Read more!

ఆదాయంలో తేడాలు ఆరోగ్యంలోనూ కనిపిస్తాయి

పేదరికంతో ఒంటి మీద సరైన బట్ట లేకపోవచ్చు, తలదాచుకునేందుకు తగిన ఇల్లు ఉండకపోవచ్చు. కానీ పేదపిల్లల్లో ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే అని తేల్చిచెబుతోంది ఒక పరిశోధన. ప్రభుత్వాలు ఎన్నెన్ని కబుర్లు చెప్పినా పేదల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదనీ, పౌరుల ఆదాయాల మధ్య ఉండే తారతమ్యాలు వారి ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయనీ గుర్తుచేస్తోంది.

50 దేశాల పిల్లలు

కెనడాలోని ఒటావా విశ్వవిద్యాలయానికి చెందిన జస్టిన్ లాంగ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. తమ పరిశోధన కోసం వీరు 50 దేశాలకు చెందిన పిల్లల ఆరోగ్యాన్ని నిశితంగా గమనించారు. ఇందుకోసం వారు 177 నివేదికలను సేకరించారు. 9 నుంచి 17 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లల్లో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం ఏమేరకు ఉందో పరిశీలించేందుకు ఈ నివేదికలు ఉపయోగపడ్డాయి.

పరుగులెత్తించారు

పిల్లల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు వారిని ఓ 20 మీటర్ల దూరాలను పరుగులెత్తించారు. పిల్లవాడు ఒకసారి ఆ దూరాన్ని పూర్తిచేయగానే, మళ్లీ అతడిని పరుగు తీయాల్సిందిగా అడిగారు. అయితే ఈసారి మరింత తక్కువ సమయంలో ఆ దూరాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. ఇలా పిల్లవాడు పరిగెత్తే ప్రతిసారీ అతనికి కేటాయించిన సమయం తగ్గుతూ వచ్చింది. చివరికి పిల్లవాడు ఇక తనవల్ల కాదని చెప్పేవరకూ ఈ పరీక్ష సాగేది.

తేడాలు బయటపడ్డాయి

పదకొండు లక్షలకు పైగా పిల్లలకి నిర్వహించిన ఈ పరీక్షలలో వారి ఆరోగ్యానికీ, పేదరికానికీ మధ్య సంబంధం స్పష్టంగా బయపడింది. దేశంలోని ప్రజల ఆదాయాలలో విపరీతమైన తేడాలు ఉన్నప్పుడు, ఆయా దేశంలోని పిల్లల ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే అని తేలింది. ఉదాహరణకు టాంజానియా ఏమంత ధనిక దేశం కాకపోవచ్చు. కానీ ఆ దేశంలో అసమానతలు పెద్దగా లేవు. దాంతో అక్కడి పిల్లలంతా ఆరోగ్యంగానే కనిపించారు. దానికి విరుద్ధంగా మెక్సికో మరీ అంత పేదదేశం కాదు. కానీ అక్కడ విపరీతంగా ఉన్న అసమానతల వల్ల మెక్సికో పిల్లలు బలహీనంగా తయారయ్యారు. ఇక అమెరికా పరిస్థితి కూడా అంతే! పైకి అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకొంటున్నా, అక్కడా అసమానతలు విపరీతంగానే ఉన్నాయనీ.... అందుకే చివరి నుంచి నాలుగో స్థానంలో ఉందనీ తేలింది.


అసమానతలు అన్న పదం ఉన్నచోట పేదరికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫలితాలు సహజమే అంటున్నారు పరిశోధకులు. వీటికి తోడు ఆటలు ఆడే సౌకర్యాలు తక్కువగా ఉండటం, పిల్లలని దగ్గర ఉండి ఆడించే పరిస్థితులు లేకపోవడం, తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఊహిస్తున్నారు. పిల్లలు రోజులో కనీసం ఒక గంటపాటు ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, పరుగులెత్తడం వంటి వ్యాయామాలు చేస్తే వారి గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం శుభ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. లేకపోతే వారు భవిష్యత్తులో అనారోగ్యాలతో బాధపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
 

 

- నిర్జర.