కడప ఐటీ పార్క్‌కు పది ఎకరాల స్థలం గుర్తింపు : ఎమ్మెల్యే మాధవి రెడ్డి
posted on Oct 29, 2025 @ 7:31PM
కడప జిల్లాలో మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నామని,ఇది ఏర్పాటైతే ఉపాధి కల్పన ప్రయత్నాలు ఊపందుకుంటాయని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ,ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి సమాన ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె అన్నారు.
కడప, బెంగళూరుకు దగ్గరగా ఉందని, కడప జిల్లా నుండి అనేక మంది అర్హత కలిగిన యువతీ యువకులు కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో వలస వెళ్లి పనిచేస్తున్నారని, అయితే ఇక్కడ ఐటీ పార్క్‌ను స్థాపించడం ద్వారా ప్రభుత్వం స్థానిక వలసలను నిరోధించడానికి, ప్రతిభ కలిగిన యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నిస్తోందని ఆమె పేర్కొన్నారు.
కడపలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో 10 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించిందని, త్వరలోనే ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి)కి అప్పగించనున్నట్లు ఆమె తెలిపారు.
కడపలో ఐటీ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో మేము ఆసక్తిగా ఉన్నామన్నారు .ప్రతి నియోజకవర్గంలో ఎంయస్‌ఎం ఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా,జిల్లా యంత్రాంగం అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడం ప్రారంభించిందని ఆమె అన్నారు.