39
"నిస్స్వార్ధ ప్రణయ చిత్రణతో పాఠకుల కంట కన్నీ రొలికించ గలిగిన నువ్వు, శరీర సంయోగం లేని ప్రేమ ఏమిటని అడుగుతున్నావా?"
లతీఫ్ ప్రశ్న తిరిగి తిరిగి ధ్వనించసాగింది మనసులో! శరీర సంయోగం లేకుండా ప్రేమ ఉంటుందని నేను నమ్మటం లేదు. నేను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి రావు. అతనితో నా ప్రణయం ఒక రకంగా సంయోగంతోనే ప్రారంభమయింది. ఆ తరవాత కూడా నేను రావును ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ, ఆ ప్రేమ శరీర సంయోగంతో కూడినది అవునా, కాదా అని నే నెన్నడూ ఆలోచించలేదు. ఆ ప్రశ్నకు అవకాశమే లేదు గనుక! నేను ఏ శక్తితో ఆ నిస్స్వార్ధ ప్రణయాన్ని చిత్రించ గలుగుతున్నాను?
నవల వ్రాస్తూన్న దశలో నాకేదో ఆవేశంలాంటిది వస్తుంది. నేను సృష్టించిన వాతావరణంలో మానసికంగా జీవిస్తాను. అయినా, నా మనసుకే సువ్యక్తం కాని ఒక విషయం, అంత శక్తి మంతంగా నా నవలలోకి ఎలా వచ్చింది?

దానిని గురించే ఆలోచించగా ఆలోచించగా నా కొక విషయం స్ఫురించింది. అగోచరమయిన మానవుని మనసు సమస్త భావాలకూ నిలయం. ఏ భావాన్ని నువ్వు జాగృతం చెయ్యదలుచుకొంటే ఆ భావంలో, ఆ క్షణంలో నీ మనసు వ్యగ్రత వహిస్తుంది.
నేను ప్రణయ గాథలు చిత్రీకరించటానికి ఉదాత్త ప్రణయ భావనను అసంకల్పితంగా నాలో జాగృతం చేసుకున్నాను. ఆ కారణంగా ఆ భావంలో నా మనసు ఏకాగ్రతను పొంది, సమర్ధంగా ప్రణయోద్వేగాన్ని చిత్రించగలుగుతున్నాను.
మానవుని అస్తిత్వానికి ఒక స్థిరత్వం ఏర్పడిన వెంటనే మేల్కొనేది కామ భావన. దాని రసాకృతి శృంగారం. ఆ కారణంచేత ప్రణయ భావాన్ని జాగృతం చేయటం తేలిక. మనసు కే కొద్దిపాటి సున్నితత్వమూ, చైతన్యమూ ఉన్నా దీనిని సాధించవచ్చు. అలా మిగిలిన భావాలను కూడా జాగృతం చెయ్యవచ్చునా? అది ప్రయత్న సాధ్యమేనా? ఆయా భావాలలో సహితం మనసు ఏకాగ్రతను వహిస్తుందా? ఆయా భావోద్వేగా లను సహజంగా చిత్రించ గలుగుతానా?
ప్రయత్నించాలి!
ప్రయత్నించాను. కానీ, నా మనసును భక్తి భావనలోకాని, వాత్సల్య భావనలో కాని జాగృతం చెయ్యలేక పోయాను. ఆ భావనలో దానికి ఏకాగ్రత రావటం లేదు. వెనక నాలో ప్రణయ భావన అసంకల్పితంగా జాగృత మయింది. ఈమారు ప్రయత్నించీ మరొక భావనను జాగృతం చెయ్యలేక పోతున్నాను. కారణ మేమిటి? ఒక భావనను జాగృతం చెయ్యటానికి కనీసం ఆ భావనకు సంబంధించిన వాసనలైనా మనసుకు ఉండాలి. ఆ వాసనా బలంతోనే ఒక భావం జాగృత మవుతుంది. నాకు ప్రణయానుభవం ఉంది. అంతే కాదు, మనసారా ప్రేమించగలిగే శక్తి కూడా ఉంది. ఆ కారణం చేత ప్రణయ భావం అతి సునాయాసంగా జాగృత మయింది.
అంటే, మనస్సీమకు పరిచితమైన పరిధిలోనే ఈ జాగృతీకరణం సాధ్యమవుతుంది.
ఆకస్మికంగా నాకు సాక్షాత్కరించిన లతీఫ్ ఔన్నత్యం నాలో ఏదో నిర్వేదాన్ని రేపింది. ఆ నిర్వేదం నా మనసును మధింప నారంభించింది. ఈ నిర్వేదమే అన్ని భావాలకూ పుట్టినిల్లనీ, ఈ నిర్వేదంలోంచే జిజ్ఞాస, విచక్షణ ఉద్భవ మందుతాయనీ, వీటి సాయంతో నేను ఇంతవరకూ ప్రయత్నించీ సాధించ లేకపోయినా సంయమనాన్ని సాధించవచ్చనీ క్రమ క్రమంగా అర్ధమయింది.
ఈ మథనలో ఉత్పన్నమయిన భావాలను ఆలంబనం చేసుకుని వ్రాయటం ప్రారంభించాను. వెనక వెర్రిగా నా నవలలు ఆరాధించే పాఠకులు పెదవి చప్పరించారు.
కాని, కొందరి కొందరి ప్రశంసలు సహితం అందుకో గలుగుతున్నాను. ఎవరు పొగిడినా, ఎవరు తెగడినా నా ధోరణిలో నేను వ్రాయటం మానలేదు. ఎందుకంటే, వ్రాసే కాలంలో నా మనసు పొందే ఔన్నత్యం తక్కిన సమయాలలో నిలవటం లేదు. ఒక ఏకాగ్రతతో నేను వ్రాసుకునే విషయాలు, తరవాత నన్ను నేనే సంస్కరించుకోవటానికి ఉపకరిస్తున్నాయి. నా పుస్తకాలు అమ్ముడయినా కాకపోయినా, పాఠకులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నా ధోరణి మార్చలేదు. నిర్వేదం ఆధారంగా నేను వ్రాయసాగిన కొద్దీ నా నిర్వేదం తీవ్రతరం కావటం గమనించాను. దానితో భావాలకు నైశిత్యం, భాషకు జీవం వృద్ది పొందసాగాయి. ప్రశంసించే పాఠకుల సంఖ్య కూడా వృద్ధిపొందింది. అయితే వెనకటి పాఠకులు వేరు! ఈ పాఠకులు వేరు! ఈ పాఠకులు నన్ను ప్రశంసిస్తూనే నా రచనలో లోపాలు సున్నితంగా ఎత్తిచూపు తున్నారు. నా రచనలో సంయమనం ఇంకా రాలేదని నాకు స్పష్టపడుతూంది.
"రావ్! నా గుండెల లోతులలోంచే వ్రాస్తున్నాను. వాస్తవంగా నా మనసులో స్పందించినదానినే చిత్రిస్తున్నాను. అయినా, అందరూ ఆనందించలేక పోవటానికి కారణ మేమిటి?"
"'నీ భావాలలో నైశిత్యం ఉన్నది, నిజమే! కానీ, అవి కాంతాసమ్మితాలుగా లేవు. అందుకే సర్వజనీనాలు కావటం లేదు."
"అంటే?"
"నువ్వు చెప్పదలుచుకున్నది ఉపన్యాసంలా ఉండ కూడదు. కథలో ఒక భాగంగా కరిగిపోతూ నువ్వు చెపుతున్న విషయం కూడా పాఠకులకు అర్ధంకాకుండా వారి మనసులను హత్తుకొని పోవాలి. నవలకు ప్రధాన మయినది కథా కథన చాతుర్యం. మిగిలిన ఏ విలువలకు కాని అది దెబ్బతినకూడదు.
అంతులేని ఆశ్చర్యం కలిగింది. అక్కడ రావు లేడు. కేవలం నా భావనలో రావు నుద్దేశించి అలా మాట్లాడాను. నా భావనలో సరిగ్గా రావు చెప్పే సమాధానమే భాసించింది. నా అంతట నా కింతగా ఆలోచించగలిగే శక్తి లేదు. ఇదెలా సాధ్యం?
నా భావనలో లతీఫ్ నుద్దేశించి మాట్లాడితే శూన్యమే మిగులుతుందే! ఏ సమాధానమూ భాసించదే?
అర్ధమయింది. రావును నేను ప్రేమిస్తున్నాను. ఆ కారణంచేత సరిగ్గా రావు చెప్పే సమాధానమే భాసిలచింది. లతీఫ్ పట్ల నాకే ఆర్ధ్రభావమూ లేదు. ఆ కారణంగా అతని భావన నాకు శూన్యాన్ని మాత్రమే అందించగలదు.
అర్ధమయింది!
రచయితకు ఆర్ద్రార్ధ్రమయిన హృదయం ఉండాలి. లోకంలో ప్రతి ప్రాణి పట్లా సానుభూతి ఉండాలి. అంటే, మొత్తంమీద సహృదయుడై ఉండాలి.
అట్లాంటి రచయిత తాను కలం పట్టుకుని పాత్రల చేత సంభాషణలు పలికించ నక్కరలేదు. మనస్సీనులో పాత్రలను ఏకాగ్రంగా భావిస్తే చాలు, పాత్రలన్నీ తామే సంభాషిస్తాయి.
బుసలుకొట్టే విషయలాలన కొద్దిగా తల వంచగానే జీవితం దాని వివిధ వర్ణాలతో యథాతథంగా కనిపించసాగింది. ఆవేశాలతో, ఆకాంక్షలతో కొట్టుకుపోయె మనసుకు అనుభవాలు అనుభవాలుగానే మిగిలిపోయేవి. ఆవేశం అణిగి కాంక్షల కోరలు బండబారిన తరవాత ప్రతి అనుభవమూ కావ్య వస్తువుగానే తోచసాగింది! 'కా దేదీ కవిత కనర్హం' అన్న శ్రీశ్రీ పలుకులలో వాడి అర్ధ మయింది.
'నీ రచనా వస్తువు జీవితంలోంచే రావాలి' అనే రావు సలహా ఇప్పుడు పాటించ గలుగుతున్నాను.
నీ పరిసర వ్యక్తులను, జీవితాన్ని నిండుగా ప్రేమిస్తూనే జీవితానికి అవతల నిలిచి జీవితాన్ని పరిశీలించ వచ్చునని లీలగా తోచసాగింది. నిర్మొహ దృష్టి అంటే మమతా రహితమైన స్తబ్ధత కాదనీ, తపస్సాధనకు అరణ్యాలలోకి వెళ్ళనక్కరలేదనీ, శ్మశాన వైరాగ్యంలోంచి కాక స్పందించే హృదయంలోనుంచే సృష్టి రహస్యం బోధపడుతుందనీ స్ఫురించసాగింది.
భావనా బలంతో దృగతీత విషయాలను సాక్షాత్కరింప చేసుకోగలగటమే క్రాంతదర్శిత్వం- అలా దర్శించగలిగినవాడే ద్రష్ట ఋషితుల్యులే అలాంటి ద్రష్టలు కాగలరు. సమస్త విశ్వాన్నీ నిర్మోహంగా సానుభూతితో చూడగలగటం ఋషులకే సాధ్యం. వశ్యవాక్కులు దర్శించిన దానిని వర్ణించగలరు. తపస్సుకు సజాతీయమైన ఏకాగ్ర సాధకులు కాని వశ్యవాక్కులు కాలేరు. ఈ కారణంగానేనా ఆర్యులు 'నా నృషిః కురుతే కావ్యం!' అన్నారు!!
40
'ఒకరు మెచ్చుకున్నా మెచ్చుకోక పోయినా నువ్వు వ్రాయాలి' అన్న రావు మాటలు నా కొకనాడు అర్ధం కాలేదు. ఈనాడు అర్ధమవుతున్నాయి.
నా రచన పాఠకులు ప్రశంసిస్తున్నారా, లేదా ఆనే దృష్టి నా కే కోశానా లేదు. నా కోసం, నా మనసులో ఉత్తమ భావాలను జాగృతం చేసుకుని వాటి బలంతో క్షుద్ర భావాలను జయించే ప్రయత్నంలో వ్రాసుకుంటున్నాను. నాలో నిర్వేదం అతిశయించినకొద్దీ ఇది వరకు ఊహలోకి కూడా రాని విషయాలనేకం అర్ధమవుతున్నాయి. ఈ లోకంలో అందరి కంటే ఏదో ప్రత్యేకత కలిగిన దానిని విర్రవీగే నాకు అందరికంటే నే నెంత క్షుద్రురాలినో అర్ధం కాసాగింది.
పరిమళకు, పాపకు, నా రావుకు, చివరికి లతీఫ్ కు నే నెంత ద్రోహం చేశానో అర్ధమవుతూన్న కొద్దీ దుస్సహ వేదనతో విలవిలలాడసాగింది మనసు.
జరిగిపోయిన దానికి ఏమీ చెయ్యలేను. కానీ నేను చేసిన ద్రోహాలకు పరిహారమైనా చెల్లించగలవా? నేను అంతులేని క్షోభ కలిగించింది పరిమళకు - పరిమళకు ఏ రకంగా సంతోషాన్ని కలిగించగలను నేను? పరిమలకు పాప అంటే ప్రాణం! పాపను పరిమళ కిచ్చేస్తే!
