ఉపవాసంతో కేన్సర్‌ మాయం

  ‘లంకణము పరమౌషధం’ అంటుంటారు పెద్దలు. కాకపోతే ఇదేదో జ్వరం, అజీర్ణం, కఫంలాంటి చిన్నాచితకా వ్యాధులకి సంబంధించిన సూత్రం అనుకునేవారం. కానీ ఏకంగా కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులలోనూ ఉపవాసం ఉపశమనాన్ని కలిగిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ నమ్మక తప్పదు!   ALL అనగా బ్లడ్‌ కేన్సర్‌ అన్న పేరు వింటేనే చాలు ఒళ్లు జలదరిస్తుంది. మనుషుల్ని బయపెట్టి, బాధపెటట్టి కొంచెంకొంచెంగా మృత్యువుకి చేరువచేసే ఈ తరహా కేన్సర్‌ పగవాడికి కూడా రావద్దు భగవంతుడా అనిపిస్తుంది. లుకేమియా అనేది ఆ బ్లడ్ కేన్సర్‌లో ఒక రకం. అందులో Acute lymphoblastic leukemia అనే తరహా వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.   తెల్లరక్తకణాలని మార్చేసి ALL బారిన పడ్డ రోగులలో తెల్లరక్తకణాలు దెబ్బతింటాయి. దీని వలన మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం పెరిగిపోతుంది. ఉపయోగం లేని తెల్లరక్తకణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో రక్తహీనత, నీరసం, రక్తస్రావం, జ్వరంలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.   పిల్లలలో అధికం ALL బ్లడ్‌ కేన్సర్‌ పిల్లలలో ఎక్కువ. లుకేమియా బారిన పడ్డ ప్రతి నలుగురు పిల్లలలోనూ ముగ్గురిలో ALL తరహా లుకేమియానే కనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ 95 శాతం మందిలో కీమోథెరపీ మొదలుపెట్టిన నెలరోజులలోపే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అయితే వీరిలో దాదాపు 20 శాతం సందర్భాలలో వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. కానీ ఉపవాసం ద్వారా ALLని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉందేమో పరిశీలించేందుకు కొన్ని ఎలుకల మీద ప్రయోగం చేశారు పరిశోధకులు. ఫలితం కనిపించింది   ప్రయోగంలో భాగంగా ఎలుకలలో ALL కేన్సర్‌ కణాలను ఎక్కించారు.  ఆ తరువాత ఒకరోజు ఉపవాసం మరుసటి రోజు ఆహారం... ఇలా ఎలుకలతో ఉపవాసం చేయించారు. ఒక ఏడు వారాలు గడిచేసరికి ఉపవాసం చేసిన ఎలుకలలోని కేన్సర్‌ కణాలు కూడా ఆరోగ్యవంతమైన కణాలలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఈ ఎలుకల మూలుగు (bone marrow)లో కానీ ప్లీహం (spleen)లో కానీ లుకేమియాని కలిగించే కణాలే కనిపించలేదు.   ప్రయోగం తరువాత కొద్దిరోజులకే ఉపవాసం చేయించని ఎలుకలు చనిపోగా, ఉపవాసంతో కేన్సర్‌ను జయించిన ఎలుకలు సుదీర్ఘకాలం జీవించాయి. మన ఆకలిని నియంత్రించి, రక్తప్రసరణ మీద ప్రభావం చూపే leptin అనే హార్మోను మీద ప్రభావం చూపడం వల్లే ఉపవాసం సత్ఫలితాలనిచ్చింది అంటున్నారు పరిశోధకులు. అయితే పెద్దలకు సోకే AML అనే తరహా లుకేమియాలో ఇలాంటి ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఉపవాసం వల్ల కేన్సర్‌ సైతం నయమవుతుందని తేలిపోయింది. ఉపవాసం వల్ల ఇంకెన్ని రోగాలలో ఉపశమనం లభిస్తుందో తేలడమే తరువాయి. పెద్దలు చెప్పే ఇలాంటి ఆరోగ్య సూత్రాల వెనుక ఎంత ఉపయోగం ఉందో తెలిపే ఇలాంటి పరిశోధనలు ప్రాచీన వైద్యం పట్ల సరికొత్త విశ్వాసాన్ని అందిస్తున్నాయి.     - నిర్జర.

వయసులో తాగితే మెదడు గతి అంతే!

  మ్యదపానం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకో పరిశోధనా వెలువడే కొద్దీ మద్యపానం వల్ల ఊహకి అందని సమస్యలెన్నో ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఫిన్లండులో సరికొత్తగా జరిగిన ఓ పరిశోధనతో, వయసులో మద్యపానాన్ని సేవించడం వల్ల, పిల్లలు మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తేలుస్తోంది.   టీనేజిలో ఉండగా ఫిన్లండుకి చెందిన పరిశోధకులు ఒక 62 మంది యువత నుంచి వారి ఆహారపు అలవాట్లకి సంబంధించిన వివరాలను సేకరించారు. ముందుగా ఒక పదేళ్ల క్రితం వారంతా టీనేజి వయసులో ఉన్నప్పుడు ఈ వివరాలను సేకరించారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితమూ, ఏడాది క్రితమూ ఇవే వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి మందు అలవాట్లను గమనించారు. వీరిలో ఒక 35 మంది టీనేజిలో ఉండగా తెగ తాగేవారని తేలింది. మరో 27 మంది అప్పుడప్పుడూ మందుని రుచి చూసేవారట.   మెదడుని పరిశీలిస్తే టీనేజిలో ఉండగా బాగా తాగేవారికీ, తక్కువ తాగేవారి ఆరోగ్యానికీ మధ్య మొదట్లో ఎలాంటి వ్యత్యాసమూ కనిపించలేదు. డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులూ అగుపించలేదు. కాకపోతే బాగా మందు తాగేవారు, మందుతో పాటుగా సిగిరెట్లు కూడా ఎక్కువ తాగుతున్నట్లు మాత్రమే తేలింది. కానీ పెద్దయ్యాక వారి మెదడుని గమనిస్తే, రెండు విభాగాల మధ్య స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. వారిలో మెదడు వికసించిన తీరులో మార్పు కనిపించింది.   గ్రే మేటర్ టీనేజిలో తెగ తాగిన యువత మెదడులోని ‘గ్రే మేటర్’ అనే పదార్థం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మనలో  జ్ఞాపకశక్తినీ, ఉద్వేగాలనీ, విచక్షణనీ, ఆత్మస్థైర్యాన్నీ నియంత్రించడంలో ఈ ‘గ్రే మేటర్‌’ది కీలక పాత్ర. మెదడులో ఇలాంటి లోటు చోటు చేసుకోవడం వల్ల టీనేజిలో బాగా తాగేసినవారిలో నానారకాల మానసిక సమస్యలూ ఏర్పడినట్లు గమనించారు. సమాజానికి దూరంగా ఉండటం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవడం, చదువులో వెనబడటం వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కొన్నారట. దీనికి తోడు శాశ్వతంగా మద్యపానానికి బానిసైపోయే ప్రమాదంలోనూ మునిగిపోయారు.   ఖచ్చితమైన కారణం టీనేజిలో విచ్చలవిడిగా తాగితే మెదుడు దెబ్బతినడానికి కారణం లేకపోలేదు. పిల్లలు 20 ఏళ్ల వయసుకి వచ్చేవరకు వారి మెదడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ కాలంలో కనుక మద్యానికి బానిసైతే, ఎదిగే మెదడు దెబ్బతినక మానదు. అందుకనే పిల్లల అలవాట్లను తల్లిదండ్రులు, తోటిమిత్రలు, ఉపాధ్యాయులు... ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ టీనేజి పిల్లలు తెలిసీ తెలియక మద్యానికి బానిసలైనా... వెంటనే వారిలో ఆ అలవాటుని కనుక మాన్పించగలిగితే, తిరిగి మెదడులోని గ్రే మేటర్‌ పుంజుకోవడాన్ని గమనించారు. అలా కాకుండా దీర్ఘకాలం పాటు మద్యానికి బానిసగా కొనసాగితే, మెదడుకి కోలుకోలేని నష్టం ఖాయమట.   - నిర్జర.

శ్వాసతో ధ్యాస పెరుగుతుందట

  ఊపిరిని ఎప్పుడూ నాసిక ద్వారా పీల్చుకోవాలేగానీ నోటితో పీల్చుకోకూడదని పెద్దలు అంటూ ఉంటారు. ముక్కుతో కాకుండా నోటితో గాలిని పీల్చుకుని వదలడం వల్ల ఊపిరితిత్తుల బలహీనంగా తయారవుతాయని ఆధునిక విజ్ఞానం ధృవీకరిస్తోంది. పైగా ఆస్తమా, రక్తపోటు వంటి ఆరోగ్యసమస్యలు సైతం పలకరిస్తాయని హెచ్చరిస్తోంది. అయితే ముక్కుతోనే గాలిని పీల్చుకోవడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తేలడం ఆశ్చర్యకరం!   అనుకోని పరిశోధన నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొన్ని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ రికార్డులు మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఓ ఏడుగురు రోగులవి. వీరి మెదళ్ల మీద త్వరలోనే శస్త్రచికిత్సలు జరగనున్నాయి. ఆ శస్త్రచికిత్సల కోసం జరుగుతున్న పరీక్షలలో భాగంగా వారిలో మూర్ఛవ్యాధికి మూలం ఎక్కడుందో కనుగొనేందుకు ఎలక్ట్రోడ్ల సాయంతో... వారి మెదడులో జరుగుతున్న చర్యలన్నింటినీ పరిశీలించి రికార్డులను రూపొందించారు. ఈ రికార్డులను పరిశీలిస్తున్నప్పుడు, రోగులు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు వారి మెదడులో కొన్ని ప్రాంతాలు ఉత్తేజితం కావడాన్ని గమనించారు. ముఖ్యంగా భావోద్రేకాలు, జ్ఞాపకాలను నియంత్రించే కొన్ని భాగాలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి.   మరో అడుగు ముందుకి శ్వాసకి సంబంధించి తాము గమనించిన విషయాలు ఎంతవరకు నిజమో తేల్చుకునేందుకు ఒక 60 మంది మీద ప్రయోగాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందులో భాగంగా వారు ఊపిరి పీల్చుకునే సమయంలో వేర్వేరు భావాలను ప్రదర్శించే చిత్రాలను చూపించారు. వాటిలో ఏ చిత్రం ఏ భావాన్ని సూచిస్తుందో ఠక్కున చెప్పమన్నారు. మిగతా ఉద్వేగాలకంటే భయానికి సంబంధించిన చిత్రాన్ని చూపించినప్పుడు... అభ్యర్థులు గబుక్కున వాటిని పోల్చుకున్నారట. అయితే గాలిని ముక్కుతో పీల్చుకునే సమయంలోనే ఇలా త్వరగా స్పందించగలిగారు. గాలిని బయటకు వదిలే సమయంలో కానీ, గాలిని ముక్కుతో కాకుండా నోటితో పీల్చుకున్నప్పుడు కానీ ఇలాంటి ప్రతిభ కనిపించలేదు.   జ్ఞాపకశక్తి కూడా భయాన్ని గుర్తుపట్టే లక్షణమే కాదు... ఏదన్నా వస్తువుని చూసినప్పుడు దానిని దీర్ఘకాలం గుర్తుంచుకోవడంలో కూడా శ్వాస ప్రభావం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు అభ్యర్థులకు కంప్యూటర్‌ తెర మీద వేర్వేరు వస్తువుల చిత్రాలను చూపించారు. తరువాత కాలంలో వాటిని గుర్తుచేసుకోమన్నప్పుడు, ముక్కు ద్వారా గాలిని పీల్చుకునే సందర్భంలో చూసిన చిత్రాలను వారు త్వరగా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని గమనించారు.   ఎందుకిలా! ఊపిరి పీల్చుకునే సమయంలో మెదడుకి తగినంత ప్రాణవాయువు లభిస్తుందన్నది ఈ పరిశోధనతో తేలిపోయింది. దాంతో మెదడు ఆ సమయంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకున్నప్పుడే మెదడుకి తగినంత శక్తి చేరుతోందేమో అన్న విశ్లేషణకు కూడా ఈ ఫలితం తావిస్తోంది. మరి భయానికి సంబంధించిన ఉద్వేగాన్ని గమనించడానికీ, శ్వాసకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నకు కూడా సహేతుకమైన జవాబులే వినిపిస్తున్నాయి. మనిషి ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు, అతని శ్వాస వేగవంతం కావడాన్ని గమనించవచ్చు. దీనివల్ల అతని మెదడుకి త్వరగా కావల్సినంత శక్తి చేకూరుతుంది. ఆ ఆపదని తప్పించుకునేందుకు సమర్ధవంతమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ఆ శక్తి ఉపయోగపడుతుంది.   ఇదీ సంగతి! దీంతో ముక్కుతోనే గాలి పీల్చుకోమని నిరంతరం హెచ్చరించే మన పెద్దల మాట మరోసారి గట్టిగా వినిపించినట్లయ్యింది. పైగా శ్వాస ద్వారా చేసే ప్రాణాయామం వంటి ప్రక్రియల వల్ల మెదడు మరింత చురుగ్గా తయారవుతుందన్న భరోసానీ అందించినట్లయ్యింది.   - నిర్జర.  

