33
జార్జిని పిలిచి, "ఈ యాభై రూపాయలూ అనంతయ్య కిచ్చెయ్యి" అన్నాడు లతీఫ్.
చదువుకుంటున్న నేను దిగ్గున తల ఎత్తి, "ఎందుకూ?" అన్నాను.
"రావు ఇయ్యమన్నాడు."
"ఎలెక్ట్రిక్ ట్రెయిన్ కేనా?"
"అవును."
"అయితే ఇయ్యక్కర్లేదు. నేను ఇచ్చేశాను."
ఉలికి పడినట్లయ్యాడు లతీఫ్.
"రావు నిన్నడిగాడా డబ్బు?" ఆశ్చర్యంగా అన్నాడు.
అత్యంత క్లిష్ట పరిస్థితులలో రావు చివరికి లతీఫ్ నైనా అడుగుతాడు కాని, నన్నడగడు. ఇది నిజం!

లతీఫ్ ఆశ్చర్యం ఈ నిజాన్ని ఎత్తి చూపి నా మనసు గుచ్చింది.
నేనేం సమాధానం చెప్పకుండా పుస్తకంలో మునిగిపోయాను.
"పాపం! రావు చాలా ఇబ్బందులలో ఉన్నాడు." మళ్ళీ అన్నాడు లతీఫ్.
నేను పుస్తకంలోంచి తల ఎత్తలేదు. అయినా, నేను శ్రద్దగా వింటున్నాన్ని లతీఫ్ కి తెలుసు. చెప్పుకుపోయాడు.
"రాఘవకు చాలా జబ్బుగా ఉందిట! పొలం ఒక్కటే ఆధారం అది ఈ ఏడూ సరిగ్గా పండలేదు. ఏదో కంపెనీలో స్టెనో ఉద్యోగానికి అప్లై చేశాడుట! ఆ కంపెనీ డైరెక్టర్లలో నలుగురు నా స్నేహితులే! వాళ్ళకు తనను రికమెండ్ చెయ్యమన్నాడు...." పుస్తకం టక్కున మూసి పక్కకు పడేశాను. లతీఫ్ ముఖంలోకి సూటిగా చూస్తూ, "నువ్వు రికమెండ్ చేస్తే ఆ ఉద్యోగం వస్తుందా?" అన్నాను.
"తప్పకుండా వస్తుంది. కానీ, ఇది చాలా చిన్న ఉద్యోగం రావు కింతకంటే మంచి ఉద్యోగం చూడగలను. ఆ మాటే రావుతో అన్నాను."
"ఏమన్నాడు?"
"'థాంక్స్' అన్నాడు. 'ప్రస్తుత స్థితిలో నాకు ఉద్యోగం ఎంత అవసరమో నీకు వివరించలేను, లతీఫ్! మంచిదో, చెడ్డదో-ఏదో ఒకటి వచ్చేలా చూడు. స్నేహాన్ని వాడుకోవడం నా కెప్పుడూ ఇష్టంలేదు. కాని, ఇప్పుడు తప్పనిసరి అవుతోంది' అన్నాడు..."
"నువ్వు ఆ డైరెక్టర్లకి రికమెండ్ చెయ్యవనుకో! అప్పుడు రావుకి ఉద్యోగం వస్తుందా?"
"చెప్పలేం! రావచ్చు. రాకపోవచ్చు, వాళ్ళ అభ్యర్ధి ఎవరైనా ఉంటే వాడి కిచ్చుకుంటారు. అలాంటి వాళ్లెవరూ లేకపోతే రావుకి రావచ్చు."
"ఒకవేళ నువ్వే డైరెక్టర్లతో రావు కా ఉద్యోగం ఇవ్వవద్దని చెపితే..."
"ఏమిటా పిచ్చి ప్రశ్నలు? అల ఎందుకు చెబుతాను?"
"చెపితే?"
"ఏముందీ? కచ్చితంగా రావు కా ఉద్యోగం రాదు."
"అయితే, నువ్వా డైరెక్టర్లతో అలాగే చెప్పు!"
"శారదా!" విభ్రాంతితో పిలిచాడు లతీఫ్.
"ఏమిటి చెప్పమంటున్నావు నువ్వు డైరెక్టర్లతో?" తన చెవులు తనే నమ్మలేనివాడిలా అడిగాడు.
"రావు కా ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని చెప్ప మంటున్నాను." కచ్చితమైన స్వరంతో అన్నాను.
"నీకు మతి పోయిందా? ఇన్నాళ్ళ స్నేహంలో ఏ నాడూ ఏ సందర్భంలోనూ నన్నే సహాయమూ కోరని రావు, నోరు విప్పి అడిగాడు. ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉండి ఉంటాడో ఊహించు. మనిషి ఎంత పాడైపోయాడో గమనించలేదా?"
నేను గమనించలేదా? రావు అలా చిక్కి శల్యమవుతున్నందుకు నా కంటే ఎక్కువగా ఎవరు క్షోభ పడతారు?
"నువ్వా డైరెక్టర్లతో చెప్పి తీరాలి!"
"ఏమని?"
"ఇదివరకు చెప్పాను. కావాలంటే మళ్ళీ చెపుతాను: రావు కా ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని ..."
"శారదా! ఇది చాలా అమానుషం. పోనీ, తటస్థంగా ఊరుకుంటాను."
"ఉహుఁ! అలా వీల్లేదు. నువ్వు చెప్పి తీరవలసిందే! రావు కా ఉద్యోగం రావటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే ..."
"వినకపోతే? ..."
"ఇంక నువ్వు నా ముఖం చూడక్కర్లేదు."
తెల్లబోయి నా ముఖంలోకి చూశాడు లతీఫ్. ఒక్క సారి నిరసనగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
లతీఫ్ ఎన్నడూ నాతో అనుచితంగా ప్రవర్తించక పోవచ్చు.
హద్దుమీరి మాట్లాడకపోవచ్చు.
అయినా, నా ప్రభావం అతని మీద ఎంత ఉందో నాకు తెలుసు. నే నింత గట్టిగా చెప్పాక - నన్ను ఎంతగానైనా అసహ్యించుకోనీ, నా మాట కాదనడు.
రావు మీది కసితో నే నిలా మాట్లాడుతున్నా ననుకొంటున్నాడు లతీఫ్.
అందుకే అతని చూపులలో ఆ నిరసన!
రావు మీద నాకు కక్షా?
రావుకోసం నా మన సెంత పరితపించి పోతూందో ఎవరు ఊహించగలరు?
ఇదే నాకు మంచి అవకాశం!
అభిమానం వదులుకొని, తన ఇష్టానికి వ్యతిరేకంగా లతీఫ్ ను ఆశ్రయించాడంటే అతనెంత ఇబ్బందిలో ఉన్నాడో ఊహించుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం రాకపోతే అప్పుడిక వేరు మార్గం లేక తన బావగారిని- పరిమళ భర్తను-దక్కించుకోవటానికి తప్పకుండా నా దగ్గిరికి వస్తాడు.
అప్పుడు రావు ముఖంలో ఆ అలసట నంతనూ మాయం చెయ్యనా?
నీరసించిపోయిన రావు యథాప్రకారం కళకళ లాడుతూ కనిపించడా?
ఇంటర్వ్యూ తరవాత ఏమయిందో లతీఫ్ వివరించాడు నాకు.
* * *
నెర్వస్ గా నవ్వుతూ జాపిన లతీఫ్ చేతిని అందుకున్నాడు రావు.
లతీఫ్ అంతకు పదింతలు నెర్వస్ గా ఫీలవుతున్నాడు. అంతేకాదు తల ఎత్తి రావు ముఖంలోకి చూడలేక పోతున్నాడు.
"లతీఫ్! అడిగిన ప్రశ్న లన్నింటికీ బాగానే సమాధానాలు చెప్పాను. అయినా, ఈ ఇంటర్వ్యూ ల బండారం నీకూ, నాకూ ఇద్దరికీ తెలుసు. వాళ్ళు ఇవ్వదలుచుకొంటే చవటకైనా ఇస్తారు. ఇష్టం లేకపోతే ఎంత సమర్ధుడి కయినా ఇవ్వరు. పరీక్షా ఫలితాల దగ్గిర మంచి ఉద్యోగాల దాకా ఇదే వరస! అందుకే మన దేశ సౌభాగ్యం ఇలా వెలిగిపోతోంది. న్యాయానికి వచ్చిన అభ్యర్ధులందరిలో నాకే అర్హత లెక్కువ. అయినా, నీ దగ్గిరకి వచ్చాను. నువ్వు నాకు తప్పకుండా సహాయం చేస్తానని నమ్మక ముంది. అయినా, పరిస్థితులను బట్టి...."
"రావ్..." వినలేక అడ్డు తగిలాడు లతీఫ్.
"ఏమిటి, లతీఫ్?" ఆశ్చర్యంగా అడిగాడు రావు.
"నన్ను క్షమించు. నేను నీ కేవిధంగానూ సహాయం చెయ్యలేను."
మూఢుడిలా లతీఫ్ ముఖంలోకి చూస్తూ ఉండి పోయాడు రావు.
"అలా చూడకు, రావ్! నీకు డబ్బు కావాలంటే తీసుకో! ఎంత కావాలన్నా తీసుకో..."
ఆ మాటలు వినిపించుకోనట్లు లతీఫ్ ముఖంలోకి సూటిగా కొన్ని క్షణాలు చూసి, "తగినంత కారణంలేకుండా నువ్విలా మాట్లాడవని నాకు తెలుసు. ఆ కారణం ఏమిటి, లతీఫ్?" అన్నాడు.
లతీఫ్ సమాధానం చెప్పలేదు.
రావు లతీఫ్ ముఖంలోకి తేరిపార చూసి, ఏదో అర్ధమయినవాడిలా నవ్వేశాడు.
"సారీ, లతీఫ్! పాపం, నిన్ను ఇబ్భందిలో పెట్టాను." మెరుపులా వెళ్ళిపోయాడు రావు.
* * *
రావుకు ఉద్యోగం రాకుండా చెయ్యకపోతే లతీఫ్ ముఖం చూడనని బెదిరించాను.
లతీఫ్ నేను కోరినట్లే చేశాడు. కానీ, నాతో మాట్లాడటం మానేశాడు.
ఏదైనా ప్రత్యేకమైన పని ఉంటే తప్ప నా ఇంటికే రావటం లేదు. ఇందుకు నేను పెద్దగా బాధ పడటం లేదు. లతీఫ్ రాకకోసం నే నేనాడూ ఎదురు చూడలేదు. అతను వచ్చినా, రాకపోయినా నాకు ఒకటే!
కానీ, ఏ వ్యక్తి రాకకోసం ఆత్రతతో ఎదురు చూస్తున్నానో, ఆ రావు మాత్రం రావటం లేదు.
ఏ చిన్న అలికిడయినా, గుమ్మం దగ్గిరికి పరుగెడుతున్నాను. గడియారపు ముళ్ళు పరుగులు పెడుతూంటే ఆవేగంతో కొట్టుకుపోతున్నాను.
గంటలు - రోజులు - వారాలు - దొర్లిపోతున్నాయి. రావు రాలేదు.
తలుపు తట్టిన చప్పు డయింది.
పరుగెత్తి వెళ్ళి తలుపు తెరిచాడు.
రూపుదాల్చిన శోకదేవతలా నిలుచుని ఉంది పరిమళ.
34
"రా! రా! లోపలికి రా! రావు కూడా వచ్చాడా? రాఘవను కూడా తీసుకురాకపోయావా? మీ రంతా ఇక్కడే ఉందురుగాని..."
సంభ్రమంగా పరిమళను లోపలకు ఆహ్వానించాను. రావుకోసం చుట్టూ చూస్తున్నాను.
పరిమళ సోఫాలో కూచుని, పైట చెంగుతో ముఖం మీది చమట అద్దుకుంటూంది.
మనిషి అస్థిపంజరంలా తయారయింది. ఏడాది క్రిందటి పరిమళను చూసినవారు, ఇప్పుడు చూస్తే గుర్తు పట్టలేరు. అంతలా మారిపోయింది.
"అన్నయ్య రాలేదు, వదినా!"
గుమ్మం దగ్గిరే నిలబడి రోడ్డు వైపు చూస్తూన్న నన్ను ఉద్దేశించి అంది పరిమళ.
ఉసూరుమంటూ లోపలికి వచ్చాను.
"తరవాత వస్తానన్నాడా?" ఆశాభంగంతో కూలి పోతూ చిరాగ్గా అడిగాను. పరిమళ బెరుగ్గా నా ముఖం లోకి చూసింది.
"మా వారికి చాలా ప్రమాదంగా ఉంది." పరిమళ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. అతిప్రయత్నం మీద ఎర్రబడి ఉబ్బిన ఆ కళ్ళలోకి నీళ్ళు రాకుండా నిగ్రహించుకుంటూంది.
రాఘవ చాలా జబ్బుతో ఉన్న విషయం నా కప్పటికీ గుర్తు వచ్చింది.
న్యాయంగా పరిమళ రాగానే రాఘవ విషయం పరామర్శించవలసిన విధి వాది.
ఆ సంగతే మరిచిపోయాను.
ఏ విషయమైనా నా దృష్టికోణంలో మండే తప్ప ఎదుటి వ్యక్తుల దృష్టిలో మండి కూడా పరిశీలించటం ఏ నాడూ తెలియదు నాకు.
"డాక్టర్ ఏమంటున్నాడు?" పొడిగా, నిరాసక్తంగా అడిగాను.
"కడుపులో నొప్పి అంటున్నారు. జ్వరం విడవకుండా వస్తోంది. కాన్సరని అనుమానం. అవునో, కాదో నిర్ధారణగా తెలియదు. హైదరాబాద్ కాని, మద్రాసు కాని వెళ్ళి చూపించుకోవాలంటే..." ఆగిపోయింది పరిమళ.
పరిమళ ఏం చెప్పదలుచుకుందో అర్ధమయింది. ఎందుకు చెప్పలేక పోతూందో కూడా అర్దమయింది. నా మనసులో ఒకటే ఘోష!
రావు ఎందుకు రాలేదు?
"ఒక్కదానివే వచ్చావు. రావును కూడా తీసుకు రావలసింది."
"అన్నయ్య పనిలో ఉన్నాడు." తల వంచుకుని నీరసంగా సమాధానం చెప్పింది పరిమళ.
నా మనసు భగ్గుమంది. నా రావు నాకు కాకుండా ఈ పరిమళ ఇంట్లో పడి వాళ్ళ పొలంపనులను చూస్తూ చిక్కి
శల్యమవుతున్నాడు. నా దగ్గిరికి రావటానికి కూడా తీరటం లేదు. ఈవిడ మహారాణిలా నా దగ్గిరికి వచ్చి నన్ను సహాయం అడుగుతూంది. నేను సహాయం చెయ్యాలి!
ఏదో ఉక్రోషంతో, నిస్సహాయంగా విలవిలలాడు తూంది మనసు. కసిగా అన్నాను:
"తమ స్వార్ధంకోసం భార్యాభర్తలను విడదీసిన వాళ్లెప్పటికీ బాగుపడరు."
రక్తహీనమైన పరిమళ ముఖం పూర్తిగా పాలిపోయింది.
