ఎవరిది అగ్రికల్చరో... ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి : సీఎం రేవంత్

 

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ 100 శాతం గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీల మధ్య ఫెవికాల్‌ బంధం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ ఎందుకు చేయలేని రేవంత్ ప్రశ్నించారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేని ఆరోపించారు.. మరో కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్‌ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం అన్నారు. 

శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదని రేవంత్ విమర్శించారు. సొంత చెల్లి కవితను , మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని రేవంత్ అన్నారు. సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకుంటాడా? అనిప్రశ్నించారు. 

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్ రెడ్డి.. గుజరాత్ కు గులాంగిరీ చేస్తూ.. తనపై ఒంటికాలిపై లేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఎగిరితే ఏమీ రాదని, ఏమన్నా ఉంటే ప్రధాని మోదీ దగ్గర మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో  ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు,  రేషన్ కార్డులు, సన్నబియ్యం ,రూ.500కే గ్యాస్ సిలిండర్, సంక్షేమ పధకాలను అమలు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన  రాష్ట్రంగా తెలంగాణను నిలిచిందని తెలిపారు. కులగణన చేశామని సీఎం అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు ఇచ్చామని. మరో 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశామని సీఎం అన్నారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండిని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
 

రెండేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి

రెండేళ్ల బాలికను అపహరించి, ఆపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దౌపది ముర్ము తిరిస్కరించారు. ఆమె దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరస్కరణకు గురైన వాటిలో ఇది మూడో క్షమాభిక్ష పిటిషన్‌గా నిలిచింది. మహారాష్ట్ర జల్నా నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో.. 2012లో అశోక్ ఘుమారేఅనే వ్యక్తి రెండేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని ప్రలోభపెట్టి కిడ్నాప్‌ చేశాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చివరకు ఆ పసికందును హతమార్చాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు.. నిందితుడైన అశోక్‌కు మరణ శిక్ష విధిస్తూ 2015 సెప్టెంబర్ 15 తీర్పునిచ్చింది. దీనిని 2016 జనవరిలో బాంబే హైకోర్టుసమర్థించింది. ఆ తర్వాత.. సుప్రీంలో ఈ కేసు విచారణకు రాగా 2019 అక్టోబర్ 03న అతడిమరణ శిక్షను ధృవీకరిస్తూ.. నిందితుడు తన లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం సామాజిక, చట్టపరమైన నిబంధలను ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ విషయమై అశోక్ ఘుమారే.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నారు.  అయితే ఆ పిటిషన్‌ను దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తిరస్కరించారని అధికారులు తెలిపారు. దీంతో నిందితునికి మరణశిక్ష ఖాయమైనట్టైంది.

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు!?

గత రెండు  దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో  కేంద్రం  కొత్త చట్టాన్ని తీసుకురానుంది.  ఈ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)  బిల్లు, 2025 ను లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది.  వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలను తీర్చిదిద్దడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.  ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పటికీ, దాని అమలులో పలు లోపాలు ఉన్నాయనీ, ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు, పెట్టిన ఖర్చుకు పొంతన లేకపోవడం వంటి  లోపాల కారణంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకంగా,  కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం చెబుతోంది.   ప్రస్తుత ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పిస్తుండగా, కొత్త బిల్లులో దీనిని 125 రోజులకు పెంచారు.   అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం ( ప్రకారం, నైపుణ్యం లేని కార్మికుల వేతనాల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. పనులకు అవసరమైన సామగ్రి ఖర్చులో 75 శాతం, నైపుణ్యం కలిగిన, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాల్లో 75శాతం కూడా కేంద్రమే భరిస్తున్నది. అయితే ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త బిల్లులో  ఈ విషయంలోనూ మార్పులు తీసుకురానుంది.   సాధారణ రాష్ట్రాల్లో కూలీల వేతనాల చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తి ప్రత్యేక కేటగిరీ ప్రాంతాలకు ఇది 90:10గా ఉంటుంది. నిరుద్యోగ భృతి  రాష్ట్రాలే చెల్లించాల్సి ఉంటుంది  మొత్తంగా కేంద్రం   గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పాదక ఆస్తులను సృష్టించడం, వలసలను తగ్గించడం వంటి లక్ష్యాలతో  కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు చెబుతోంది.  

మెక్సికోలో కుప్పకూలిన విమానం.. పది మంది దుర్మరణం

మెక్సికోలో  జరిగిన విమాన ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ చిన్న విమానం మెక్సికో ఎయిర్ పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పది మందీ దుర్మరణం పాలయ్యారు. విమానం కూలిపోగానే మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పోగకమ్ముకుంది.  విమానం క్రాష్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  మెక్సికోకి 50కిలోమీటర్ల దూరంలోని టోలుకా ఎయిర్‌పోర్టు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఒక చిన్న ప్రైవేట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఓ భవనాన్ని ఢీకొని కూలిపోయింది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ ప్రైవేటు జెట్ లో ప్రమాద సమయంలో ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.   ప్రమాదం ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.   ఈ విమాన ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. 

బీబీసీపై 90 వేల కోట్టకు ట్రంప్ పరువునష్టం దావా..

