Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 31

   
    నేను శారదనని ఆవిడ గుర్తించలేదు. శారదనని చెప్పుకోకపోతేనేం!
    "పరిమళ స్నేహితురాలిని నేను. మీ దగ్గిరుండమని పరిమళ పంపింది" అన్నాను.
    "నిజంగానా! అయితే సుభద్రనా నువ్వు? ఎప్పుడొచ్చావ్ అత్తారింటి నుంచి? అంతా కులాసాయేనా? అయ్యో! పరిమళ! వెర్రిబాగుల తల్లి! పొలం పోయినా దానికి నా ధ్యాసే! వెళ్ళనంది. నేనే వెళ్ళమని పంపాను. పాపం, ఆ రావు ఒక్కడూ ఎంతని శ్రమపడగలడు! మనుష్యులను పెట్టుకోవటానికి డబ్బు లేవీ? ఎలా నెగ్గు కొస్తున్నాడో ఏమో! తల్లీ! తల్లీ! కాస్త ఆ మంచినీ ళ్ళందుకొందూ! అబ్బ! ఛస్తున్నానే, తల్లీ! ఏదైనా పుల్లగా తినడానికి ఉంటే బాగుండును..."
    నేను తెచ్చిన ద్రాక్ష పళ్ళు ఒకొక్కటే ఆవిడ కందించాను. ఆవిడ ఆవురావురుమని తింటూంటే సంతృప్తిగా చూశాను.
    పరిమళ రాకుండానే తిరిగి వచ్చేశాను.
    ఇదివరలో నే నెవరి కే చిన్న సహాయం చేసినా దాన్ని లడాయిగా చేసేదానిని. నా గొప్ప ప్రదర్శించుకోవ టానికి చేసేదానిని. నేను చేస్తున్న సహాయం ఎంత  గొప్పదో వాళ్ళకు స్పష్టం చేసేవరకూ స్తిమితం ఉండేది కాదు.
    నేను సహాయం చేస్తున్న సంగతి చివరకు సహాయ పడుతున్న వ్యక్తికి కూడా తెలియకుండా సహాయ పడడంలో ఎంత ఆనందం ఉందో మొదటి సారిగా అర్ధమయింది.
    తరుచు సీతమ్మ దగ్గిరకు వెళుతున్నాను. వెళ్ళినప్పుడల్లా పళ్ళు తీసుకు వెళుతున్నాను. చాలాసేపు ఆవిడ దగ్గిర కూర్చుని ఆవిడ మాట్లాడిందల్లా ఓపిగ్గా వింటున్నాను.
    సహజంగా వాగుడు పిట్టయిన సీతమ్మను రోగం మరింత వాగుడు పిట్టగా చేసింది. ఎప్పుడూ వట వట వాగుతూనే ఉండాలి. సీతమ్మ మాట్లాడే మాటల్లో కొన్ని కొన్ని మాత్రమే గుర్తున్నాయి నాకు.
    అవి నాకు సంబంధించినవి. నేను మరిచిపో లేనివి.
    "రావును చూస్తేనే గుండె తరుక్కుపోతుందమ్మా! బంగారంలాంటి బిడ్డ అన్ని విధాలా భ్రష్టుడయి పోయాడు. దానికేం! ఆ ముసిలాన్ని డబ్బుకోసం ఉంచుకుని కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి కులుకుతోంది. రోజురోజుకీ బెంగతో తల్లడిల్లిపోతున్నాడు బిడ్డ! "నీకేం మొగ మహారాజువి! దర్జాగా మరో పెళ్ళి చేసుకో, మని ఎంత నచ్చజెప్పానో తెలుసా? గానుగ వీథిలో మహాలక్ష్మమ్మ తన కూతుర్ని ఇస్తానంది. ఎక్కడో సత్తెకాలపు మనిషి! 'చట్టం ఒప్పదు, అత్తయ్యా!' అంటాడు. అయినా అమ్మా, నాకు తెలియ కడుగుతాను, అందరూ చట్టం ఒప్పే పనులే చేస్తున్నారా? ఆ శారదమ్మ చేసే పనులన్నింటికీ చట్టం ఒప్పుతోందా? ఇంకా నయం! ఇది విన్నావా? మొగుణ్ణి తను వెళ్ళగొట్టిందే కాక మా పరిమళను కూడా వెళ్ళగొట్టమందిట! మా పరిమళ ఒప్పుకుంటుందా? భోగం సానిని మించిన వయ్యారి కనక ఆవిడ ఏవైనా చేస్తుంది. పేగు బంధం! పరిమళ ఎట్లా తెంపుకుంటుంది?
    "రావు వద్దని చెపుతూనే ఉన్నాడమ్మా! వెర్రి బాగులది, మా పరిమళ మొగుణ్ణి బ్రతికించుకుందామని ఆ కసాయిదాని ముందు చెయ్యి జాపింది. మొగుడూ, ప్రేమా - ఇవన్నీ దానికేం తెలుస్తాయమ్మా దీని పిచ్చిగాని! రామ! రామ! చల్లని వేళ తలవకూడదు కాని అలాంటి మనుష్యులు ఉండబట్టే కాలం ఇలా మండిపోతోంది. అయినా ఇంత కింతా అనుభవిస్తుందిలే! రావు మరీ మంచివాడమ్మా! లోకంలో మంచివాళ్లకే కష్టాలు! దాని కర్మానికి దా న్నొదిలి బిడ్డను తెచ్చుకుని మరో చక్కనిదాన్ని చూసి పెళ్ళాడేస్తే పోలే! దాని తెగులంతా కుదిరేది! ఆ ముసలాడి తోనే ఊరేగేది! ముసలా డేమిటిలే! ఇలాంటి వాళ్ళ కింకెందరో! రావు చేసుకున్న పుణ్యం! పండంటి బిడ్డ పచ్చని జీవితం కాల్చుకుంటున్నాడు. మహాలక్ష్మి కూతురు రాధమ్మను చేసుకుంటే మూడు పువ్వులూ ఆరు కాయలూగా ఉండదూ! అన్నట్లు, మహాలక్ష్మమ్మ కూతురి పేర నాలు గెకరాలు పెడతానంది. అది రావు కేగా! ఏమిటో, వినిపించుకోడు! ...."
    సీతమ్మ మాటల్లో ఒకొక్కటీ నన్ను వాడి వాడి బల్లేలతో గుచ్చినట్లుగా ఉన్నా, ఏదో సంతృప్తిగానూ ఉంది.    
    ఏదో ఇంగ్లీషు నవలలో చదివాను. ఒక ఫాదర్ తోటి సిస్టర్ ను ప్రేమించి, ఆ పాప పరిహారార్ధం తనను తాను కొరడా దెబ్బలు కొట్టుకొనే వాడట!
    ఫాదర్ కు కొరడా దెబ్బల వలన కలిగే సంతృప్తి లాంటిదే నాకు సీతమ్మ నిందావాక్యాలలో లభ్యమవుతూంది.
    సీతమ్మ నే నిచ్చిన పళ్ళు అన్నీ తనే తినలేకపోయింది. కొన్ని దాచి పరిమళ కిచ్చింది. పరిమళ ఆశ్చర్యపోతూ, "ఇవెక్కడివీ!" అంది.
    "నీ స్నేహితురాలు సుభద్ర తెచ్చిందే! వెర్రి పిల్ల రోజూ తెస్తుంది!"
    "సుభద్ర ఇక్కడెక్కడుందీ? అత్తవారింటికి వెళ్ళి పోయిందిగా!"
    "ఏమోనే! 'సుభద్రవా?' అంటే 'అవు'నంది."
    "అవునందా?" ఆశ్చర్యంగా అడిగింది పరిమళ.
    "ఏం సమాధానం చెప్పిందో గుర్తు రావటంలేదే! సుభద్ర తప్ప నీ స్నేహితులెవ రున్నా రిక్కడ?"
    "శారద కాదుగదా!"
    అదిరిపడింది సీతమ్మ.
    "కాదు! కాదు!" అంది గాభరాగా.
    "ఎందు కంత గాభరా?"
    "గాభరా? ఏం లేదు. శారద ఎంతమాత్రం కాదు. కారదయితే...."
    "అయితే? ...."
    "తిడుతోంటే ఊరుకుంటుందా?"
    "తిట్టావా? నీకు పళ్ళు తెస్తే ...."
    "అబ్బా! సుభద్రను తిట్టలేదే! శారదను గురించి ఉన్న మాటలే అన్నాను. అన్నింటికీ అవునంది. హమ్మో! శారదయితే నా పీక నులిమెయ్యదూ?"
    "అయితే శారద కాదు, ఎవరయి ఉంటారన్నయ్యా? లతీఫ్ ఎవరినైనా పంపాడంటావా?"
    రావు ఏ సమాధానమూ చెప్పలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు.

                                *    *    *

                                    42

    సీతమ్మ దగ్గిరనుండి వచ్చాక నాకు స్తిమిత మనేది లేకుండా పోయింది. అందుకు కారణం ఆవిడ వాగుడు కాదు. అది నేను సంతోషంగానే భరించ గలిగాను. 'పండులాంటి రావు జీవితం శారద మూలంగా నాశనమయింది' అన్న మాటలు పదే పదే నా మనసును గుచ్చుతున్నాయి.
    కానీ, నేనేం చెయ్యగలను? రావును రెండో పెళ్ళికి ఒప్పించటానికి సీతమ్మ కన్న ఎక్కువగా ప్రయత్నించ గలనా?
    రావు ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటే భరించగలనా? రావు ఇంకొక అనుకూలవతిని పెళ్ళిచేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నే నెప్పటికీ ఇలా ఒంటరిగా .... అబ్బా! ఆలోచించటానికి కూడా భయంకరంగా ఉన్న ఈ విషయాన్ని, వాస్తవంగా చేజేతులా మార్చనా? ఎంత స్వార్దపరురాలిని! ఎంత సేపూ నా దృష్టికోణం నుండి ఆలోచిస్తాను తప్ప ఎదుటి వాళ్ళ దృక్పథంలోంచి ఆలోచించవేం? పెళ్ళి చేసుకున్నది మొదలు ఏనాడూ రావుకు సంపూర్ణ మైన ఆనందాన్ని అందించలేక పోయాను. అన్ని సందర్భాలలోనూ రావుసర్దుకుపోవటానికి ప్రయత్నించాడే తప్ప, నేను సర్దుకు పోవటానికి ఏనాడూ ప్రయత్నించ లేదు. అతని మనసు ముక్కలుగా చీలుస్తూ నా ఆవేశంలో, నా ధన దాహంలో నేను పరుగెత్తిపోయాను. విధిలేక వ్యధతో వీడిపోవలసి వచ్చింది అతనికి! ఈ రోజు అతని కాళ్ళమీద పడి-"క్షమించు, రావ్! నాకు బుద్దొచ్చింది" అని చెంపలేసుకోనా? ఇలాంటి 'సీన్స్' ఒకనాటి ఆవేశంలో అతి సునాయాసంగా సృష్టించ గలిగే దాన్ని. ఈనాడు అలాంటి ఉన్మాదావేశ ప్రకటన కు ఏదో లజ్జ కలుగుతూంది. నాతో పశ్చాత్తాపం కలుగుతున్నది నిజమే అయితే, నేను నిస్స్వార్ధంగా రావును ప్రేమించ గలిగితే అతనికి ఆనందం కలిగించ టానికి ప్రయత్నించాలి! నా మనసు కది ఎంత రంపపు కోత అయినా సరే! తాను కోరిన వ్యక్తిని వివాహమాడ గలిగే అవకాశం రావుకు కలిగించాలి. 'చట్టం ఒప్పు కోదు' అన్నాడుట సీతమ్మతో. సీతమ్మ అతిగా వాగేమాట నిజమే కాని, అబద్ధాలు మాత్రం చెప్పదు.
    నిజమే! నాకు విడాకులు ఈయనంత వరకూ మరో పెళ్ళికి చట్టం ఒప్పుకోదు. రావు తనంత తను నాకు విడాకులు ఇవ్వడు.
    పోనీ, నేనే రావును విడాకులు కోరితే .... రావు నన్ను మరింత అసహ్యించుకోవచ్చు. అసహ్యించుకోనీ! అందుకు అర్హురాలిని కానా నేను!
    నా లాయరుద్వారా రావుకు నోటీ సిప్పించాను, విడాకులు కావాలని ....
    రావు దగ్గిర నుండి సమాధానం రాలేదు. రావు స్వయంగా వచ్చాడు.
    వస్తాడని అనుకొంటూనే ఉన్నాను!
    ఈ మనసు తనను తానే ప్రతారించుకోవటంలో బహు గొప్పది!
    రావుకు మరొకరితో వివాహం చేసుకునే అవకాశ మివ్వటానికి విడాకులు కోరాను.
    కానీ, లోలోపల నా కలలు నేను కంటున్నాను. రావు విడాకులకు ఒప్పుకోడు! 'శారదా! నువ్వు తప్ప మరొకరు నా కక్కర్లేదు!' అంటాడు. ఈనాడు లతీఫ్ ఐశ్వర్యాన్ని నేను కోరటం లేదని తెలుసుకుని, నన్ను క్షమించి ఆదరిస్తాడు. మళ్ళీ ఎప్పటిలా ..... ఇదివరకటి కంటే అందంగా .... ఇలా కలలు కంటూంది మనసు.
    "శారదా! ఈ నోటీసు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదన్న మాటేకాని, నేను ఏనాడో నీకు విడాకులు ఇచ్చేశాను. ఇంకా అర్ధంకాలేదా నీకు!"
    నా గుండెల మీద నేను తట్టుకోలేని దెబ్బ తగిలింది. రావు నన్ను నిందిస్తాడనీ, అసహ్యించుకుంటాడనీ ఊహించాను. అందుకు సిద్ధంగానే ఉన్నాను. కానీ, 'ఏనాడో నీకు విడాకు లిచ్చేశాను. ఇంకా అర్ధంకాలేదా నీకు!' అంటున్నాడు రావు చలనం లేని స్వరంతో! ఆర్ద్రత హరించుకుపోయిన చూపులతో!
    నిజమే! ఇంకా అర్ధంకాలేదు నాకు! ఇప్పటికీ అర్ధం చేసుకోలేక పోతున్నాను. నమ్మలేక పోతున్నాను రావుకూ. నాకూ సంబంధం లేదని! ఏనాడో తెగతెంపు లయిందని!
    "పాపకోసం, నా కూతురుకోసం ఈ హాలాహలా న్నంతా మింగి నీకు నామమాత్రపు భర్తగా మిగిలాను. కన్నతల్లివి - పాప భవిష్యత్తు విషయం ఆలోచించ లేవా? లతీఫ్ సంగతి నాకు తెలుసు! నువ్వు నా భార్యగా నామమాత్రంగా నైనా సరే ఉన్నంత వరకూ, నిన్నతడు కోరలేడు. అతని లక్షలకు సంపూర్ణాధికారిణివి కాలేవు.
    "ఫరవాలేదు. లతీఫ్ తో చెపుతాను. మీ వ్యవహారాలకు నా నామమాత్రపు భర్త్రుత్వం అడ్డురాదు. నువ్వు కోరిందల్లా చేస్తున్నాను. పాప భవిష్యత్తుకోసం ఈ విడాకులు మాత్రం ఇవ్వలేను. క్షమించు."
    రాయిలా కూర్చున్నాను.
    వెనకటి బంగళాలోంచి చిన్న ఇంట్లోకి మారాను. కారు ఇచ్చేశాను. నగలు కూడా ఏం లేవు. ఇదంతా రావు గమనించలేదా? లతీఫ్ డబ్బుమీది ఆశతో విడాకులు కోరానని అనుకొంటున్నాడా?
    "రావ్! నువ్వు హాయిగా మరొకరిని పెళ్ళిచేసుకో వచ్చుగా!"
    పకాలున నవ్వాడు రావు.
    నా ముఖంలోకి వెటకారంగా చూస్తూ, "ఎంత ప్రేమ నా మీద!" అన్నాడు.
    ఆ మాటలు పలికిన తీరులో, ఆ స్వరంలో వ్యంగ్యం ఉట్టి పడుతూంది.
    నేను ఏ సంజాయిషీలు ఇవ్వదలుచుకోలేదు. ఒక్కసారి తల ఎత్తి రావు ముఖంలోకి చూశాను. నా కళ్ళలో ఏం కనిపించిందో ఒక్క సారిగా "నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు.

                                   
    తల ఎత్తాను కుతూహలంగా.'
    "ఇటీవలి నీ రచనలు చదివి నీలో మార్పు వచ్చిందనుకున్నాను!" నిట్టూరుస్తూ అన్నాడు.
    నా కళ్ళు  మెరిశాయి.
    అప్పటి సందర్భం పూర్తిగా మరిచిపోయి, "నా రచనలు నీకు నచ్చుతున్నాయా, రావ్! నేను వ్రాయగల నంటావా?" అన్నాను బేలగా.
    "నాకు సంతృప్తికరంగానే ఉన్నాయి. నీ ఆవేశాలకూ, ఆలోచనలకూ సంయమనం ఇంకా సాధించాలి నువ్వు ..."
    "థాంక్స్, రావ్! థాంక్స్!"
    చటుక్కున అతని దగ్గిరగా వెళ్ళి చిన్నపిల్లలా అతని రెండు చేతులూ పట్టుకుని ఊపేశాను. మెరుస్తున్న నా కళ్ళలోకి తదేకంగా కొన్ని క్షణాలు చూసి నెమ్మదిగా చేతులు విడిపింకుకున్నాడు రావు. మరొక్క సారి నా ముఖంలోకి చూడగలిగే శక్తి లేనివాడిలా తల వంచుకుని గబగబ వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS