ బరువు, రక్తపోటు, షుగర్‌ నిల్వలు పరిధిలో ఉన్నాయా లేదా అన్నది తరచి చూసుకుంటూ ఉండాలి.   పిల్లల అనారోగ్యం మీద తల్లి ఊబకాయమే కాదు, తండ్రి బరువు కూడా ప్రభావం చూపుతుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి తల్లిగా మారాలనుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, తండ్రి కావాలని ఆశపడేవారు కూడా తమ ఆరోగ్యం పట్ల అంతే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.   - నిర్జర.

కూర్చునే ఉండకండి బాబూ

  హాయిగా కుర్చీలో కూర్చుని పనిచేసే ఉద్యోగం వస్తే ఎంత బాగుండు అన్నది ప్రతి మనిషి కల. కదలకుండా కూర్చుని సంపాదించడం ఎంత అదృష్టమో అనేది ప్రతి జీవి కోరిక. కానీ డబ్బు సంగతి పక్కన పెడితే, నిరంతరం కూర్చునీ కూర్చునీ ఉండే జీవనశైలితో... మన కుర్చీ కాస్తా మృత్యువుకి నేరుగా దారి చూపిస్తోందన్నది నిపుణుల మాట. ఇంతకీ నిరంతరం కూర్చునే ఉండటం వల్ల కలిగే అనర్థం ఏమిటో, దానిని నివారించుకునే మార్గాలు ఏమిటో మీరే చూడండి. ఇవీ అనారోగ్యాలు-   - నిరంతరం కూర్చుని ఉండటం మనలోని రక్తప్రసార వేగాన్ని తగ్గిస్తుంది. కొవ్వు కూడా నిదానంగా కరుగుతుంది. దీని వల్ల అంతిమంగా గుండె పనితీరు దెబ్బతింటుంది.   - అదేపనిగా కూర్చోవడం, మన శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని తేలింది. దీని వల్ల క్రమంగా చక్కెర వ్యాధి చాలా తేలికగా మనల్ని లొంగదీసుకుంటుంది.   - నిల్చొని ఉన్నప్పటికంటే కూర్చుని ఉన్నప్పుడే మన వెన్నెముక మీద అధికభారం పడుతుంది. పైగా కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక చూస్తూ కూర్చోవడం వల్ల మెడ, భుజాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వెన్ను, మెడ నొప్పులతో పాటుగా మన నడకతీరులో కూడా మార్పు వచ్చేస్తుంది.   - శారీరిక కదలికలు ఉన్నప్పుడే మెదడుకి రక్తప్రసారం, ఆక్సిజన్‌ సరఫరా సమృద్ధిగా ఉంటుందనీ... అలా లేని సందర్భాలలో మెదడు నిదానంగా మొద్దుబారిపోతుందనీ తేలింది.   - కుర్చీని అదేపనిగా అంటిపెట్టుకుని ఉంటే సరైన వ్యాయామం లభించక నడుము భాగం నుంచి ఎముకలు, కండరాలు అన్నీ బలహీనపడిపోతాయి. నడుము నొప్పి, వెరికోస్‌ వెయిన్స్ వంటి నానా సమస్యలూ తలెత్తుతాయి.   - కూర్చుని ఉండటం వల్ల ముందు మన పొట్ట మీదే ఒత్తిడి పడుతుంది. దీంతో మన జీర్ణాశయం దెబ్బతింటుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, పొట్ట ఉబ్బరంగా మారిపోవడం, మలబద్ధకం వంటి నానారకాల జీర్ణసమస్యలకీ ఇది దారితీస్తుంది. ఇవీ ఉపాయాలు   ఓపిక ఉండాలే కానీ అదేపనిగా కూర్చుని ఉండటం వల్ల వచ్చే సమస్యల జాబితా ఎంత రాసినా తీరేది కాదు. అయితే దీని దుష్ఫలితాల నుంచి తప్పుకునేందుకు కొన్ని చిట్కాలూ లేకపోలేదు...   - నడిచే అవకాశం ఉన్నప్పుడు కాస్త కాళ్లని కదిలించమంటున్నారు. లిఫ్ట్‌ బదులు మెట్లని ఉపయోగించడం, స్వయంగా వెళ్లి ఫైల్స్‌ తెచ్చుకోవడం వంటి చిన్నచిన్న చర్యలతో బోలెడు ఫలితం ఉంటుంది.   - ఫోన్‌ మాట్లాడటం, క్యాంటీన్‌లో భోజనం చేయడం, స్నేహితులతో కాలక్షేపం సాగించడం వంటి పనులు నిలబడి కూడా చేయవచ్చు. దీని వలన కాళ్లకి కాస్త పని చెప్పినట్లవుతుంది.   - కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు మన వెన్ను కుర్చీకి సమాంతరంగా నిటారుగా ఉందా లేదా గమనించుకోవాలి. వెన్ను నిటారుగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల లోపల వరకూ శ్వాస చేరుకోవడాన్ని గమనించవచ్చు. దీంతో అటు ఊపిరితిత్తులు, ఇటు వెన్ను కూడా బలపడతాయి.   - గంటకి ఓసారన్నా లేచి ఓ నాలుగడులు వేయడం మంచిది. అలా ఓ నాలుగడులు వేసేంత సమయమే లేకపోతే కాసేపు నిలబడే పనిచేసుకునే ప్రయత్నం చేయవచ్చు.   - నిరంతరం కూర్చుని ఉండేవారు తిరిగి ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు నడకను మించిన వ్యాయామం లేదంటున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో కాసేపు నడకని సాగించమంటున్నారు.   - నిర్జర.

