మెక్సికోలో కుప్పకూలిన విమానం.. పది మంది దుర్మరణం
posted on Dec 16, 2025 @ 9:47AM
మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ చిన్న విమానం మెక్సికో ఎయిర్ పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పది మందీ దుర్మరణం పాలయ్యారు. విమానం కూలిపోగానే మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పోగకమ్ముకుంది. విమానం క్రాష్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మెక్సికోకి 50కిలోమీటర్ల దూరంలోని టోలుకా ఎయిర్‌పోర్టు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఒక చిన్న ప్రైవేట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఓ భవనాన్ని ఢీకొని కూలిపోయింది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ ప్రైవేటు జెట్ లో ప్రమాద సమయంలో ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమాన ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.