ఆడదిక్కు లేని సంసారం... ఆరోగ్యానికీ నష్టమే!

పిల్లల్ని పెంచడంలో ఇప్పటికీ ఆడవారే కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే! అందుకనే విడాకులు తీసుకున్నప్పుడు కూడా పిల్లల బాధ్యతలని ఆడవారే స్వీకరిస్తూ ఉంటారు. ఒకవేళ మగవారు కనుక పిల్లల బాధ్యతలని భుజాన వేసుకుంటే వారి పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన వచ్చింది మారియా అనే పరిశోధకురాలికి. ఆలోచన వచ్చిందే తడవుగా ఒంటరి తల్లులతో పోలిస్తే ఒంటరి తండ్రుల ఆరోగ్యం ఏ తీరున ఉందో గమనించే ప్రయత్నం చేసింది.   ఒంటరి తండ్రులు పెరుగుతున్నారు సమాజంలో చెదిరిపోతున్న వైవాహిక బంధాల వల్ల ఒంటరిగా పిల్లల్ని పెంచే తండ్రుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే వీరి కష్టం మీద ఇప్పటివరకూ పెద్దగా పరిశోధనలు జరగలేదంటున్నారు మారియా. ఇందుకోసం ఆమె కెనడాకి చెందిన 1,058 మంది ఒంటరి తండ్రుల స్థితిగతులను గమనించారు. ఆ గణాంకాలను 20 వేల మంది సాధారణ తండ్రులతోనూ, 5,725 ఒంటరి తల్లులతోనూ పోల్చి చూశారు.   స్పష్టమైన తేడాలు ఇంట్లో ఆడదిక్కు ఉన్నవారితో పోలిస్తే ఒంటరి తండ్రుల ఆరోగ్యం అంతంతమాత్రమే అని తేలింది. పైగా వీరిలో మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఒంటరిగా పిల్లల్ని పెంచుకొస్తున్న తల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే వారితో పోలిస్తే సగానికి సగం మంది ఒంటరి తండ్రులు మాత్రమే తమ మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారట.   మూడు కారణాలు ఒంటరి తండ్రులలో ఈ అవస్థకి మూడు కారణాలను పేర్కొనవచ్చునంటున్నారు పరిశోధకులు..   - తాము మానసికంగా క్రుంగిపోతున్నామని ఒప్పుకొంటూ, వైద్యులు సలహాని తీసుకునేందుకు మగవారు సంశయించడం.   - సమాజం కూడా ఒంటరి తల్లుల మీద చూపే జాలి, శ్రద్ధా ఒంటరి తండ్రుల మీద చూపకపోవడం.   - ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల వారి ఆరోగ్యాన్ని పట్టించుకునేందుకు కానీ, మంచిచెడులు చెప్పేందుకు కానీ, అండగా నిలిచేందుకు కానీ ఓ తోడు లేకపోవడం.   ఒంటరి తండ్రులు కనుక మానసిక వ్యధకి లోనవుతుంటే.. ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, ఏవన్నా మనస్పర్థలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కానీ, పిల్లల్ని పంచుకుని పెంచుకునే దాకా పోకూడదని ఈ పరిశోధన సూచిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక ఏర్పడితే... సదరు వ్యక్తిని కనిపెట్టుకుంటూ ఉండాలని సమాజాన్ని కూడా హెచ్చరిస్తోంది.   - నిర్జర.

పడుకునే ముందు పోట్లాడుకోవద్దు!

    నిద్ర గురించి కావల్సినన్ని పరిశోధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు తగినంత నిద్రలేకుండా అదేపనిగా పనిచేసేవారిలో రక్తపోటు, గుండెదడ ఎక్కువగా ఉన్నట్లు ఇటీవలే చికాగోలో జరిగిన ఒక సమావేశంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇదంతా బాగానే ఉంది కానీ నిద్రపోయే ముందు మన ఆలోచనా విధానానికీ, జ్ఞాపకాలకీ ఏదన్నా సంబంధం ఉందా? అన్న విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు కొందరు శాస్త్రవేత్తలు. భయంకరమైన చిత్రాలు లండన్‌కు చెందిన పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా ఓ 73 మంది విద్యార్థులను ఎన్నుకొన్నారు. వీరికి నిద్రపోయే ముందు కొన్ని భయానక చిత్రాలను చూపించారు. గాయపడినవారు, ఏడుస్తున్న పిల్లలు, శవాలు... ఇలా మనసుని తొలచివేసే సన్నివేశాలు ఉన్న చిత్రాలను వీళ్లకి అందించారు. చిత్రాలను చూపించడమే కాదు, అభ్యర్థులలో కొందరికి- ‘మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ చిత్రాల గురించి అంతగా పట్టించుకోవద్దు,’ అంటూ సలహాని కూడా ఇచ్చారట. అలాంటి సలహాని అందుకున్నవారికి ఓ అరగంట తరువాత మళ్లీ అవే చిత్రాలను చూపించారు. వాళ్లంతా ఆ చిత్రాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో.... ఓ 91 శాతం మందే వాటిని గుర్తుచేసుకున్నారు. ఒక రోజు తరువాత అయితే! ప్రయోగంలోని రెండో దశలో భాగంగా మిగతా అభ్యర్థులకి ఒక రోజు తరువాత అవే చిత్రాలను చూపించారు. ఆశ్చర్యకరంగా... వారిలో 97 శాతం మంది వాటిని గుర్తుచేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- చిత్రాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్న కొందరు అభ్యర్థులు అరగంటలోనే వాటిని మర్చిపోవడంలో సఫలం అయితే, వాటి గురించి జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకున్నవారు... రోజు గడిచినా కూడా వాటిని మర్చిపోలేకపోయారు. జ్ఞాపకాలే కీలకం నిద్రపోయి లేచిన తరువాత చేదు అనుభవం మరింత తీవ్రంగా నిక్షిప్తం అవడానికి కారణాన్ని కనుగొనేందుకు అభ్యర్తుల మెదడుని స్కానింగ్‌ చేసి చూశారు. దానిలో తేలిన విషయం ఏమిటంటే... మనలోని తాత్కాలిక జ్ఞాపకాలన్నీ కూడా మెదడులోని ‘హిపోక్యాంపస్’ అనే చోట నమోదవుతాయి. ఇక్కడే వీటిని తుంచేస్తే అవి దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాటిని మనసులోనే ఉంచుకుని నిద్రలోకి జారుకుంటే... ఆ ఆలోచనలు ‘హిపోక్యాపస్‌’ను దాటుకుని మెదడు అంతా పరుచుకుంటాయి. మరిన్ని సూత్రాలకు ఆధారం నిద్రపోయేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలన్న పెద్దల మాటను ఇది నిజం చేస్తోంది. అలా కాకుండా భార్యాభర్తలు గొడవపడుతూనో, పనికిరాని పుస్తకాలు చదువుతూనే పడుకుంటే పీడకలల మాట అటుంచి... అవి మన మెదుడలోనే తిష్టవేసుకుపోయే ప్రమాదం ఉందని తేలిపోతోంది. నిద్రపోయే ముందు ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలో, మనసులో ఎలాంటి ఆలోచనలకి చోటు ఇవ్వాలో చెప్పడం మాట అటుంచి... ఏదన్నా చేదు అనుభవం తాలూకు జ్ఞాపకాలు మనసులో ఎలా నిక్షిప్తం అవుతాయో, వాటికి చికిత్స ఎలా అందించవచ్చో సూచించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతోంది. - నిర్జర.

