36
ఆ కవరు పైన దస్తూరి చూస్తూనే ఎగిరి గంతులేసింది నా మనసు. వంకర టింకరగా ఉన్నట్లు తోస్తూనే ఏదో అందంతో తీర్చినట్లుండే ఆ దస్తూరీ రావుది. ఎందరిలోనైనా అన్నివిధాలా తన ప్రత్యేకతను నిలుపుకో గలిగిన రావు దస్తూరి ప్రత్యేకంగా ఎందుకు ఉండదూ?
ఉత్తరం తెరవకుండా ఆ దస్తూరిని పదే పదే ముద్దెట్టుకున్నాను. దానిని హృదయానికి హత్తుకున్నాను.
రావు నాకు ఉత్తరం వ్రాశాడు! నా రావు నాకు ఉత్తరం వ్రాశాడు. అంటే నా మీద కోపం లేదన్న మాట! రావు కింకా నేను కావలసినదాన్నే! రావు ఆప్యాయంగా నాకు ఉత్తరం వ్రాయటం - శరీరంలోని అణువణువూ మధురమైన గిలిగింతలతో పులకించి పోయింది. ఆ ఉత్తరం న శరీరంలో ఏ భాగానికి అనించుకున్నారావు స్పర్శించినట్లే తోచింది. మనసు నిండిపోయిన అతి తీయని సంతృప్తి - ఆ సంతృప్తి లోతులలో నుండి ఏదో సన్నని పదునైన ఘోష! వియోగానలంలో విలవిలలాడే మనసు పొందే ఆర్తి!
రావుకు దూరంగా బ్రతకటం నా తరం కాదు. ఏదో విధాన రావును నేను తిరిగి పొందాలి.
నా గదిలోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని ఉత్తరం విప్పాను.
"శారదా!
రాఘవ మరణించాడు. నువ్వెన్ని పనులలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా ఒక్కసారి రా! నీకు శ్రమ ఇస్తున్నందుకు క్షమించు. దయచేసి ఒక్కసారి వచ్చి పరిమళను ఓదార్చి పో!
-రావు."
అంతే ఉత్తరం! ఎన్ని సార్లు అంత ఆత్రతతో చదివినా అవే సంగతులు.
రాఘవ మరణించాడు! ఆ అక్షరాల వంక చూడలేక పోయాను. ఆ వాక్యంలో ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క పిశాచంలా నన్ను చూసి వికటాట్టహాసం చేసింది. నా మనసులో విలయతాండవం చేస్తున్న పిశాచాలన్నీ ఆ అక్షరాలలో రూపు దాల్చినట్లు తోచింది. మృత్యుదేవత కరాళ శీతల హస్తం నన్ను చుట్టినట్లుగా శరీరమంతా చల్లగా అయిపోయింది. నా నీడను చూసి నేను వణికాను. నాలోకి నేను చూసుకోలేక కళ్ళు మూసుకున్నాను.
రాఘవ మరణించాడు! కళ్ళులేని ఆ గంభీరమైన విగ్రహం- శాంత గంభీరమైన పరిమళ శోకమూర్తి - 'నా భర్త నాకు కావాలి.... ఆయనను దక్కించు కోవాలి' అని దీనంగా ఆక్రోశించే పరిమళ ఆర్తస్వరం-నా చుట్టూ నాట్యం చేయసాగాయి.
నా మస్తిష్కం చికాకు పడిపోతూంది. ఉద్వేగంతో శిరసు రెండుగా చిట్లిపోతుందేమో అనిపించసాగింది.
బ్రతిమాలుతున్నట్లు వ్రాసినా రావు ఉత్తరంలో ఆజ్ఞ ఉంది. నేను స్వయంగా సృష్టించిన ఆ శ్మశానం లోకి వెళ్ళగలిగే సాహసం నాకు లేకపోయినా రావు ఆజ్ఞ కాదనకలిగే శక్తి నాకు లేదు.
'దయచేసి ఒక్కసారి రా!' అనే రావు పిలుపు సూదంటురాయిలా నన్ను ఆ ధ్వనికేసి లాక్కొని పోతూంది.
పాపను ఆయా కప్పజెప్పి నే నొక్కదాన్నే బయలు దేరాను.
"వదినా!" నిన్ను చూడగానే కౌగిలించుకుని బావురుమంది పరిమళ.
అస్థిపంజరంలా తయారయిన శరీరం, జీవకళ పూర్తిగా కోల్పోయిన ముఖ కవళిక, ఆశా నిరాశలకు అతీతంగా శూన్యాన్ని నింపుకొన్న గాజు చూపులు!
పరిమళ రోదన నా మనసుని మధిస్తూంది. అట్టడుగున పడి ఉన్న అమృతం వెలికి వచ్చే ప్రయత్నంలో ప్రథమంగా కాలకూటం భయానక జ్వాలలతో నా మనసును దహిస్తూంది.
రెండు చేతులలో తల పెట్టుకుని ఒక మూల కూర్చున్నాడు రావు. ఒక్కసారి తల ఎత్తి నా ముఖం లోకి చూసి అంతలో తల దించుకున్నాడు.
వడిలిపోయిన ఆ ముఖం, చిక్కిపోయిన ఆ శరీరం చూడలేక వణికాను. భగవాన్! నా రావుకి కూడా ఏమైనా అయితే...?
ఆ ఆలోచనను సహితం భరించలేకపోయాను. బలహీనమైన మనసు కుతకుత ఉడికిపోతూంది.
"వదినా! భగవంతుడికి కూడా నా మీద దయ లేక పోయింది." ఏడుస్తూ అంటూంది పరిమళ.

"కూడా" అంటే? ఇంకెవరికి దయ లేకపోయిందీ? నన్ను కదూ, అంటూంది!
పరిమళ దుఃఖలన్నింటిలో దుర్భరమైన దుఃఖాన్ని అనుభవిస్తూంది. ఎంతో సహనం గల పరిమళ ఈ వేదన సహించలేక పోతూంది. పరిమళను నే నెంత దూరం చేసుకున్నా ఇంకా పరిమళ నన్ను ఆత్మీయురాలి గానే భావిస్తూంది. అందుకే ఈ ఆపద సమయంలో నాతో ఆవేదనను పంచుకొని తనను ఓదార్చుకోవాలని ఏదో మాట్లాడుతూంది.
కానీ, ఇదంతా ఆలోచించగలిగే స్తిమితం నా మనసుకి లేదు.
'రాఘవను నువ్వే హత్య చేశావు. ఈ దీనురాలి దౌర్భాగ్యానికి నువ్వే కారకురాలివి!' అని ఈటెలతో నన్ను పొడిచే అంతరంగానికి సమాధానం చెప్పుకోకపోతే, నన్ను నేను సమర్ధించుకోలేకపోతే, నిలవలేని స్థితి వచ్చేసింది నాకు!
"రాఘవ చచ్చిపోవటానికి నేను కారణమా? నేను చంపానా రాఘవను?"
హమ్మయ్య! కక్కేశాను. నా మనసులో విషాలు కక్కే నాగుపామును బయటకు వదిలాను. ఇప్పు డది ఎంతమందిని కాటు వేస్తుందో?
నన్ను కౌగిలించుకుని ఏడుస్తూన్న పరిమళ నన్ను వదిలి ఎడంగా నిలబడింది.
ధారగా ప్రవహిస్తూన్న కన్నీటిని తుడుచుకుని సన్నగా నవ్వింది.
నా ప్రశ్నలకి సమాధానం ఆ నవ్వు! మాటల కందని భావాల నెన్నింటినో ఇమిడింకుకొన్న ఆ నవ్వు- 'నీ ప్రశ్నలకు సమాధానం నీకు తెలియదా?' అని నా అంతరంగాన్ని మరింత నా మీదకు ఉసికొల్పే ఆ నవ్వు-నా గుండెలను చీల్చింది. తట్టుకోలేకపోయాను.
"రాఘవను చంపింది నేను కాదు. నువ్వు! నువ్వు! నువ్వు! నువ్వే చంపావు. రాఘవ వైద్యానికి కావలసినంత డబ్బిస్తా నన్నాను. వైద్యం చేయిస్తా నన్నాను. నువ్వే ఒప్పుకోలేదు. అవునా? కాదా? కళ్ళులేని మొగుడు ఉంటేనేం? పోతేనేం? అనుకొన్నావు. అన్ని విధాలా సమర్దుడయిన అన్నగారు అండగా ఉంటే చాలనుకొన్నావు. వదిన ప్రాధేయపడినా అన్నను వదిన దగ్గిరకి పంపటానికి ఒప్పుకోలేదు. నువ్వు .... నువ్వే...."
రావు మెరుపులా మా మధ్యకు వచ్చాడు. ఒక చేత్తో స్మృతి తప్పి పడిపోబోతున్న పరిమళను పట్టుకొన్నాడు. మరొక చేత్తో నా చెంప చెళ్ళు మనిపించాడు.
కళ్ళు చీకట్లు కమ్మాయి.
ఎన్నడూ నా మీద చెయ్యి చేసుకోని రావు నా చెంప చెళ్ళు మనిపించాడు.
చెంప ఎంత మండుతూందో మనసు కంత చల్లగా ఉంది.
ఇంకొక్కసారి రావు నన్ను కొడితే బాగుండు నని పించింది.
నా అపరాధాలకు నన్నిలా శిక్షించి, రావు తిరిగి నన్నాదరిస్తే....
ఎంతటి శిక్షనైనా భరిస్తాను.
చెక్కిలిని చేత్తో అదుముకొని బేలగా రావును చూశాను.
నా చూపులకు తట్టుకోలేనివాడిలా చటుక్కున చూపులు తిప్పుకున్నాడు. తన అరచేతిని చూసుకున్నాడు.
పూర్తిగా స్మృతి కోల్పోయిన పరిమళ రావు చేతులలో వేలాడుతూంది.
పరిమళను ఎత్తుకుని అక్కడి నులకమంచంమీద పడుకోబెట్టి నా వైపు తిరిగాడు రావు.
ఆ చూపులు నిప్పులు కక్కుతున్నాయి.
దుర్నిరీక్ష్యంగా ఉన్నాయి.
తేజోవంతంగా ఉన్నాయి.
పదునుగా ఉన్నాయి.
"శారదా! నేను మూర్ఖుణ్ణి పరమ మూర్ఖుణ్ణి నిన్ను రమ్మని వ్రాశాను. ఎక్స్ ట్రీమ్లీ సారీ! వెళ్ళి పో! వెంటనే వెళ్ళిపో!" గుమ్మం వైపు తర్జని చూపించాడు.
"రావ్ ...."
ఏదో అనబోయాను. తన పేరు నేను ఉచ్చరించటం కూడా సహించలేనివాడిలా ముఖం చిట్లించుకున్నాడు. నా పెదవులు విడివడక ముందే అడ్డుకున్నాడు.
"ప్లీజ్! గెటౌట్! వెళ్ళు! వెంటనే ఇక్కడినుంచి పో!" చెయ్యి పట్టుకుని బరబర నన్ను గుమ్మం అవతలకు ఈడ్చి డభాలున తలుపులు మూసుకున్నాడు రావు.
37
"అమ్మా! అయ్యగారు వచ్చారు!" పనిమనిషి సీతాలు వ్రాసుకొంటున్న నా దగ్గిరకు వచ్చి చెప్పింది.
"వస్తే రానీ!" అన్నాను చిరాగ్గా.
సీతాలు లతీఫ్ విషయం చెపుతూం దనుకొన్నాను. పనివాళ్ళు లతీఫ్ ను కూడా 'అయ్యాగా'రనే అంటున్నారు.
"రావుగారు వచ్చారు, అమ్మగారూ!"
ఒక్క ఉదుటున లేచాను. చేతిలో కాప్ పెట్టని పెన్ అలా ఉండగానే సంభ్రమంగా పరుగెట్ట బోయిన నేను చటుక్కున ఆగిపోయాను.
నెల రోజుల పైగా గడిచిపోయినా ఆనాటి పరాభవం రగిల్చిన జ్వాల నాలో ఇంకా చల్లార లేదు. వెనక్కు వచ్చి కుర్చీలో జారగిలబడి పెన్ కాప్ పెట్టి బల్లమీద పెట్టి, "ఎందుకో కనుక్కురా!" అన్నాను.
అదొక్కసారి నా ముఖంలోకి వింతగా, నిరసనగా చూసి వెళ్ళిపోయింది.
ఎవరైనా శరీరాలను శాసించగలరు. కానీ, మనసు నెవరు నియమించగలరు?
నా దగ్గిర జీతం తీసుకుంటున్నందుకు వినయంగా నా మాట వింటుంది. శారీరకంగా నేను చెప్పిన పని చేస్తుంది. కానీ, దాని మనో సామ్రాజ్యాని కధే సర్వాధికారిణి.
"పాపను తీసుకెళ్ళటానికి వచ్చారటమ్మా!"
భగ్గుమంది- అంతే! పాప తప్ప రావుకు నే నక్కర్లేదు! పాప పట్ల ఏదో ఈర్ష్యలాంటి భావం కూడా కలిగింది. ఆనాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవటానికి నా కిది మంచి సమయం.
'వీల్లేదు. వెళ్ళమను' - అని సీతాలుతో చెప్పి పంపాలనుకున్నాను. కానీ, ఒక్కసారి రావును చూడాలని తపనను నిగ్రహించుకోలేకపోయాను.
"వస్తున్నానని చెప్పు" అన్నాను సీతాలుతో.
రావులో చాలా మార్పు వచ్చింది. పాంటుకు బదులు ముతక నేత పంచె కట్టుకున్నాడు. సైన్ చొక్కా తొడుక్కున్నాడు. కాళ్ళకు నాసిరకం ఆకుచెప్పులు గెడ్డం బాగా మాసింది.
అందమైనవాళ్ళు ఏ బట్టల్లోనైనా అందంగానే ఉంటారు.
ఆ ముతక పంచెలో రావు ఎంతో అందంగా ఉన్నాడు. పంచెలే అతని కెక్కువ బాగుంటాయా అనిపించేటంత అందంగా ఉన్నాడు.
నన్ను చూసి మామూలుగా నవ్వాడు. ఆ నవ్వులో ఆప్యాయత బొత్తిగా లేకపోవటం గమనించిన నా మనసు మరింత ఉడికింది.
"పాపను పంపించు, శారదా! నాకు బస్ టైమ్ అయిపోతోంది. బస్ దిగిమ్, రైలెక్కి, మళ్ళీ బండీ కట్టించుకొని వెళ్ళాలి. పాపం! పరిమళ ఒక్కర్తే ఉంది."
నేను రాయిలా కూర్చున్నాను.
'పాపను పంపించు', 'పాపం! పరిమళ-'
ఒంటరితనం పరిమళకేనా? నాకు లేదా?
"ఆయా! కాన్వెంటుకు వెళ్ళి పాపను తీసుకురా!" ఎంతకూ నేను ఏమీ మాట్లాడకపోవటం చూసి, తనే ఆయాతోఅన్నాడు రావు.
కదలబోతున్న ఆయాతో కఠినంగా, "ఆగు" అన్నాను.
ఆయా ఆగిపోయింది.
"పాపను కాన్వెంటు నుంచి తీసుకురావటానికి వీల్లేదు. చీటికీ మాటికీ దానిని బడి మాన్పించటం నా కిష్టం లేదు."
