ప్రయాణికులకు పోలీసు సిబ్బంది మానవతా సహాయం
posted on Oct 29, 2025 @ 6:03PM
వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి , రూరల్ సీఐ సరవయ్య , డోర్నకల్ సీఐ చంద్రమౌళి మరియు సిబ్బంది, ఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లు రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలులోని ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేశారు. రైలు ఆలస్యం అయినప్పటికీ, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసు సిబ్బంది సకాలంలో సహాయం అందించి మానవతా దృక్పథంతో సాయం చేశారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... మహబూబాబాద్ పోలీస్ ఎప్పుడూ ప్రజలతో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా సహాయం అవసరమైతే ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం పోలీసుల ప్రధాన ధ్యేయమని, వర్షం వంటి విపత్తు సమయంలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో స్పందించి భారీ వర్షాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు సహాయం చేస్తున్న మహబూబాద్ జిల్లా పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఆపదలో ఆదుకున్న పోలీస్ సిబ్బంది కృషిని ప్రశంసించారు.