మొండి బ్యాక్టీరియాకు తిరుగులేని వైద్యం

బ్యాక్టీరియా కారణంగా శరీరంలోకి ఏదన్నా ఇన్ఫెక్షన్‌ చేరితే, దానిని సరిచేసేందుకు యాంటీబయాటిక్స్‌ను అందిస్తూ ఉంటారు. ఈ యాంటీ బయాటిక్స్‌ కారణంగా శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం, మనిషి నిస్సత్తువగా మారిపోవడాన్ని తరచూ గమనిస్తూనే ఉన్నాము. పైగా తరచూ ఇలాంటి యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల బ్యాక్టీరియా కూడా రాటుదేలే పరిస్థితులు వస్తున్నాయి. యాంటీబయాటిక్స్ కూడా పనిచేయలేని స్థితిలో ఏటా వేలమంది నిస్సహాయంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇక మీదట మొండి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే చికిత్స అందుబాటులోకి రానుంది.   మొండితనానికి కారణం కొన్నిరకాల బ్యాక్టీరియాల మీద రక్షణగా ఒక పొర ఏర్పడటంతో... వాటి మీద మందులు పనిచేయడం లేదని తేలింది. ఈ పొరను బయోఫిల్మ్‌ అంటారు. యాంటీబయాటిక్స్ ఈ పొరను దాటుకుని బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడంలో విఫలం అవుతుంటాయి. ఇలా యాంటీబయాటిక్స్ నుంచి నిలదొక్కుకున్న బ్యాక్టీరియా... అంతకు పదింతలై వృద్ధి చెంది ప్రాణాంతకంగా మారుతుంది.   విద్యత్తుతో చికిత్స మొండి బ్యాక్టీరియాని ఛేదించేందుకు ‘వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ’కి చెందిన పరిశోధకులు విద్యుత్తుని ప్రయోగించి చూశారు. ఇందులో భాగంగా చిన్నపాటి విద్యుత్తుని రోగి శరీరంలోకి పంపారు. ఆ విద్యుత్తుతో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అనే రసాయనం ఉత్పత్తి అయ్యేలా చూశారు. ఈ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ మొండి బ్యాక్టీరియా మీద ఉన్న బయోఫిల్మ్‌ను ఛేదించింది. దీంతో యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా మీద దాడి చేసే అవకాశం ఏర్పడుతుంది.   కొత్త కాదు కానీ... విద్యుత్తును ప్రయోగించి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఈనాటివి కావు. దాదాపు వందేళ్ల నుంచీ ఇలాంటి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. కానీ సరిగ్గా తగినంత మోతాదులో విద్యుత్తు అందించడం, ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా నేరుగా బ్యాక్టీరియా మీద దాడి చేయడం... వంటి అంశాలలో తాజా పరిశోధన విజయవంతమయ్యింది. పైగా ఈ చికిత్సకు బ్యాక్టీరియా కూడా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా లొంగిపోవడం కూడా పరిశోధకులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.   ‘విద్యుత్తుతో బ్యాక్టీరియా నాశనం’ అనే పరిశోధన విజయవంతం కావడంతో ఈ చికిత్సకు సంబంధించి పేటెంట్లను కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చికిత్సే కనుక అందుబాటులోకి వచ్చేస్తే ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్లు, ఎంతకీ మానని గాయాలను ఇకమీదట సులభంగా లొంగదీసుకోవచ్చు. అదే కనుక జరిగితే మున్ముందు ‘ఇచట మొండి గాయాలను మాన్పబడును’ అన్న బోర్డులు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.     - నిర్జర.

టెన్నిస్‌తో ఆయుష్షు పెరుగుతుంది.. ఫుట్‌బాల్‌తో పెరగదు!

ఆటలు ఆడే మనుషులు ఆరోగ్యంగానూ, దృఢంగానూ ఉంటారన్న విషయం తెలిసిందే! ఆడే తీరుని బట్టి కొన్ని రకాల ఆటల్లో ఎక్కువ శక్తి ఖర్చవుతుందనీ, కొన్నింటిలో అంతగా కొవ్వు కరగదనీ వింటుంటాము. కానీ ఆటకీ ఆయుష్షుకీ సంబంధం ఉందంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కదా! అలాంటి సంబంధం ఏమన్నా ఉందేమో అని తెలుసుకునేందుకు సాక్షాత్తూ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు రంగంలోకి దిగారు.   14 ఏళ్ల పరిశోధన ఈ ప్రయోగం కోసం ఇంగ్లండు, స్కాట్లాండుకు చెందిన 80 వేలమందికి పైగా వ్యక్తులను... వారి జీవనశైలి గురించి ప్రశ్నించారు. 1994 నుంచి 2008 వరకు సాగిన ఈ ప్రశ్నలలో వారు ఎలాంటి ఆటలు ఆడతారు, ఎలాంటి వ్యాయామం చేస్తారు, ఎంతసేపు చేస్తారు, పొగతాగడం లాంటి అలవాట్లు ఉన్నాయా, విద్యార్హతలు ఏమిటి... వంటి ప్రశ్నలెన్నో సంధించారు. పలు దఫాలుగా సాగిన ఈ ప్రశ్నావళి ద్వారా వచ్చిన సమాచారాన్నంతా ఒకచోటకి చేర్చి పరిశీలించారు.   సంబంధం ఉంది ఈ పధ్నాలుగేళ్ల కాలంలో... పరిశోధనలో పాల్గొన్న 80 వేల మందిలో, ఓ ఎనిమిదివేల మంది చనిపోయారు. వీరిలో దాదాపు రెండువేల మంది గుండెపోటుతోనే చనిపోయారు. అయితే వీరు ఆడిన ఆటకీ ఆయుష్షుకీ సంబంధం ఉండటం పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగతావారితో పోలిస్తే... రాకెట్‌తో ఆడే టెన్నిస్‌ వంటి క్రీడలు అలవాటు ఉన్నవారు గుండెపోటుతో చనిపోయే అవకాశం 57 శాతం తక్కువగా ఉందని తేలింది. ఇక ఈత కొట్టేవారు 41 శాతం తక్కువగానూ, ఏరోబిక్స్‌ చేసేవారు 36 శాతం తక్కువగానూ గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు. కేవలం గుండెపోటే కాదు, ఇతరత్రా కారణాలతో మృత్యువుబారిన పడటం కూడా వీరిలో తక్కువగానే నమోదయ్యింది. ఆశ్చర్యం ఏమిటంటే ఫుట్‌బాల్‌, రగ్బీ వంటి ఆటలు ఆడేవారిలో ఆయుష్షుకీ ఆటకీ మధ్య ఎలాంటి సంబంధమూ కనిపించలేదు!   కారణం లేకపోలేదు వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా క్రీడలకు అనుగుణంగా ఆయుష్షులో మార్పులు ఉండటానికి వెనుక స్పష్టమైన కారణం ఉందంటున్నారు పరిశోధకులు. టెన్నిస్, స్విమ్మింగ్‌, సైక్లింగ్, ఏరోబిక్స్‌ వంటి క్రీడలకు వయసుతో సంబంధం ఉండదు. ఒకసారి ఈ క్రీడలకు అలవాటు పడినవారు వాటిని నిరంతరం కొనసాగించే అవకాశం ఉంటుంది. పైగా టెన్నిస్‌, ఏరోబిక్స్ వంటి క్రీడలకు కొన్ని క్లబ్బులు ఉండటం... వాటిలో చేరినవారు మిగతావారి ప్రోత్సాహంతో సుదీర్ఘకాలం క్రీడను అంటిపెట్టుకుని ఉండటం కూడా ఓ కారణం. దీనికి విరుద్ధంగా యుక్తవయస్సులో ఫుట్‌బాల్, క్రికెట్‌ వంటి క్రీడలు ఆడేవారు... జట్టు నుంచి దూరం కాగానే ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటారు. టీవీల్లో ఆటలను చూస్తూ ఆనందపడతారే కానీ తాము కూడా ఎలాగొలా ఆటని కొనసాగించేందుకు ప్రయత్నించరు. అలా నడివయసులోనే తమకు నచ్చిన క్రీడల నుంచి దూరం కావడంతో... వ్యాయామానికి సంబంధించిన ఫలితాలు వారికి అందవు.   మరేం చేయడం! పైపైన చదివితే ఈ పరిశోధన ఫుట్‌బాల్‌, క్రికెట్‌ అభిమానులకు కాస్త నిరాశనే కలిగిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న సూచనను అందుకుంటే వారి ఆయుష్షు కూడా మెరుగుపడుతుందని అంటున్నారు పరిశోధకులు. యుక్తవయసులో ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడినవారు... ఆ ఆటని ఆడటం కుదరకపోతే నిస్తబ్దుగా మారిపోవద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు బదులుగా నిరంతరంగా సాగే సైక్లింగ్‌ వంటి వ్యాయామాన్ని ఎంచుకోమంటున్నారు.   - నిర్జర.

హెచ్‌.ఐ.వి టీకా వచ్చేస్తోంది

  ఎయిడ్స్‌! ఈ పేరు వింటే చాలు ప్రపంచం ఇప్పటికీ వణికిపోతోంది. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేసినా, పరిశోధకులుఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... హెచ్‌.ఐ.వి అనే మహమ్మారి ఏటా లక్షలమందిని కబళిస్తూనే ఉంది. భారతీయ శాస్త్రవేత్తలతో సహా ఎంతోమంది ఈ వ్యాధికి మందులనో, టీకాలనో కనుగొన్నామని ప్రకటిస్తూనే వస్తున్నారు. అయితే అవి ఇంకా తుదిదశకు చేరుకోలేదు. ఇప్పుడు హెచ్.ఐ.విని ఎదుర్కొనే ఒక టీకాను దక్షిణాఫ్రికాలో ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారు.   దక్షిణాఫ్రికాలోనే ఎందుకు! ఈ టీకాను అమెరికన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినప్పటికీ, దానిని దక్షిణాఫ్రికాలో ప్రయోగించడానికి ఒక కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎయిడ్స్‌ ప్రబలుతున్న దేశాలలలో దక్షిణాఫ్రికా ఒకటి. అక్కడ దాదాపు 19 శాతం మంది ప్రజలు హెచ్‌.ఐ.వి వైరస్‌ను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌.ఐ.వీ బాధితులలో ఐదో వంతు మంది ఆ దేశంలోనే ఉన్నారు. పైగా హెచ్‌.ఐ.వి వైరస్‌లో '‘subtype C” అనే మొండిరకం అక్కడి ప్రజలలోనే ఎక్కువగా కనిపిస్తోంది.   ఇంతకుముందు ధాయ్‌లాండ్‌లో హెచ్‌.ఐ.వి టీకాను ప్రజల మీద ప్రయోగించడం ఇదేమీ కొత్త కాదు. ఒక ఆరేళ్ల క్రితం (2009) థాయ్‌లాండ్‌లో కొందరి మీద ఈ టీకాను ప్రయోగించారు. అక్కడ కొంతమేరకు టీకా విజయాన్ని సాధించింది కూడా! హెచ్‌.ఐ.వి టీకాను తీసుకున్నవారిని తిరిగి మూడున్నర ఏళ్ల తరువాత గమనిస్తే... వారిలో దాదాపు మూడోవంతు మంది హెచ్‌.ఐ.వి వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తేలింది.   మరింత శక్తిమంతం ఈసారి దక్షిణాఫ్రికాలో ప్రయోగించనున్న టీకా మునుపటికంటే మరింత శక్తిమంతమైందని చెబుతున్నారు. వైరస్‌ను మరింత ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు, రోగనిరోధక శక్తిని మరింతగా పెంచేందుకు అనువుగా ఈ టీకాను రూపొందించారట. దీనిని 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న 5,400 మందికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాక్సినేషన్‌లో భాగంగా అభ్యర్థులకు ఏడాదికాలంలో రెండు సార్లు టీకాను అందిస్తారు. టీకాను అందించి మూడేళ్లు ముగిసిన తరువాత వారిలో ఎంతమంది హెచ్‌.ఐ.విని సమర్థంగా ఎదుర్కొన్నారో పరీక్షిస్తారు. పరిశోధకుల అంచనా మేరకు కనీసం 50 శాతం మందైనా ఈ టీకాతో హెచ్‌.ఐ.విని ఎదుర్కొనే అవకాశం ఉంది.   ఇప్పటివరకూ హెచ్‌.ఐ.విని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. కేవలం ‘యాంటి రిట్రోవైరల్‌’ అనే చికిత్స ద్వారా హెచ్‌.ఐ.వి వైరస్ తీవ్రతను కాస్త తగ్గించే ప్రయత్నమే జరుగుతోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పరీక్షలు కనుక సత్ఫలితాలను ఇస్తే మున్ముందు హెచ్.ఐ.విని ఎంతోకొంత మేర ఎదుర్కోవచ్చుననే ఆశ కలుగుతోంది. ఆ ఆశ ఎంతమేరకు ఫలిస్తుందో తెలుసుకోవాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే!   - నిర్జర.

