నాటు సారాను అరికట్టాలి కలెక్టర్లకు... సీఎం చంద్రబాబు సూచన
posted on Dec 18, 2025 @ 6:44PM
అమరావతిలో రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. ముగింపు ఉపన్యాసంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరీకరణ, పీపీపీ విధానాలు, విద్యుత్ రంగం, పాలనలో సంస్కరణలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురాగలిగామని, రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యుత్ రంగంపై మాట్లాడుతూ యూనిట్‌కు రూ.1.20 మేర కొనుగోలు ధర తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పీపీఏల రద్దుతో గతంలో విద్యుత్ వ్యవస్థ నాశనం అయ్యిందని, డిస్కంలు–ట్రాన్స్‌కోలపై రూ.1,25,633 కోట్ల భారం పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రుణ నిర్వహణను సమర్థంగా చేపట్టి, అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను రీషెడ్యూలింగ్ చేస్తున్నామని తెలిపారు.
పీపీపీ వైద్య కళాశాలల అంశంపై సీఎం ఘాటుగా స్పందించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ విధానంలో చేపట్టే ప్రాజెక్టులు ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయని, నిబంధనలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రైవేటు సంస్థలు నిర్వాహకులుగా మాత్రమే ఉంటాయని, సీట్లు పెరుగుతాయే తప్ప ఫీజులు పెరగవని భరోసా ఇచ్చారు. 70 శాతం వరకు ఎన్టీఆర్ వైద్యసేవల కింద ఉచిత చికిత్స అందుతుందని, పీపీపీ మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధమవుతాయని అన్నారు. ఈ విషయంలో బెదిరింపులు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.
పాలన, శాంతిభద్రతలపై మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లో నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులను సహించవద్దని స్పష్టం చేశారు. నేరాల దర్యాప్తులో వేగం పెంచాలని సూచించారు. పాలనలో డిజిటలీకరణపై సీఎం కీలక ప్రకటన చేశారు. జనవరి 15 నుంచి అన్ని శాఖల ఫైళ్లు, ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు.
ఇప్పటివరకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, ఇకపై ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఎస్క్రో ఖాతా విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణం, నేరాల రేటును తగ్గించగలిగామని, నాటు సారా నియంత్రణకు తీసుకొచ్చిన ‘మార్పు’ ప్రాజెక్టు రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. సారా తయారీదారులకు పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.
తిరుమల ప్రసాదంలో నాణ్యతను పునరుద్ధరించామని, అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రం 18 నెలల్లోనే రికవరీ అవుతుందని, పునర్నిర్మాణం సాధ్యమవుతుందని తాను కూడా ఊహించలేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నింటికంటే ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అత్యంత విజయవంతంగా జరిగిందని ప్రశంసించారు.