కూల్డ్రింక్ డబ్బులతో పరిశోధనలు

కూల్డ్రింక్స్ వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయనేదాని మీద పెద్ద జాబితానే పేర్కొనవచ్చు. ఊబకాయం దగ్గర నుంచీ చక్కెర వ్యాధి వరకూ కూల్డ్రింకులు నానారకాల రోగాలనీ పెంచి పోషిస్తున్నాయనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఇలాంటి రోగాల గురించి జరిగే పరిశోధనలని ప్రభావితం చేసేందుకు సదరు శీతలపానీయాల తయారీదారులు ప్రయత్నిస్తున్నారా అంటే ఔననేందుకు తగిన ఆధారాలు కనిపిస్తున్నాయి. దాదాపు వంద! బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు వివిధ పరిశోధనలు జరిపే కొన్ని సంస్థలను గుర్తించారు. వీరు చేస్తున్న పరిశోధనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయీ అన్న విషయం మీద ఆరా తీశారు. ఈ ఆరాతో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అమెరికాలో దాదాపు వంద సంస్థలకు కోకో-కోలా, పెప్సీల నుంచి పుష్కలంగా నిధులు అందుతున్నట్లు తేలింది. వీటిలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉండటం కూడా విశేషం. ప్రభావం చూపేందుకే ఏ పని చేసినా దాని వెనుక ప్రయోజం ఉండాలనుకునే వ్యాపార సంస్థలు, ప్రజల ఆరోగ్యం గురించి ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నాయంటే అనుమానం రాక మానదు. ఇదంతా కూడా పరిశోధనలను ప్రభావింతం చేసేందుకే అంటున్నారు నిపుణులు. దానికి ఉదాహరణగా 50 ఏళ్ల క్రితం జరిగిన ఒక పరిశోధనను గుర్తుచేస్తున్నారు. అప్పట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రఖ్యాత పరిశోధనను వెలువరించారు. అందులో చక్కెరకంటే కొవ్వు పదార్థాల వల్లే గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువని తేల్చారు. చక్కెర పరిశ్రమ నుంచి భారీగా నిధులు అందడంతో వారు సదరు పరిశ్రమకు అనుకూలంగా ఈ పరిశోధన సాగించినట్లు తరువాతి కాలంలో తేలింది. ఇప్పుడు కూడా శీతలపానీయాల దుష్ప్రభావాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నిధుల ప్రవాహం సాగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అబ్బే అంతా ఉత్తుత్తిదే శీతలపానీయాలు పరిశోధనలకు నిధులు అందించడాన్ని వారి సమాఖ్య వెనుకేసుకు వస్తోంది. సదరు కంపెనీలకు ప్రజల ఆరోగ్యం మీద మహా శ్రద్ధ ఉండబట్టే అవి అన్నేసి నిధులను అందిస్తున్నాయనీ... దానికి చాలా సంతోషంగా ఉందనీ సన్నాయినొక్కులు నొక్కింది. ఇక నిధులను పుచ్చుకుంటున్న ఆరోగ్య సంస్థలు కూడా- ‘ఏదో తమ సామాజిక బాధ్యతలో భాగంగా వారు ఇస్తున్నారు కాబట్టి మేం పుచ్చుకుంటున్నామే కానీ, వారిచ్చే నిధులు మా పరిశోధనలని ప్రభావితం చేయలేవు’ అంటూ బీరాలు పలుకుతున్నాయి. నిజానికి శీతలపానీయ సంస్థల చరిత్ర చూసినవారెవ్వరికైనా, వాటి నిజాయితీ మీద అనుమానాలు కలుగక మానదు. ఉదాహరణకు 2011-2015 మధ్యకాలంలో శీతలపానీయాల మీద నియంత్రణ విధించేందుకు ప్రయత్నించిన 28 బిల్లులను అవి తీవ్రంగా వ్యతిరేకించాయి. పైగా ఇవి అందించే నిధులతో వెలువడుతున్న పరిశోధనలు కూడా ఏమంత ఆమోదయోగ్యంగా ఉండటం లేదన్నది పరిశీలకుల మాట. ఉదాహరణకు ఊబకాయం గురించి జరిగిన ఓ పరిశోధనలో ఊబకాయానికీ, శీతలపానీయాలకీ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడకుండా.... వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తుందని తేల్చేశారట. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ఏదో శీతలపానీయాల ప్రభావంతో ఏదో మతలబు ఉందని అనుమానించడానికి. ఆఖరికి చక్కెర వ్యాధికి సంబంధించిన పరిశోధనలలో కూడా శీతలపానీయ సంస్థలు వేలుపెట్టడం చూస్తే మున్ముందు డయాబెటీస్ రోగులు కూడా శీతలపానీయాలను తాగవచ్చు అనే పరిశోధనలు వచ్చినా రావచ్చు. అందుకనే పరిశోధనా సంస్థలు శీతలపానీయాల ఉత్పత్తిదారుల నుంచి వచ్చే నిధులను తిరస్కరించాలంటూ వాదనలు వినిపిస్తున్నాయి.   - నిర్జర.