ఊబకాయానికి కారణం తెలిసిపోయింది

  ఈ రోజుల్లో ఊబకాయం లేనివారు అరుదు. ఆ ఊబకాయం నుంచి విముక్తి పొందుదాం అని ఎవరికి వారు ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కడుపు మాడ్చుకుంటూ, కఠినమైన వ్యాయామాలు చేస్తూ... ఎలాగొలా కాసింత బరువు తగ్గుతారు. కానీ బరువు తగ్గాం కదా అని అలా ఓ నాలుగు ముద్దలు నోట్లో వేసుకుంటారో లేదో... మళ్లీ ఎప్పటిలాగే బరువు పెరిగిపోతుంటారు. ఈ తరహా ఊబకాయాన్ని Yo-Yo ఊబకాయం అంటారు. Yo-Yo అనేది చిన్నపిల్లలు లాగి వదిలే బంతిలాంటి పరికరం. దాన్ని అలా నేలకి వదలగానే తిరిగి చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే కొందరిలో ఊబకాయం కూడా మళ్లీ మళ్లీ వస్తుందన్నమాట. ఈ తరహా శరీర తత్వానికి Yo-Yo obesity అంటూ మంచి పేరైతే పెట్టారు కానీ, దానికి కారణం ఏమిటో ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు.   ఇజ్రాయేలుకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు Yo-Yo ఊబకాయానికి కారణం తెలుసుకునేందుకు ఎలుకల జీర్ణవ్యవస్థను నిశితంగా పరిశీలించారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన ఫలితం వెలువడింది. మన పేగులలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే కదా! వీటిలో ఒక సూక్ష్మజీవి ఊబకాయులలో చిత్రంగా ప్రవర్తించడాన్ని గమనించారు. ఒక మనిషి విపరీతంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు తాము ఎలా పనిచేస్తున్నామో గుర్తుంచుకునే ఈ సూక్ష్మజీవి, అతను డైటింగ్‌లో ఉన్నంతకాలమూ నిశబ్దంగా ఉండి... మళ్లీ ఓ నాలుగు ముద్దలు అదనంగా పేగులలోకి చేరగానే ఊబకాయానికి తోడ్పడుతోందట.   ప్రయోగంలోని రెండో దశలో- ఊబకాయం పునరావృతమవ్వడానికి సదరు సూక్ష్మజీవే కారణమా కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. అందుకోసం ఎలుకలకి కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం ద్వారా సదరు సూక్ష్మజీవిని నిర్వీర్యం చేశారు. అప్పుడు ఎలుకలలో ఊబకాయం తిరిగి రాకపోవడాన్ని గమనించారు. మరోవైపు ఊబకాయానికి అలవాటు పడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన ఎలుకలలో ప్రవేశపెట్టినప్పుడు, అవి వెంటనే ఊబకాయంతో సతమతమవ్వడాన్ని గమనించారు.   మళ్లీ మళ్లీ వచ్చే ఊబకాయానికి కారణమైన సూక్ష్మజీవిని కనుగొన్నారు సరే! మరి సదరు సూక్ష్మజీవి ఊబకాయానికి ఎలా తోడ్పడుతోంది? అన్న ప్రశ్నకి కూడా జవాబు దొరికింది. ఆ సూక్ష్మజీవులు, మన శరీరంలోకి చేరే ఫ్లేవనాయిడ్స్ అనే పోషక పదార్థాలను నిర్వీర్యం చేస్తాయట. కొవ్వుని శక్తిగా మార్చడంలో కీలకపాత్రని వహించే ఇలాంటి ఫ్లేవనాయిడ్స్‌ని నిర్వీర్యం చేయడం ద్వారా... శరీరంలో కొవ్వు ఎప్పటికప్పుడు పేరుకుపోయే ప్రమాదం ఏర్పుడుతుంది.   ఎలుకల మీద జరిగిన ఈ పరిశోధన ఆధారంగా ఊబకాయంతో బాధపడే మనుషులకు కూడా తగిన చికిత్సను అందించవచ్చు అంటున్నారు. కొవ్వుని కరిగించే ఫ్లేవనాయిడ్స్‌ను ఎప్పటికప్పుడు శరీరానికి అందించడం ద్వారా ఊబకాయాన్ని సులువుగా జయించవచ్చునంటున్నారు. ఊబకాయం కేవలం ఆకృతికి సంబంధించిన సమస్యే కాదు! దాని వల్ల గుండెజబ్బులు, షుగర్‌, రక్తపోటు వంటి నానారకాల ఆరోగ్య సమస్యలూ మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి మున్ముందు చిన్నపాటి చికిత్సతోనే ఈ ఊబకాయం అనే మహమ్మారి నుంచి బయటపడితే, ఇతరత్రా సమస్యల నుంచి కూడా దూరం కావచ్చునేమో!                  - నిర్జర.

చెమట చుక్కతో ఆరోగ్యాన్ని పసిగట్టేస్తుంది

  ఒక చిన్న స్టిక్కర్‌ని చేతికి అంటించుకుంటే... అది మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఈ ఆశ్చర్యం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పుణ్యమా అని రాబోయే రోజుల్లో వైద్య పరీక్షల తీరే మారబోతోంది.   సరికొత్త పరికరం ఒక మనిషి గుండె ఎంత వేగంతో కొట్టుకుంటోంది, అతని రక్తపోటు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు చెప్పేందుకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు తమ శరీరంలో ఎన్ని కెలొరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకునేందుకు, వ్యాయామం శృతి మించుతోందేమో గమనించుకునేందుకు ఈ పరికరాలు వాడుతున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక సమాచారాన్ని అందించగలవే కానీ మన ఒంట్లోని నీరు, లవణాల శాతం ఎలా ఉందో చెప్పవు. పైగా ఈ పరికరాలు శరీరానికి తగులుతూ కాస్త చిరాగ్గా ఉంటాయి. ఇవి పనిచేయాలంటే బ్యాటరీలు కూడా కావాల్సి ఉంటుంది. కానీ కొత్త స్టిక్కర్‌ తీరే వేరు.   రసాయనాల ఆధారంగా ఒక రూపాయి నాణెం అంత ఉండే ఈ స్టిక్కర్‌లో నాలుగు భాగాలు ఉంటాయి. ఆ నాలుగు భాగాల్లోనూ నాలుగు రకాల రసాయనాలు ఉంటాయి. ఈ నాలుగు రసాయనాలూ మన ఒంట్లోంచి వెలువడే చెమటతో కలిసినప్పుడు ప్రతిచర్య జరిగి వాటి రంగు మారతాయి. అప్పుడు మన దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఇలా రంగు మారిన స్టిక్కర్‌ను ఒక ఫొటో తీస్తే.... ఫోన్లో వాటికి సంబంధించిన యాప్‌, రంగులని బట్టి మన ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది.   నాలుగు రకాలు స్టిక్కర్‌లో ఉన్న నాలుగు రకాల రసాయనాలూ మన శరీరంలో నాలుగు రకాల పరిస్థితులను అంచనా వేస్తాయి. మన శరీరంలోని ఆమ్లశాతం, లాక్టేట్‌ పరిమితులు, క్లోరైడ్‌ నిల్వలు, గ్లూకోజ్ స్థాయిలను ఇవి పసిగడతాయి. వీటి ఆధారంగా మన ఒంట్లో నీరు తగినంత ఉందా లేదా! సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి లవణాలు (Electrolytes) తగిన మోతాదులో ఉన్నాయా లేదా అన్నది అంచనా వేస్తాయి. లాక్టేట్‌ పరిమితులను అంచనా వేయడం వల్ల వ్యాయామం గాడితప్పుతోందా? శరీరంలోని కణాలకి ఆక్సిజన్‌ తగినంతగా అందుతోందా లేదా? గుండె, లివర్ పనితీరు సవ్యంగా ఉందా లేదా? అన్న వివరాలను అంచనా వేయవచ్చు.   మరికొన్ని వివరాలు - ఇంతకీ ఈ స్టిక్కర్‌ అన్ని సందర్భాలలోనూ పనిచేస్తుందా లేదా అని పరీక్షించేందుకు ఇటు ఇంట్లో వ్యాయామం చేసేవారికీ అటు ఎడారిలో సైక్లింగ్ పోటీలలో పాల్గొనేవారి చేతులకి స్టిక్కర్‌ను అంటించి చూశారు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది శుభ్రంగా పనిచేస్తున్నట్లు తేలింది. - ఈ స్టిక్కర్‌లోని రసాయనాలు ఒంట్లోని చెమటతో ప్రతిచర్య జరపడం ద్వారా రంగులు మారిపోతాయి కాబట్టి, ఒకసారి వాడిన స్టిక్కర్‌ మరోసారి పనికిరాదు. అయితే ఎలాంటి బ్యాటరీల అవసరం లేకపోవడం, కేవలం ఒకటిన్నర డాలరు ఖరీదు మాత్రమే ఉండటంతో ఇది సామాన్యులకు అందుబాటులోనే ఉందని భావించవచ్చు.   - ప్రస్తుతానికి ఓ నాలుగైదు రకాల ఆరోగ్య పరిస్థితులను మాత్రమే అంచనా వేస్తున్నప్పటికీ... ఈ స్టిక్కర్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా మున్ముందు షుగర్‌ వంటి పరీక్షలను కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నారు.     - నిర్జర.

హోదాతో పాటే ఆరోగ్యం కూడా!

వంశపారంపర్యంగా మనకి లభించిన జన్యువులు అంత బలంగా లేకపోవచ్చు, చిన్నాచితకా ఆరోగ్యసమస్యలు మనల్ని వేధిస్తుండవచ్చు- కానీ సమాజంలో పేరుప్రతిష్టలు ఉంటే సుదీర్ఘకాలం బతికేస్తామా! ఆరోగ్యం కూడా డబ్బున్నవాడికే సాయపడుతుందా! అంటే అవుననేలా ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది.     ఇప్పటికే కొన్ని ప్రయోగాలు డబ్బుకీ ఆరోగ్యానికీ లంకెపెడుతూ ఇప్పటికే కొన్ని పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయంలో అట్టడుగున ఉండే పేదలతో పోల్చుకుంటే బాగా ధనవంతులు 10 నుంచి 15 ఏళ్లు ఎక్కువ బతుకుతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇది కేవలం సమాజంలో మంచి హోదాలో ఉండటం వల్ల సాధ్యమవుతోందా! లేకపోతే ఆహారానికీ, వైద్యానికీ కావల్సినంత ఖర్చుపెట్టుకునే స్తోమత ఉండటం వల్ల సాగుతోందా! అన్నది తేలలేదు. అందుకోసం అమెరికాకి చెందిన కొందరు పరిశోధకులు ఓ 45 కోతుల మీద సామాజిక హోదాకి సంబంధించిన ఓ ప్రయోగాన్ని తలపెట్టారు.     ఐదు బృందాలుగా పరిశోధనలో భాగంగా 45 కోతులని ఐదు బృందాలుగా విభజించి వేర్వేరుగా ఉంచారు. సహజంగానే కొద్ది రోజులు గడిచేసరికి ఒకో బృందంలో ఒకో కోతిది పైచేయి అయ్యేది. బృందంలోని మిగతా కోతుల మీద వాటి ఆధిపత్యం సాగేది. కొన్నాళ్ల తరువాత ఈ కోతులని గమనించినప్పుడు, తక్కువ హోదాతో సరిపెట్టుకున్న కోతులలోని రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నట్లు బయటపడింది. వీటిలోని రోగనిరోధకశక్తిని నియంత్రించే జన్యువులను గమనించినప్పుడు... 9,000 జన్యువులలో ఏకంగా 1,600 జన్యువుల లోపభూయిష్టంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా సదరు కోతులకి ఏదన్నా ఇన్షెక్షన్‌ సోకినప్పుడు, అవి తొందరగా వ్యాధులకు లోనవ్వడం కనిపించింది. అంతేకాదు! వీటిలోని కణాలు అపసవ్యంగా ప్రవర్తించడం వల్ల గుండెజబ్బులు, అల్జీమర్స్‌ వంటి రోగాలు సైతం వాటిని బలిగొనే అవకాశం ఉన్నట్లు గమనించారు.     ప్రయోగంలో రెండో దశ 45 కోతులను ఐదు బృందాలుగా విభజించిన పరిశోధకులు, ఒక ఏడాది గడిచిన తరువాత వాటిని అటూఇటూ మార్చారు. అంటే ప్రతి కోతికీ ఒక కొత్త బృందం ఏర్పడిందన్నమాట. ఈ మార్పుతో సహజంగానే ఆయా బృందాలలో కొత్త హోదాలు ఏర్పడే అవకాశం ఉంది. విచిత్రమేమిటంటే ఒకప్పుడు తక్కువ హోదాలో ఉన్న కోతులు ఇప్పుడు తమ బృందంలో పైచేయి సాధించే పరిస్థితులు వస్తే... హోదాతో పాటుగా వాటిలోని రోగనిరోధక శక్తిలో కూడా మార్పు వచ్చిందట! అంటే హోదాతో పాటుగా వాటి ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయన్న విషయం ఖచ్చితంగా రుజువు అయిపోయింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏదన్నా ఒక కోతి తక్కువ హోదాలో ఉన్నప్పటికీ, దానికి బృందంలోని మరో కోతి అండగా నిలబడితే... వాటి ఆరోగ్యంలో పెద్దగా లోటు కనిపించలేదు.   కోతుల హోదాల మీద విజయవంతంగా సాగిన ఈ పరిశోధన మనుషులకు ఏమేరకు వర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అంతవరకూ మనం హోదా సంగతి పక్కన పెడితే, ఒకరికొకరు అండగా నిలబడే ప్రయత్నం చేస్తే సరి!                          - నిర్జర.  

మగవాడి కష్టాలు పగవాడికి కూడా వద్దు

కాలం మారుతోంది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా తిరగగలుగుతున్నారు!... ఇలాంటి మాటలు మనకి తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆడవారి పట్ల వివక్ష ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉందని మనకి తెలుసు. అంతేకాదు! ‘మగవాడు’ అన్న పదానికి నిర్వచనంలో కూడా పెద్దగా మార్పు రాలేదు. కానీ ‘మగవాడు’గా నిరూపించుకోవాలంటే భారీమూల్యం చెల్లించక తప్పదంటోంది ఓ పరిశోధన.   11 లక్షణాలు గెలవాలనే పట్టుదల, భావోద్వేగాల మీద అదుపు, తెగింపు, హింసాత్మక ధోరణి, తమదే పైచేయి కావాలనుకోవడం, ఆడవారితో తిరగడం (Playboy), ఎవరి మీదా ఆధారపడకపోవడం, పనికి ప్రాధాన్యతని ఇవ్వడం, ఆడవారి మీద ఆధిపత్యం చెలాయించడం, స్వలింగ సంపర్కం అంటే ఏవగింపు, హోదా కోసం తపించిపోవడం... అనే 11 లక్షణాల ఆధారంగా సమాజం దృష్టిలో ‘మగవాడు’ అనే పదానికి నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నించారు అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.   ఆరోగ్యానికి లక్షణాలకీ లంకె పైన పేర్కొన్న ‘మగవాడి’ లక్షణాలకీ వారి మానసిక ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం ఇప్పటివరకూ జరిగిన 78 పరిశోధనల తాలూకు గణాంకాలను సేకరించారు. వీటిలో 19,453 మంది ఆరోగ్యం, వ్యక్తిత్వాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇమిడి ఉంది. వీటిలో ప్లేబాయ్‌ మనస్తత్వం కలిగినవారు, ఆడవారి మీద ఆధిపత్యం చెలాయించే అలవాటు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే మానసికమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది.    కారణం లేకపోలేదు సమాజం దృష్టిలో ‘మగవాడు’ అనిపించుకోవాలనే తపనలో, వ్యక్తి తన మనసుని కఠినంగా మార్చేసుకుంటాడట. ఈ ప్రయత్నంలో అతను స్త్రీల నుంచి, తోటి మగవారి నుంచే కాదు... తన సహజమైన వ్యక్తిత్వం నుంచి కూడా దూరమైపోతాడు. ఫలితం! అతనిలోని సున్నితమైన భావోద్వేగాలను విలువ ఉండదు. అనేక మానసిక సమస్యలు చుట్టముట్టడం మొదలవుతుంది. వ్యసనాలబారిన పడటం, డిప్రెషన్‌కు లోనవడం వంటి సమస్యల దగ్గర్నుంచీ ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుల వరకూ అతని జీవితం ఛిద్రమైపోతుంది.   ఆగని కథ ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చు. మనసులో అలజడి చెలరేగవచ్చు. అయితే వీటికి స్పందించే విషయంలో కూడా ‘మగవాడి’ తీరు వేరుగా ఉండటాన్ని గమనించారు. ‘మగవాడు’ కాబట్టి తను డిప్రెషన్‌లో ఉన్న విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి మొహమాటపడతాడు. ఎలాంటి కష్టాన్నయినా తనకు తానుగా ఎదుర్కోవడమే మగతనం అనుకుంటాడు. తనలోని క్రుంగుబాటు పరాకాష్టకి చేరుకున్న తరువాత కూడా వైద్యులను సంప్రదించేందుకు వెనకాడతాడు. ఫలితం! పగవాడికి కూడా కలగకూడని మనోవేదనలో క్రుంగిపోతాడు.   అదీ విషయం! కాబట్టి ఎవరో మనకు ‘వాడు మగాడ్రా బుజ్జీ!’ అని బిరుదు ఇస్తారనుకుని మనలోని సున్నితమైన వ్యక్తిత్వాన్ని అణచివేసుకోకూడదని ఈ పరిశోధనతో తేలిపోతోంది. పైగా తోటివారిని గుర్తించాలనీ, ఆడవారిని గౌరవించాలనే విలువైన విలువలను గుర్తుచేస్తోంది.   - నిర్జర.

