Read more!

బిడ్డల క్షేమం కోసం బరువు తగ్గాల్సిందే

 

ఊబకాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మారిపోతున్న జీవనశైలితోనూ, అదుపులేని ఆహారంతోనూ... ఇప్పుడు ఎవరిని కదిపినా ఊబకాయం గురంచి గంటల తరబడి చెప్పేయగలరు. దాంతో పాటుగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కూడా అందరికీ తెలిసిందే! కానీ గర్భం దాల్చే సమయానికి తల్లి కనుక ఊబకాయంతో బాధపడుతుంటే... అది వారికి పుట్టబోయే పిల్లలను జీవితాంతం వేధిస్తుందని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.

 

ఒకటి కాదు రెండు కాదు

Lancet Diabetes and Endocrinology అనే పత్రికలో ఈ వారం ఏకంగా నాలుగు పత్రాలు ప్రచురితం అయ్యాయి. ఇవన్నీ కూడా జన్మనిచ్చే తల్లి ఊబకాయం వల్ల పిల్లలకు ఎలాంటి హాని ఏర్పడతాయో చర్చించినవే! ఊబకాయం వల్ల తల్లిలో రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపుతప్పే అవకాశం ఉంది. ఇలా అదుపు తప్పిన అనారోగ్యం వలన ఒకోసారి కడుపులోని బిడ్డ ప్రాణానికే హాని ఉంటుందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎలాగొలా బిడ్డ క్షేమంగా బయటపడినా, తరువాత కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బిడ్డ కడుపులో ఉండగా ఆమె మెదడు సరైన రీతిలో ఎదిగేందుకు అనేక పోషకాలు, హార్మోనులూ అవసరం అవుతాయి. తల్లి కనుక ఊబకాయంతో ఉంటే వీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిపోతుందట. ఫలితం! పిల్లవాడిలో ఆటిజం మొదలుకొని పక్షవాతం వరకు... మెదడుకి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

 

ఇది ఒక విషవలయం

అధిక బరువుతో ఉన్న తల్లికి పుట్టే బిడ్డలు కూడా రానురానూ ఊబకాయానికి లోనయ్యే ప్రమాదం ఉందట. దీంతో ఇది ఒక విషవలయంగా మారిపోనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా మరో పది సంవత్సరాలలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడే పరిస్థితి రానున్నదని ఊహిస్తున్నారు. ఇలాంటి వారికి పుట్టే పిల్లలలో ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఎలాంటి సమస్య అయినా తలెత్తవచ్చట.

 

ముందు జాగ్రత్త

పిల్లల్ని కనాలన్న ఆలోచన ఉన్న స్త్రీలు ముందుగా తమ బరువు మీద దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ముందుగా తమ బరువుని తగ్గించుకోవాలి. అవసరమైతే ఇందుకోసం వైద్యుని సలహా సంప్రదింపులను పాటించేందుకు ఏమాత్రం జంకాల్సిన పనిలేదు. గర్భం దాల్చిన తరువాత కూడా ఎప్పటికప్పుడు తమ బరువు, రక్తపోటు, షుగర్‌ నిల్వలు పరిధిలో ఉన్నాయా లేదా అన్నది తరచి చూసుకుంటూ ఉండాలి.

 

పిల్లల అనారోగ్యం మీద తల్లి ఊబకాయమే కాదు, తండ్రి బరువు కూడా ప్రభావం చూపుతుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి తల్లిగా మారాలనుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, తండ్రి కావాలని ఆశపడేవారు కూడా తమ ఆరోగ్యం పట్ల అంతే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

 

- నిర్జర.