రావును నేను ప్రేమించటం లేదా? లేకపోతే అతను దూరమవుతున్నందుకు నా కెందుకింత అశాంతి?
ఈ లోకంలో నావాళ్ళయిన ఇద్దరికీ రోజు రోజుకీ దూరమయి పోతున్నాడు.
ఈ దూరాన్ని ఎలా కలిగించగలను?
పాప కొద్దిగా ఒళ్ళు చేసింది. చెక్కిళ్ళు మరింత నిండుగా కనిపిస్తున్నాయి. ఛాయకూడా వచ్చింది.
పరిమళ పట్ల నాకు ఎంతయినా ఈర్ష్య ఉందనీ గాదు పరిమళకు పాపమీదున్న ప్రేమను మాత్రం తలకించలేదు.
"శారదా! నాకు బస్సు టైమవుతోంది. వస్తాను." గుమ్మం దగ్గిర నిలబడి అన్నాడు రావు.
పాప మంచం మీద కూర్చుని నిద్రపోతున్న పాపను చూస్తూ ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడ్డాను.
"టైమవుతోందా? ఎక్కడికి?"
"ప్లీజ్! శారదా! అవన్నీ మాట్లాడేసుకున్నాం. మొదటికి తేకు!"
"ఇంత రాత్రివేళ ...."
"నీకు చెప్పి వెళ్ళాలనే ఇప్పటివరకూ ఆగాను. ఆఖరి బస్సు కూడా దాటిపోతోంది. వస్తాను."
ఉసూరుమని పోయాను. రావును నే నేవిధంగానూ జయించలేను.
"నా మీద నీకున్న ప్రేమ పూర్తిగా పోయిందా, రావ్?" దీనంగా అడిగాడు.
కొన్ని క్షణాలు నా వంక జాలిగా చూశాడు రావు నాలో ఆశలు చిగురించేలా ....
"ఏ సూత్రమూ పోలేదు, శారదా!"
"మరి ....."
"సారీ! ఈ విషయాలన్నీ మాట్లాడటాని కిప్పుడు టైమ్ లేదు. ఇది నీ దగ్గరుండు. వస్తాను."
ఒక పుస్తకం నా మీదకు విసిరేశాడు. పాప పేరున నాలుగు వందలూ డిపాజిట్ చేసిన బాంక్ పుస్తకం అది.
రావుకు ఆర్ధికంగా సహాయపడుతున్నాననే తృప్తి కూడా నాకు దక్కకుండా పోయింది.
"ఏమి టిది?" రోషంగా అడిగాను.
"కళ్ళజో డుందిగా! కనబడటం లేదూ?"
"కళ్ళజోడులో పైకి కనిపించేవి మాత్రమే చూడగలం మనస్సుల్లో మురికి ఎలా కనిపిస్తుంది?"
"అరే మానవ జాతి విషాద చరిత్ర! తమ మనసులోని మురికి తమకు తెలియకపోవటం!"
ఎప్పటికప్పుడు నా మాటలు నాకే తిప్పి కొట్టడంలో రావు కెంత నేర్పు!
"నీ పంతాలకి పాపని మార్చాలనుకున్నావా?"
"ఇందులో నా ప్రమేయం లేదు, శారదా! ఇదంతా పరిమళకు సంబంధించినది. రేపు పాప లేవగానే పాప బరువు తూచి చూడు. ఏమైనా తగ్గితే అప్పుడు పరిమళను శపించు. వస్తాను." చక చక వెళ్ళిపోయాడు రావు.
దెబ్బలాడుతూ అయినా రావును మరి కొంతసేపు ఉంచాలనుకున్నాను. నా ఉద్దేశం గ్రహించినవాడిలా సంభాషణ తుంచేసి వెళ్ళిపోయాడు.
"అమ్మగారూ! వడ్డించమంటారా?" నాకోసం కనిపెట్టుకున్న వంటమనిషి అడిగింది.
"అయ్యగారు భోజనం చేశారా?"
"లేదమ్మగారూ!"
"హుఁ! ఎందుకూ? ఉన్నారు ఇంత మంది! ఇంటికి యజమాని వస్తే భోజనం పెట్టాలని కూడా తెలియదు."
"తెలియకేం, అమ్మగారూ! నేను చాలా సార్లు బ్రతిమాలాను, భోజనానికి లేవమని. 'తొందరేం? అమ్మగారు రానీ!' అన్నారు. ఇంకేమనను చెప్పండి? మీరు వచ్చారు ...." ఆగిపోయింది వంటమనిషి.
ఆవిడ వాక్యం పూర్తి చెయ్యలేకపోయింది.
నేనూ చెయ్యలేక పోయాను.
"అమ్మగారు రానీ, భోజనం చేస్తాను' అన్నాడు రావు- నా ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన నా సర్వస్వం అయిన రావు!
నేను వచ్చాను. వచ్చిన క్షణం నుంచీ అతనితో దెబ్బలాడి ఆకలితో అతన్ని పంపేశాను.
"అమ్మగారూ! వడ్డించమంటారా?" మళ్ళీ అడిగింది వంట మనిషి.
"అవతలకు ఫో!" కసిరాను, పనివాళ్ళ ఎదురుగా ఏడవటం ఇష్టంలేక.
అది దీనంగా ఒకసారి చూసి వెళ్ళిపోయింది.
అందరికంటే ఎక్కువగా నే నిచ్చే జీతాలకు ఆశపడి మాత్రమే నా దగ్గిరుంటున్నారు ఈ మనుష్యులు.
వెనకటి రోజుల్లో ఒక నాడు కూరలు కొనటానికి డబ్బులు లేకపోయాయి. పాపం, పరిమళ కందిపచ్చడి రుబ్బి, చారు చేసింది. అందరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కడుపునిండా తిన్నాం! వట్టి నీళ్ళ చారుకూడా అమృతంలా అనిపించింది ఆ నాడు.
ఏదో ఉక్రోషంతో వంటింట్లోకి వెళ్ళాను. వంట మనిషి తను వడ్డించుకుని తింటూంది.
"అంతే! యజమానులు తిన్నా తినకపోయినా మీ కక్కర్లేదు. మీ కడుపు నిండితే చాలు!" కసిగా అన్నాను.
వంటమనిషి బిత్తరపోయి నా వంక చూసి, లేచి పోయి చెయ్యి కడిగేసుకుంది.
ఛీ! ఛీ! ఏం పని చేశాను నేను! తిండి దగ్గిర కూర్చున్న మనిషిని లేవకొట్టాను. మాలో మాకే లేని ఆప్యాయతలు వంటమనిషి కెందుకుంటాయి? ఉండాలని నే నాశించటం ఏమిటి? నోటి దగ్గిర పెట్టుకో బోతున్న తిండిని నా నోటికి జడిపి దూరం చేసుకున్న ఆ నిర్భాగ్యురాలి దీనమైన ముఖం చూడలేక పోయాను.
అప్పటికప్పుడు దాని చేతిలో పది రూపాయలు పెట్టాను.
దాని ముఖం వికసించింది.
నేను చేసే పనులలో ఛండాలన్నంతటినీ డబ్బుతో కడుక్కోగలనా?
"ఏదో చిరాకుతో అన్నాను. అన్నం తినేసెయ్యి."
"మీరూ కాస్త తినం డమ్మగారూ!"
"రావు ఏమీ తినలేదా?"
"కాసిని మంచినీళ్ళు త్రాగారు, అమ్మగారూ! అదిగో! ఆ గ్లాసు అలాగే ఉంది. కడిగేస్తాను."
రావు తాగి వదిలిన నీళ్ళు గ్లాసులో సగానికి అలాగే ఉన్నాయి.
"నువ్వేం కడగద్దు, వెళ్ళు."
ఆ గ్లాసు తీసుకుని నా గదిలోకి వచ్చేశాను. ఆ మిగిలిన నీళ్ళు ఒక్కొక్క బొట్టే చాలాసేపు తాగాను.
* * *
30
ఒకప్పుడు అదే పనిగా నవలలు చదివేదాన్ని రామ రామ నవల ప్రారంభిస్తూనే ముగింపు తెలిసి పోతూంది. ఒక రచయిత రచనలు ఒకటి రెండు చదివేసరికి ఆ రచయిత రచనా శిల్పం అర్ధమయిపోయి, మూడో నవల తెరుస్తూనే అత డెక్క డెక్కడ ఏయే మలుపులు తిప్పుతాడో, ఏయే సన్నివేశాలు ఎలా నిర్వహిస్తాడో అర్ధమయి పోతూంది. తెలుగు రచయితల లోనే కాదు, హోరాల్ద్ రోబిన్స్, డెవిస్ రోబిన్స్ మొదలైన ప్రఖ్యాత ఆంగ్ల రచయితల నవలల్లో కూడా 'ఒక గాడి' కనిపిస్తూంది. వైవిధ్యం బొత్తిగా కొరవడుతూంది. రమణీయమైన ఇతివృత్తాన్ని ఎన్నుకొని అల్లిక బిగితో, సంభాషణల సొగసుతో పాఠకులను గారడీ చేసి ప్రఖ్యాతి పొందటం నేర్చుకున్నాక, కేవలం అల్లిక బిగితో నెట్టుకు వచ్చే ఇతివృత్త ప్రాధాన్యపు నవలలన్నా విసుగు పుట్టుతూంది.
వెనకటి రోజుల్లో నాలో నిరుత్సాహం ప్రవేశించి నప్పుడల్లా రావుతో చర్చించేసరికి మళ్ళీ కొత్త ఉత్సాహం నిండుకునేది మనసులో నేను సాధించవలసింది ఏదో ఉందనీ, నా గమ్యం ఇంకా చాలా దూరంలో ఉందనీ నన్ను నమ్మించే వాడు రావు. ఆ కారణంతో నాలో కృషి, తపన సన్నగిల్లేవి కావు.

లతీఫ్ కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే ఆలోచించగలడు. పాఠకులను విశేషంగా ఆకట్టుకో గలిగే ఫ్లాట్స్ ఒక అయిదారు వివరించాడు. అవే అటు తిప్పి, ఇటు తిప్పి నవలలుగా వ్రాయమనే వాడు.
"వ్రాసిందే వ్రాస్తే పాఠకులకు విసుగుపుట్టదూ?"
"చూస్తున్నావుగా? మన సేల్స్ పడిపోయాయా?"
"అదే నాకు అర్ధంకావటం లేదు."
"నాకు చక్కగా అర్ధమవుతోంది. పాఠకులలో అధిక సంఖ్యాకులు కమ్మని ప్రేమ కథలంటే పడి వస్తారు. తెలుసుకో దగినది ఏమీ లేకపోయినా, రచనా శిల్పంలో వినూత్నత ఏ కోశానా కనపడక పోయినా, చదివిందే చదువుతున్నట్లు స్ఫురించినా, కమ్మని ప్రేమ సంభాషణలూ, తీయని విరహాలూ, అలౌకిక మయిన త్యాగ్యాలూ, హృదయ భేధ్యాలయిన వియోగాలూ-ఇత్యాదులతో కమ్మని పగటి కలలలోకి పాఠకులను తేలించగలిగే రచనలకి ఏనాడూ ఢోకా ఉండదు."
"కేవలం ప్రేమ కథలు వ్రాయటం మూలాన్నే నేను ప్రఖ్యాతి పొందుతున్నా వంటావా? ఎంతమంది ప్రేమ కథలు వ్రాయటం లేదూ? వాళ్ళందరికీ పేరు వచ్చిందా?"
లతీఫ్ కొంచెంసేపు ఆలోచించి, "బహుశః వాళ్ళ కంటే నువ్వు నేర్పుగా వ్రాయగల వనుకుంటాను" అన్నాడు.
"మరి, ఆ నేర్పు అన్నది నాలో ఉన్నప్పుడు కేవలం ప్రేమ కథలు వ్రాయటం వల్లనే ప్రఖ్యాతి వచ్చిందంటా వెందుకు?"
"అదేమీ నాకు తెలియదు. పోనీ, ప్రేమ కథలు కాకుండా మరొకటి వ్రాయటానికి ప్రయత్నించి చూడు!"
"ఒకవేళ అమ్ముడుపోకపోతే?"
"పోనీ నష్టం వస్తుంది." నిర్లక్ష్యంగా నవ్వాడు లతీఫ్.
లతీఫ్ పక్కా వ్యాపారస్థుడు. అంత ధనవంతుడయినా లెక్కల దగ్గిరకి వచ్చేసరికి అతి జాగ్రత్తగా ఉంటాడు. ఒక్క పైసా అయినా వృథా కానియ్యడు. అలాంటి వాడు కేవలం నా మాట మీద-'నష్టం వస్తే రానియ్యి' అనగలిగాడంటే ఆశ్చర్యమూ కలిగింది; ఏదో భయమూ వేసింది.
లతీఫ్ ఈనాటి వరకూ నాతో ఏనాడూ అనుచితంగా మాట్లాడలేదు.
శృతి మించి మాట్లాడలేదు.
భయపడవలసిన అవసరం నా కేముందీ?
ఉత్కంఠా జనకమైన ఇతివృత్తము, సర్వలక్షణ సంపన్నుడైన కథానాయకుడు, సర్వాంగ సుందరి అయిన కథా నాయకి-ఇత్యాది హంగులన్నీ వదిలి, మనసు లోలోపలి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తూ, స్థూలంగా మంచి చెడ్డలని మనం భావించే భావాలు విశాలమైన మానవతా వాదంలో ఒక దానిలో ఒకటి కలిసిపోయే ఉంటాయని నిరూపిస్తూ ఒక నవల వ్రాశాను.
లతీఫ్ అన్నట్లే అక్షరాలా జరిగింది.
ఆ నవల చదివిన పాఠకులు చప్పరించేశారు.
"శారదగా రీ మధ్య చెత్త నవలలు వ్రాస్తున్నారు" అనేశారు.
