భద్రాచలానికి 50 కి.మీల దూరంలో మొంథా తుఫాన్
posted on Oct 29, 2025 @ 7:58PM
మొంథా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. భద్రాచలానికి దక్షిణ ఆగ్నేయంగా 50 కి.మీల దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశముందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయుగుండం కదలిందని పేర్కొంది. రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. పలు ప్రాంతాల్లో 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు హనుమకొండ, వరంగల్, మహబూబ్ బాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.