చికిత్సలో వైద్యుల రాజకీయాలు

  మరో నెల రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డెమోక్రెటిక్‌ పార్టీ తరఫు నుంచి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్‌ పార్టీ తరఫు నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుని పీఠం మీద కూర్చునేందుకు పోటీ పడుతున్నారు. ప్రతి నాలుగేళ్లకి ఓసారి ఈ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం ఎన్నడూ లేనంత ఉత్కంఠత నెలకొంది. ట్రంప్‌ తన వ్యాఖ్యలతో ఈ ఆసక్తిని మరింతగా రెచ్చగొడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వైద్యుల రాజకీయ భావాలకీ, వారు చేసే చికిత్సకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా!’ అనే కోణంలో ఒక పరిశోధన జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా కనిపించినా, పరిశోధన ఫలితాలు మాత్రం ఆలోచింపచేసేవిగానే ఉన్నాయి.   వైద్యుల నేపథ్యం యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హెర్ష్‌ అనే ఆచార్యుడు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీకి విధేయంగా ఉండే ఒక 20,000 మంది వైద్యులను గుర్తించారు. వీరిలో 1,529 మందికి కొంతమంది రోగులకు సంబంధించిన రిపోర్టులను పంపించి వాటి మీద తమ అభిప్రాయాన్ని చెప్పమన్నారు. ఫలానా స్త్రీ గత ఐదేళ్లలో రెండు అబార్షన్లు చేయించుకుంది, ఫలానా రోగి ఊబకాయంతో బాధపడుతున్నా కూడా తగిన వ్యాయామం చేయడం లేదు... వంటి రకరకాల సమస్యలను వారి ముందు ఉంచారు. ప్రతి సమస్యకీ ఒకటి నుంచి పది పాయింట్లను కేటాయించి వాటి తీవ్రతని బట్టి పాయింట్లను కేటాయించమని అడిగారు. దాదాపు 300 మంది వైద్యులు ఈ సర్వేకు స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.   తేడాలు బయటపడ్డాయి అబార్షన్ విషయంలో రిపబ్లికన్‌ వైద్యలు చాలా తీవ్రంగా స్పందించారు. అవి మానసికంగానూ, శారీరికంగానూ రోగి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మారిజోనా అనే మత్తుపదార్థపు వాడకాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో వైపు ఇళ్లలో తుపాకులను ఉంచుకోవడం, విచ్చలవిడిగా లైంగిక చర్యలకు పాల్పడటం వంటి అంశాల మీద డెమోక్రేట్ వైద్యులు తీవ్రంగా స్పందించారు. కాకపోతే రోజువారీ సమస్యలైన ఊబకాయం, త్రాగుడు, సిగిరెట్‌ వాడకం, హెల్మెట్‌ వంటి విషయాల్లో ఇద్దరి స్పందనా ఒకేలా కనిపించింది. మరో మాటలో చెప్పాలంటే నైతికతకి సంబంధించిన విషయాలుగా భావించే అబార్షన్, మత్తుపదార్థాలు, తుపాకులు, లైంగిక స్వేచ్ఛ వంటి అంశాల మీద ఇరుపార్టీలకు చెందిన వైద్యులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైద్యుల మతం, ప్రాంతం, వయస్సులకు అతీతంగా ఈ తేడాలు బయటపడ్డాయి.   కారణం సాధారణంగా నైతికతకి సంబంధించిన సమస్యల మీద ఒకో రాజకీయ పార్టీ ధోరణి ఒకోలా ఉంటుంది. ఆ పార్టీ విధేయుల మీద కూడా ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వైద్యలు కూడా ఈ ధోరణికి అనుగుణంగా ప్రవర్తించడం ఆశ్చర్యపరిచే అంశమే! ‘వైద్యులు కేవలం రోగలక్షణాల ఆధారంగా యాంత్రికంగా వైద్యాన్ని అందిస్తారని మనం అనుకోవడానికీ లేదనీ, వారి వ్యక్తిగత అభిప్రాయాలు వారు అందించే చికిత్స మీద కూడా ప్రభావం చూపుతాయనీ’ అంటున్నారు హెర్ష్‌. వైద్యులకు శిక్షణని అందించేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నారు. అవసరం అనుకుంటే రోగులు కూడా వైద్యుల రాజకీయ నేపథ్యాన్ని గమనించాలని సూచిస్తున్నారు. వివిధ నైతిక సమస్యల మీద ఒకో రాజకీయ పార్టీ ఒకో అభిప్రాయానికి కట్టుబడి ఉన్న మన దేశానికి కూడా ఈ పరిశోధన వర్తిస్తుందేమో ఎవరన్నా విశ్లేషిస్తే బాగుండు.   - నిర్జర.

