పాపం జగన్
posted on Dec 15, 2013 @ 11:31AM
రాష్ట్రంలో దాదాపు అందరు కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని భావిస్తున్నారు. ఈవిషయాన్ని సీమంధ్రలో నేతలు బహిరంగంగా ప్రకటిస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతలు మాత్రం అంతరంగిక సంభాషణలలో అంగీకరిస్తున్నారు. అయితే వాటిని వైకాపా నేతలు ఎంత ఖండిస్తున్నపటికీ ప్రజలు కూడా అనుమానిస్తూనే ఉన్నారు. వారి అనుమానాలు నిజమని నిరూపిస్తూ మొన్నమీడియా సమావేశంలో సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ “జగన్మోహన్ రెడ్డిది తమ కాంగ్రెస్ డీ.యన్.యే.నే అని గతంలో అన్న మాటకు నేటికీ తాను కట్టుబడి ఉన్నానని, కాదని జగన్మోహన్ రెడ్డి అనగలడా? ఆయననే అడగండని” మీడియాతో అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ జగన్ గురించి ఈవిధమయిన అభిప్రాయం వ్యక్తం చేయడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న డీ.యన్.యే. అనుబందాన్ని ద్రువీకరిస్తోంది.
అందుకు జగన్ తీవ్రంగా స్పందిస్తూ ‘ఆమాట అన్న దిగ్విజయ్ చెంప మీద కొట్టాలి’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుంటే తాను దానిని కలిపి ఉంచాలని పోరాడుతున్నాని, అటువంటప్పుడు తమకీ వారికీ ఏవిధంగా అక్రమ సంబంధం అంటగడతారని ఆయన ప్రశ్నించారు. అయితే మరి దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా ఎందుకు అన్నట్లు? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా లగడపాటి, దివాకర్ రెడ్డి తదితరులు అందరూ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానానికి దత్తపుత్రుడని ఎందుకు అభివర్ణిస్తున్నట్లు?
జగన్మోహన్ రెడ్డి, ఆయన వైకాపా నేతలు తమకు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదని ఎంత గట్టిగా వాదిస్తుంటే, నానాటికీ ప్రజలలో మరింత అనుమానం పెరుగోతోందే తప్ప తరగడం లేదు. ఆ అనుమానాలను దిగ్విజయ్ వంటి వారు అప్పుడప్పుడు ద్రువీకరిస్తుండటంతో ప్రజలకు ఏవిధంగా సర్ది చెప్పుకోవాలో జగన్ కి అర్ధం కావడం లేదు పాపం.