ప్రఖ్యాత మీడియా సంస్థ  బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి.. తాను చెప్పని మాటలను మాట్లాడినట్లుగా బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించిన ట్రంప్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. బీబీసీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, ఇది జర్నలిజం విలువలకు  విఘాతమనిపేర్కొన్న ట్రంప్ బీబీసీపై 90 వేల కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు.  తాను ఎన్నడూ అనని  ఎ  మాటలను ఏఐ వినియోగించి.. తన నోట పలికినట్లు వినిపించి, చూపించారని తీవ్ర ఆరోపణలు చేశారు.  జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి, తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు. బీబీసీ ఫేక్ న్యూస్ ప్రసారం చేసిందన్న ట్రంప్.. ఈ దావా వేశారు. 

అవినీతి కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ

అద్భుత క్రికెటర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అవినీతి కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు. 1996లో శ్రీలంక వరల్డ్ కప్ విజయంలో రణతుంగది కీలక పాత్ర. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు  కెప్టెన్  అయిన రణతుంగ  క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు.  రణతుంగ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలపైనే ఆయనపై కేసు నమోదైంది. అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రణతుంగ స్వదేశానికి తిరిగి రాగానే అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.   కేసు వివరాల్లోకి వెడితే 2017లో రణతుంగ పెట్రోలియం మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో దీర్ఘకాలిక చమురు కొనుగోలు ఒప్పందాల నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరకు స్పాట్ పద్ధతిలో  కొనుగోళ్లు జరిపారనీ, దీనితో  ప్రభుత్వానికి దాదాపు  23.5 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ తేల్చింది.ఈ కేసులో ఇప్పటికే రణతుంగ సోదరుడు ధమ్మికను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు.   

ఉసురు తీసిన పొగమంచు

ఒకదాని వెనుక ఒకటిగా వాహనాలు ఢీ కొనినలుగురు మృతి పొగమంచు కమ్మేయడంతో విజిబులిటీ తగ్గిపోయి ఢిల్లీ-ఆగ్రారోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. దారి కనిపించక పదుల సంఖ్యలో వాహనాలు  ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.   దుర్ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో పాతిక మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.   మథుర జిల్లా పరిధిలోని ఆగ్రా-నోయిడా మార్గంలో మంగళవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ఒకదాని వెనుక ఒకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

తెలుగు వారికి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఆయన : సీఎం చంద్రబాబు

  తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా 'డే ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల దినం)గా  నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు  ప్రకటించారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మిస్తామని వెల్లడించారు.  సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం, ఆ తరువాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని ముఖ్యమంత్రి అన్నారు.  పాలకుల వివక్షకు గురైన తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన త్యాగ ఫలితంగానే 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. కొందరు ఈ తేదీలపై అనవసర రాజకీయాలు చేస్తున్నందునే, ఆయన ఆత్మార్పణ చేసిన రోజునే త్యాగాలకు గుర్తుగా నిర్వహించాలని నిర్ణయించాం” అని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాములు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, గుండె చప్పుడు అని ఆయన కొనియాడారు.  

ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు

  ఏపీ మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌కి బెయిల్‌ ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో సంజయ్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయాల్లో ఆయన ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మాత్రం ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా ఐపీఎస్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం సంజయ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది.

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు

  పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఈ-తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్  ఉగ్రసంస్థతో పాటు మరో ఆరుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ కుట్ర, నిందితుల పాత్రలు, ఆధారాలతో కూడిన ఈ ఛార్జిషీట్‌లో నిషేధిత ఉగ్రసంస్థను ఒక చట్టబద్ధ సంస్థగా గుర్తించి, పహల్గామ్ దాడిని ప్రణాళికాబద్ధంగా రూపొందిం చడం, సహకరిం చడం, అమలు చేయడంలో వారి పాత్ర ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.  పాక్ మద్దతు తో జరిగిన ఈ ఉగ్రదాడిలో మత ఆధారిత లక్ష్య హత్యలు చోటు చేసుకోగా, 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పో యారు.1,597 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్‌ను జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఇందులో పాకిస్థాన్ హ్యాండ్లర్ ఉగ్రవాది సజీద్ జట్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. అలాగే, 2025 జూలైలో శ్రీనగర్‌లోని డాచిగాం ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పొందుపరి చారు.  వారు ఫైసల్ జట్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. తో పాటు పై నలుగురు ఉగ్రవాదులపై భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం–1959, అక్రమ కార్య కలాపాల నివారణ చట్టం 1967 కింద అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా, భారత్‌పై యుద్ధం ప్రకటించిన నేరం కింద కూడా శిక్షార్హ సెక్షన్లను ఎన్‌ఐఏ ప్రయోగించింది. గత దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన శాస్త్రీయ, సుదీర్ఘ దర్యాప్తులో కేసులోని ఉగ్ర కుట్ర పాకిస్థాన్ నుంచే రూపుదిద్దుకున్నదని ఎన్‌ఐఏ తేల్చింది.  భారత్‌పై నిరంతరం ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది.ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై 2025 జూన్ 22న అరెస్టయిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జొథాత్ద్‌లపై కూడా ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో వారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఆయుధధారుల వివరాలు వెల్లడించడంతో పాటు, వారు నిషేధిత  ఉగ్రసంస్థకు చెందిన పాకిస్థాన్ పౌరులేనని నిర్ధా రించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.

కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

  సీఎం చంద్రబాబు  హైదరాబాద్ నగర శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కన్హా ధ్యానమందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు. కన్హాశాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాలను గురించి సీఎంకు దాజీ వివరించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా  చంద్రబాబు సందర్శించారు. ధ్యాన మందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన, సామర్థ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాజీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతోన్న సేవలు, నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు.