ముఖ్యమంత్రి శాసనసభకు డుమ్మా!!!
posted on Dec 16, 2013 @ 10:18AM
శాసనసభలో తెలంగాణా బిల్లును అడ్డుకొంటామని భీకర ప్రతిజ్ఞలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈ రోజు సభలో బిల్లు ప్రవేశ పెడుతున్నకీలక సమయంలో సభకు గైర్హాజరవడం విశేషం. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన సభకు రానప్పటికీ, స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణా బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నివాసంలో జరిగిన భోజన సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఒక ఒప్పందం జరిగిందని తాజా సమాచారం. ఆ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రితో సహా బిల్లుపై ఎవరెన్నివాదనలు చేసినప్పటికీ దానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సకాలంలో దానిని రాష్ట్రపతికి త్రిప్పి పంపేందుకు, అందుకు ప్రతిగా వచ్చేఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు ఇరువురు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. బహుశః ఆ కారణం చేతనే ముఖ్యమంత్రి ఇటువంటి కీలకమయిన సమయంలో సభకు మొహం చాటేసి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి.
అదే నిజమయితే నేడో రేపో ఆయన కూడా సభకు హాజరయి బిల్లుపై గట్టిగా వాదించినప్పటికీ, ముందు ఊహించినట్లుగా తన పదవికి రాజీనామా చేయకపోవచ్చును. ఆది నుండి ప్రతి అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది గనుక, ఆయన వ్యవహారంపై కూడా సస్పెన్స్ అనివార్యమయింది. కానీ, ఇప్పుడు కధ క్లైమాక్స్ కు చేరుకొంది గనుక త్వరలోనే ఆ సస్పెన్స్ కూడా విడిపోతుంది.
ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? లేకపోతే ఎన్నికల వరకు తన పదవిలోనే కొనసాగుతారా? లేక రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారా లేదా? అసలు ఆయన నిజంగానే సమైక్యవాదా లేక రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్ననాటకంలో తన పాత్ర పోషిస్తున్నారా? వంటి ధర్మసందేహాలకు సమాధానాలు త్వరలోనే దొరకవచ్చును.
ఒకవేళ ఆయన తన ముఖ్యమంత్రి పదవికి అంటి పెట్టుకొని ఉంటే ఆయన అధిష్టానం ఆదేశాలను అక్షరాల అమలు చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన బిల్లు అన్ని అడ్డంకులను అధిగమించి శాసనసభ గడప దాటిపోయిన తరువాత కూడా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సమైక్యవాదం గురించి ఎంత గొంతు చించుకొని అరిచినా అది ప్రజలను మభ్యపెట్టడానికే తప్పదానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.