Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 33


    అది ఎలా సంభవమో, ఆ సాధనలో ఎంత సౌఖ్యముందో ఇప్పుడు అర్ధం కాసాగింది.
    మానసిక వేదన వలననో, అవిశ్రాంతత వలననో ఆరోగ్యం బాగా దెబ్బ తింది.
    లతీఫ్ ఆందోళనతో "డాక్టర్ ను పిలుస్తాను శారదా!" అన్నాడు.
    "డాక్టర్ ను పిలవక్కర్లేదు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ కు వెడతాను" అన్నాను.
    "కాని ..."
    నవ్వాను. "ఏం? ప్రభుత్వం మనది! ప్రభుత్వ వైద్యాలయాలంటే రోగులు హడిలిపోతారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలిగినవాళ్ళెవరూ తమ పిల్లల్ని చదివించరు. ప్రభుత్వానికి సంబంధించిన దేనిలోనూ ఎవరికీ విశ్వాసం లేదు. ఫరవాలేదు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ కే వెళతాను."
    నాకు లతీఫ్ డబ్బు వాడుకోవటం ఇష్టంలేదు.
    దగ్గిరున్నది పాపకోసం దాచాలని నిశ్చయించుకున్నాను. దానిని నా ఆరోగ్యంకోసం, డాక్టర్లకీ, మందు లకీ తగలెయ్యాలని లేదు.
    నా ఉద్దేశం అర్ధం చేసుకున్న లతీఫ్ ఇంకేమీ మాట్లాడలేదు.
    సీన్స్ సృష్టించే ఓపిక ఇద్దరిలోనూ లేదు. నా నిర్లక్ష్యం కారణమో, లేక డాక్టర్ అశ్రద్ధ కారణమో కాని, నా ఆరోగ్యం మరింత క్షీణించి మంచం దిగలేని దశలోకి వచ్చాను.
    లతీఫ్ పాపను రోజూ కాన్వెంట్ లో దింపి, కాన్వెంట్ నుండి ఇంటికి తీసుకొస్తున్నాడు.
    ఒకసారి లతీఫ్ నాకోసం పళ్ళు తీసుకొచ్చాడు.
    వాటిని లతీఫ్ ఎదురుగానే సీతాలు కిచ్చాను.
    లతీఫ్ బాధపడతాడని నాకు తెలుసు. కానీ, నాకోసం ఏం తేవద్దని అతడు నొచ్చుకోకుండా చెప్పే మార్గం లేదు.
    "నేను ఇక్కడికి రావడం నీ కిష్టం లేదా, శారదా!" ఆవేదన ధ్వనించే స్వరంతో సూటిగా అడిగాడు.
    "భలేవాడివి. నిన్ను చూడకపోతే నాకు తోచదు. నాకు మిగిలిన ఆప్తుడివి నువ్వు ఒక్కడివే! నీకు నేనంటే అసహ్యం కలుగుతోందా? నానుండి పారిపోవాలనుకుంటున్నావా?"
    "శారదా! ..." విచలిత స్వరంతో అడ్డు తగిలాడు లతీఫ్. "నీకు కష్టం కలిగిస్తున్నానేమోనని ...."
    "లేదు, లతీఫ్! నువ్వు చాలా మంచివాడివి. నాలో లోపలి కవాటాలు తెరిచి, నా గుండెలోపలి దివ్యజ్యోతి దర్శనం కలిగించింది నువ్వే! నీలాంటి ఆప్తుడు నాకు ఉన్నందుకు గర్వపడుతున్నాను. నిన్ను చూసి నప్పుడల్లా మంచి చెడ్డలు పడుగు పేకలతో అల్లుకున్న మానవతా సౌందర్యం నా కళ్ళకు కట్టినట్లనిపిస్తుంది."
    "శారదా! నిన్నీ నిస్సహాయ స్థితిలో వదిలి వెళ్ళ లేకుండా ఉన్నాను. కానీ, నే నిక్కడ ఉండటం వల్ల రావుకు, నిన్ను మరింత దూరం చేస్తున్నానా అని భయపడుతున్నాను."
    వ్యాకులపాటు స్పష్టంగా ప్రతిఫలిస్తున్న లతీఫ్ ముఖంలోకి చూసి ఆర్ద్రంగా నవ్వాను.
    "ఫరవాలేదు. రావు వ్యక్తిత్వంలో నాకు విశ్వాసం ఉంది. రావు తిరిగి స్వీకరించగలిగే అర్హత నా మనసు పొందగలిగితే రావు తప్పకుండా నన్ను స్వీకరిస్తాడు. ఆ అర్హత ఇంకా నాకు రాలేదేమో! లేకపోతే నా రావు నా దగ్గిరకి రాడా? రావుకు అర్ధంకాని విషయమేముందీ?"
    జాలిగా నా ముఖంలోకి చూసి, "కూలద్రోసినంత సులభంగా దేన్నీ నిర్మించలేం, శారదా! పోనీ, నన్ను రావు దగ్గిరికి వెళ్ళమంటావా? రావు నా మాటలు నమ్ముతాడు" అన్నాడు లతీఫ్.
    "వద్దు! వద్దు, లతీఫ్! ఈ విషయంలో నువ్వు కలిగించుకోకు. నా హృదయంలోంచి రావును ఆర్తితో పిలుస్తాను. ఆ ధ్వని రావు మనసుకు సోక గలిగే శక్తి మంత మయినపుడు, రావు తనంత తానే నా దగ్గిరికి వస్తాడు. అంతవరకూ నిరీక్షించగలను. ఒకప్పుడు నేను అసహనానికి మారుపేరును. నాలో సహనం కూడా ఉందని నిరూపించుకోనీ!"
    మాట్లాడే శక్తి లేక ఆయాసపడుతూ దిళ్ళమీదికి ఒరిగాను. గుమ్మంలో నించుని పాప నన్నే చూస్తూంది.
    చేతులు చాపి, "రా!" అన్నాను.
    పాప నా దగ్గిరగా వచ్చింది. బాగా ఏడ్చినట్లు ముఖమంతా ఉబ్బి ఉంది.
    "పాపా! ఏడ్చావా? ఎందుకమ్మా?" గుండెలు తల్లడిల్లి పోతూండగా ఆందోళనగా అడిగాను.
    పాప సమాధానం చెప్పలేదు. మరింత ఏడ్చింది.
    "పాపా! చిట్టితల్లీ! ఏం కావాలో నాతో చెప్పమ్మా! నీ కెందుకమ్మా, కన్నీళ్ళు? చెప్పు, తల్లీ!"
    "అమ్మా! నే నిక్కడ ఉండను. నాన్నగారి దగ్గిరకే వెళ్ళిపోతాను. నేను నాన్నగారి దగ్గిరే ఉంటాను."
    ఒరిగిపోతున్న నన్ను లతీఫ్ పట్టుకోవటం మాత్రమే నాకు తెలుసు.
    తిరిగి నాకు స్పృహ వచ్చేటప్పటికి నన్ను ఆందోళనగా చూస్తూన్న లతీఫ్ ముఖమే కనిపించింది.    
    పాపకోసం చుట్టూ చూసి, లతీఫ్ ముఖంలోకి చూశాను. నా కళ్ళలో ప్రశ్న చదివిన లతీఫ్, ముఖం వాల్చుకున్నాడు. సమాధానం నా కర్ధమయింది. పాప వెళ్ళిపోయింది! నిరాశా కెరటాలలో కొట్టుకుపోతూ, పాపమీది మమతను నా ఉనికిని ఆధారం చేసుకున్నాను.
    ఆ పాప - నా పాప - వెళ్ళిపోయింది!!

                                 *    *    *

                 

                                    45

    చిమ్మచీకటి! ఆ గాదాంధకారంలో దూరంగా మినుకు మినుకు మని సన్నని దీపరేఖ కనిపిస్తూంది. ఆ దిక్వే నాకు చూపుతున్నది రావు!
    పరుగెడుతున్నాను రావును అందుకోవాలని, ఆ జ్యోతి ప్రకాశంలో నన్నావరించిన అంధకారాన్ని దూరం చేసుకోవాలని! పరుగుపెడుతూన్న కొద్దీ ప్రకాశం అధికమవుతూంది. రావు ఆకృతి స్పష్ట మవుతూంది. చీకట్లు పలచనవుతున్నాయి. కానీ, ఇంకా రావు దూరంగానే ఉన్నాడు. ఆ జ్యోతి దూరం గానే ఉంది.
    ఏ శక్తితో పరుగెడుతున్నాన్నో ఆ శక్తి హఠాత్తుగా క్షీణించిపోయింది. ఉన్నపాటున కుప్పగా కూలి పోయాను. రావు కనిపిస్తున్నాడు. కాని, పరుగెట్టలేను. రావును అందుకోలేను. ఎలుగెత్తి పిలుస్తున్నాను. అయినా, ఆ పిలుపు ధ్వనించటం లేదు. అక్కడి వాతావరణం లో వాయువు లేదా? అందుకనే నా పిలుపు ధ్వనిగా రావును చేరలేకపోతూందా? ఆ కారణంగానే నాకు ఊపిరాడటం లేదా?
