భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..!
posted on Dec 20, 2025 @ 4:20PM
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే. ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. అంతే కాదు.. ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కూడా. ఇద్దరు వ్యక్తులను అన్ని పరిస్థితులలో నిలిపి ఉంచేది ప్రేమ మాత్రమే. అయితే బార్యాభర్తల బందంలో చాలా మంది ప్రేమ లేదని అంటూ ఉంటారు. కొందరేమో ప్రేమ లేకపోయినా కేవలం బందం కోసం ఒక యంత్రంలా బ్రతికేస్తుంటారు. అలా ఉన్న బంధాలలో జీవం ఉండదు. భార్యాభర్తల బందంలో ప్రేమ ఉన్నప్పుడు అది చాలా కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. అయితే భార్యాభర్తల బందాన్ని బలంగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఇద్దరి మధ్య ప్రేమను పెంచి ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
నిజాయితీగా ఉండాలి..
నిజాయితీ అనేది సంబంధానికి బలమైన పునాది. చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నిజం చెప్పాలి. లైప్ పార్ట్నర్ ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి. నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది, ప్రేమను మరింత పెంచుతుంది.
ప్రేమ.. మాటల్లో కాదు చేతల్లో..
చాలామంది మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది చేతల్లో చూపించాలి. ఒకరికొకరు సమయం కేటాయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, చిన్న చిన్న విషయాలలో కూడా కేరింగ్ గా ఉండటం వంటివి ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది.
చిన్న సంతోషాలు..
ప్రేమను, సంతోషాన్ని పంచుకోవడానికి పెద్ద పెద్ద విజయాలు, పెద్ద సమయాలు, పెద్ద ప్లానింగ్ లు అవసరం లేదు. చిన్న చిన్న సందర్భాలను కూడా ఇద్దరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అభిరుచులను షేర్ చేసుకోవడం, చిన్న సర్‌ప్రైజ్ లు, చిన్న బహుమతులు లాంటివి ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా మారుస్తాయి.
కమ్యూనికేషన్..
నేటి కాలంలో సంబంధాలలో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే చాలా పెద్ద గొడవలకు కారణం అవుతోంది. ఆనందాలు, బాధలు, సమస్యలు, సంతోషకరమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ విషయాన్ని అయినా ఆరో్గ్యకరంగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి బంధం ఉంటుంది.
ఇగో..
బందాలను దెబ్బ తీసే అతిపెద్ద శత్రువు ఇగో.. చిన్న కోపతాపాలు లేదా కోపంలో మాట్లాడే మాటలు కూడా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవలు జరిగినా ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం నేర్చుకున్నప్పుడే బంధం నిలబడుతుంది. ఇగోను పక్కన పెట్టినప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు.
*రూపశ్రీ.