జాగ్రత్త అమ్మాయిలను ఎప్పుడూ ఈ 7 ప్రశ్నలు అడగకండి..!
posted on Dec 17, 2025 @ 10:56AM
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది. కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము. ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే..
శరీరం గురించి..
అమ్మాయిలు లావుగా ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది. ఇది పైకి కనిపించే విషయమే. ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి, బరువు గురించి అస్సలు అడగకూడదు. ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ షేమింగ్ చేయడం కిందకు వస్తుంది. ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు.
పిల్లలు..
పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి. కొత్తగా పెళ్లైన దగ్గర నుండి పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు. పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం. అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది.
వివాహం..
వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం అనేది మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా. దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది.
వృత్తి..
మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది. పెళ్లి అయిన తరువాత పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం. వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు.
సమయం..
చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని. ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి. మహిళలు కుటుంబాన్ని, తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ, వారి తొందర గురించి కానీ అలా అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది.
సోషల్ మీడియా..
సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు అనేకం. చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం, అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది. దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు.
డ్రస్సింగ్..
ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది. కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు. ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం, కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు.
పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించినవి. వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.
*రూపశ్రీ.