నిరుద్యోగంతో ఆరోగ్యమూ గల్లంతు

నిరుద్యోగంతో మనిషి మనసు క్రుంగిపోతుందనీ, ఆత్మన్యూనతతో బాధపడే ప్రమాదం ఉందని తెలిసిందే! కానీ వారి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. Gallup-Healthways అనే సంస్థ రూపొందించిన నివేదికలో నిరుద్యోగానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.   50 ఏళ్లవారితో సమానం 30 ఏళ్లలోపు ఎలాంటి ఉద్యోగమూ లేనివారి ఆరోగ్యం 50 ఏళ్లు పైబడిన పెద్దలతో సమానంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు వారు 2013-2015 మధ్యకాలంలో 155 దేశాలకు చెందిన దాదాపు 4,50,000 మందిని పరిశీలించారట. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఎక్కువ చదువు ఉండి నిరుద్యోగంతో బాధపడేవారి ఆరోగ్యం మరింత అల్పంగా ఉండటం. ఉదాహరణకు డిగ్రీ పట్టా పొందిన నిరుద్యోగులలో 86 శాతం మందిలో ఏదో ఒక అనారోగ్య సమస్య కనిపిస్తే, ప్రాధమిక విద్య మాత్రమే అర్హతగా ఉన్నవారిలో ఇది 72 శాతమే ఉంది.   అమెరికాలోనే ఎక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ నిరుద్యోగపు అనారోగ్యం ఎక్కువగా ఉండటం పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది. స్పెయిన్‌ యువతలో 40 శాతానికి పైగా నిరుద్యోగంతో బాధపడుతున్నారు, అదే అమెరికాలో అయితే కేవలం 11 నుంచి 12 శాతమే నిరుద్యోగం కనిపిస్తుంది. పైగా స్పెయిన్‌ పేదరికంతో కూడా కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అలాంటి దేశాలతో పోల్చుకుంటే అమెరికా నిరుద్యోగులలో అనారోగ్యం ఎక్కువగా కనిపించిందట. కేవలం అమెరికాలోనే కాదు... ప్రపంచ బ్యాంకు ధనిక దేశాలు అంటూ ముద్రవేసిన చాలా దేశాలలో ఈ తేడా కనిపించింది.   కారణాలు నిరుద్యోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేందుకు తగినంత ఆర్థిక వనరులు ఉండవన్నది మొదటగా తేలిపోయే కారణమే! కానీ ధనికదేశాల్లో ఈ వ్యత్యాసం ఎందుకని ఎక్కువగా ఉంటుందన్నదానికి కొన్ని ఆశ్చర్యకరమైన విశ్లేషణలు వెలువడ్డాయి.   - ధనికదేశాలలోని ఖర్చులు, ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బున్నవారికి మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఖర్చులను నిరుద్యోగులు భరించడం చాలా కష్టంగా మారిపోతుంది.   - భారతదేశం, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని కుటుంబ జీవనం అమెరికా వంటి ధనిక దేశాలకు కాస్త విరుద్ధంగా ఉంటుంది. మన దేశంలో 99 శాతం యువతకి తమ కుటుంబాలు అండగా ఉన్నాయి. వారు వారి కుటుంబాలతో కలిసే ఉంటారు. కానీ అమెరికాలో మాత్రం 26 శాతం మంది యువత తమ కుటుంబాల నుంచి విడివడి విడిగా బతికేస్తున్నారు. దాంతో వారి బాగోగులను చూసుకునేందుకు, ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండేందుకు ఎవ్వరూ లేకుండా పోతున్నారు.   - నిర్జర.

