Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 30


    ఒక్కక్షణం నా హృదయ స్పందన స్తంభించిన ట్లయింది. ప్రస్తుతం నాకు మిగిలినది పాప ఒక్కర్తే! దానిని దూరం చేసుకోనా? ఇప్పుడిప్పుడు పాపను నాకు గర్వకారణమైన ఒక అందాల పసిపాపగా కాక నా కూతురుగా చూడటం నేర్చుకుంటున్నాను. పాప కేం కావాలో అవి కొని ఇవ్వటంతో నా విధి నిర్వహించినట్లు తృప్తి పొంది ఊరుకోక దానితోటి ఆటపాటల్లో, దాని కబుర్లలో నిజమైన ఆనందాన్ని పొందగలుగుతున్నాను.
    విలువ తెలియని రోజుల్లో పాపకు కావాలని దూరంగా ఉన్నాను. విలువ తెలుసుకుని పాపకు దగ్గి రవుతున్న ప్పుడు పరిమళ కప్పగించెయ్యనా?
    "పాపా! అత్త దగ్గిరకి వెళతావా?"
    "ఓ!" సంబరంగా అంది.
    ఆ సంబరం చూసిన నా మనసు కలుక్కుమంది. ఏమిటీ ఈర్ష్య? అహర్నిశమూ బుసలు కొడుతూ అంతరంగంలో ఏ మూల దాక్కుని ఉంటుంది?
    "అత్త దగ్గిరే ఉండిపోతావా?"
    పాప తెల్లబోయి నన్ను చూసింది.
    కొంచెం సేపు ఆలోచించి, "మరి నువ్వు...?" అంది.
    నా మనసు ఊరడిల్లింది. పాపనుదగ్గిరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాను.
    "నువ్వెళ్ళు. తరవాత నేను వస్తాను."
    "భలే! భలే! మళ్ళీ నువ్వూ, నేనూ, అత్తా, నాన్న గారూ -అంతా ఒక్కచోటే ఉంటామా?"
    సంతోషంతో వెలిగిపోతూంది పాప ముఖం. నా మూర్ఖత్వంతో పాప పసిమనసుకు ఎంత క్షోభకలిగించావో అర్ధమయి, ఒక్క నిట్టూర్పు విడిచాను.
    "పరిమళా! పాపను నేను కన్నాను. కానీ, అది నీ కూతురు. నీ పొత్తును నీకు పంపిస్తున్నాను. ఎప్పుడైనా నేను వచ్చి చూస్తుంటాను.
                                                                                          నీ...
                                                                                         -వదిన."
    ఉత్తరం మడిచి సీతాలు కిచ్చాను. పరిమళ కియ్యమన్నాను. పాపను మళ్ళీ  మళ్ళీ ముద్దుపెట్టుకున్నాను. తన చిట్టి చేతులతో నా కన్నీళ్ళు తుడుస్తూ, "ఏడవ కమ్మా! నేను వెళ్ళను" అంది పాప.
    పసిపాపలు భగవత్స్వరూపాలు. లౌకిక విషయ వాసనలతో కలుషితం కాని వాళ్ళ అంతరంగం, ఎదుటి వ్యక్తుల కన్నీటికి అతి తేలికగా కరిగిపోతుంది. పసిపిల్ల లను బెదిరించటం కంటే లాలించి నచ్చ చెప్పటం ఎందుకు మంచిదో ఇప్పటికీ చాలా మందికి అర్ధంకాదు.
    నేను కళ్ళు తుడుచుకుని నవ్వాను.
    "నేను ఏడవటం లేదు, పాపా! వెళ్ళు. అత్తని అడిగానని చెప్పు...."
    పాప, సీతాలు కారులో కూర్చుని వెళుతూంటే కనుమరుగయ్యేవరకూ అలా చూస్తూ నించున్నాను. పాపను చూసి పరిమళ పొంగిపోతుంది. పాపను శాశ్వతంగా తనకే ఇచ్చేస్తూన్నానంటే పరిమళ ఎంత ఆనందిస్తుంది! పరిమళ కేమాత్రమైనా ఆనందం కలిగించ కలిగితే, వెనుక నేను కలిగించిన అంతులేని దుఃఖానికి కొంతైనా ఉపశమనం కలగదా?
    పాపా లేని ఇల్లు శ్మశానంలా ఉన్నా, పాపను చూడక పోతే మనసు అశాంతికి లోనయినా, నా పాప నాకు దూరమయిందన్న భావన గుండెలు బద్దలు చేస్తూన్నా, నన్నావరించిన ప్రతి వాయు కెరటమూ పాప చిట్టి పలుకులను నా మనోశ్రవణేంద్రియాలకు వినిపిస్తూ నాకు పిచ్చెక్కిస్తూన్నా - పరిమళ పాపను దగ్గిరికి తీసుకుని పొందే పారవశ్యాన్ని ఊహించుకొంటూ నిగ్ర హించు కున్నాను.
    ఆ మరునాటి కల్లా తిరిగి వచ్చింది సీతాలు. ఆ వెనక పాపను చూస్తూనే సంతోషంతో కౌగిలించుకున్నాను. ఎత్తుకుని గిరగిర తిప్పాను. హృదయానికి హత్తుకున్నాను. ముఖమంతా ముద్దులు కురిపించాను. "వచ్చావా, పాపా!" అన్నాను ఆర్తిగా.
    "ఎందుకు రానూ?" ఆశ్చర్యంగా అంది పాప.
    పాపను తిరిగి నా దగ్గిరకు పరిమళ ఎందుకు పంపిందా అనే విచికిత్స అప్పుడు ప్రారంభమయింది.
    సీతాలు నా చేతిలో ఒక పెద్ద ఉత్తరం పెట్టింది.
    "వదినా!
    నువ్వు నా కన్ని విధాలా పూజ్యురాలిని. నా కంటే పెద్దదానివి. నా కంటే తెలిసినదానిని. నీకు చెప్పగలిగే అర్హత నాకు లేదు. కానీ, వదినా! కేవలం నీ కోసం- నీ క్షేమం కోరి చెబుతున్నాను.
    పాపను కావాలని దూరం చేసుకుంటే నీకు ఏం మిగులుతుంది, వదినా! ఆ తరవాత నీ కసలు మన స్సిమితం ఉంటుందా? నీ రచనా వ్యాసంగానికి పాప ఆటంకం అవుతుందా? అయినా, జీవితంలోంచి దూరంగా పారిపోయి జీవితానికి వ్యాఖ్యాన రూపమయిన సాహిత్య స్రష్టపు కాగలవా? పాప చిరునవ్వుల్లో, ముద్దు మాటల్లో దొరకని ఆనందం నీ కా పుస్తకాల్లో దొరుకుతుందా? నువ్వు చూసే ప్రతి దృశ్యంలో, వినే ప్రతి సవ్వడిలో, అనుభవించే ప్రతి ఉద్వేగంలో-ఆకృతి పొందని అనేక కావ్యాలు నీ జీవితాన్ని రసవంతం కావించటం లేదా?
    వదినా! తల్లి తరవాతే ఎవరైనా! పాపకు మాతృ ప్రేమను దూరం చెయ్యకు. నీ విధులు నువ్వు నిర్వహించినంత మాత్రాన నీ రచనా వ్యాసంగం కుంటుపడదు. ప్రయత్నిస్తే అన్నింటికీ సమయం ఉంటుంది. ఈనాడు అవివేకంగా పాపను వదులుకున్నావంటే, ఒక నాటికి ఎంత పశ్చాత్తాపపడ్డా తిరిగి పొందలేవు. ఎంత సంపద ఉన్నా, నా అవే వారు లేని ఒంటరితనం కష్టాలన్నింటిలో పెద్ద కష్టం.
    నీ కే అవసరం వచ్చినా సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటాను. నన్ను అపార్ధం చేసుకోకు.


                                                                                      -నీ.....పరిమళ."


    రావుకు అన్నివిధాలా తగిన చెల్లెలు పరిమళ. పరిమళను నే నేనాడూ అపార్ధం చేసుకోలేదు. నే నాశించిన, నాలోలేని ఔన్నత్యం పరిమళలో ఉన్నందుకు ఏదో అసహనంతో రగిలేది మనసు ఇదివరలో. ఇప్పుడు పరిమళ ఔన్నత్యానికి జోహార్లు పలుకుతూ, ఆ అంచులు అందుకోవాలని తాపత్రయ పడుతూంది. పాప తన కెంత ప్రాణమయినా, పాప సాన్నిధ్యం తన దుఃఖాలన్నింటినీ మరిపించగలిగినా, నా కోసం - నా మాతృత్వానికి పరిపూర్ణత్వాన్ని కల్పించటం కోసం-పాపను నా దగ్గిరకు పంపించేసింది పరిమళ.
    ఇందులో పెద్ద ఆశ్చర్య పడవలసింది లేదు. పరిమళ ఈ రకంగా తప్ప మరో రకంగా ప్రవర్తించలేదని నేను ముందే ఊహించి ఉండవలసింది.
    ఎంతటి ఆనందం ఆహ్వానించినా, పరిమళ లాంటి వ్యక్తులు తను శిఖరాలు దిగి రారు! అగాధాలలోకి జారిపోరు!
    నాకు ఆశ్చర్యం కలిగించింది పరిమళ మేధ. పరిమళ ఇంత తెలివిగా ఆలోచిస్తుందనీ, ఈమాత్రం సాహిత్య పరిజ్ఞానం పరిమళకు ఉందనీ నే నెన్నడూ ఊహించలేదు.
    "జీవితంలోంచి పొరిపోయి, జీవితానికి వ్యాఖ్యాన రూప మయిన సాహిత్య స్రష్టవు కాగలవా?"
    ఎంత అద్భుతమైన ప్రశ్న!!

                                  41

    సీతమ్మకు వయసు పండిపోయింది. దానికి తోడు ఒక్కగా నొక్క కొడుకు పోయిన గర్భశోకం! ఆవిడ పూర్తిగా మంచ మెక్కింది. చూపు దెబ్బతింది. అడుగు తీసి అడుగు పెట్టలేక పోతూంది. శరీరానికి పక్షవాతం కూడా వచ్చింది. పరిమళ రావుకు సాయపడటానికి పొలానికి పోక తప్పటం లేదు. పాపం అక్కడికీ అత్తగారికి కావలసినవన్నీ అందుబాటులో ఉంచి మరీ వెళుతుంది. అయినా ఆ వృద్ధమూర్తి శోకానికి అంతులేదు. ఇదంతా నాకు సీతాలు ద్వారా తెలిసింది. ఒక్క సారి వెళ్ళి చూసి రావాలనుకున్నాను. ప్రస్తుతం నాకు కారు లేదు. ఆ బంగళా కూడా లేదు. కారును డ్రైవర్ తో సహా లతీఫ్ దగ్గిరకి పంపేశాను. నే నొక చిన్న ఇంట్లోకి మారి బంగళాను అద్దెకిచ్చి, ఆ అద్దె లతీఫ్ కిచ్చెయ్యమని చెప్పాను. నౌకర్ల నందరినీ మాని పించాను. పాపమీది మమకారం చేత సీతాలు మాత్రం నన్ను వదలలేదు. కారు తిరిగి తీసుకోమనీ, బంగళాలోకి వచ్చి ఉండమనీ లతీఫ్ నన్ను ప్రాధేయపడతా డనుకున్నాను. కానీ, లతీఫ్ ఆ ప్రస్తావనే తేలేదు. నేను అద్దెకుంటున్న చిన్న ఇంటికి కూడా లతీఫ్ నాలుగయిదు సార్లు వచ్చాడు. కానీ ఎన్నడూ డబ్బు ప్రసక్తే తీసుకురాలేదు. అతి మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మరో విషయం స్పష్టంగా అర్ధమయింది. పాపం, లతీఫ్ తనంతట తాను డబ్బు ఎరజూపి ఎన్నడూ నన్ను ప్రలోభ పెట్టలేదు. నేను ఐశ్వర్య కాంక్షతో, లజ్జ వదిలి నోరు విడిచి అడిగిన కోరికలు మాత్రం కాదనకుండా తీర్చాడు! సీతమ్మ నన్ను గుర్తుపట్టలేదు. అలికిడికి "ఎవరూ?" అంది.
    దగ్గిరగా వెళ్ళి, "నేను!" అన్నాను.
    నన్ను తడిమి తడిమి చూస్తూ, "పరిమళా! కాదు. పాపం! గొడ్డులా ఆ పొలంలో పడి చాకిరీ చేస్తోంది. ఆ బ్రహ్మరాక్షసి శారద ఏ ముహూర్తంలో ఆ ఇంటి కోడలయిందో కాని, పాపం పరిమళకు సుఖ మన్నది లేకుండా పోయింది. నే నొకదాన్ని గుదిబండలా తగిలాను! చచ్చినదాన్నీ కాను. బ్రతికినదాన్నీ కాను. ఎవరు నువ్వు? పరిమళకోసం వచ్చావా? సాయంత్రంకాని రాదు" అంది.    
    సీతమ్మ చూపు పూర్తిగా పోయిందని అర్ధమయింది. మంచం మీంచి కదలలేక పోతూంది.
    'బ్రహ్మరాక్షసి శారద!' ఆ మాట లంటున్నప్పుడు సీతమ్మ ముఖంలో కనిపించిన అసహ్యమూ, ఆ మాటలు పలికేటప్పుడు ఆవిడ కంఠంలో ధ్వనించిన కసీ-నే నంటే ఆవిడ కెంత మంటగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS