రావు నన్ను నిందించినా, ఎంత నీచంగా నన్ను గురించి ఊహించుకున్నా ఆనందంతో గంతులు వేసింది మనసు. నాకు నాట్యం రాదు కాని అప్పటికప్పుడు గజ్జెలు కట్టుకుని నాట్యం చెయ్యాలని పించింది. నేనే కోరినా రావు నాకు విడాకు లివ్వలేదు! ఇవ్వడు! నా రావు ఇన్నాళ్ళకు నా రచన మెచ్చుకున్నాడు!
43
లతీఫ్ నా దగ్గిరకు వచ్చాడు.
"శారదా! నువ్వు రావును విడాకులెందుకడిగావు?"
"నీ కెలా తెలిసింది?"
"రావు చెప్పాడు."
"ఏమని చెప్పాడు?"
లతీఫ్ ముఖం ఎర్రబడ్డది. ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాలు ఆగి, "ఎందుకు చేశావు ఇలాంటి పని?" అన్నాడు మళ్ళీ.
"రావు ఏమన్నాడు?"
నా ప్రశ్న రెట్టించాను.
లతీఫ్ తన రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు.
"చెప్పమంటావా? నీకు కష్టం కలుగుతుంది."
"వినాలని ఉంది."
"అయితే విను. చాలా రోజుల తరవాత వచ్చాడు రావు నా దగ్గిరకి! నా రెండు చేతులూ పట్టుకుని, 'ఈ సహాయం నువ్వు చేసి తీరాలి, లతీఫ్!' అన్నాడు దీనంగా.
'చెప్పు, రావ్! నీకోసం ఏదైనా చేస్తాను. చెయ్యగలిగే స్థితిలో ఉన్నాను' అన్నాను.
'శారదకూ, నాకూ భార్యా భర్త్రుత్వ సంబంధం తెగిపోయి చాలా రోజులయింది. శారద ఇప్పుడు నా కేమీ కాదు. ఒకవేళ శారదను నువ్వు కావాలను కొంటే అది అన్యాయం ఏమీ కాదు. నాకు ద్రోహమూ కాదు. శారదకు విడాకులు ఇవ్వలేను. ఇవ్వమని కోరకు. అది పాప భవిష్యత్తుపై దెబ్బ తీస్తుంది' అన్నాడు.
నిర్ఘాంతపోయాను.
'నిన్ను శారదకు విడాకులివ్వమని ఎవరు కోరారు?' అన్నాను.
నా ఆశ్చర్యం చూసి నాకేమీ తెలియదని నమ్మాడు రావు. స్థిమితఆపాది కుర్చీలో కూర్చుంటూ, 'శారద చిన్న ఇంట్లోకి మారటమూ, నౌకర్లు తగ్గిపోవటమూ ఇదంతా చూసి ...' అంటూ ఆగిపోయాడు.
నాకు అర్ధమయిపోయింది నేను డబ్బుదగ్గిర ఎంత గట్టివాన్నో రావుకు బాగా తెలుసు.
నీ పరిస్థితి చూశాడు.
నీవల్ల ఆనందం పొందలేని కారణంగా నీ కోసండబ్బు ఖర్చుచెయ్యటానికి నా మనసు ఒప్పుకోలేదనీ, ఆ డబ్బుకోసమే నువ్వు విడాకులు కోరావనీ భ్రమించి ఉంటాడు. అందుకే నా దగ్గిరకి వచ్చి నన్ను ప్రాధేయపడ్డాడు. మొదటిసారిగా రావు ముందు లజ్జతో ముడుచుకుపోయాను.
'సారీ, రావ్! శారద విచిత్రమైన వ్యక్తి! తనెప్పుడు ఏం చేస్తుందో నీలాగే నాకూ తెలియదు. బంగళా కావాలంది. ఇచ్చాను. కారు కావాలంది. ఇచ్చాను. రెండూ తనే మళ్ళీ నా కిచ్చేసింది. తీసేసుకున్నాను. అంతకంటే నాకేం తెలియదు. పాపకోసం నువ్వు నన్ను ప్రాధేయ పడక్కర్లేదు. మీ అందరిలాగే పాపంటే నాకూ ప్రాణమే!' అన్నాను.
ఆ తరవాత రావు ఇంకేమీ మాట్లాడలేదు. అతని ముఖ భంగిమలను బట్టి ఆలోచిస్తున్నాడని ఊహించుకున్నాను.
'శారదా, నువ్వూ దెబ్బలాడుకున్నారా?' అకస్మాత్తుగా అడిగాడు.
'దెబ్బలాడుకొనేటంత ఆత్మీయత పెరగలేదు!'
నవ్వేశాడు.
'శారద మనసులో ఈ పురుగెందుకు పుట్టిందో తెలియదు! చేతనైతే నాశనం చెయ్యి.'
ఆ రోజు సాయంత్రం వరకూ రావు నాతోనే ఉన్నాడు. వెనకటి రోజుల్లో లాగానే హుషారుగా ఉన్నాడు. నాతోనే భోజనం చేసి, బాగా పొద్దుపోయాక వెళ్ళిపోయాడు.
ఇంతకూ నువ్వు విడాకు లెందుకు కోరావు, శారదా?!"
నేను లతీఫ్ ముఖంలోకి సూటిగా చూస్తూ, "రావు అంటున్నది నిజమేనా? నేను నీ మిత్రుడి భార్య కాబట్టే నన్ను కోరలేక పోయావా?" అన్నాను.
"అవును!"
"మరి నీ మిత్రుడి భార్యను నీ మిత్రుడి నుండి దూరం చేసే ఐశ్వర్యాన్ని నా కెందుకు ఎరగా చూపావు? ఆ మత్తులో నన్నెందుకు మునిగిపోనిచ్చావు? ఇంత మునిగేవరకూ ఎందుకూరుకున్నావు?"
"నువ్వు కోరిన ఐశ్వర్యాన్ని నీ కిచ్చింది నా మిత్రుడి దగ్గిరనుండి నిన్ను దూరం చెయ్యటానికి కాదు, శారదా! నా మిత్రుడికోసం నిన్ను కాపాడటానికి!!"
"అదేమిటి?"
"నువ్వు బాధపడనంటే చెబుతాను."
"బాధపడినా తెలుసుకోవాలని ఉంది."
"ఒక్కొక్కసారి మనను గురించిన నిజాలు మనకు తెలియవు. వాస్తవానికి అది తెలియకపోవటం, కూడా కాదు, మనమే ప్రయత్నపూర్వకంగా తెలిసి పోకుండా జాగ్రత్త పడతాము. తెలిసిపోతే భరించలేం కనక!
"నువ్వానాడు నా పేర పుస్తకం పంపిన వెంటనే నీలోని ఆ చీకటి కోణం నా కర్దమయిపోయింది. రావు వద్దంటున్నా నా కారులో వచ్చిననాడు నీ ఐశ్వర్య కాంక్ష అర్ధమయింది. నా మేడను యావగా చూసే నీ చూపు లతో నా అనుమానం దృఢపడింది. నేను నీ సౌందర్యాన్ని చూపులతో ప్రశంసించలేదని ఉడుక్కోవటంలో నీ అహం అర్ధమయింది.
"నన్ను గురించి నీకు పూర్తిగా తెలుసునని నాకు తెలుసు. మరి, నా కా పుస్తకం ఎందుకు పంపావు? ఏ రకమైన గౌరవం నా మీద నీకు?
"ఆ అవకాశాన్ని నే నందుకోకపోతే నువ్విదే అవకాశాన్ని మరొకరి కియ్యవచ్చునని తోచింది. నామీద నీకు ప్రత్యేకమైన గౌరవాభిమానాలు లేవని నాకు రూఢిగా తెలుసు!
"మరొకరు రావును గురించి ఎందుకాలోచిస్తారు? అందుకే నువ్వందించిన అవకాశాన్ని అందుకున్నాను. నిన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటంలో నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను.
"నీకు విపరీతమైన అహం! నీ సౌందర్యానికి అష్టైశ్వర్యాలలో తులతూగే అర్హత సహజంగానే ఉందని నీ నమ్మిక! నీకు లభించిన మధ్యతరగతి జీవితంతో నువ్వు తృప్తి పడలేకపోయావు. రోజురోజుకీ నీలో అసహనం పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి దశలో నువ్వు అతి తేలికగా ...."
లతీఫ్ ఆగిపోయాడు. వాక్యం పూర్తి చెయ్యలేదు. చెయ్యమని నే నడగలేదు.
నామీద నాకు కలిగిన జుగుప్సలో వణికిపోతున్నాను.
అవును! లతీఫ్ చెప్పినది అక్షరాలా నిజం! లతీఫ్ వ్యభిచార గాథల్ని విని, అతన్ని చీదరించుకునే నేను ఏ కారణం చేత అతనికి నా పుస్తకాన్ని పంపాను?
జాలిగా నన్ను చూస్తున్న లతీఫ్ ముఖంలోకి చూడగానే ఏదో పూజ్యభావంతో మనసు నిండిపోయింది.
'లతీఫ్ వ్యభిచారి. త్రాగుబోతు. అయినా, మంచి వాడు' అన్న రావు మాటల పూర్తిగా అర్ధమయ్యాయి. కూర్చున్న చోటునుండి లేచి, లతీఫ్ పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాను.
"శారదా!" అన్నాడు విభ్రాంతితో లతీఫ్.
"నేను చాలా క్షుద్రురాలిని, లతీఫ్! కానీ, చాలా చాలా అదృష్టవంతురాలిని. నా జీవితంలో నాకు తారస పడిన వ్యక్తులందరూ ఎంతో మంచివాళ్ళు."
"ఎదుటి వ్యక్తులలో మంచితనం గుర్తించగలిగిన నువ్వు క్షుద్రురాలివి కాలేవు, శారదా! వెంటనే రావు దగ్గిరకి వెళ్ళు. క్షమాపణ కోరుకో!" అంతవరకూ అణుచుకున్న ఆవేదన ఒక్కసారి హృదయాన్ని గిల కొట్టింది.
"రావు తన నోటితో మా ఇద్దరి మధ్యా ఏ సంబంధమూ లేదన్న తరవాత నేను క్షమాపణలు ఎవరిని కోరను? రావు ఇలాంటి క్షమాపణలకు కరిగే వ్యక్తి కాదు. రావు తిరిగి స్వీకరించగలిగే అర్హత నేను పొందగలిగితే రావు తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది." నిలవలేక తూలుతున్న నన్ను చూసి ఆందోళనతో, "ఏం శారదా! ఒంట్లో ఎలా ఉంది?" అన్నాడు లతీఫ్.
"ఏం లేదు. బాగుంది. నువ్వెళ్ళు. కాస్సేపు పడుకుంటే స్థిమిత పడతాను."
లతీఫ్ వెళ్ళిపోయాడు.
నేను పడుకోలేదు. ప్రయత్నించినా కంటిమీద కునుకు రాలేదు.
'నీలోని చీకటి కోణం ఆనాడే నాకు అర్ధమయింది' అన్న లతీఫ్ మాటలూ-
'శారదా! నా అభిప్రాయంలో ఆచరణ కంటే దాని వెనక ఉన్న ఉద్దేశమే ప్రధానం' అన్న రావు మాటలూ - తిరిగి నా మనసులో సుడిగుండాలు రేపుతూ నా తల పగలగొడుతున్నాయి. నా శరీరం కాలిపోతూంది.
44
శారీరకంగా నా ఆరోగ్యం నన్ను వదలటం లేదు. అంతకు పదింతలుగా నా మనసు కృంగిపోయింది. మేధాశక్తితో ఇతివృత్తాన్ని అల్లుకో గలుగుతున్నాను కానీ, దాన్ని రసవంతం చెయ్యగలిగే ధారాశుద్ధి పొందలేకపోతున్నాను. ఏదో నీరసం నా మనసుకూ, శరీరాన్నీ, రచననూ ఆక్రమించేసుకుంది. ఏదో వట్టిపోయిన అనుభూతి కలుగుతూంది.
సగంవరకూ వ్రాసి నాకె సంతృప్తికరంగా లేక మూల పడేస్తున్నాను. కొన్నిసార్లు పూర్తిగా వ్రాసినవి కూడా ప్రచురణ కియ్యటానికి మన సొప్పటంలేదు.
ప్రచురణ కర్తల నుండీ, చిన్న చిన్న పత్రికాధిపతుల నుండీ నా రచనలు కావాలని ఉత్తరాలు వస్తున్నాయి.
కొంత పేరు రాగానే ప్రచురణ కర్తలూ, పత్రికాధిపతులూ ఇలా ఉత్తరాలు వ్రాస్తారు.
"పేరుమీది ప్రలోభంచేతనో, పారితోషిక ప్రభావం వల్లనో సహజమైన ప్రేరణ లేకుండానే రచయితలు వాసేస్తారు. ఈ కారణంగానే ప్రతిభావంతుల రచనలు కూడా అప్పుడప్పుడు అతి మామూలుగా ఉండటం తటస్థిస్తూంది."
నాకు వచ్చే ఉత్తరాల నన్నింటినీ బుట్టదాఖలు చేస్తున్నాను. సమాధానం ఇచ్చే ఓపిక కూడా లేక పోతూంది. ఒకరు వ్రాయమన్నారు కనక వ్రాయాలని నాకు లేదు. కానీ, నాకోసం నేను వ్రాసుకోవాలనుకున్నా గూడా ఆ ఏకాగ్రత సాధ్యం కావటం లేదు.
నా కష్టాలన్నింటిలో ఇది నాకు భరించరాని కష్టం! రావు తిరస్కారాన్ని కూడా తట్టుకోగలిగాను. కాని, నా రచన శక్తి ఇలా వట్టిపోవటం భరించలేక పోతున్నాను.
ఇందుకు కారణం నిరతరం నా మనసును మథించే వ్యథ.
వ్యధాభరితమైన వ్యధిత హృదయం ఏకాగ్రంగా నిలవలేక పోతూంది.
మనసు పొందిన ప్రతి స్పందననూ మాటలలో పరుచుకుని ముచ్చట పడటానికి అలవాటుపడిన దానిని ఆవేదనకు తట్టుకోలేక నా ఆవేదనను అక్షరాలలోకి మార్చుకోసాగాను.
చిత్రం! అక్షరాలలో ప్రతిఫలించే నా ఆవేదన గుండెలని మెలిపెట్టడం లేదు. నాచే తిరిగి కన్నీళ్లు కార్పిస్తున్నది. నిజమే. కానీ, ఈ కన్నీళ్ళలో ఉన్నది దుఃఖం కాదు. ఆర్ద్ర భావనాన్వితమైన ఒక హాయి.
బాధ ననుభవిస్తూనే ఉన్నాను. అనుభవ దశలో కేవలం బాధగా మిగిలిపోయిన ఆ అనుభూతి అక్షరా కృతిలో నాకు అక్షరమైన శాంతి ప్రసాదిస్తూంది.
ఒకే క్షణంలో బాధనూ, బాధలో సౌఖ్యాన్నీ-రెంటినీ అనుభవిస్తున్నాను.
'బాధే-సౌఖ్యమనే భావన రానీవోయ్!
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్! బ్రహ్మానందమోయ్!' అన్న పాట ఒక నాడు కేవలం త్రాగుబోతు పాటలా అనిపించింది. ఆ పాటలో భావం ఈనాడు అర్ధమయింది.
'బ్రదర్స్ కారామొజోవ్' ఏ రష్యన్ నవలలో ఒక ఫాదర్ 'నీ బాధలోనూ సౌఖ్యాన్ని పొందు' అని ఉపదేశిస్తాడు. ఆ మాట లానాడు మెట్ట వేదాంతంలా తోచాయి. అసంభవ మనిపించాయి.