చలికాలంలో వేధించే డిప్రెషన్- SAD

చలికాలం రాగానే మనసంతా ఏదో తెలియని వేదనతో నిండిపోతోందా! ఏ పని చేయాలన్నా చిరాకుగా ఉంటోందా? సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘ఆ ఏముందిలే చలికాలం కదా, ఈ కాస్త బద్ధకం సహజమే!’ అనుకుంటూ ఉంటాము. కానీ లక్షణాల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలంతో పాటుగా వచ్చే డిప్రెషన్కి సూచన కావచ్చునంటున్నారు వైద్యులు. లక్షణాలు పైన చెప్పుకున్నట్లుగా తెలియని వేదన, చిరాకుతో పాటుగా చలికాలంలో ఈ కింది లక్షణాలు కూడా కనిపిస్తే మనకు Seasonal affective disorder (SAD) అనే వ్యాధి ఉందని అనుమానించాల్సి ఉంటుంది. - ఎంతసేపు నిద్రపోయి లేచినా ఇంకా నిస్సత్తువగా, మత్తు వదలనట్లుగా ఉండటం. - చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ తరచూ ఉద్వేగానికి లోనవ్వడం. - ఆకలిలో మార్పులు వచ్చి పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గుచూపడం. తద్వారా    బరువు పెరగడం. -ఇతరులతో కలవడానికి, బయట తిరగడానికీ ఇష్టపడకపోవడం. ఏక్కడన్నా తిరస్కారానికి గురైనప్పుడు భరించలేకపోవడం. - ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం. మూడీగా, చిరాకుగా ఉండటం. కారణాలు SAD ఎందుకు వస్తుందన్నదానికి శాస్త్రవేత్తలు స్పష్టమైన కారణాలు చెప్పలేకపోతున్నారు. అయితే కొన్ని కారణాలను మాత్రం ఊహించగలుగుతున్నారు. అవి... - చలికాలంలో తగ్గిపోయే సూర్యకాంతి మన జీవగడియారం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇదే తాత్కాలిక  డిప్రెషన్కు దారితీస్తుంది. - సూర్యకాంతి తగ్గుదల వల్ల మన మెదడులోని ‘సెరొటోనిన్’ అనే రసాయనంలో తగ్గుదల ఏర్పడుతుంది. దీని వలన కూడా  డిప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంది. - తక్కువ సూర్యకాంతిలో ‘మెలటోనిన్’ అనే రసాయనం ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ అసమతుల్యత కూడా  డిప్రెషన్కు దారి తీస్తుంది.  అవకాశం అప్పటికే డిప్రెషన్ ఉన్నవారికి, అది చలికాలంలో మరింతగా ముదిరే ప్రమాదం ఉంది. వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉన్నవారిలో కూడా SAD ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చలిప్రదేశాలలో నివసించేవారికి ఈ వ్యాధి సోకే సంభావ్యత ఎక్కువ. ఉదాహరణకు అమెరికాలోని అలాస్కా అనే చలి ప్రదేశంలో దాదాపు పదిశాతంమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని తేలింది. చికిత్స వరుసగా రెండుమూడేళ్లపాటు ప్రతి చలికాలంలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది. అప్పుడు ఆయన ఈ లక్షణాలు SADకు చెందినవా లేకపోతే Bipolar Disorder వంటి ఇతర వ్యాధులను సూచిస్తున్నాయా అన్న అంచనాకు వస్తారు. గదిలో కృత్రిమ కాంతులను ఏర్పాటు చేసే లైట్ థెరపీ ద్వారా, యాంటీ డిప్రెసంట్స్ వంటి మందుల ద్వారా వైద్యులు ఈ వ్యాధికి చికిత్సను అందిస్తారు. తరచూ వ్యాయామం చేయడం, ఉదయం వేళల్లో సూర్యకాంతిలో తిరగడం, ఆప్తులతో ఎక్కువసేపు గడపడం, ధ్యానం చేయడం వంటి చర్యలతో కూడా SAD నుంచి ఉపశమనం పొందవచ్చు. SADని అశ్రద్ధ చేస్తూ ‘చలికాలంలో ఇలాంటి సహజమేలే’ అని బలవంతంగా సర్దుకుపోయేందుకు ప్రయత్నిస్తే అది మన ఉద్యోగాల మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. మత్తుపదార్థాలకు అలవాటు పడటం, ఆత్మహత్యకి ప్రేరేపించే ఆలోచనలు ఏర్పడటం వంటి ప్రమాదాలు కూడా SADతో పాటుగా పొంచిఉంటాయి. అందుకే చలికాలంలో చర్మం గురించి, జలుబూజ్వరాల గురించే కాదు... మెదడు గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి.   - నిర్జర.

ఆదాయంలో తేడాలు ఆరోగ్యంలోనూ కనిపిస్తాయి

పేదరికంతో ఒంటి మీద సరైన బట్ట లేకపోవచ్చు, తలదాచుకునేందుకు తగిన ఇల్లు ఉండకపోవచ్చు. కానీ పేదపిల్లల్లో ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే అని తేల్చిచెబుతోంది ఒక పరిశోధన. ప్రభుత్వాలు ఎన్నెన్ని కబుర్లు చెప్పినా పేదల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదనీ, పౌరుల ఆదాయాల మధ్య ఉండే తారతమ్యాలు వారి ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయనీ గుర్తుచేస్తోంది. 50 దేశాల పిల్లలు కెనడాలోని ఒటావా విశ్వవిద్యాలయానికి చెందిన జస్టిన్ లాంగ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. తమ పరిశోధన కోసం వీరు 50 దేశాలకు చెందిన పిల్లల ఆరోగ్యాన్ని నిశితంగా గమనించారు. ఇందుకోసం వారు 177 నివేదికలను సేకరించారు. 9 నుంచి 17 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లల్లో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం ఏమేరకు ఉందో పరిశీలించేందుకు ఈ నివేదికలు ఉపయోగపడ్డాయి. పరుగులెత్తించారు పిల్లల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు వారిని ఓ 20 మీటర్ల దూరాలను పరుగులెత్తించారు. పిల్లవాడు ఒకసారి ఆ దూరాన్ని పూర్తిచేయగానే, మళ్లీ అతడిని పరుగు తీయాల్సిందిగా అడిగారు. అయితే ఈసారి మరింత తక్కువ సమయంలో ఆ దూరాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. ఇలా పిల్లవాడు పరిగెత్తే ప్రతిసారీ అతనికి కేటాయించిన సమయం తగ్గుతూ వచ్చింది. చివరికి పిల్లవాడు ఇక తనవల్ల కాదని చెప్పేవరకూ ఈ పరీక్ష సాగేది. తేడాలు బయటపడ్డాయి పదకొండు లక్షలకు పైగా పిల్లలకి నిర్వహించిన ఈ పరీక్షలలో వారి ఆరోగ్యానికీ, పేదరికానికీ మధ్య సంబంధం స్పష్టంగా బయపడింది. దేశంలోని ప్రజల ఆదాయాలలో విపరీతమైన తేడాలు ఉన్నప్పుడు, ఆయా దేశంలోని పిల్లల ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే అని తేలింది. ఉదాహరణకు టాంజానియా ఏమంత ధనిక దేశం కాకపోవచ్చు. కానీ ఆ దేశంలో అసమానతలు పెద్దగా లేవు. దాంతో అక్కడి పిల్లలంతా ఆరోగ్యంగానే కనిపించారు. దానికి విరుద్ధంగా మెక్సికో మరీ అంత పేదదేశం కాదు. కానీ అక్కడ విపరీతంగా ఉన్న అసమానతల వల్ల మెక్సికో పిల్లలు బలహీనంగా తయారయ్యారు. ఇక అమెరికా పరిస్థితి కూడా అంతే! పైకి అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకొంటున్నా, అక్కడా అసమానతలు విపరీతంగానే ఉన్నాయనీ.... అందుకే చివరి నుంచి నాలుగో స్థానంలో ఉందనీ తేలింది. అసమానతలు అన్న పదం ఉన్నచోట పేదరికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫలితాలు సహజమే అంటున్నారు పరిశోధకులు. వీటికి తోడు ఆటలు ఆడే సౌకర్యాలు తక్కువగా ఉండటం, పిల్లలని దగ్గర ఉండి ఆడించే పరిస్థితులు లేకపోవడం, తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఊహిస్తున్నారు. పిల్లలు రోజులో కనీసం ఒక గంటపాటు ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, పరుగులెత్తడం వంటి వ్యాయామాలు చేస్తే వారి గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం శుభ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. లేకపోతే వారు భవిష్యత్తులో అనారోగ్యాలతో బాధపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.     - నిర్జర.

అంత కాంతి ఎందుకు బాబూ!

ఇప్పడు చాలా నగరాలలో పాతకాలపు ట్యూబ్లైట్ల బదులు ఎల్ఈడీలని అమర్చే ప్రక్రియ మొదలైపోయింది. చిన్నచిన్న దుకాణాలు మొదలుకొని పెద్ద పెద్ద మాల్స్ వరకూ ఎల్ఈడీలనే ఎక్కువగా వాడేస్తున్నారు. ఎల్ఈడీలని వాడటం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి వచ్చే మాట వాస్తవమే! కానీ అంత కాంతి వలన లేనిపోని ప్రమాదాలు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్. ఈ సంస్థ మాటలు విని, ఆ దేశంలోని 25 నగరాలు తమ వీధిదీపాలను మార్చేశాయి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మొన్న జూన్లో విడుదల చేసిన ఒక నివేదికలో ఎక్కువ కాంతి ఉన్న ఎల్ఈడీ దీపాలను వాడటం వల్ల రకరకాల సమస్యలు ఉన్నాయంటూ పలు హెచ్చరికలు జారీచేసింది. ఒక నల్లటి వస్తువుని ఎంత ఉష్ణోగ్రత దగ్గర మండిస్తే అంతటి కాంతి వస్తుందో... దానిని కలర్ టెంపరేచర్ అంటారు. ఇది 3000 వరకూ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ చాలా సందర్భాలలో 5000-6000 మధ్య ‘కలర్ టెంపరేచర్’ ఉండే ఎల్ఈడీ దీపాలను వాడేస్తున్నారని దుయ్యబట్టింది. వీటి నుంచి వెలువడే నీలపు కాంతి వల్ల ఏఏ సమస్యలు వస్తాయో తేల్చిచెప్పింది. వీరి నివేదిక ప్రకారం... - కంటిలోని రెటినా దెబ్బతిని కంటిచూపు బలహీనపడే అవకాశం ఉంది. - జీవగడియారపు వ్యవస్థ దెబ్బతిని నిద్రపోయే సమయాలలో విపరీతమైన మార్పులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. - క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు. - వాహనాలను నడిపేవారు, ముఖ్యంగా వృద్ధుల కళ్ల మీద ఈ కాంతి నేరుగా పడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. - వాతావరణంలోకి వెలువడే ఈ కాంతి కిరణాలు మనుషుల మీద కాకుండా పక్షులు, తాబేళ్లు వంటి జీవజాతుల మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. - ఒంటి మీద నేరుగా పడే ఇంతటి కాంతితో మనుషులు ఏదో పదిమంది కళ్ల ముందరా దోషిగా నిల్చొన్నట్లు అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే అమెరికాలో వాడుతున్న వీధిదీపాలను తక్కువ స్థాయి ఎల్ఈడీలతో భర్తీ చేయమంటూ సూచించారు నిపుణులు. దాంతో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఓ 25 నగరాలు తమ వీధుల తీరునే మార్చేశాయి. 3000 కలర్ టెంపరేచర్ లోపు ఉండే దీపాలను ఎంచుకున్నాయి. ఇప్పుడు హైదరాబాదులో కూడా 406 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి ఎల్ఈడీ వీధిలైట్లను నెలకొల్పాలని చూస్తున్నారు. మరి వారికి ఎల్ఈడీలతో వచ్చే దుష్ఫలితాలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిసే ఉంటాయని ఆశిద్దాం.   - నిర్జర

బ్లడ్‌గ్రూపే తెలియని బ్రిటన్ ప్రజలు

  సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించామని బ్రిటన్‌ దేశస్థులు మురిసిపోతూ ఉండవచ్చుగాక! కానీ అమాయకత్వంలో మాత్రం వారు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. తాజాగా జరిగిన ఒక సర్వేలో తమ ఆరోగ్యానికి సంబంధించిన మౌలికమైన విషయాలు కూడా తెలియవంటూ నాలుక కరుచుకున్నారు. ఆ నివేదిక ఇదిగో...   హెల్త్‌స్పాన్‌ అనే సంస్థ, తన పరిశోధనలో భాగంగా బ్రిటన్‌లోని రెండువేల మంది పెద్దలని ఓ పది ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరో వైద్యవిద్యార్థులకు సంబంధించినవి కావు. ఒక వ్యక్తికి తన ఆరోగ్యం గురించి ఎంతవరకు తెలుసు అన్న విషయాలకు సంబంధించినవే! కానీ చాలామంది వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సరైన సమాధానం చెప్పేలేకపోయారట. ఉదాహరణకు-   - సర్వేలో పాల్గొన్న సగానికి సగం మందికి తమ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటో తెలియదట!   - ఒక 68 శాతం మంది తమ గుండె పనితీరు సవ్యంగానే ఉందని భావిస్తున్నారు. ఇక ఓ 42 శాతం మందికైతే మెరుగైన గుండె కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు.   - 16 శాతం మంది అభ్యర్థులకు తమకు వంశపారంపర్యంగా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో అన్న అవగాహన లేదు.   - ఓ 35 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకోలేదని చేతులెత్తేశారు.   - సర్వేలో పాల్గొన్న జనాభాలో చాలామందికి కొలెస్ట్రాల్‌ పరిమితుల గురించి కానీ, ఆరోగ్యకరమైన రక్తపోటు గురించి కానీ ఆలోచనే లేదు. పైగా వీటివల్ల ఏదన్నా ప్రమాదం ఏర్పడితే అప్పుడే చూసుకోవచ్చులే అని ఓ 44 శాతం మంది భావిస్తున్నారు కూడా!   - కొంతమంది అభ్యర్థుకి 47 ఏళ్లు వచ్చిన తరువాత కానీ తమ జీవనవిధానంలో ఏమన్నా మార్పులు ఉండాలేమో అన్న ఆలోచన రావడం లేదు.   ఇక కొంతమందికి రోజుకి ఎంత మంచినీరు తాగాలో కూడా తెలియకపోతే, మరికొందరేమో తమకి ఏమన్నా తేడా చేసినప్పుడు కూడా జీవన విధనంలో ఎలాంటి మార్పులనూ చేయం అని కుండబద్దలు కొట్టేశారు.   ఇలాంటి అజ్ఞానం నిజంగా ప్రాణాంతకం అంటున్నారు సర్వే చేపట్టిన పరిశోధకులు. 40 ఏళ్ల వయసు వచ్చిన తరువాత అన్ని రకాల వైద్య పరీక్షలనీ చేయించుకుంటేనే మేలని సూచించారు. సమస్యలు మరీ జటిలం అయితే తప్ప మర ఆరోగ్యాన్ని పట్టించుకోమనీ, దానివల్ల గుండె వంటి ముఖ్యమైన శరీర భాగాలను తీరని నష్టం జరిగిపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరిమితులు, డి విటమిన్‌ ఆవశ్యకత వంటి విషయాల మీద అవగాహన ఉంటే సమస్య మొదలవకముందే దానిని నివారించవచ్చునని సూచిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎలాంటి వైద్య పరీక్షలూ చేయించుకోకుండా ఉండి ఉంటే కనుక, తక్షణమే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి పరీక్షల కోసం వైద్యడి దగ్గరకు బయల్దేరమని తొందరపెడుతున్నారు. లేకపోతే ఇవి నిదానంగా మన శరీరాన్ని దెబ్బతీసి, ముప్పు తలపెడతాయి. ఈ సూచనలు కేవలం బ్రిటన్ వాసులకే కాదు, మనకు కూడా ఉపయోగపడతాయి కదా!     - నిర్జర.

