Read more!

కాస్త ఆలోచించుకోండి!

సాధారణంగా చాలామంది ఈకాలంలో ఆన్లైన్ షాపింగ్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఆన్లైన్ షాపింగ్ డెలివరీ సేవలు పల్లెపల్లెకు విస్తరించడంతో పట్టణాల నుండి మాత్రమే కాకుండా పల్లెల నుండి షాపింగ్ చేసేవారే ఎక్కువయ్యరు. ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లు ఇచ్చే ఆఫర్ లు, కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇచ్చే డిస్కౌంట్ లు, ఓ నిర్ణీత ధరకు షాపింగ్ చేయడం వల్ల ఫ్రీ డెలివరీ ఇవ్వడం వంటి కారణాల వల్ల వీటిలో సందడి బాగానే ఉంటుంది. 

టౌన్స్ లో సూపర్ మార్కెట్లు, డీ మార్ట్ లు, రిలయన్స్ మార్ట్ మొదలైనవి ఉండటం వల్ల కొన్ని అవసరమైనవి బయటకెళ్లి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ పల్లెల్లో నివసించేవాళ్లకు సీన్ రివర్స్ లో ఉంటుంది. లోకల్ వస్తువుల లిస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పటి ఇంటి అవసరాలకు ఉపయోగపడే వస్తువుల నుండి, ఫుడ్ ఐటమ్స్ వరకు లోకల్ లో దొరకడం కష్టమే. ఇలాంటి వాటిని పాయింట్ చేసుకుని ఆన్లైన్ అమ్మకాల జోరు పెరిగింది. దుస్తులు, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, చెప్పులు లాంటివి అన్ని ఆన్లైన్ లో దొరికేస్తున్నాయి.

అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ మాయలో పడి సాధారణం కంటే ఎక్కువ ఖర్చులు చేసేస్తున్నారు అందరూ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి?? ఆన్లైన్ షాపింగ్ ను  ఎలా చేయడం వల్ల మంచిది?

ఆఫర్స్ చూసి ఎగబడద్దు!

చాలామంది ఆఫర్స్ చూశారంటే చాలా తొందరపడతారు. స్టాక్ అయిపోతే కొంప కొల్లేరు అయిపోతుందేమో అన్నంత ఫీలవుతారు. అందుకే తొందరగా కార్ట్ లో వేయడం, వెంటనే ఆర్డర్ పెట్టేయడం చేస్తారు. పూర్తి డెలివరీ అయిన తరువాత వచ్చిన ఐటమ్స్ చూసి ఏడుపెత్తుకుంటారు. కొంతమంది ఏమవుతుందిలే రిటర్న్ చేసేయచ్చు అనే తెలివి ఉపయోగిస్తారు అయితే అక్కడే పప్పులో కాలువేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ కు రిటర్న్ పాలసీ ఉండదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.

టచ్ చేయద్దు!

చాలామంది డిస్కౌంట్ చూశారంటే డమాల్ అయిపోతారు. అబ్బాబ్బా ఎంత ఖరీదైన వస్తువు ఎంత తక్కువ ధరకు వస్తుంది అని తెగ ఖుషీ అయిపోతారు. ఆ వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా తక్కువ ధరకు ఇస్తున్నాడంటే అందులో ఉన్న ఇన్నర్ పార్ట్శ్ నకిలివి కావచ్చు. ఇలాంటి ఫ్రాడ్ లకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాధ్యత వహించదు. కాబట్టి అవగాహన రిటర్నబుల్  పాలసీ ఉంటే తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలు కొనద్దు.

అనవసరంగా కొనద్దు!

కొందరికి ఆఫర్లు, డిస్కౌంట్ చూసి అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనాలనిపిస్తుంది. అలా కొనడం వల్ల ఆ వస్తువును ఎప్పుడు వాడతారో ఆ దేవుడికే తెలియాలి. చాలామంది ఇళ్లలో ఇలాంటి స్టఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటి కోసం పెట్టె ఖర్చుతో కొన్ని ఇంటి అవసరాలు తీరవచ్చు. కాబట్టి మధ్యతరగతి, దిగువ తరగతి వారు ఇలాంటి ఆఫర్ల మాయలో పడి డబ్బు వేస్ట్ చేసుకోకండి.

స్పెషల్ డేస్!

పండుగలకు ముందు, ఆయా షాపింగ్ వారి యనివర్సరీ రోజుల్లో మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో కావలసిన వస్తువులను రిటర్న్ పాలసీ చూసి కొనుగోలు చేయవచ్చు. వస్తువు బాగుంటే ఉంచుకుంటాం. లేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు. 

కొందరు అనుకుంటారు. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు అని. ఎక్కువగా అమ్ముడుపోతుంటే వాటిని తయారుచేసే వారికి తయారీ సరుకు కొనుగోలుకు కూడా ధర తక్కువగా పడుతుంది. కిలో మామిడిపళ్ళు కొనేవాడు ఏకంగా బుట్ట పళ్ళు కొంటె వాడికి ఒక్కొక్క పండు తక్కువ ధరకు వస్తుంది. అదే విధంగా ఈ ఆన్లైన్ మార్కెట్లలో కూడా వస్తువుల ఉత్పత్తుల విషయంలో జరుగుతుంది. కాబట్టే తక్కువ ధరకు అమ్మకానికి పెడతారు. ఇలాటి ఆఫర్ల సమయంలో మరీ అంత నాణ్యమైనవి కాకపోయినా పెడుతున్న ఖర్చుకు సాటిసిఫై అయ్యేలా ఉండే వస్తువులను పొందడం మాత్రం తప్పనిసరి.

ఏది ఏమైనా ఆన్లైన్ షాపింగ్ విషయంలో మరీ అంత దూకుడుగా ఉండొద్దు. 


                               ◆ వెంకటేష్ పువ్వాడ.