ఇచట అన్ని భయాలూ చెరపబడును

మీకు బొద్దింకలంటే భయమా? మీ జీవితంలో ఏదన్నా విషాదకరమైన సంఘటన మాటిమాటికీ జ్ఞాపకానికి వస్తూ బాధిస్తోందా? మరేం ఫర్వాలేదు! ఎలాంటి ఫోబియాలనైనా, ఆందోళనలైనా తొలగించే అవకాశం ఉంది అంటోంది విజ్ఞానశాస్త్రం. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి   ఇప్పటివరకూ... మనలో ఏదన్నా ఫోబియా ఉంటే దానిని నివారించే ప్రక్రియలు చాలా సుదీర్ఘంగా ఉండేవి. ఫోబియా ఉన్న వ్యక్తికి తరచూ కౌన్సిలింగ్‌ ఇవ్వడం, భయం మరీ తీవ్రంగా ఉంటే మందులు వాడటం చేసేవారు. ఇంత చేసినా సదరు వ్యక్తిలో ఏదన్నా వస్తువు పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడం అంత సులువు కాదు. ఇక దగ్గరి బంధువులని కోల్పోవడం, ఘోర ప్రమాదాన్ని ఎదుర్కోవడం వంటి సందర్భాల తరువాత మిగిలే గాయాలని మాన్పడమూ అంత తేలిక కాదు. post-traumatic stress disorder (PTSD)గా చెప్పుకునే ఈ మానసిక సంఘర్షణ వల్ల మనిషి బతికి ఉన్నా కూడా జీవచ్ఛవంలా మిగిలిపోతాడు.   జ్ఞాపకాలను నమోదు చేశారు అంతులేని భయాల బాధకి తగిన నివారణ కోసమని జపాన్‌, ఇంగ్లండ్, అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధనను నిర్వహించారు. రోగికి తెలియకుండానే అతని మెదడులో ఉన్న భయాన్ని చెరిపేసే అవకాశం ఏదన్నా ఉందేమో అని అన్వేషించారు. అందుకోసం వారు ఓ 17మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. ఆ అభ్యర్థులకు ముందుగా కొన్ని రంగుల వస్తువులను చూపించారు. అభ్యర్థులు వేర్వేరు రంగుల్లో ఉన్న వస్తువులను చూస్తున్నప్పుడు, వారి మెదడులో నిక్షిప్తం అవుతున్న జ్ఞాపకాలను fMRI స్కాన్‌ ద్వారా నమోదు చేశారు.   భయాలను రేకెత్తించారు వివిధ రంగుల గురించి అభ్యర్థులకు ఉన్న జ్ఞాపకాలను నమోదు చేసిన తరువాత పరిశోధనలో రెండో దశ మొదలైంది. ఇందులో భాగంగా వారికి మళ్లీ వేర్వేరు రంగులను చూపారు. కాకపోతే ఈసారి వారి కళ్ల ముందుకి కొన్ని రంగు వస్తువులు కనిపించేసరికి ఓ చిన్న షాక్‌ని అందించి భయాన్ని రగిలించారు. ఉదాహరణకు ఎరుపురంగు వస్తువుని చూడగానే అభ్యర్థికి కరెంటు షాక్‌ తగిలిందనుకోండి... సదరు అభ్యర్థిలో ఆ రంగులో ఉన్న వస్తువు పట్ల ఒకరకమైన భయం ఏర్పడిపోయేది.     అదే భయాన్ని చెరిపివేశారు ఇది పరిశోధనలోని మూడో అంచె. ఇందులో భాగంగా అభ్యర్థులను ప్రశాంతంగా పడుకోమని చెప్పారు. కానీ వారి మెదడులో జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ నమోదుచేస్తూనే ఉన్నారు. అభ్యర్థి అలా విశ్రాంతి తీసుకుంటుండగా ఇందాక జరిగిన బాధాకరమైన సంఘటన అప్పుడప్పుడూ మెదడులో సుడులు తిరగడాన్ని గమనించారు. ఆ విషయం అభ్యర్థి గమనించకపోయినా మెదడుకి తగిలించి ఉన్న స్కానింగ్‌ పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు గమనించేవారు.     అలా షాక్‌ తాలూకు జ్ఞాపకాలు మెదుడులోకి ఉబికి వచ్చిన ప్రతిసారీ, అభ్యర్థికి ఓ మంచి వార్తని చేరవేసేవారు శాస్త్రవేత్తలు. ‘ఈ పరిశోధనలో పాల్గొన్నందుకు మీకు కొంత డబ్బుని ఇస్తున్నామనో, వెళ్లేటప్పుడు ఆ డబ్బుని తీసుకువెళ్లమనో...’ అభ్యర్థులని ఊరించే సందేశాలను అందించేవారు. మెదడులో ఒక బాధ ఉబికివచ్చే సమయంలోనే ఏదో శుభవార్త దానికి అందుతూ ఉండటంతో... నిదానంగా బాధాకరమైన జ్ఞాపకాల తీవ్రత తగ్గిపోవడాన్ని గమనించారు. ఇదే సూత్రాన్ని అనుసరించి ఎంతటి తీవ్రమైన బాధనైనా తగ్గించవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అనడమే కాదు... జపాన్‌లో అయితే ఈ తరహా చికిత్సను మొదలుపెట్టేశారట కూడా! ఇక మీదట మన దగ్గర కూడా- ‘డాక్టర్‌ నాకు మా ఆయనంటే భయం! కాస్త దానిని తగ్గించరూ...’ అంటూ క్లినిక్‌లకు వెళ్లే రోజులు వచ్చేస్తాయేమో!     - నిర్జర.

లైంగిక రోగాలని పంచే ATMలు

  క్రిములనేవి రాక్షసులలాగా ఇంతింత ఆకారాలతో మన మీద దాడి చేయవు. ప్రకటనల్లో చూపించినట్లుగా కేకలు వేస్తూ కూర్చోవు. అవి మన చుట్టు పక్కల ఎక్కడ పడితే అక్కడ కాచుకుని ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంటాయి. పళ్లు తోముకునే బ్రష్‌ల దగ్గర నుంచి కీబోర్డుల వరకూ క్రిములు సర్వత్రా వ్యాపించి ఉంటాయి. ఇప్పుడు ATMలలో కూడా నానారకాల క్రిములూ ఉన్నాయని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.   అమెరికాలో సైతం ‘అదే అమెరికాలో అయితేనా’ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ATMలలో క్రిములుంటాయని బయటపడింది అమెరికాలోనే! జేన్‌ కార్ల్‌టన్‌ అనే శాస్త్రవేత్త ఈ పరిశోధనని నిర్వహించారు. ఇందుకోసం ఆయన బ్రూక్లిన్‌, మన్‌హాటన్ వంటి ప్రాంతాలలో ఉన్న 66 ఏటీఎం కీబోర్డుల మీద ఉన్న దుమ్ముని సేకరించారు. ఆ దుమ్ముని పరిశీలించగా వంటింటి దగ్గర నుంచీ మరుగుదొడ్ల వరకూ కనిపించే నానారకాల క్రిములూ వాటి మీదే ఉన్నట్లు తేలింది.   లైంగిక వ్యాధులు సైతం ATM కీప్యాడ్‌ల మీద పాలపదార్థాలు, కుళ్లిపోయిన మొక్కల ద్వారా వృద్ధి చెందే ‘లాక్టోబాసిలస్’ అనే తరహా బ్యాక్టీరియా ఎక్కువగా కనిపించిందట. ఇక Actinobacteria, Bacilli, Clostridia వంటి నానారకాల క్రిములతో పాటుగా లైంగిక వ్యాధులను కలిగించే Trichomonas vaginalis అనే క్రిమి కూడా కనిపించడంతో పరిశోధకుల దిమ్మ తిరిగిపోయింది.   ప్రాంతాన్ని బట్టి ఏటీఎంలు ఉన్న ప్రాంతాలను బట్టి ఒకోచోట ఒకో తరహా క్రిములు కనిపించాయట. అవి అక్కడ నివసించే ప్రజల ఆహారపు అలవాట్లని సూచించడం విశేషం. ఉదాహరణకు చైనాటౌన్‌లో ఉన్న ఏటీఎంల మీద చేపలకి సంబంధించిన క్రిములు కనిపిస్తే, తెల్లవారు ఎక్కువగా నివసించే మన్‌హాటన్‌లో బేకరీ పదార్థాల మీద పేరుకునే క్రిములు కనిపించాయి. అయితే కొన్ని రకాల క్రిములు మాత్రం ప్రతి ఏటీఎంలోనూ దర్శనమిచ్చాయి. ఇంకా చిత్రమేమిటంటే నాలుగు గోడల మధ్యా సురక్షితంగా కనిపించే ఏటీఎంలలో కూడా కావల్సినన్ని క్రిములు కనిపించాయి.   చేతులు కడుక్కోవడమే! పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని ఇప్పుడు ప్రతివారూ ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తీసుకునే నగదు మీద పరిమితులు ఉండటంతో, ఒకటికి పదిసార్లు ఏటీఎంలని ఆశ్రయించక తప్పడం లేదు. కాబట్టి ఏటీఎంల ద్వారా క్రిములు వ్యాపించే ప్రమాదం ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. దీనికి మన వంతుగా చేయగలిగింది ఒక్కటే! ఇతరులకు మన నుంచి క్రిములు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు చేతలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఏటీఎం నుంచి వచ్చిన తరువాత కూడా చేతులను కడుక్కోవాలి. లేకపోతే డబ్బుతో పాటుగా రోగాలని కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది.   - నిర్జర.

పొగ తాగితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది!

  ‘పాగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అన్న మాట అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటుంది. సిగిరెట్లు ఊదేయడం వల్ల  ఎన్నెన్ని సమస్యలు వస్తాయో చెబుతూ బోలెడు పరిశోధనలు వెలువడుతూ ఉంటాయి. కానీ క్యాన్సర్‌కీ సిగిరెట్లకీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ఓ కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది.     డీఎన్‌ఏ మారిపోతుంది ఇంగ్లండ్‌, అమెరికాలకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 5000 క్యాన్సర్‌ కణితుల పరిశీలించారు. రోజుకి ఒక పెట్టె సిగిరెట్లు తాగేవారి ఊపిరితిత్తులలోని కణాలు దెబ్బతింటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. సిగిరెట్ పొగకి ఈ కణాలలోని డీఎన్ఏలో సమూలమైన మార్పులు (mutation) కనిపించాయి. ఇలా డీఎన్‌ఏలో మార్పులు రావడమే క్యాన్సర్‌ దాడి చేసేందుకు ఆస్కారం ఇస్తుందట. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు... ఏడాదిలో 150 సార్లు ఇలా కణాల డీఎన్‌లలలో మార్పులు రావడాన్ని పరిశోధకులు గమనించారు. అంటే 150 రెట్లు క్యాన్సర్‌ కణితిలు ఏర్పడే ప్రమాదం ఉందన్నమాట. ఇక పొగరాయుళ్ల స్వరపేటికలో ఏడాదికి 97 సార్లు, నోటిలో 23 సార్లు... అక్కడి కణాలలో డీఎన్ఏ మార్పులు కనిపించాయి.     ఊపిరితిత్తులే కాదు ఇప్పటివరకూ సిగిరెట్లలోని రసాయనాలు ఊపిరితిత్తులు, నోరు, స్వరపేటిక వంటి అవయవాల మీదే ప్రభావం చూపుతాయని అనుకునేవారు. ఎందుకంటే సిగిరెట్లలోని పొగ నేరుగా వాటికి తగులుతూ ఉంటుంది కాబట్టి. కానీ మూత్రాశయం, కాలేయం వంటి అవయవాలలో కూడా సిగిరెట్‌ ప్రభావం ఉండటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. రోజుకి ఓ పెట్టె సిగిరెట్ తాగినవారిలో ఏడాది గడిచేసరికి మూత్రాశయంలోని కణాలలో 18 సార్లు డీఎన్‌ఏ మార్పులు జరిగాయట. ఇక కాలేయంలో ఓ 6 సందర్భాలలో ఇలాంటి ప్రభావం కనిపించింది. దీంతో సిగిరెట్ల వల్ల దాదాపు 17 రకాల క్యాన్సర్లు వ్యాపించే ప్రమాదం ఉందన్న వాదనలకి ఈ పరిశోధన బలం చేకూరుస్తోంది.     కార్సినోజెన్లే కారణం క్యాన్సర్‌ను ప్రేరేపించే రసాయనాలను కార్సినోజెన్‌లు అంటారు. ఇవి మన చుట్టుపక్కల ఒకటో రెండో ఉంటేనే ప్రమాదం. అలాంటిది నేరుగా నోట్లోకి పీల్చుకునే సిగిరెట్‌ పొగలో 50కి పైగా  కార్సినోజెన్‌ రసాయనాలు ఉంటాయి. ఇవే కాకుండా 400కు పైగా ఇతర హానికారక రసాయనాలు ఉంటాయి. మొత్తంగా దాదాపు 5000 రకాల రసాయనాలు ఒక్క సిగిరెట్లో ఇమిడి ఉంటాయి. మరి ఇన్ని ఉన్నాక అవి క్యాన్సర్‌కు దారితీయక ఏం చేస్తాయి!   జోలికే పోవద్దు ఇప్పటికే సిగిరెట్‌ అలవాటు ఉంటే దానిని మానుకోవడం మంచిదే. కానీ అసలు దాని జోలికే పోకపోవడం మరింత మేలంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే కొన్నాళ్లపాటు విపరీతంగా సిగిరెట్లు కాల్చి ఆ తరువాత మానేసినా, దాని ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. ఇప్పటికే పొగాకు వల్ల ఏటా కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారని WHO వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. జనం కనుక ఇలాగే సిగిరెట్లని అంటిపెట్టుకుని ఉంటే భవిష్యత్తులో ఈ సంఖ్య కోట్లలో ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.     - నిర్జర.  

పుట్టిన ఏడాదిని బట్టి ఫ్లూ జ్వరాలు

  ఇంకొన్నాళ్ల తరువాత ఫ్లూ జ్వరంతో బాధపడుతూ డాక్టర్‌ దగ్గరకి వెళ్తే.... ‘మీరు పుట్టిన సంవత్సరం చెప్పండి. త్వరగా నయం అవుతుందో లేదో చెబుతాను,’ అనే రోజులు వస్తాయేమో. ఎందుకంటే మనం పుట్టిన సంవత్సరానికీ, ఫ్లూ జ్వరాలకీ మధ్య అవినాభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు.   టైప్‌1, టైప్ 2... సాధారణంగా ఫ్లూ జ్వరాలు ఒకరికో ఇద్దరికో వచ్చి ఊరుకోవు. ఇవి ఓ ఉపద్రవంలా ప్రపంచాన్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఫ్లూని కలిగించే వైరస్‌ని బట్టి అందులో చాలా రకాలే ఉన్నాయి. కాకపోతే వాటన్నింటినీ రెండు రకాలుగా విభజించి టైప్ 1, టైప్ 2 ఇన్‌ఫ్లూయెంజాగా (ఫ్లూ) పేర్కొంటున్నారు. ఈ విభజన ఆధారంగా అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, 1918 నుంచి ఏ ఏడాది ఎలాంటి ఫ్లూ జ్వరాలు వ్యాపించాయో గమనించారు.   వందేళ్ల గణాంకాలు 1918 నుంచి 1968 వరకు టైప్ 1 ఫ్లూతో ప్రజలు బాధపడినట్లు తేలింది. ఇక 1968 నుంచి 1979 వరకూ టైప్ 2 ఫ్లూ జనాల మీద దాడి చేసింది. ఆ తరువాత నుంచి విడతల వారీగా ఫ్లూలోని రెండు రకాలూ ప్రపంచాన్ని పీడిస్తున్నాయి. ఒక సంవత్సరం టైప్‌ 1ది ఆధిక్యంగా ఉంటే మరుసటి ఏడు టైప్‌ 2ది పై చేయి అవుతోంది. ఇలా ఏ ఏడాది ఎలాంటి ఫ్లూ వైరస్ ప్రబలిందో అంచనా వేశారు పరిశోధకులు.   తవ్వుకుంటే లాభం! చిన్నప్పుడు ఎవరికన్నా ఫ్లూ జ్వరం వచ్చి తగ్గిపోయిందనుకోండీ! వారిలో సదరు వైరస్‌ని ఎదుర్కొనేందుకు తగిన రక్షణవ్యవస్థ ఏర్పడి ఉంటుంది. ఉదాహరణకు టైప్ 1 ఫ్లూ బారిని పడి కోలుకున్నవారు, తరువాతకాలంలో అలాంటి వైరస్ తమ మీద దాడి చేసినా ఎదుర్కోగలుగుతారు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1975 వరకు మనం పుట్టిన ఏడాదిని బట్టి ఏ తరహా ఫ్లూతో బాధపడి ఉంటామో వైద్యులు అంచనా వేయగలుగుతారు. ఇక 1979 తరువాత నుంచి ఏ ఏడాది అయితే మనకి ఫ్లూ జ్వరం వచ్చిందో ఆ సంవత్సరం ప్రబలంగా ఉన్న వైరస్‌ మనకి సోకి ఉంటుందని అంచనా వేస్తారు.   అంచనాలతో ఉపయోగం ఏంటి? ఒకసారి ఏదన్నా ఫ్లూ వచ్చినవారికి అదే తరహా ఫ్లూ వస్తే వారు కోలుకునే అవకాశం 75 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక సదరు ఫ్లూ కారణంగా మరణం సంభవించే అవకాశం ఏకంగా 80 శాతం తక్కువగా ఉంటుంది. అది కాకుండా వేరే ఫ్లూ వైరస్ కనుక రోగి మీద దాడి చేస్తే అతనికి మరింత జాగ్రత్తగా వైద్యం అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులలో రోగనిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఫ్లూ కూడా ప్రాణాంతకంగా మారిపోతుంది. అలాగే ఈమధ్యకాలం తరచూ బర్డ్‌ ఫ్లూ వ్యాధులు ప్రబలడం చూస్తున్నాం. ఈ బర్డ్‌ ఫ్లూ వ్యాధిని కలిగించే వైరస్‌లు కూడా సాధారణ ఫ్లూ వైరస్‌కు దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకు H5N1 వైరస్ టైప్‌ 1 ఫ్లూకి దగ్గరగా ఉంటే... H7N9 తరహా బర్డ్‌ ఫ్లూ, టైప్‌ 2కి దగ్గరగా ఉంటుంది. ఇలా బర్డ్‌ ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలినప్పుడు కూడా ఎవరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చికిత్స విషయంలో అశ్రద్ధ చేయకూడదు అన్న విషయాలు తమ పుట్టినసంవత్సరం ఆధారంగానో, ఫ్లూ వచ్చిన ఏడాదిని బట్టో నిర్ణయించవచ్చు.   - నిర్జర.

దిల్లీ కాలుష్యం నుంచి పారిపోతున్నారు

  ఎక్కడైనా చలికాలంలో పొగమంచు నగరాలను చుట్టుముడుతుంది. సూర్యుడిని చూడగానే మంచు కాస్తా కరిగిపోతుంది. కానీ దిల్లీవాసులను ఏకంగా పొగే చుట్టబెట్టింది. ఎన్ని రోజులు గడిచిన కరగకుండా వారిలో కన్నీటిని నింపుతోంది. ప్రపంచీకరణ తాలూకు కఠిన వాస్తవం ఇది. తప్పించుకోవాలనుకున్నా మార్గం కనిపించని పొగ ఇది. ఇంతకీ ఈ క్షోభ ఎందుకు? దీనికి కారణాలు ఏమిటి అని వెతకడం మొదలుపెడితే...   ఇదీ సమస్య కాలుష్యం కారణంగా వాతావరణంలో పేరుకుపోయే ధూళికణాలను particulate matter (P.M) అంటారు. ఈ P.M కనుక 2.5 మైక్రోమీటర్లకంటే తక్కువగా ఉంటే అది నేరుగా మన ఊపిరితిత్తులలోకి చేరిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఒక క్యూబిక్‌ మీటరులో 25 P.Mకు మించి ఉంటే అది కాలుష్యం కిందకి లెక్కవేస్తారు. అలాంటి దిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఇది 900లకు పైగా నమోదైనట్లు చెబుతున్నారు. ఇవీ కారణాలు     - తమ పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు పంటల అవశేషాలను తగటబెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అయితే ఇది పాక్షిక సత్యం మాత్రమే. దిల్లీలో ఉండే పరిశ్రమలు, వాహనాల వల్ల ఎప్పటికప్పుడు విపరీతంగా కాలుష్యం పేరుకొంటూ ఉంటుంది. అందుకనే వాహనాలు సరి-బేసి నెంబర్ల ఆధారంగా తిరగాలంటూ ఒక ప్రయోగాన్ని కూడా చేసి చూశారు. అయితే ఇంతకు మించి పటిష్టమైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.     - భవంతులు నిర్మించేటప్పుడు ఎక్కువ ధూళి పడకుండా, చెత్తను కాల్చకుండా దిల్లీలో చట్టాలు ఉన్నప్పటికీ ఏడాదికాలంగా వాటిని సరిగా అమలుచేయడం లేదని గణాంకాలు రుజువుచేస్తున్నాయి.   - దీపావళికి టపాసులను కాల్చడంలో కాస్త విచక్షణ పాటించమంటూ పౌరులను ఎంతగా వేడుకొన్నా దీపావళి టపాసుల ఆర్భాటంలో పెద్దగా మార్పులు రాలేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి.   - సాధారణంగా దీపావళి తరువాత కాలంలో దిల్లీలో ఒకటి రెండు వర్షాలు పడతాయి. ఈ వర్షాల వల్ల వాతావరణంలో పేరుకుపోయిన ధూళికణాలు కరిగి నేల మీదకు చేరుకుంటాయి. కానీ ఈసారి వరుణదేవుడు కరుణించనేలేదు. ఫలితంగా తక్కువ గాలి, ఎక్కువ తేమ ఉండే ఈ సమయంలో ధూళికణాలు అలాగే కదలకుండా ఉండిపోయాయి. ఆరోగ్యం మీద తీవ్రప్రభావం     దిల్లీ కాలుష్యంలో జీవించడం అంటే ఇన్ని సిగిరెట్లు తాగినట్లు, అంత పొగను మింగినట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ కాలుష్యంతో ఏం జరుగుతుంది అంటే....   - ఈ ధూళి కణాలు మన ఊపిరితిత్తులలోకి చేరగానే అవి వాపుకి (inflammation) గురవుతాయి. అలా కొన్నాళ్లపాటు ఇవి మన ఊపిరితిత్తులలోకి పదే పదే ప్రవేశిస్తూ ఉంటే ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.   - ధూళి కణాలు కేవలం మన ఊపిరితిత్తులతోనే ఆగిపోవు. అవి నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా అవి మన రక్తనాళాలనీ, గుండెనీ దెబ్బతీస్తాయి. రక్తం ప్రవహించే వేగం, గుండె పనితీరు మందగించడం మొదలవుతుంది.   - శరీరంలోకి ప్రవేశించిన ధూళికణాలు మనలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. పైగా ఇందులో ఉండే హానికారక రసాయనాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఒక పక్క రోగనిరోధక శక్తి క్షీణించడం, మరోవైపు హానికారక రసాయనాలు... ఈ రెండింటి కారణంగా క్యాన్సర్‌ దాడి చేసే ప్రమాదం ఏర్పడుతుంది.   - చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు ఈ కాలుష్యం వల్ల త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.   - మోతాదు మించిన P.M కాలుష్యం మధ్య కాసేపు ఉన్నా... ఆ కాసేపు ధూళికణాలను పీల్చడం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, ఛాతీలో మంట వంటి నానారకాల సమస్యలూ తలెత్తుతాయి.   ఇన్ని మాటలు ఎందుకు! ఒక్కమాటలో చెప్పాలంటే ఒక 300 పరిమితిని దాటిన P.M కాలుష్యం మధ్య తిరగడం అంటే మృత్యువు వైపుగా అడుగులు వేసినట్లే! అందుకే ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం దీనిని నివారించడం ఎలాగా అని తలబాదుకుంటోంది. పవర్‌ ప్లాంటులను మూసేయడం దగ్గర్నుంచీ కృత్రిమ వర్షాలను కురిపించడం వరకూ అన్ని ఉపాయాలనూ పరిశీలిస్తోంది. ఈలోగా దిల్లీ పౌరులు మాస్కులు ధరించడం, ఎయిర్‌ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇక పొట్ట చేత పట్టుకుని రాజధానికి వచ్చినవారు ఈ కాలుష్యాన్ని భరించలేక తమ కుటుంబాలను ఊళ్లకు పంపిస్తున్నారు. మరికొందరు విహారయాత్రల పేరుతో కాలుష్యం నుంచి పారిపోతున్నారు. ఈ దెబ్బతో అయిన కాలుష్యం గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనీ, దిల్లీ ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలనీ కోరుకుందాం. అన్నింటికీ మించి మన హైదరాబాదు, విజయవాడ వంటి రాజధానులు దిల్లీ నుంచి తగిన పాఠాలు నేర్చుకుంటాయని ఆశిద్దాం.   - నిర్జర.

టీవీ చూస్తూ తింటే అనారోగ్యమే

  భోజనం చేసేటప్పుడు టీవీ చూడకూడదనీ, అసలు టీవీ చూస్తూ తినే కార్యక్రమాన్ని పెట్టుకోవద్దనీ నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కుటుంబం అంతా టీవీ చుట్టూ చేరి భోజనాలు చేసే పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అలాంటివారికి హెచ్చరికగా ఇప్పుడు మరో పరిశోధన వెలువడింది...   భోజనాలని రికార్డు చేశారు టీవీ చూస్తూ తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు మినసొటా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకుల ప్రయత్నించారు. ఇందులో భాగంగా 6-12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న ఓ 120 కుటుంబాలని ఎన్నుకొన్నారు. వీరి ఇళ్లలో భోజనాలు జరిగిన తీరుని రికార్డు చేసి అందించమన్నారు. - ఈ 120 కుటుంబాలలో మూడోవంతుమంది భోజనం సమయంలో అసలు టీవీ జోలికి పోలేదు. - నాలుగో వంతు మంది రోజులో ఒక్కసారి మాత్రమే భోజన సమయంలో టీవీ చూస్తూ గడిపారు. - 43 శాతం మంది మాత్రం రెండుపూటలా టీవీ చూస్తూనే భోజనం చేశారు. - టీవీ చూస్తూ తినే కుటుంబాలలో మూడో వంతు మంది టీవీ మోగుతున్నా దానిని గమనించకుండానే భోజనం పూర్తిచేశారు.   ఇవీ ఫలితాలు ఇంట్లో టీవీ మోగకుండా భోజనం చేసినవారు ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు తేలింది. టీవీ వంక చూసినా చూడకపోయినా, అది వెనకాల మోగుతూ ఉన్న ఇళ్లలో తగినంత ఆహారాన్ని తీసుకోవడం లేదని తేలింది. టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్న కుటుంబాలలోని ఆహారంలో కూడా తేడా ఉన్నట్లు గమనించారు. వారి భోజనంలో పండ్లు, కూరలకంటే చిరుతిళ్లే అధికంగా కనిపించాయి. ఫలితంగా ‘టీవీ భోజనం’ అనే కార్యక్రమం సాగించే కుటుంబాలలోని పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది.   కారణాలు ఉన్నాయి టీవీ చూస్తూ భోజనం చేయడానికి, పిల్లల్లో ఊబకాయానికీ సంబంధం ఏమిటి? అనిపించవచ్చు. టీవీ ధ్యాసలో పడితే ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అన్న విచక్షణ ఉండదు. ముఖ్యంగా ఇంకా ఆహారపు అలవాట్ల మీద పట్టు లేని పిల్లలకి దగ్గర ఉండి తగిన సూచనలు అందిస్తూ ఉండాల్సింది పోయి... చిన్నా,పెద్దా టీవీ ధ్యాసలో పడిపోతే అనర్థం తప్పదంటున్నారు. పైగా ఎలాగొలా టీవీ ముందుకి చేరిపోవాలన్న ధ్యాసలో పెద్దవారు కూడా వంట కారక్రమాల జోలికి పోకుండా, బయట నుంచి ఏదో ఒక ఆహారాన్ని తీసుకువస్తున్నట్లు తేలింది. ఫలితంగా పిల్లాపెద్దా అన్న తేడా లేకుండా ఊబకాయం, అజీర్ణం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి.   ఇలా తినాలి భోజనం అంటే ఏదో మొక్కుబడి కార్యక్రమం అన్న చులకన భావం ఉండబట్టే... ఆ సమయంలో కాలక్షేపం కోసం టీవీ చూస్తుంటాం. నిజానికి ఇంట్లోవారంతా కలిసి కూర్చునే ఒక సందర్భంగా భోజన కార్యక్రమం ఉండాలంటున్నారు. మంచీ చెడూ మాట్లాడుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడం, పిల్లల ఆహారపు అలవాట్లను గమనించడం వంటివి ప్రశాంతమైన వాతావరణంలోనే సాధ్యమవుతాయి. అలా కాని పక్షంలో ఏం తినాలి, ఏం తింటున్నాం అన్న విచక్షణ కూడా లేకుండా తిండి అనేది ఓ మొక్కుబడి కార్యక్రమంగా మిగిలిపోతుంది. అది కొన్నాళ్లకి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.   - నిర్జర.

ఇవి తింటే పొట్ట తగ్గడం ఖాయం

అదేంటో! మన పెద్దవాళ్లు అన్నిరకాల ఆహారాన్నీ తీసుకునేవారు. కడుపు మాడ్చుకోకుండా శుభ్రంగా తినేవారు. అయినా వాళ్లు మనలాగా ఊబకాయంతో బాధపడేవారు కాదు. మారిపోయిన జీవనశైలి ఇందుకు కారణం కావచ్చు. కానీ ఆహారం విషయంలో స్పష్టత లేకపోవడం కూడా ఓ ముఖ్య కారణం అంటున్నారు. కొన్ని రకాల ఆహారపదార్థాలతో పొట్టతగ్గడం ఖాయమంటున్నారు. అవి ఇవిగో...   పాల పదార్థాలు పాలకి సంబంధించిన ఏ పదార్థంతో అయినా కొవ్వు ఖాయమనీ, కొవ్వుతో ఊబకాయమూ గ్యారెంటీ అన్నది మన భయం. ఇందులో సగం మాత్రమే వాస్తవం ఉంది. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుందన్న విషయం తెలిసిందే! ఈ కాల్షియం మనలోని కొవ్వు కణాలలోకి చేరి అవి త్వరగా కరిగేలా చేస్తాయని పరిశోధనల్లో తేలింది. పైగా ఇప్పుడు వెన్న తీసిన పాలపదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి, నిర్భయంగా పాలపదార్థాలను తీసుకోవచ్చు.   ఆకుకూరలు ఇప్పటి ఆహారంలో ఆకుకూరలు మాయమైపోయాయి. వీటిని పచ్చిగానో, లేదా ఆవిరి మీద ఉడికించో తింటేనో కావల్సినన్ని పోషకాలు ఎలాగూ లభిస్తాయి. ఇక ఆకుకూరల్లో పీచుపదార్థం, నీరు ఎక్కువగానూ... కేలరీరు తక్కువగానూ ఉంటాయి. అందుకనే మాంసాహారం తినేవారికంటే తరచూ ఆకుకూరలు తినేవారు తక్కువ బరువు ఉంటారని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.   పళ్లరసాలు కాదు పళ్లే! లోటాలకి లోటాలు పళ్లరసాలు తాగి తెగ ఆరోగ్యం వచ్చేసిందని భ్రమిస్తూ ఉంటాము. నిజానికి పళ్లని తినడంలో పదోవంతు లాభం కూడా పళ్ల రసాల వల్ల కలగదు. కారణం! పళ్లని రసంగా మార్చే క్రమంలో వాటిలోని విటమిన్లు, మినరల్స్‌తో పాటుగా ‘phytonutrients’ అనే పోషకాలు కూడా కొట్టుకుపోతాయట. ఇక పీచు పదార్థాలు అయితే అస్సలు మిగలవు. మిగిలేదల్లా గుప్పెడు చక్కెర పదార్థాలే! అందుకే పళ్లరసాల వల్ల ఊబకాయం, డయాబెటిస్ దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   బాదంపప్పులు బాదంపప్పులు తింటే బరువు పెరిగిపోతామన్నది ఇప్పటి తరానికి ఉన్న భయం. ఇది కూడా అర్థసత్యమే అని తేలిపొయింది. బాదంపప్పులలో ఉండే కొవ్వు వల్ల శరీరానికి చెడుకంటే మంచే ఎక్కువ అని తాజా పరిశోధనల్లో తేలింది. బాదం పప్పులలోని ప్రొటీన్ల వల్ల ఆకలి తగ్గి, చిరుతిళ్ల వైపుగా మనసు పోదట. పైగా ఇది మన శరీరంలోని చెడు కొవ్వుని (LDL Cholesterol) తగ్గిస్తుందనీ, పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వుని కూడా కరిగిస్తుదనీ చెబుతున్నారు. మన రోజువారి ఆహారంలో కాస్త బాదంపప్పుని కూడా చేర్చుకోమని సూచిస్తున్నారు.   పొట్టు తీయని ఆహారం గోధుమపిండి ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది, బియ్యం ఎంత తెల్లగా ఉంటే అంత నాణ్యమైనవి... లాంటి అభిప్రాయాలకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చేసింది. తెలుపు, మెత్తదనాల మాయలో పడిపోతే మనకు మిగిలేది పిండే! మన శరీరంలో అధికంగా పేరుకుపోయే ఈ పిండిపదార్థాలే సకలరోగాలకూ కారణం అవుతున్నాయి. కాబట్టి ఆహారపదార్థాలను ఎంచుకొనేటప్పుడు అవి వీలైనంత సహజంగా ఉండేలా చూసుకోవాలి. మర తక్కువ పట్టించిన బియ్యాన్నీ, Whole wheat గోధుమపిండినీ, కాస్త గోధుమరంగులో బరకగా ఉండే పంచదారనీ ఎంచుకోవాలి.     - నిర్జర.