    అవును! నాకు ఊపిరాడటం లేదు. ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి. నాలో జీవశక్తి హరించుకు పోతూంది. మన నావరించిన ఈ సమస్త వాతావరణమూ చైతన్యమయమా? ఈ చైతన్య జీవ కెరటాలు వాయురూపంలో నిరంతరం మనలో నుండి ప్రవహిస్తున్నంత వరకేనా మనకు చైతన్యం? నా కా వాయు కెరటా లందటం లేదు. నాలో చైతన్యం క్షీణిస్తూంది! నాలో చైతన్యం పూర్తిగా నశించక ముందు ఒక్క క్షణం రావును చేసుకోగలిగితే! ఒక్కసారి రావు చేతిలో చెయ్యి ఉంచి తరవాత శాశ్వతంగా జడాకృతి పొందితే!
    యావచ్చక్తి నీ వినియోగించి రావును పిలుస్తున్నాను. నా సమస్త చైతన్యమూ అతి తేలికయి ఎక్కడికో తేలిపోతూంటే, అది ఎగిరిపోకుండా గట్టిగా 'రావు' అనే రెండక్షరాలకూ దానిని బంధించాను. ధ్వని లేని ఆ పిలుపుకు బలహీనంగా ఉన్న ఆ బంధం సడలిపోయి, ఆ చైతన్య శక్తి అనంతంలోకి ఎగిరిపోవాలని ఆరాట పడుతూంది! పోనీయటం లేదు నేను! ఒక్కసారి రావును దగ్గిరగా చూడాలి! ఒక్కసారి రావు చేతిని పట్టుకోవాలి!
    రావ్! రావ్! రావ్!
    చైతన్య రహితమైన ఆ జీవ శూన్య వాతావరణంలో ధ్వని కల్పించటానికి ప్రయాసపడుతున్నాను.
    హమ్మయ్య! ధ్వనిస్తూంది. 'రావ్!' ఆ రెండక్షరాలూ అతి తీయగా నా చెవులకు వినబడుతున్నాయి. ఎగిరిపోతున్న నా చైతన్యాన్ని మరి కాస్త దృఢంగా ఈ ధ్వనికి బిగించి, మరింత ఎలుగెత్తి పిలుస్తాను!
    "రావ్!"
    "శారదా!"
    నా కళ్ళకు రావు కనిపించాడు. గట్టిగా రావు చేతిని పట్టుకున్నాను. రావు చేతులు నన్ను ఆప్యాయంగా నిమురుతున్నాయి. కన్నీళ్లు! ఏ నాడూ దేనికి చలించని రావు కళ్ళలో నీళ్ళు! ఎందుకు?
    నా చుట్టూ ఎవరెవరో ఉన్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు.
    నాకు  రావు తప్ప ఎవరూ కనపడటం లేదు. మరేదో లోకంలోనుండి లాగ ఏవో మాటలు వినబడుతున్నాయి.
    "హమ్మయ్య! కళ్ళు విప్పింది. జాగ్రత్త! ఆయాస పెట్టకండి. పరిస్థితి బాగుండలేదు."
    "ఫరవాలేదంటారా, డాక్టర్ గారూ! మా వదిన బ్రతుకుతుందంటారా?"
    "చెప్పలేం! ఆవిడకు స్మృతి వచ్చి మాట్లాడితే, నెల రోజులుగా అపస్మారక దశలో పడి ఉన్నట్లు తెలియనీయకండి. అందరూ ఏం జరగనట్లే మాట్లాడండి!"
    నా చుట్టూ ఏవేవో ధ్వనులు! ఒక్క మాటా అర్ధం కావటం లేదు. ఒక్క ఆకృతీ స్పష్ట పడటం లేదు. రావునే తదేకంగా చూస్తున్నాను. రావు పెదవులు కదులుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. "రావ్! నా కళ్ళు మూసుకు పోతున్నాయి. మూసుకోవాలని లేదు. ఇంకా నిన్నే చూడాలని ఉంది. కానీ, మూసుకుపోతున్నాయి. పోనీలే! నిన్ను చూశాను. ఆ దివ్వె ఏది? ఏం చేశావ్ ఆ జ్యోతిని?"
    రావు చేతిలోనుండి నా చెయ్యి జారిపోతూంది. జారిపోనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు రావు. ఆ ధార్డ్యం, ఆ ఉష్ణం నా నరనరాలకూ వ్యాపించింది. బాగా నామీదకు దగ్గిరగా వంగాడు.
    "శారదా! వీల్లేదు. నువ్వు బ్రతకాలి. బ్రతకాలి. శారదా!"
    అప్పుడు అర్ధమయింది. నేను చచ్చిపోతున్నానా?
    ఎలాంటి అవివేకిని నేను! ఊహతో ఏ విషయాన్నీ తెలుసుకోలేను. అనుభవాలతోకాని జీవితాన్ని దర్శించలేను.
    నా చేతిని తన చేతుల మధ్య బంధించుకున్న రావు చేతులు నాకు ప్రసాదించిన శక్తితో సంతృప్తిగా అన్నాను!
    "రావ్! ఇలా నీ దగ్గిర- నీ చేతుల్లో చచ్చిపోవటం నాకు చాలా హాయిగా ఉంది. ఇంతకన్న ఏం కావాలి నాకు? బ్రతికి నేను చెయ్యవలసింది ఏముంది?"
    రావు నా వక్షం మీద తల వాల్చి తన చేతులతో నన్ను గట్టిగా చుట్టేశాడు.
    రావు కన్నీళ్ళు వెచ్చగా నా గుండెల మీదకు జారి, గుండెలను కదిలిస్తున్నాయి.
    రావును ఆప్యాయంగా అదుముకోబోయాను. కానీ, శక్తి లేదు.
    నా చివరి క్షణాలలో రావు నడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నాలో మిగిలిన శక్తినంతా ఒక్కసారి కూడదీసుకున్నాను.
    "రావ్!"
    రావు తల ఎత్తి చూశాడు. "మాట్లాడకు, శారదా! ఆయాసపడకు!"
    "లాభంలేదు, రావ్! నన్ను మాట్లాడనియ్యి. లేకపోతే ఈ అశాంతి అలా మిగిలిపోతుందేమో!"
    రావు ఆందోళనగా డాక్టర్ వంక చూశాడు.
    డాక్టర్ ఏమన్నాడో నాకు వినబడలేదు. రావు కళ్ళు మళ్ళీ నీళ్ళతో నిండటం మాత్రం చూడగలిగాను. నా చేతులతో ఆ కన్నీళ్లు తుడిచాను.
    నా జీవితంలో నేను ఒక్కసారి రావు కన్నీళ్లు తుడవ గలిగాను.
    అయినా, అవి ఆగటం లేడు.
    "రావ్! నాకేం కావాలో నేను తెలుసుకోలేకపోవటం నేను చేసిన పెద్ద పొరపాటు! నాకు ఐశ్వర్యం కావాలి. కానీ, అది నీతో కలిసి అనుభవించటానికి కావాలి. నువ్వులేని ఏ అనుభవనలా నా కక్కర్లేదు! అది అర్ధం చేసుకోలేకపోయాను.
    "ప్రేమ గురించి లతీఫ్ నన్ను ప్రశ్నించేవరకూ నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు కూడా నాకు తెలియదు!"
    "బాధపడకు, శారదా! నువ్వేకాదు, ఎంతటి విజ్ఞానులైనా తెలుసుకోలేనిది ఒక్కటే! అది తమలో ఉన్నది! తనను తాను తెలుసుకోగలిగిననాడు అర్ధం చేసుకోలేనిది లేదు. కానీ, అదే చాలా కష్టం!"
    "నాకు ఒకటే వేదన మిగిలింది ...."
    "చెప్పు...."
    "మంచి పుస్తకం ఒకటైనా వ్రాయలేకపోయాను. నిరర్ధకంగా చచ్చిపోతున్నాను."
    ఇప్పుడు నా కళ్ళలో నీళ్ళు నిండాయి. రావు తుడిచాడు వాటిని.
    "అలా ఎందుకనుకుంటావు, శారదా! నీ రచనల్లో లోపాలు ఉన్న మాట నిజమే! కానీ ఒక రచనకు కావ్యార్హత కలిగించేది దోష రాహిత్యం కాదు. రసోత్కర్ష!"
    "రావ్! ఇటీవల నే నెంత ప్రయత్నించినా ఏకాగ్రంగా నవల అల్లలేకపోయాను ఏకాగ్రత అనేదే సాధ్యపడలేదు. నా మనసులో వేదన ఎప్పటికప్పుడు ఖండఖండాలుగా తోచినట్లు వ్రాసుకోగలిగాను. ఎందుకని?"
    రావు క్షణకాలం నా ముఖంలోకి చూసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS