Read more!

అయితే ఆకలి లేకపోతే అనారోగ్యం!

 

పేదరికం ఎక్కడ ఉంటే ఆకలి అక్కడ ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజమే! ఆ ఆకలిని రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలన్నీ తెగ కృషి చేసేస్తున్నాయి. వీటికి తోడు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల సహకారం ఎలాగూ ఉంది. కానీ పరిస్థితుల్లో ఏమంత మార్పులు కనిపించడం లేదని పెదవి విరుస్తోంది ఓ నివేదిక.

 

కోట్లమంది ఆకలితో

Global Panel on Agriculture and Food Systems for Nutrition అనే సంస్థ రూపొందించిన ఈ నివేదిక, మన భవిష్యత్తు ఏమంత ఆరోగ్యంగా లేదని సూచిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది ఆకలితో అల్లలాడిపోతున్నారనీ, 2030 నాటికి ఈ సంఖ్య ఏకంగా 300 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక ఊహిస్తోంది. అంతేకాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్లో నాలుగో వంతు మందిలో సరైన శారీరిక, మానసిక ఎదుగుదల ఉండటం లేదని స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు ఒక్క గ్వాటెమాల (ఆఫ్రికా)లోనే 40 శాతం మంది పిల్లలు తమ వయసుకి ఉండాల్సినంత ఎత్తు లేరట! పేద దేశాలలోని పిల్లలకు ఆహారం అందినా కూడా అందులో పాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం లభించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోందని తేలింది. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లభించక, రోజుకి ఎనిమిది వేల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతోంది.

 

ఊబకాయం పెనుముప్పు

వెనుకబడిన దేశాలలో ఆకలి సమస్యగా ఉంటే... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో ఊబకాయం ముంచుకు వస్తోందని హెచ్చరిస్తోంది ఈ నివేదిక. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది ఊబకాయంతోనో, అధికబరువుతోనో బాధపడక తప్పదని తేలుస్తోంది. ఇక చైనాలో అయితే సగానికి సగం మంది ఊబకాయంలో కూరుకుపోక తప్పదని ఊహిస్తోంది. ప్రాసెస్డ్‌ ఆహారం, శీతల పానీయాల వాడకం విపరీతంగా పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణం అని నివేదిక కుండబద్దలు కొట్టేసింది. వీటి వల్ల రక్తపోటు, చక్కెర, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితి HIV, మలేరియా వంటి వ్యాధులకంటే ప్రాణాంతకమని హెచ్చరిస్తోంది.
సమస్యలే కాదు, సూచనలు కూడా!

 

 

ప్రపంచం ముందర ఉన్న వివిధ సమస్యలను స్పష్టం చేయడమే కాదు, ఆ సమస్యలకు కొన్ని పరిష్కారాలను కూడా సూచిస్తోంది ఈ నివేదిక. వాటిలో కొన్ని...

 

- పోషకాహారాన్ని కొనుగోలు చేసి అవి తక్కువ ధరలకే ప్రజలకు అందేలా ప్రభుత్వరంగ సంస్థలు చొరవ చూపాలి.

 

- ప్రజలకి ఆహారం అందుతోందా లేదా అనే కాదు... అందులో తగిన పోషకాలని అందించే పండ్లు, పీచుపదార్థాలు, తృణ ధాన్యాలు ఉన్నాయా లేదా అని కూడా గమనించుకోవాలి.

 

- ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించాలి. ఉత్పత్తి దగ్గర్నుంచీ ప్రకటనల దాకా అవి ఏ దశలోనూ వినియోగదారులను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు.

 

- పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చేవరకూ తల్లిపాలని పట్టించేలా తగిన ప్రచారం చేయాలి.

 

- అధికంగా ఉప్పు, పంచదార, మాంసం ఉన్న పదార్థాల వాడకం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్, శీతల పానీయాల ప్రాభవాన్ని తగ్గించాలి.

 

- మహిళలకు తగిన పోషకాహారం అందిచే చర్యలు తీసుకోవడం వల్ల... వారికీ, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఢోకా లేకుండా కాపాడుకోగలగాలి.

 

ఈ సూచనలన్నీ ఆచరిస్తే సరేసరి! లేకపోతే... 2030 నాటికి ఈ నివేదిక ఊహించిన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందేమో!

 

 

- నిర్జర.