రావు సంభాషణ మార్చేశాడు. అంటే, నన్ను తన అంతరంగ పరిధి అవతలకు నెట్టేశా డన్నమాట!
చిరునవ్వు ముఖం మీదకు వచ్చేసింది. అంటే తన కవచం తొడుక్కున్నా డన్నమాట! ముఖ భంగిమలో గాంభీర్యం ఉట్టిపడుతూంది! అంటే తన కంచుకోటలోకి తాను వెళ్ళిపోయా డన్నమాట! ఆ కోటను పగల గొట్టడం నా తరం కాదు. ప్రయత్నించీ ప్రయోజనం లేదు.
"అవును. మామూలు ధోరణిలోనే వ్రాశాను. ఇప్పుడిప్పుడే పాఠకుల దృష్టిలోకి వస్తున్నాను. వాళ్ళను మెప్పించే రీతిలో వ్రాయక పోతే పైకి రాలేను."
రావు నవ్వేసి, "మంచిది" అన్నాడు పొడిగా.
అంతలోనే "అరె! పాప ఏదీ?" అన్నాడు చుట్టూ చూస్తూ.
"ఆడుకోవటానికి వెళ్ళి ఉంటుంది" అన్నాను మామూలుగా.
రావు ఏదో ఆలోచిస్తూ, "చూస్తాను" అంటో లోపలకు వెళ్ళాడు.
రావు వెనకాలే నేనూ వెళ్ళాను.
పాప తన మంచంమీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది.
ఆశ్చర్యపోయాను.
పాప ఏడవటం అంతకుముందు నే నెన్నడూ చూడలేదు. పాప అలా ఏడుస్తూంటే చూడలేక పోయాను. వెంటనే దగ్గిరగా లాక్కుని, "పాపా!" అన్నాను గుండెలకు హత్తుకుంటూ.
పాప నా చేతులలో ఒదిగిపోయి మరింత ఏడ్చింది. ముఖమంతా బాగా ఎర్రబడింది. చిట్టి చేతులతో కళ్ళు తుడుచుకుంటున్న కొద్దీ నీళ్ళు ధారలు కడుతున్నాయి. వెక్కిళ్లకు ఎదురురొమ్ము ఎగసి పడుతూంది.
పాప ఆ మూర్తిని చూసి రావుకూడా చాలా బాధ పడుతున్నట్లు కనురెప్పలు అల్లలాడించాడు.
నా దగ్గిరగా వచ్చి, "పాపా!" అంటూ చేతులు జాపాడు. పాప ఒక్కసారి రావు వంక చురచుర చూసి, నిర్లక్ష్యంగా తల ఎగరేసి ముఖం గిర్రున పక్కకు తిప్పుకుంది. ఆ రోషము, ఆ పౌరుషము, ఆ అభిమానం నా చేతులలో ఉన్న ఆ చిట్టి పాప రావు ప్రతిరూపమే ననిపించింది. చురచుర చూపులలోని ఉద్రేకం నా దగ్గిరనుండి వారసత్వంగా వచ్చింది.
ఒక్క క్షణం రావు ముఖం పాలిపోయింది.
పాపకు కొంచెం ఎడంగా కూర్చుని, "మా పాప నాతో మాట్లాడటం లేదూ..." అని చేతులు కళ్ళ కడ్డం పెట్టుకొని దొంగ ఏడుపు మొదలుపెట్టాడు.
పాప ఏడుపు చప్పున ఆగిపోయింది.
కళ్ళు పెద్దవి చేసుకుని రావు వైపు చూసింది.
తన కళ్ళు తుడుచుకుంది. నా చేతులు విడిపించుకుంది. నా ఒళ్లోంచి లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రావు దగ్గిరికి నడిచింది.
ఈ ఆర్ద్రహృదయం పరిమళ పెంపకంవల్ల వచ్చిందా?
"నాన్నగారూ!" అంది పాప.
రావు వినిపించుకోనట్లు ఇంకా గట్టిగా ఏడవసాగాడు.
పాప దగ్గిరగా వచ్చి రావు చేతులు పట్టుకొని కళ్ళ మీదనుంచి తీసేసింది.
ఆ చేతులతో చటుక్కున పాపను ఎత్తుకుని పైకెగరేసి పట్టుకుంటూ పకపక నవ్వాడు రావు.
అతని కనుకొలకుల్లో నిజంగానే నిలిచినా నీటి బిందువులను చూసి ఆశ్చర్యపోయాను.
పాప తన ఏడుపు మరిచిపోయి పకపక నవ్వేసింది.
"మనం అలా షికారు వెళదామా, పాపా?" అన్నాడు రావు.
పాప ముఖంలో దిగులంతా ఎగిరిపోయింది.
ఎప్పటి ఉత్సాహంతో తండ్రిచెయ్యి పట్టుకొని బయటకు నడిచింది.
రావు సంతృప్తితో నిట్టూర్పు విడుచుకోవటం గమనించాను.
రావు, పాపా తిరిగి వచ్చేసరికి పొద్దుబోయింది.
పాప ముఖం ఉత్సాహంతో వెలిగిపోతూంది.
పాప చేతిలో స్వీట్ బాక్స్, ఎలెక్ట్రిక్ ట్రెయిన్ ఉన్నాయి.
అవి రెండూ నాకు చూపించి, "నాన్నగారు కొని పెట్టారమ్మా" అంది సంబరంగా.
ఎలెక్ట్రిక్ ట్రెయిన్ యాభై రూపాయలకు తక్కువ ఉండదు.
రావు దగ్గిర డబ్బులేని ఈ స్థితిలో, పాప రావుచేత అంతంత డబ్బు ఖర్చు పెట్టించినందుకు ప్రాణం చివుక్కుమంది.
రావుమీద అంతులేని జాలి కలిగింది.
"పాపా! నాన్నగారిని అంత ఖరీదైనవి కొనమనకూడదమ్మా! న న్నడుగు-నేను కొంటానుగా!" అన్నాను పాపకు నచ్చజెప్పాలని.
"శారదా!" గర్జిస్తున్నట్లు అన్నాడు రావు.
నిలువెల్లా వణికాను.
రావుపట్ల సానుభూతి చూపబోయి, రావు మనసును ఎంత పదునైన బాణంతో గుచ్చానో అర్ధమయింది.
బిత్తరపోయి చూశాను.
అంతలో తనను తను నిగ్రహించుకున్నాడు రావు.
పాపకు "టా!టా!" చెప్పి నా ముఖమైనా చూడకుండా వెళ్ళిపోయాడు.
"అమ్మా! నాన్నగారిని నే నడగలేదు. ట్రెయినంటే ఇష్టం అన్నాను. నాన్నగారే కొన్నారు." బేలగా అంటూంది పాప.
ఇటు పాప ఉత్సాహాన్నీ నాశనం చేశాను. అటు రావు మనసునూ గాయం చేశాను.
నాలో ఏమి రీ తొందరపాటు? దీన్ని ఎలా జయించగలను?
"ఆడుకో, పాపా! నాన్నగారు కొన్నారుగా!" పాప వదలలేదు.
"పోనీ, ఈ ట్రెయిన్ షాప్ వాడి కిస్తే డబ్బు లిచ్చేస్తాడా? నాన్నగారి కిచ్చేద్దాం!"
నిలువెల్లా వణికాను. పాప ఆ పని చేసిందంటే రావు నన్నీ జన్మలో క్షమించడు.
"ఫరవాలేడమ్మా! ఆడుకో! నాన్నగారి దగ్గిర డబ్బులు ఉన్నాయిలే!"
"ఇప్పుడు లేవన్నావు."
"ఎక్కువ లేవు."
"నువ్వెందు కివ్వలేదు నాన్నగారికి?"
ఉలిక్కిపడ్డాను.
ఆరేళ్ళు నిండీ నిండని పాప ఇంత ఆలోచించ గలదా? ఏం సమాధానం చెప్పను? చెప్పకపోతే ఊరు కోదు.
"ఇచ్చినా నాన్నగారు తీసుకోరు."
పాప ఇంకేమీ అడగలేదు. ఏదో ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుంది.
ఇద్దరమూ ఎవరి ఆలోచనలో వాళ్ళు పడిపోయాం.
పాప అకస్మాత్తుగా లేచి నా దగ్గిరకి వచ్చింది.
"అమ్మా! నేను నీ అంత అయ్యాక బోలెడు డబ్బు సంపాదిస్తాను. సంపాదించి నాన్నగారి కిస్తాను. నే నిస్తే తీసుకుంటారు." ఆరిందాలా అంది పాప.
ఆనందమూ, ఆవేదనా రెండూ కలిగాయి.
పాపకు తండ్రిమీద ఉన్న మమతకు ఆనందం, "నే నిస్తే తీసుకుంటారు' అనగలిగిన ఆరేళ్ళ పాప లేక మనసులో రావుకూ, నాకూ నడుమ ఉన్న అగాధం లీలగా తోచినందుకు ఆవేదన.
"అలాగే ఇద్దువుకాని, ఆడుకో!"
పాపను పంపేశాను ఆయాతో.
మరి కొంచెం సేపటికే అనంతయ్య వచ్చాడు. ఆనందయ్య 'టాయ్ ఎంపోరియమ్' యజమాని. తరుచుగా పాప ఆట సామానులు అతని షాపులోనే కొంటూ ఉంటాను. నన్ను బాగా తెలుసు.
"ఏం? ఇలా వచ్చారు?" అన్నాను కూర్చోవటానికి కుర్చీ చూపిస్తూ.
"ఈవేళ రావుగారు పాపతో మా షాప్ కి వచ్చారు. పాప ఎలెక్ట్రిక్ ట్రెయిన్ ఇష్టమంది. 'తరవాత డబ్బు లిస్తాను. ప్రస్తుతం తీసుకురావటం మరిచిపోయాను. ఆ ట్రెయిన్ ఇవ్వటానికి వీలవుతుందా?' అని అడిగారు రావుగారు. సాధారణంగా అలా ఎప్పుడూ ఎవ్వరికీ ఇవ్వం. పాపం, రావుగారు కూడా అడగలేక అడగలేక అడిగారు మిమ్మల్ని మాకు బాగా తెలుసు కనక కాదనలేక ఇచ్చాను."
చేతి రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు అనంతయ్య.
అతనుచెప్పదలుచుకున్నది నాకు అర్ధమయిపోయింది. లేచి, లోపలికి వెళ్ళి యాభై రూపాయలు తెచ్చి ఇచ్చాను. అందుకని లేచాడు అనంతయ్య.
"ఒక్కమాట వినండి నేనీ డబ్బు మీకిచ్చినట్లు రావుకు తెలీనీయకండి. తరువాత ఎప్పుడైనా రావు డబ్బులిచ్చినా అవికూడా తీసుకోండి."
అనంతయ్య తల ఊపి బయటకు నడిచాడు. అశాంతి మరిచిపోయేటందుకు ఇంటిముందు తోటలో తిరగడానికి నేనూ ఇంటి ముందుకు వచ్చాను.
"డబ్బు లిచ్చిందా?"
"ఇవ్వకేం చేస్తుందిరా! బంగారు పిచికను వలలో వేసుకుంది. ఆవిడకు డబ్బుకేం లోటు? ఎడంచేత్తో వందలు గిరాటెయ్యగలదు. ఎటొచ్చి ఆ రావుగారే అన్నింటికీ చెడ్డారు.
నాకు వినపడిన రెండు కంఠాలలో ఒక కంఠం అనంతయ్యది. రెండవ కంఠం ఎవరిదో? నా గుండె గుండెలు బద్దలుచేస్తూ ఇద్దరి నవ్వులూ వికటంగా వినిపించాయి.
సంఘంలో ఇలాంటి ప్రచారం జరుగుతూందన్న మాట!
అయ్యో.....రావు! రావును ఎలా నా దగ్గిరకు తెచ్చుకో గలను? ఏ ఉపాయంతో నా సాహచర్యంలో నిలుపుకో గలను?
పిచ్చెక్కుతూంది నాకు!
* * *
