Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 28


    "కానీ, నేను వెళ్ళిపోవాలి, శారదా!" రావు చిరాగ్గా అన్నాడు.
    ఆ చిరాకు నా మనసు మరింత విరిచింది.
    "వెళ్ళు!" నిర్లక్ష్యంగా అన్నాను.
    రావు ఉలికిపడినట్లు చూశాడు. ఒకటి రెండు క్షణాలు నా ముఖంలోకి పరిశీలనగా చూసిన రావుకు నా మనసు అర్దమయిపోయింది.
    విసురుగా లేచి నించుని, "నేనే కాన్వెంటుకు వెళ్ళి పాపను తీసుకువెళతాను" అన్నాడు.
    అంతకంటే విసురుగా లేచాను నేను.
    "తీసుకెళ్ళనివ్వను నేను. పాపమీద ఏ అధికారమూ లేదు నీకు. ఈవేళే కాదు- ఏనాడూ నేను పాపను నీతో పంపను. కోర్టుకు వెళతానంటావా? వెళ్ళు. న్యాయస్థానాలలో తీర్పు న్యాయాన్ని అనుసరించి ఉండదు. నీ పెట్టుబడిని అనుసరించి ఉంటుంది."
    తోకమీద నిలిచిన ఆడతాచులా బుసలుకొట్టు తూన్న నన్ను చూస్తూ అలా నిలబడిపోయిన రావు ముఖం తెల్లగా పాలిపోయింది.
    విమూఢుడిలా అలా కొంచెం సేపు నిలిచిపోయి, "వెళతాను" అంటూ వెనక్కి తిరిగాడు.
    లయబద్ధంగా పడే అడుగులతో సాగిపోతున్న ఆ మూర్తిని కనుమరుగయ్యేంత వరకూ చూస్తూ అలాగే నిలుచున్నాను.
    పాప కాన్వెంటు నుంచి ఇంటికి రాగానే రోజూ అడిగే ప్రశ్న అడిగింది: "నాన్నగారు వచ్చారా?"
    క్రూరంగా ఆయావైపు చూశాను.
    ఆయా తల దించుకుని, "రాలేడు" అంది.
    పాప ముఖం వేలాడేసుకుని వెళ్ళిపోయింది. కానీ, ఆరేళ్ళు నిండీ నిండని పాప తనంత తను తండ్రి దగ్గిరకి వెళ్ళిపోతుందని మాత్రం నే నెన్నడూ ఊహించలేదు.

                                  38

    పాపను తీసుకుని రావు దగ్గరనుండి వచ్చినప్పటి నుండి నాకు బొత్తిగా స్తిమితం లేకుండా పోయింది. అనుక్షణమూ నీరసించినా నిర్లక్ష్యంగా నవ్వే రావు ముఖమే నా మనఃఫలకంలో ప్రత్యక్షం కాసాగింది. ఆకలికి ప్రాణాలు పోయినా రావు నా దగ్గిరకి రాడని స్పష్టపడిపోయింది. రావుకు ఉద్యోగం రాకుండాచేసి రావు మరింత కష్టాల పాలవటానికి నేనే కారకురాలి నయ్యాననే భావం పుండులా సలపసాగింది. అపరాధ భారాన్ని సహించలేని మనసు - అపరాధం నాదేనని గుర్తించగలిగే అంతరంగాన్ని అహంతో అణిచే నా మౌర్ఖ్యం - అతి తేలిగ్గా నెపాన్ని లతీఫ్ మీదికి తోసేసింది. రావు కష్టాలకు లతీఫే కారకుడని క్షణాలలో నన్ను నేను నమ్మించుకో గలిగాను.
    లతీఫ్ కొనిపెట్టిన కారులో లతీఫ్ మీద యుద్దానికి వేగంగా బయలుదేరాను.
    నన్ను చూడగానే లతీఫ్ ముఖం వికసించింది.
    "రా, శారదా! నువ్వు వస్తావో, రావో అనుకున్నాను. వచ్చావు. నేను మరీ అంత దురదృష్టవంతుణ్ణి కానన్న మాట! జ్వరం ఈవేళ కూడా అలాగే ఉంది. కాని, డాక్టర్ వారం రోజుల నుంచీ రెండు రోజుల్లో తగ్గిపోతుందని చెబుతున్నాడు. అందుచేత అతని మాటలు నమ్మవచ్చు!"
    నేను తెల్లబోయాను.
    లతీఫ్ తనకు జ్వరంగా ఉన్నట్లు వారం రోజుల క్రిందట నాకు కబురు పంపించాడు. కానీ, నే నా విషయమే పూర్తిగా మరిచిపోయాను. నాకు కొంచెం తలనొప్పి వస్తే, లతీఫ్ ఆరాటపడిపోతూ తగ్గేవరకూ స్తిమితం పొందలేకపోయేవాడు. అతనికి జ్వరం వచ్చినా, ప్రత్యేకం నాకు కబురు పంపినా చూడటానికి కూడా రాలేకపోయాను నేను.
    ముఖం చూస్తూనే ఎదుటివాళ్ళ మనసు చదివెయ్యగల లతీఫ్ ముఖంలో చిరునవ్వు నా ముఖంలో భావ సంచలనం గమనించగానే తుడుచుకుపోయింది.
    తన మంచంమీది డదిండు మీదికి ఒరిగి కూర్చుని సిగరెట్ ముట్టించుకుంటూ, "ఏం పనిమీద వచ్చావు?" అన్నాడు.
    "నే నే పని చెయ్యమన్నా చేస్తావా?"
    "ఇంతవరకూ చేస్తూనే ఉన్నానుగా!"
    "నీ స్వంత ఆలోచన లేనే లేదా?"
    "ఎందుకు లేదు?"
    "ఉండీ ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు?"
    "దానికేంలే! గంపెడంత విచక్షణా జ్ఞానాన్ని చిటికెడు వ్యామోహం అతి సునాయాసంగా మింగేస్తుంది. ఇంతకూ నేను మూర్ఖంగా ప్రవర్తించిన దెప్పుడు?"
    "రావుకు ఉద్యోగం రాకుండా చేశావు. అతడెంత ఇబ్బందులలో ఉన్నాడో తెలిసీ, అంత రాక్షసంగా ప్రవర్తించావు. ఇంతేనా నీ స్నేహం?"
    లతీఫ్ కొన్ని క్షణాలు విస్తుపోయి నా ముఖం వంక చూసి పకపక నవ్వాడు.
    "ఎందుకు నవ్వుతావు?"
    "ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు, చిట్టితల్లీ! నువ్వు చేసినదానికి పశ్చాత్తాప పడతావని నాకు తెలుసు కాని, ఇదేదో తమాషాగానే ఉంది. ఏం జరిగిందేమిటీ? పాపకోసం గ్రామానికి వెళ్ళావు కదూ! అక్కడ వాళ్ళు మరీ ఇబ్బందులలో ఉన్నారా?"
    రావు, లతీఫ్ స్నేహితులయినందుకు ఇద్దరిలో సామాన్య లక్షణాలు కొన్ని ఉన్నాయి. ముఖాలు చూస్తూనే మనసులు చదవగలగటం, దేని వెనక ఏది ఉందో సరిగ్గా ఊహించగలగటం - ఇద్దరూ ఒక్కలా చెయ్యగలరు.
    "అవును. ఆ అవతారం చూస్తే మతి పోయింది. నిజమే, నాకు బుద్ధి లేదు. నేను రావుకు ఉద్యోగం రాకుండా చూడమన్నది రావుమీది కసితో కాదు. అలా అయినా రావు నా దగ్గిరకి వస్తాడని..."
    "నాకు తెలుసు..."
    "తెలుసా? అయితే ఉద్యోగం పోయినా రావు నా దగ్గిరకి రాడని కూడా తెలిసి ఉండాలి."
    "అదీ తెలుసు."
    "హుఁ! అన్నీ తెలుసు! తెలిసీ తెలిసి ఎందుకిలా చేశావు? స్నేహానికిదా అర్ధం?"
    "రావు నీ దగ్గిరకి రావాలనే నేనూ ఉద్యోగం రాకుండా చేశానేమో?"
    "ఒక్కనాటికీ కాదు, నేను ఛస్తే నమ్మను."
    లతీఫ్ నా వంక చూసి నవ్వాడు.
    "ఎందుకు నమ్మలేవు?"
    నేను సమాధానం చెప్పలేదు. మనసులో వ్యక్తా వ్యక్తంగా ఉన్న ఆ భావాన్నిస్పష్టం చేసుకుని దానికి భాష నియ్య దలుచుకోలేదు.
    "నిజమే! సరిగ్గా ఊహించావు, ఇంత ఊహించగలిగినదానివి నా మనసుకు వ్యతిరేకంగా నా కెంత కష్టం కలుగుతోన్నా ఆ పని ఎందుకు చేశావో కూడా ఊహించగలవు."
    నా ముఖం తెల్లగా పాలిపోయింది.
    పెదవులు వణికాయి.
    "ఏమో! నా ఊహ కందటం లేదు."
    "పోనీ, నన్ను చెప్పమంటావా?"
    "వద్దు!"
    "అయితే సరిగ్గా ఊహించా వన్న మాట!"
    పకపక నవ్వి, మళ్ళీ దిళ్ళమీద ఒరిగిపోయాడు లతీఫ్.
    "పోనీ, ఇప్పుడు రావుకు ఉద్యోగం ఇప్పించలేవా?"
    "ఉహుఁ! నా తరం కాదు. అతను దరఖాస్తు పెట్టుకోకుండా ఉద్యోగ మెలా వస్తుందీ? కావలసినప్పు డల్లా ఖాళీలు ఉంటాయా? సరే! నువ్వెళ్ళు!"
    అలసటగా కళ్ళు మూసుకున్నాడు లతీఫ్.
    జ్వరంలో ఉన్న అతడిని చూస్తే ఆ క్షణాన ఏదో జాలి కలిగింది.
    "నువ్వు జ్వరంలో ఉన్నావని చూడటానికి వస్తే వెళ్ళి పొమ్మంటా వేమిటి?"
    కనురెప్పలు తెరిచి నవ్వాడు లతీఫ్.
    వయసులో ఇతను చాలా అందగాడై ఉండాలి! ఆ కళ్ళ నిండా ఎంత విషయలాలన!
    "నువ్వు నన్ను చూడటానికే వచ్చావా?"
    "మరెందుకు వచ్చాను?"
    ఒక్క నిట్టూర్పు విడిచాడు లతీఫ్.
    "నిన్ను నిన్నుగానే ప్రేమించగలను, శారదా! నా దగ్గిర అబద్దాలాడకు."
    అదిరిపడ్డాను. ఎప్పటినుండో పేలుతుందని భయపడుతున్న బాంబు పేలింది. నాకు ఆశ్చర్యం కలగలేదుకాని, పర్యవసానాలు ఎదుర్కొనటానికి సిద్ధంగా లేను.
    "నన్ను ప్రేమించావా?"
    "నువ్వు కోరిన ప్రతిదీ ఎందుకిస్తున్నాను? ప్రాణ స్నేహితుడైన రావును ఆదుకోగలిగే శక్తి ఉండీ, నీ మాటకు కట్టుబడి ఎందుకు ఆదుకోలేకపోయాను? ఇప్పుడింకా నీ కా విషయం ప్రశ్నగానే ఉందా?"
    లోలోపల వణికాను. కానీ, ఎప్పుడూ నాలో బుసలు కొట్టే సందేహాన్ని బయట పెట్టాను.
    "నన్ను ప్రేమిస్తే .... నువ్వెప్పుడూ..... నాతో .... నువ్వు ..... నన్ను..."
    లతీఫ్ గట్టిగా నవ్వాడు.    
    " 'కోరలేదేం?' అంటావు. అంతేనా? అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమైనది: నీ ప్రవర్తనకు ఏదో ఒకనాడు పశ్చాత్తాప పడతావని నమ్మకం నాలో ఉంది-ఎందుకో? ఆనాడు రావు ముందు దోషిగా నిలవటం నా కిష్టం లేదు. రెండవది: నేను నిన్ను ప్రేమిస్తున్నానే కాని, నువ్వు నన్ను ప్రేమించటం లేదు. నా డబ్బు తప్ప నీకు నేను అక్కరలేదు. నిన్ను డబ్బుతో కొనుక్కోవటం నా కిష్టం లేదు. కేవలం అందమైన నీ శరీరం మీది వ్యామోహం కాదు ఇదంతా! తలుచు కొంటే నీ కంటే అందమైనవాళ్ళను క్షణాలలో కొనుక్కోగలను."
    ఆశ్చర్యంగా విన్నాను.
    "మరి, ఎందు కిదంతా చేస్తున్నట్లు?"
    ఈసారి లతీఫ్ నన్ను ఆశ్చర్యంగా చూశాడు.
    "ఇదేం ప్రశ్న, శారదా! అత్యద్భుతమైన ప్రేమ గాథలతో అశేష పాఠకులను పరవశింపజేసే నువ్వు- శరీర సంయోగం లేకుండా ప్రేమ ఏమిటని అడుగుతున్నావా? ఇంతటి శూన్యహృదయినివా నువ్వు? హృదయాలను స్పందింపజేసే ఆ మహత్తర ప్రణయం, గుండెలను కరిగించి కన్నీరు కార్పించే నిస్స్వార్ధ ఆరాధన, ఊపిరి నిలబెట్టివేసే సంఘర్షణ, మనసునూ తనువునూ పులకింపజేసే సరస సంవిధానం - ఎలా కురుస్తున్నాయి నీ కలంలో నుంచీ?" లతీఫ్ ఆశ్చర్యం, అతని ప్రశ్న నా మనసు లోలోపలి పొరలలోకి దూసుకు పోయాయి.
    అతని ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక పోయాను. చెప్పటానికి సమాధానం నాకే తెలియదు. ఇది నాలో నేను ఆలోచించుకోవాలి.
    "మరి, రావుకోసం మనం చెయ్యగలిగిందేమీ లేదా?"
    "ఒక్కటే ఉంది."
    "ఏమిటీ?"
    "పాపను తరుచు అక్కడికి పంపటం. పరిమళ పాపను కన్నతల్లిలా పెంచింది. పాప దగ్గిర ఉంటే పరిమళ తన మనోవ్యథ కొంతవరకు మరిచిపోగలదు. పాపలో నిన్ను చూసుకుని రావు తన వేదన మరిచిపోవటానికి ప్రయత్నిస్తాడు."
    మరొక్కసారి ఆశ్చర్యపోయాను.
    "పాపలో నన్ను చూసుకుంటాడా? వేదన మరిచిపోవటానికి ప్రయత్నిస్తాడా? అంటే, నన్ను విడిచి ఉండటం రావుకు కూడా వేదనగానే ఉందా?"
    "ఎంత పిచ్చిదానివి నువ్వు! ఇన్నాళ్ళు రావుతో కలిసి మెలిసి ఉండి రావును ఇంతమాత్రం అర్ధం చేసుకోలేదా?"
    "మరి, ఎందుకు రాడు నా దగ్గిరకి?"
    "మనసులో ప్రేమ లోపించినప్పుడు కేవలం శరీరాన్ని రావు అంగీకరించలేడు."
    "నా మనసులో రావుపట్ల ప్రేమ లోపించిందా?"
    లతీఫ్ సమాధానం చెప్పలేదు. జాలిగా నవ్వి ఊరుకున్నాడు.
    "నేను రావును తప్ప ఎవరినీ ప్రేమించలేదు." బేలగా అన్నాను.
    లతీఫ్ ఆర్ద్రస్వరంతో అనునయిస్తున్నట్లు, "నువ్వు రావును కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది వ్యక్తులనే కానక్కర్లేదు" అన్నాడు.
    ఉలికిపడ్డాను. అర్ధమయింది.
    "వెళతాను నీ ఆరోగ్యం జాగ్రత్త!" అన్నాను. నా మాటలను నేనే ఆశ్చర్యపోయాను.
    లతీఫ్ ఆరోగ్యం పట్ల నాలో ఈమాత్రం శ్రద్ధ నిజంగానే కలగటం నాకె ఆశ్చర్యంగా ఉంది. నాలో లోపలి కవాటాలేవో తెరుచుకుంటున్నాయి. అహం మాటున అణిగిపోయిన ఆర్ద్రభావ మేదో ఆర్తితో ఊపిరి పోసుకుంటూంది.
    "విష్ యు బెస్ట్ ఆఫ్ ది లక్!" అన్నాడు చిరునవ్వుతో లతీఫ్.
    ఈ లతీఫ్ పరమ దుర్మార్గు డనుకొనేదానిని. ఎంతటి ఔన్నత్యం ఉంది ఇతనిలో!
    ఇన్నాళ్ళూ ఇతనిని అర్ధం చేసుకోలేకపోయాను. అంతే!
    అర్ధం చేసుకోగలిగితే లోకంలో అసలు దుర్మార్గులే ఉండరేమో?
    అర్ధం చేసుకోవాలి! ఈ ఒక్క వాక్యంలోనే జీవిత రహస్యాలన్నీ ఇమిడిపోయి ఉన్నాయి!

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS