Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 26


    "వదినా! వదినా! ఎంతమాటన్నావు, వదినా! ఈ స్థితిలో నన్ను శపించకు. నా స్థితి వింటే నువ్వు  తప్ప కుండా సహాయపడతావని అన్నయ్య వద్ధంటున్నా వచ్చాను."    
    పరిమళ నిగ్రహం సడలిపోయింది. రెండు చేతుల్లో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు వింటే బండరాళ్ళు సహితం కరిగి నీరవుతాయి.
    నేనూ సహించలేకపోయాను. కానీ, అన్నయ్య వద్దంటున్నా వచ్చాను' అన్న మాట శూలంలా గుచ్చుకుంది నా గుండెల్లో. ఆ బాధ ముందు పరిమళ దైన్యావస్థ గాలికి కొట్టుకు పోయింది.
    "ఏం? ఎందు కనకూడదూ? నీ మొగుడు గుడ్డివాడు. రావు అక్కడికి వచ్చి చక్కగా మీ పొలం పనులన్నీ చూసి పెడుతున్నాడు. మీకు హాయిగా ఉంది. వదిన ఏమయిపోయినా మీ కక్కర్లేదు. ఇది నిజం కాదా?"
    పరిమళ బాధగా, జాలిగా నా వంక చూస్తూ, "అన్నయ్యను నేను రమ్మన్నానా, వదినా?" అంది.
    "రమ్మని పిలవాలా? నువ్వు నా మీది కసితో ఆ గుడ్డివాణ్ణి చేసుకుంటే, మీ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడా? పరుగెత్తుకుంటూ నీ దగ్గిరికి వచ్చాడు. నన్ను ఆత్మవంచన నుండి తప్పించాలని కదూ, ఆ గుడ్డివాన్ని పెళ్ళి చేసుకున్నావు? ఇప్పుడు మళ్ళీ నా కెందు కీ ఆత్మవంచన?"
    నా మాటల్లో చివరి దెప్పిపొడుపును మింగేసింది పరమళ.
    నా వంక సూటిగా చూస్తూ, "వదినా, అన్నయ్య కేవలం నాకు సహాయం చెయ్యడానికే అక్కడికి రాలేదు. నీ అంతట నువ్వు అన్నయ్యను నీకు దూరం చేసుకుంటే తప్ప అన్నయ్యను ఎవరూ నీకు దూరం చెయ్యలేరు" అంది.
    "తప్పంతా నాదే అంటావ్?" రోషంగా అన్నాను.
    "తప్పొప్పుల సంగతి నాకు తెలియదు, వదినా! జరిగినదానిపై తర్జన భర్జనలు వదిలేసి జరగవలసిన దానిని గురించి ఆలోచించు."
    "అదే ఆలోచించి చెబుతున్నాను. నా దగ్గిరకి వచ్చెయ్యమని రావుతో నువ్వు చెప్పు."
    "అది లాభం లేదు, వదినా!"
    "మరి, 'లాభం' ఎలా ఉంటుందో చెప్పు?" హేళనగా అన్నాను.
    నా హేళన గుర్తించ నట్లు మామూలుగా, "నువ్వు లతీఫ్ తో లావాదేవీలు వదులుకొని అతని బహుమానాలు అతని కిచ్చేస్తే ఎవరూ చెప్పక్కర్లే కుండానే అన్నయ్య నీ దగ్గిరకి వచ్చేస్తాడు" అంది.
    నాకు భరించరానంత కోపం వచ్చింది. నేనే తప్పూ చెయ్యలేదు. సుఖంగా జీవించగలిగే అవకాశం నాకు వచ్చింది. సుఖపడుతున్నాను. ఎందుకు వీళ్ళకీ ఆక్రోశం!
    "వహ్వా! లతీఫ్ తో లావాదేవీలు వదులుకోవాలా? చాలా ముద్గుగా ఉంది. ఇప్పుడు నువ్వు నా ముందు నిలిచి చెయ్యి జాపుతున్నది ఏ సంపద కమ్మా, మరదలా? మీ అందరిలా నేనూ దరిద్రంలో ఓలలాడటం లేదని మీ కడుపుమంట!"
    ఏడ్చి ఏడ్చి పరిమళ కళ్ళలో నీళ్ళయిపోయినట్లున్నాయి జీవంలేని చూపులతో నన్ను చూస్తూ అంది:
    "నేను చేస్తున్న పని ఎంత నీచమో నాకు తెలుసు. అయినా నా భర్త ప్రాణాలు దక్కించుకోవాలి, వదినా! ఆయన కావాలి నాకు! మానావమానాలన్నీ గంగలో కలిసిపోనీ! నేను ఎంత హైన్యాని కయినా దిగజారనీ! ఆయనను బ్రతికించుకోవాలి."
    పరిమళ ముఖం నా హృదయాన్ని కరిగించకపోలేదు. అయినా పరిమళ వాడిన 'నీచమూ', 'హైన్యమూ' అనే పదాలు నా మనసును గుచ్చి నా రోషాన్ని రెచ్చగొట్టాయి. తన భర్త కోసం పరిమళ పడే ఆరాటం రావుకోసం నా ఆరాటాన్ని రగిల్చింది.
    "సరే! మనం వ్యాపారస్థుల్లా మాట్లాడుకుందాం నీ భర్తను బ్రతికించుకోవటానికి నీకు సహాయం చేస్తాను. నా భర్తను నా దగ్గిరకు పంపించు."
    "నే నేం చెయ్యగలను, వదినా?"
    "శారద దగ్గిరకు వెళ్ళిపో!" అని రావుతో చెప్పు."
    "నీ దగ్గిరకు అన్నయ్య వస్తానంటే నేను వద్దంటానా? నేను వెళ్ళమన్నంత మాత్రాన నీ దగ్గిరకు వస్తాడా?"
    "అయినా, నువ్వు చెప్పు."
    "వదినా, నువ్వూ కలిసి ఉండటం నా కిష్ట'మని చాలాసార్లు చెప్పాను. నవ్వేసి ఊరుకున్నాడు."
    "అలాకాదు, 'వెళ్ళ' మని చెప్పాలి."
    "ఏమని చెప్పమంటావ్? 'నా ఇంట్లోంచి పొ'మ్మని అన్నయ్యతో చెప్పనా?"
    "నీ ఇష్టం! ఎలా చెప్పినా సరే!"
    పరిమళ చాలాసేపు పచ్చతాడుతో కట్టబడి ఉన్న తన మంగళసూత్రాలు చూసుకుంటూ కూర్చుంది. చివరకు తల ఎత్తి, "నా వల్లకాదు, వదినా!" అంది.
    బలహీనంగా ఉన్న ఆ ముఖంలో చిరునవ్వు చూసి నిర్ఘాంతపోయాను.
    అచ్చు రావు చిరునవ్వులాంటి చిరునవ్వు.

                                  35

    పరిమళ పాపను చూడాలని లోపలకు నడిచింది.
    యాంత్రికంగా నేను పరిమళ వెంట నడిచాను.
    నా మనసులో సముద్ర ఘోష!
    నా ముందు నడుస్తూన్న ఆ శల్యావశిష్ట మూర్తి మీద జాలి, గౌరవం, అభిమానం, ఈర్ష్య!
    నేను మహాపరాధం చేశానని నా అంతరంగం ఘోష పెడుతూంది!
    కనీసం తన భర్తకోసమైనా పరిమళ రావును నా దగ్గిరకు పంపకపోతుందా అన్న ఆశ నా బిగువును సడలనయ్యలేదు.
    పాప బొమ్మలతో ఆడుకుంటూంది.
    "అత్తా! అన్నానికి రా!"
    పాప మాట విని నేనూ, పరిమళా ఆశ్చర్యపోయాం! పాప నన్ను కానీ, పరిమళను కానీ చూడలేదు.
    "నాన్నగారూ! స్నానం చెయ్యండి!" తన ముందున్న మగ బొమ్మతో అంటూంది పాప.
    మాకు విషయం అర్ధమయింది.
    పరిమళ ముఖం వికసించింది.
    నా మనసు మూలిగింది.
    ఇద్దరమూ అలాగే నిలబడిపోయాం.
    "అబ్బబ్బ! ఎప్పుడూ చదువేనా? లేవండి, నాన్న గారూ?" పాప మాగ్ బొమ్మను నీళ్ళ తొట్టి దగ్గరకు తీసుకెళ్ళి, వట్టి వట్టి స్నానం చేయించింది.
    ఆయా కుట్టిన లాగూ, చొక్కా తొడిగింది.
    "ఇదిగోండి, నాన్నగారూ! డబ్బులు!" ఇన్ని చిల్లర డబ్బులు తీసి ఆ బొమ్మ చొక్కా జేబులో పోసింది.
    "పెందలాడే వచ్చెయ్యండి! వచ్చేటప్పుడు నాకు ఎలెక్ట్రిక్ ట్రెయిన్, కారూ అలాంటివి తేకండి. అవంటే నాకు అసహ్యం. నాకు బెలూన్లు పట్టుకు రండి!"
    మొగ బొమ్మను తీసుకెళ్ళి బొమ్మరింటి అవతల నించోబెట్టింది.
    "అత్తా! ఇల్లు నే నూడుస్తాను!"
    ఆడబొమ్మ చేతిలో పెట్టిన నాలుగు చీపురుపుల్లల కట్ట తీసుకుంది.
    "నన్నెందుకు ఊడవనియ్యవత్తా! నేనూ నీలా పని నేర్చుకుంటాను."
    తనే మళ్ళీ ఆ చీపురు పుల్లల కట్ట బొమ్మ చేతిలో పెట్టింది.
    "అవును. అమ్మ కోప్పడుతుంది. నేను అమ్మంత అయ్యాక నిన్ను ఊడవనియ్యను. సీతాలుని ఊడవ మంటాను."
    "పాపా!"
    పరిమళ పాపను రెండు చేతులతో ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది.
    ఆనందాశ్రువులో, దుఃఖాశ్రువులో కళ్ళ వెంట నీరు ధారలు కట్టుతూంది.
    పాప ఆనందం వర్ణనాతీతం!
    "అత్తా, ఎప్పుడొచ్చావ్? నాన్నగారు వచ్చారా?"
    పరిమళ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది.
    "లేదమ్మా!"
    "మరి, నువ్వే నన్ను తీసుకెళతావా?"
    మాట తప్పిస్తూ "పిచ్చితల్లి" అంటూ నవ్వింది పరిమళ.
    "మామయ్య వచ్చారా? మామయ్య జ్వరం తగ్గిపోయిందా?"
    "లేదమ్మా!"
    పరిమళకు దుఃఖం ఆగటం లేదు.
    పాప తన చిట్టి చేతులతో ఆ కన్నీళ్లు తుడిచి "ఏడవ కత్తా! జ్వరం తగ్గిపోతుంది" అంది.    
    "బంగారు పాప!" అంటూ పాపచెక్కిళ్ళు ముద్దు పెట్టుకుంది పరిమళ.
    "ఉండత్తా!" పరిమళ చేతుల్లోంచి తప్పించుకుని లోపలకు పరుగెట్టింది పాప.
    నేను, పరమళ-ఇద్దరమూ ఆశ్చర్యంగా చూస్తున్నాము. పాప ఇన్ని ఎ.పి.సి. మాత్రలు తెచ్చి పరిమళ చేతిలో పోసింది.
    "నాకు జ్వరం వస్తే డాక్టర్ గారు ఈ మాత్ర లిచ్చారు. తగ్గిపోయింది. మామయ్య కియ్యత్తా!"
    "నీకు ఎక్కడి వమ్మా!"
    "మామయ్యకి కావాలని అడిగితే డాక్టర్ గారు ఇచ్చారు."
    నవ్వూ, ఏడుపూ రెండూ వచ్చాయి పరిమళకు. ఆ మాత్రలు అపురూపంగా కొంగున కట్టుకుంది.
    "అత్తా! మామయ్యకి జ్వరం తగ్గగానే నన్ను తీసుకెళ్తావు కదూ?"
    "తప్పకుండా!"
    "నాన్నగా రెప్పుడు వస్తారు?"
    "నేను వెళ్ళు పంపిస్తా!"
    పాప కొంచెంసేపు ఆలోచించింది.
    "వద్దులే, అత్తా! మామయ్యకి జ్వరం తగ్గాక రమ్మను. నాన్నగారు ఇక్కడికి వస్తే డాక్టర్ నెవరు పిలుస్తారు?"
    పాప చెక్కిళ్ళు ఆప్యాయంగా నిమురుతూ నా వై పొక్కసారి చూసింది పరిమళ.
    ఆ చూపులో భావం నా కర్ధం కాకపోలేదు. పసిపిల్లకు ఉన్న పాటి దయకూడా నాలో లేదని...
    నాలో దయలేదా? పరిమళ స్థితికి నాకూ బాధగానే ఉంది. రాఘవను నా దగ్గిరే ఉంచుకుని వైద్యం చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను. కానీ, నా రావు నాకు కావాలి.
    పరిమళ ఇంటికి వెళ్ళి అంతా రావుకు చెబుతుంది. చెల్లెలికోసమైనా రావు న దగ్గిరకు రాక మానడు. మనసులో చిరచిర ఉంటుందా? ఉండనీ! చిరాకులతో అయినా, నన్ను తిడుతూ అయినా రావు నా ఎదుట ఉండటమే నాకు కావలసింది. ఇప్పుడు మెత్తబడ కూడదు.
    తన చేతిలో ఉన్న రెండే రెండు చాక్ లెట్లు పాప చేతిలో పెట్టి, "వెళ్ళొస్తా, పాపా!" అంది పరిమళ.
    "అన్నం తిని వెళ్ళవూ?" అంది పాప.
    పరిమళ నావై పొక్కసారి చూసి, "ఇప్పుడే తిని వచ్చానమ్మా! ఆకలి లేదు" అంది.
    "అయ్యో! ఎంతో బాగా కుదిరింది వంట!" అంది పాప లక్కపిడతల వంక చూస్తూ.
    అర్ధం చేసుకున్న పరిమళ నవ్వుతూ క్రింద చతికిల పడి,"త్వరగా వడ్డించు. ఆకలి మండిపోతోంది" అంది.
    పాప బిస్కట్ల అన్నమూ, చాక్ లెట్ల కూరా, పిప్పర మెంట్ల పచ్చడీ వడ్డించింది.            పరిమళ తిని వంటకాల రుచి మెచ్చుకుంది.
    పాప ముఖం సంతోషంతో వెలిగిపోతూంది.
    పసిపిల్లలు పెద్దవాళ్ళ దగ్గిర నుంచి తిండీ, బట్టా, అవసరాలూ మాత్రమే కాదు - స్నేహం కూడా కోరతారన్న మాట! కేవలం వాత్సల్యంతో వాళ్ళకి తృప్తి కలగదు. ఊపిరాడని పనులతో ఉక్కిరిబిక్కిరయ్యే నేను, చిన్న పిల్లలా పాపతో ఆడగలనా?
    పాప వడ్డించిన భోజనం ముగించి, పాపకు 'టాటా' చెప్పి నా వైపు తిరిగి చేతులు జోడించి, చిరుగులు కుట్టిన చీరను. జాకెట్టు చిరుగులు కనపడకుండా భుజం నిండా కప్పుకుని బస్ స్టాప్ వైపు నడిచింది పరిమళ.

                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS