Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 23


    "కళాత్మక ప్రతిభ లేకుండా కలం పట్టి నిలవలే డెవ్వడూ. అయితే, శృంగార రసాత్మకమైన ఇతివృత్త ప్రాధాన్యపు నవలలు వ్రాయటానికి ఒక మోస్తరు ప్రతిభ చాలు.  వినూత్న ప్రయోగాలు సాధించగలిగిన వాడు అసాధారణ ప్రతిభా సంపన్నుడైతే తప్ప విజయం సాధించలేడు. శృంగార రసాత్మక నవలల్లో ఇతివృత్తాన్ని యధేచ్చగా మలుపులు తిప్పుకోవచ్చు. కానీ, ఒక ప్రత్యేక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రయోగాత్మకంగా వ్రాస్తున్నప్పుడు ప్రతి మలుపూ అతి మెలుకువతో నిర్వహించాలి. కేవలం శృంగార రసాత్మక నవలల వలన మానసికోల్లాసమూ, క్షణికమయిన చిత్త విద్రుతి మాత్రమే పొందగలవు. జిజ్ఞాసాపూర్వక మైన నవలల వలన చిరస్మరణీయమైన విలువలను సాధించగలవు..."
    "అంటే?..."
    ఆగిపోయాను. నా ప్రశ్నను పూర్తి చెయ్యలేక పోయాను.
    రావు నవ్వాడు. ఆ నవ్వులో నా ప్రశ్నకు సమాధానం వచ్చేసింది.    
    "నాలో నూత్నప్రయోగాలు సాధించటాని కవసరమైన కళాత్మక ప్రతిభ లేదు."
    దిగాలుగా అన్నాను. నా కంఠం గద్గదమయిపోయింది.
    రావు నావైపు సానుభూతితో చూశాడు.
    "కళాత్మక ప్రతిభ ఒక్కటే చాలదు, శారదా? రచయితలో నిజాయితీ ఉండాలి."
    "అంటే?"
    "రచయిత పలికే ప్రతి అక్షరమూ అతని అనుభవం లోంచి రావాలి."
    నాకు ఆపుకోలేని నవ్వు వచ్చింది.
    పకపక నవ్వేశాను.
    "ఎందుకలా నవ్వుతావు?" ఆశ్చర్యంగా అడిగాడు రావు.
    "లేకపోతే ఏమిటీ? ఒక వ్యక్తి జీవితంలో ఎంతని అనుభవించగలడు? ప్రతీదీ అనుభవంలోంచే రావాలంటే సాధ్యమా?"
    "అనుభవమంటే నువ్వు సరిగా అర్ధం చేసుకోవటం లేదు. ఒక అనుభవం నీదిగా చేసుకోవటానికి నువ్వు శారీరకంగా అనుభవించక్కర్లేదు. కానీ, ఆయా భావాలకి నీ మనసు వాస్తవంగా స్పందించాలి. ఆ భావోద్వేగంలోంచే భాష వెలికి రావాలి. అప్పుడు కాని, ఆ శైలికి జనమూ, జీవమూ రావు. క్రౌంచ ద్వంద్వ వియోగానికి కరిగిన వాల్మీకి హృదయమే 'మా నిషాద' శ్లోకరూపంలో సాక్షాత్కరించింది. రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది. రామాయణ గాథ నంతనూ వాల్మీకి స్వయంగా అనుభవించలేదు. కానీ, ప్రియురాలి విరహంతోనే ప్రియుడు చేసిన ఆర్తనాదం ఆయన హృదయాన్ని తాకింది. కరుణతో మనసు కరిగింది. అచ్చమైన ఈ స్పందన ఆలంబనంగా ఒక మహాకావ్యం అల్లుకుంది. నీ పరిసర చైతన్య స్రవంతి నంతనూనీలో ప్రతిస్పందింప చేసుకోగలిగే అత్యంత సున్నితమయిన మనసును జాగృతం చేసుకోవాలి."
    రావు మాటలు నాకు అర్ధమయ్యీ  కానట్లుగా ఉన్నాయి. రావు చెప్పినవన్నీ ఆలోచిస్తున్నాను.
    ఇంత చెపుతాడు. మళ్ళీ అన్నీ సహజంగా రావాలంటాడు.
    ఈ రెంటికీ సమన్వయ మెలాగో అర్ధం కాదు. అదే అడిగాను.
    గట్టిగా నవ్వాడు.
    "దీనికి సమాధానం నేను చెప్పలేను. నువ్వు నిజంగా శారదా వరప్రసాదురాలివే అయితే, ఒకనాటికి నీకె స్పష్టపడుతుంది."
    "అటు తిరిగి, ఇటు తిరిగి వేదాంతంలోకి దిగావా?" హేళనగా అన్నాను.
    రావు గంభీరంగా నా ముఖంలోకి చూసి, "ఇది వేదాంతంకాదు, శారదా! నీలో ఉన్న ప్రతిభకు తోడు సాధించాలనే తపనా, కృషీ ఉంటే తప్పక ఒకనాటికి ఆ దివ్యజ్యోతిని నీ మనోమందిరంలో దీపింప చేసుకోగలవు" అన్నాడు.
    రావు మాటల్లో నాకు నమ్మకం కలగలేదు. అయినా, రావు అంత గంభీరంగా మాట్లాడుతున్నప్పుడు కాదని అనగలిగే శక్తి నాకు, లేదు. నాకే కాదు; ఎవరికీ ఉండదు.
    ఇద్దరమూ నడుచుకుంటూనే ఇంటికి వచ్చాము.
    "పొద్దు పోయింది. ఇక్కడే పడుకోకూడదూ!" ప్రాధేయపడుతూ అన్నాను, వింటాడని ఆశ లేకపోయినా.
    రావు నా ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. ఎగిరి గంతులేసింది నా మనసు.
    నేనే స్వయంగా రావుకు ఎక్క సిద్ధం చేశాను. పక్కమీద కూర్చున్న రావును పరిశీలనగా చూశాను. చాలా చిక్కిపోయాడు. అయినా, చిరునవ్వులో మెరుపూ, కళ్ళలో కాంతీ మాత్రం తగ్గలేదు.
    రావును అలా వదిలి వెళ్ళలేకపోయాను. రావు కళ్ళలోకే చూస్తూ నేనేం చేస్తున్నానో నాకే తెలియని దశలో ఒక్కొక్క అడుగే రావువైపు వెయ్యసాగాను. రావు రెండు చేతులూ జాపాడు. అంతటి ఆహ్వానం ఆశించని నేను, ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఒక్క ఉదుటున అతని చేతుల్లో వాలిపోయాను.
    గాఢంగా, అతి గాఢంగా అతని వక్షాన్ని అల్లేసుకున్నాను.
    నా చెక్కిళ్ళకు వెచ్చగా తగులుతూన్న రావు ఊపిరీ, నా వెన్నుచుట్టూ సన్నగా వణుకుతూన్న రావు చేతులూ, అదురుతూ నా పెదవులను లోపలకు అందుకుంటున్న అతని పెదవులు-నాలాగే రావుకూడా ఉద్రిక్తుడయ్యాడని చెపుతున్నాయి.
    హోరున దూకే జలపాతంలా రావును ఆవరించుకున్నాను. అణువణువునా విద్యుత్తు మెరిపించే సౌదామినిలా రావులో జ్వాల రగిల్చాను. ఆ జ్వాలలో రావు నన్ను కరిగిస్తూంటే, ఆప్యాయంగా అతనిని నిమురుతూ గుండెల్లో ఒదిగిపోయాను.
    "స్వామీ!" అన్నాను సంపూర్ణ పారవశ్యంలో.
    పకపక నవ్వాడు రావు.
    ఎన్నాళ్ళయింది అలాంటి నవ్వు విని!
    ఎన్ని జన్మలు తపస్సు చేశానో ఇంత పరిపూర్ణంగా శృంగారానుభవాన్ని పొందేటందుకు!
    ఏ జన్మలో నేను చేసిన దీపారాధనల ఫలితమో రావు కళ్ళలో ఆ మెరుపు!
    "నా శారదా!"
    శరీరం అలసటతో పక్కకు వాలిపోయినా, ఆప్యాయంగా నా చెక్కిళ్ళు నిమిరాడు రావు.
    నా చెక్కిలి అతని చెక్కిలి కానించి అక్కడే అలాగే పడుకున్నాను.
    "ఈవేళ నా మనసుకు కలిగినంత ఉల్లాసం ఇటీవల ఎన్నడూ లేదు, శారదా!" నా చెవిలో గుసగుసగా అన్నాడు.
    సంతృప్తితో కళ్ళు మూసుకున్నాను.
    మరునాడు రావు తయారయి, పాప చెయ్యి పుచ్చుకుని వెళతానని చెపుతూంటే ఆశ్చర్యపోయాను.
    "వెళుతున్నావా?" అన్నాను దిగాలుగా.
    రాత్రి అనుభవం తరవాత రావు నా దగ్గిరే ఉండి పోతాడని నమ్మకం కలిగింది నాలో! ఒకవేళ రావు వెళతానన్నా నేను ఆపగల ననుకున్నాను.
    ఏ విధమైన ఉద్వేగమూ లేకుండా చిరునవ్వుతో, "వెళతాను, శారదా!" అంటూన్న రావు ముఖం చూస్తూంటే న ఆశలు నీరుకారిపోయాయి. అక్కడికీ- "వెళ్ళకపోతేనేం?" అన్నాను బేలగా. అదే చిరునవ్వుతో, "వెళ్ళకపోతే చాలా నష్టం ఉంది. ఉండటంవలన వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం ఏదీ లేదు" అనేసి పాప చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాడు.
    నాకు మరొక్క మాటకుకూడా అవకాశమియ్య లేదు.
    తన దృఢనిశ్చయాన్ని అత్యంత సున్నితంగా రావు వ్యక్తం చేసే పద్ధతి అది.
    కొన్ని క్షణాలు బొమ్మలా నించున్న నేను, ఏదో తోచి, నా బాగ్ తెరిచి చూశాను. నేను పెట్టిన డబ్బు పెట్టినట్లే ఉంది.
    నిన్న హోటల్ ఖర్చంతా రావు భరించాడు!
    'ఈవేళ న మనసుకు కలిగినంత ఉల్లాసం ఇటీవల ఎన్నడూ లేదు, శారదా!'
    రావు మాటలు తిరిగి తిరిగి నా మనసులో ప్రతిధ్వనించాయి.

                                                         32

    ఒకటి రెండు నెలల్లో రావులో చాలా మార్పు, వచ్చేసింది. మనిషి బాగా నీరసించిపోయాడు. కళ్ళలో ఏదో అశాంతి స్పష్టంగా కొట్టవచ్చినట్లు కనిపిస్తూంది.
    ఎందుకు రావు కీ దైన్యం? సుఖంగా నాతో ఉండి ఈ ఐశ్వర్యాన్నంతా అనుభవించక ఎందుకు కోరి కష్టాలపాలవుతున్నాడు?
    "నాన్నగారూ!"
    రావు చూడగానే పాప పరుగెత్తుకుంటూ వచ్చి రావు చేతుల్లో వాలిపోయింది.
    "నాన్నగారూ! నేను రెడీ! ఆయా అన్నీ సర్ది పెట్టేసింది. ఎప్పుడెళదాం?" ఉత్సాహంగా అడుగుతూంది పాప.
    పాప మాటల్లో తొందరను బట్టి అది రావుతో వెళ్ళిపోవాలని ఎంత ఆత్ర పడుతూందో అర్ధమయింది.
    పాపకు నేనేం తక్కువ చేశాను? అల్లారుముద్దుగా, అతి గారాబంగా చూసుకొంటున్నాను. అడిగిందే తడవుగా ఏది కావాలన్నా తెచ్చి ఇస్తున్నాను. అయినా పరిమళ దగ్గిరికి వెళ్ళాలంటే పాపకు ఎంత ఉత్సాహం! ఎంత ఆరాటం!
    పాపను మించిన ఉత్సాహంతో పాప నెత్తుకుని కబుర్లు చెప్పే రావు, ఈసారి ఉదాసీనంగా ఒక్కసారి ఎత్తుకుని ముద్దుపెట్టుకుని దింపెయ్యటం ఆశ్చర్యమనిపించింది.
    అంతకంటే ఆశ్చర్యం కలిగించాయి ఆ తరవాతి రావు మాటలు!
    "పాపా! ఈసారి మనం అత్తదగ్గిరకి వెళ్ళటం లేదమ్మా!"
    నేను ఉలిక్కిపడ్డాను.
    పాప కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. ఆ కళ్ళ నిండా అప్పుడే నీళ్ళు తిరిగి పోతున్నాయి.
    "ఎందుకు, నాన్నగారూ! నేను అక్కడ అల్లరి చేశానా?"
    "లేదమ్మా! లేదు. పాప ఎప్పుడూ అల్లరి చెయ్యదు. అది కాదమ్మా! మామయ్యకి జ్వరంగా ఉంది. తగ్గాక వెళదాం!"
    "జ్వరంగా ఉన్నప్పుడు ఎవ్వరూ వెళ్ళకూడదా?"
    "ఉహుఁ!"
    "మరి, నువ్వూ అత్తయ్యా ఉన్నారుగా!"
    "మేం మామయ్య కేం కావాలో చూస్తాం!"
    "నేనూ మామయ్య కేంకావాలో చూస్తాను. పాపం, మామయ్యకి కళ్ళు కనపడవుగా! అన్నీ అందిస్తాను నేను."
    రావు మానసికంగా చాలా కృంగిపోయినట్లున్నాడు. సాధారణంగా ఎంతో సహనంతో పాపకు ప్రతిదీ నచ్చజెప్పే వ్యక్తి కొంచెం విసుగ్గా, "అబ్బ! మరో సారి తీసుకెళతా నమ్మా! ఇప్పుడు కాదు" అన్నాడు.
    విసుక్కొంటున్న రావు ముఖంలోకి బిత్తరపోయి చూసి తల వాల్చుకుని వెళ్ళిపోయింది పాప.
    "ఏం జరిగింది, రావ్?"
    చటుక్కున రావు దగ్గిరగా నడిచి, అతడి తల నా హృదయానికి హత్తుకొని ఆదరంగా అడిగాను.
    అలిసిపోయిన వ్యక్తిలా నా వక్షానికి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు రావు.
    నా ఆదరంలో కరిగిపోతూ తన సహజ గాంభీర్యాన్ని మరిచి, "రాఘవకు ఏం జబ్బో తెలియటం లేదు, శారదా! కడుపులో నొప్పీ, దానికి తోడు జ్వరమూ అక్కడి డాక్టర్లు డయాగ్నైజ్ చెయ్యలేకపోయారు. అకాల వర్షాలతో ఈ ఏడాది పంట పాడయిపోయింది. వచ్చింది కుటుంబం గడవటానికే చాలీ చాలకుండా ఉంది. రాఘవ వైద్య మెలాగ? పరిమళ భవిష్యత్తు ఏమవుతుందీ?" అని బేలగా అన్నాడు.
    "డబ్బు కావాలా, రావ్? ఇవ్వనా?" ఆశగా అన్నాను.
    అదిరిపడ్డ వాడిలా నా చేతులు విడిపించుకొని దూరంగా తొలిగాడు రావు. ఒక్క క్షణం నా ముఖంలోకి తేరిపార చూసి ముఖం తిప్పుకున్నాడు.
    ఏదో అనకూడని మాట అనేశాను. అయినా, అందులో తప్పేముందీ? కష్టంలో సహయం చేస్తాననటం కూడా తప్పేనా?
    కొంచెం సేపటికి తల తిప్పి నా వంక చూస్తూ ఎప్పటి చిరునవ్వుతో, "నువ్వు మళ్ళీ మామూలు ధోరణిలోనే నవల వ్రాసినట్లున్నావు కదూ!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS