Read more!

కజిన్స్ కోసం ఉందోక రోజు!

ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఫాథర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వాలెంటైన్స్ డే లాగా నేషనల్ కజిన్స్ డే అని ఒకటి ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు, ఎక్కువ శాతం మంది పట్టించుకోరు కూడా. అయితే కజిన్స్ అనగానే అందరిలో ఒకానొక ఎమోషన్ చోటుచేసుకుంటుంది. ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా తోబుట్టువుల కంటే స్ట్రాంగ్ బాండ్ కజిన్స్ తో ఉంటుంది ఎక్కువ శాతం మందికి. కజిన్స్ లో 90% మంది చిన్నతనంలో కలసి పెరిగినవాళ్ళు అయి ఉండటం వల్ల ఎన్నో చిన్నతనపు జ్ఞాపకాలు, తుంటరి పనులు, గొడవలు, ప్రేమలు ఉంటాయి కజిన్స్ మధ్య. 

కాలం గడుస్తూ ఉంటే తల్లిదండ్రుల వృత్తులు, పోటీ ప్రపంచంలో చదువుల కోసం పరుగులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు మొదలైన కారణాల వల్ల కజిన్స్ దూరదూరంగా వెళ్ళిపోతారు. అయితే కాలం మారినా తాము ఏమీ మారలేదు అనే విషయం అపుడపుడు కలవడం వల్ల తెలుస్తూ ఉంటుంది. మరికొందరు కాలంతో పాటు మార్పుకు లోనవుతారు కూడా. ఏదేమైనా కజిన్స్ అంటే కొట్టుకోవడంలోనూ, వెనక నిలబడి సపోర్ట్ గా ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.

ప్రతి సంవత్సరం జులై నెల 24 వ తారీఖున నేషనల్ కజిన్స్ డే జరుపుకుంటున్న సందర్బంగా ఈసారి మీరు మీ కజిన్స్ ను కాస్త సర్ప్రైజ్ చేయడం, కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవడం చేస్తే చిన్ననాటి బంధమయినా, పెద్దల మధ్య అనుబంధమైనా ఇంకా గట్టిపడుతుంది.

సడెన్ సర్ప్రైజ్!

చెప్పకుండా కజిన్స్ దగ్గరకు వెళ్లడం, వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తడం అద్భుతంగా ఉంటుంది. నిజానికి పెద్దయ్యాక చదువులు, ఉద్యోగాల వల్ల దూరంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఏదోలా కలిసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. కానీ పెళ్లిళ్లు అయినవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి తరువాత ఒక సెపరేట్ ప్రపంచం ఏర్పడుతుంది. భర్త, భర్త వైపు చుట్టాలు, అత్త, మామ. ఇంకా పిల్లలు వీళ్ళందరి ప్రపంచంలో అమ్మాయిలు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం వల్ల కజిన్స్ ను, ఫ్రెండ్స్ ను కలవాలని ఉన్నా కలవడానికి తగినంత సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఒక చిన్న స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. చెప్పకుండా వెళ్లి కలిస్తే.

బహుమతులు ఇవ్వడం!

బహుమతులు చిన్నవో, పెద్దవో అనేది లెక్క కాదు. కానీ అవి ఎంత ప్రేమగా ఇస్తున్నాం అనేది ముఖ్యం. చిన్నతనంలో ఇష్టపడి ఆర్థిక పరిస్థితి వల్ల లేక పిల్లల మధ్య ఉన్న కాంపిటేషన్ వల్ల కొన్ని చేజారిపోయి ఉంటాయి. స్కూల్, కాలేజి, పోటీలలో గెలిచిన ప్రైజెస్, చిన్నప్పటి అరుదైన ఫోటోలు వంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల చాలా సంతోషిస్తారు.

ఆత్మీయ కలయిక!

కజిన్స్ డే సందర్బంగా అందరూ కలసి ఆత్మీయంగా కలవడం చాలా బాగుంటుంది. కుదిరితే ఫ్యామిలీ తో సహా కలవడం పెద్ద పండగలాగే ఉంటుంది. ఇప్పటి వేగవంతమైన కాలంలో పిల్లలకు ఇలా రిలేషన్స్ గురించి నేరుగా అర్థం చేసుకున్న అనుభూతి కలుగుతుంది. జీవిత భాగస్వాములు పక్కన ఉంటే కొంతమంది తాము ఉండాల్సినంత ఫ్రీగా, కజిన్స్ తో క్లోజ్ గా ఉండలేకపోవచ్చు కాబట్టి ఆరోగ్యవంతమైన రిలేషన్స్ చాలా ముఖ్యం.

అమ్మానాన్నలతో చెప్పుకోలేని పరీక్షల మార్కుల విషయాల నుండి, జీవితంలో స్పెషల్ గా భావించే ప్రేమ సంగతులు, గొడవలు, అల్లర్లు, అప్పులు వంటి ఎన్నో విషయాలలో స్నేహపూర్వకంగా ఉంటూనే బాధ్యతగా సపోర్ట్ ఇచ్చే కజిన్స్ పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కాబట్టి కజిన్స్ ను సంతోషపెట్టండి ఎంతో కొంత వీలైనంత. వారి నుండి తిరిగి మీరు పొందే ప్రేమ మాత్రం విలువ కట్టలేనంత ఆనందాన్ని కలిగించడం ఖాయం.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.