అయితే ఆకలి లేకపోతే అనారోగ్యం!

  పేదరికం ఎక్కడ ఉంటే ఆకలి అక్కడ ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజమే! ఆ ఆకలిని రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలన్నీ తెగ కృషి చేసేస్తున్నాయి. వీటికి తోడు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల సహకారం ఎలాగూ ఉంది. కానీ పరిస్థితుల్లో ఏమంత మార్పులు కనిపించడం లేదని పెదవి విరుస్తోంది ఓ నివేదిక.   కోట్లమంది ఆకలితో Global Panel on Agriculture and Food Systems for Nutrition అనే సంస్థ రూపొందించిన ఈ నివేదిక, మన భవిష్యత్తు ఏమంత ఆరోగ్యంగా లేదని సూచిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది ఆకలితో అల్లలాడిపోతున్నారనీ, 2030 నాటికి ఈ సంఖ్య ఏకంగా 300 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక ఊహిస్తోంది. అంతేకాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్లో నాలుగో వంతు మందిలో సరైన శారీరిక, మానసిక ఎదుగుదల ఉండటం లేదని స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు ఒక్క గ్వాటెమాల (ఆఫ్రికా)లోనే 40 శాతం మంది పిల్లలు తమ వయసుకి ఉండాల్సినంత ఎత్తు లేరట! పేద దేశాలలోని పిల్లలకు ఆహారం అందినా కూడా అందులో పాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం లభించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోందని తేలింది. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లభించక, రోజుకి ఎనిమిది వేల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతోంది.   ఊబకాయం పెనుముప్పు వెనుకబడిన దేశాలలో ఆకలి సమస్యగా ఉంటే... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో ఊబకాయం ముంచుకు వస్తోందని హెచ్చరిస్తోంది ఈ నివేదిక. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది ఊబకాయంతోనో, అధికబరువుతోనో బాధపడక తప్పదని తేలుస్తోంది. ఇక చైనాలో అయితే సగానికి సగం మంది ఊబకాయంలో కూరుకుపోక తప్పదని ఊహిస్తోంది. ప్రాసెస్డ్‌ ఆహారం, శీతల పానీయాల వాడకం విపరీతంగా పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణం అని నివేదిక కుండబద్దలు కొట్టేసింది. వీటి వల్ల రక్తపోటు, చక్కెర, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితి HIV, మలేరియా వంటి వ్యాధులకంటే ప్రాణాంతకమని హెచ్చరిస్తోంది. సమస్యలే కాదు, సూచనలు కూడా!     ప్రపంచం ముందర ఉన్న వివిధ సమస్యలను స్పష్టం చేయడమే కాదు, ఆ సమస్యలకు కొన్ని పరిష్కారాలను కూడా సూచిస్తోంది ఈ నివేదిక. వాటిలో కొన్ని...   - పోషకాహారాన్ని కొనుగోలు చేసి అవి తక్కువ ధరలకే ప్రజలకు అందేలా ప్రభుత్వరంగ సంస్థలు చొరవ చూపాలి.   - ప్రజలకి ఆహారం అందుతోందా లేదా అనే కాదు... అందులో తగిన పోషకాలని అందించే పండ్లు, పీచుపదార్థాలు, తృణ ధాన్యాలు ఉన్నాయా లేదా అని కూడా గమనించుకోవాలి.   - ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించాలి. ఉత్పత్తి దగ్గర్నుంచీ ప్రకటనల దాకా అవి ఏ దశలోనూ వినియోగదారులను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు.   - పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చేవరకూ తల్లిపాలని పట్టించేలా తగిన ప్రచారం చేయాలి.   - అధికంగా ఉప్పు, పంచదార, మాంసం ఉన్న పదార్థాల వాడకం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్, శీతల పానీయాల ప్రాభవాన్ని తగ్గించాలి.   - మహిళలకు తగిన పోషకాహారం అందిచే చర్యలు తీసుకోవడం వల్ల... వారికీ, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఢోకా లేకుండా కాపాడుకోగలగాలి.   ఈ సూచనలన్నీ ఆచరిస్తే సరేసరి! లేకపోతే... 2030 నాటికి ఈ నివేదిక ఊహించిన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందేమో!     - నిర్జర.