"శారదా! నువ్విలా నీ కోసం ప్రయోగాలు చేసుకుంటే రచయిత్రిగా నీ కున్నప్రఖ్యాతి తగ్గిపోతుంది, జాగ్రత్త!" హెచ్చరించాడు లతీఫ్.
మా కిద్దరికీ ఒకరి నొకరిని పేరుపెట్టి పిలుచుకునే చనువూ, 'ను'వ్వని సంబోధించే చనువూ చాలా రోజుల క్రిందటే వచ్చేసింది.
నాలో ఏదో నిరుత్సాహం కలిగింది. ప్రేమ కథలు తప్ప మరొకటి నేను వ్రాయలేవా? నా రచన పాఠకుల ముందు ఎందుకిలా ఓడిపోయింది?
ఈ ప్రశ్నలకు లతీఫ్ సమాధానం చెప్పలేడు. రావునే అడగాలి.
పాపను తీసుకెళ్లడానికి రావు ఎప్పుడొస్తాడా అని ఎదురు తెన్నులు చూశాను.
రాగానే-"హమ్మయ్య! వచ్చావా?" అన్నాను సంభ్రమంగా.
నా సంభ్రమానికి ఆశ్చర్యంగా నన్ను చూసి, "నా కోసం ఎదురుచూస్తున్నావా?" అన్నాడు.
"అవును.... ప్రతి క్షణమూ ..."
"నీ రచనా వ్యాసంగంలో ఏదైనా నాతో చర్చించాలనుకున్నావా?"
తెల్లబోయాను.
ఎంత సరిగ్గా ఊహించగలడు రావు? ఇతని కేదైనా దివ్య దృష్టి ఉందా?
రావుతో అబద్దాలాడగలిగే శక్తి నాకు లేదు.
"అవును పద! అలా ఏదైనా హోటల్ కి వెళ్ళి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం!"
క్రిందటి సారి రావును భోజనమైనా చెయ్యకుండా పంపిన సంగతి నేను మరిచిపోలేదు. ఈసారి అలా జరగనీయ దలుచుకోలేదు.
ఇంట్లో కంటే హోటల్లో అయితేనే వాతావరణం బాగుంటుందనిపించింది ఎందుకనో .....
బయలుదేరుతూనే నా పర్స్ రావు చేతి కిచ్చాను. అది మామూలుగా నా అలవాటు. అయితే, ఇప్పుడు మాత్రం అలవాటుగా ఇవ్వలేదు. రావు దగ్గిర డబ్బులు ఉండవని నాకు తెలుసు. అతని అభిమానం గాయపడకుండా అతడే డబ్బు ఖర్చుపెట్టడానికి వీలుగా ఉంటుందని అతని కిచ్చాను.
మామూలుగానే తీసుకున్నాడు రావు.
లతీఫ్ ఇటీవల నా కొక కారు కూడా కొన్నాడు. డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను.
కారులో కూర్చుని, "రా!" అన్నాను రావుతో.
ఒక్క క్షణం రావు ముఖంమీద ఏదో నల్లని తెర పడినట్లయింది.
"కారులో వద్దు, శారదా! నడుచుకుంటూ వెళదాం! సాయంత్రాలు చల్లగాలికి నడవటం నీకు చాలా ఇష్టంగా!" అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు.
రావు నన్ను ప్రాధేయపడుతూ ఏదైనా అడగటమే అపురూపం. ఇంత చిన్న కోరిక కాదనలేకపోయాను.
కానీ, వీథి వెంట నడుస్తున్న కొద్దీ ఎలాగో అనిపించసాగింది.
"వీళ్ళందరికీ నే నెవరో తెలుసు. ఇలా రోడ్డుమీద సామాన్యురాలిలా నడిచి వెళుతూంటే వాళ్ళంతా ఏమనుకుంటారు?" చిరాగ్గా అన్నాను.
రావు నావైపు అదొక మాదిరిగా చూసి నిట్టూర్చాడు.
రావు పైకి నిట్టూర్చటం చాలా అరుదు. భరించ రానంత ఆవేదన కలిగితేనే కాని, అలా నిట్టూర్చాడు.
నే నేదో పొరపాటుగా మాట్లాడానని ఊహించాను. పొరపాటు ఎక్కడో, ఏదో అర్ధంకాకపోయినా, చాలా రోజుల తరవాత రావు సాన్నిహిత్యంలో నా కేర్పడిన ఆ అందమైన వాతావరణాన్ని చెదరగొట్టడం ఇష్టం లేక సంభాషణ మారుస్తూ, "నేను కొత్తగా వ్రాసిన నవల చదివావా?" అన్నాను.
"నువ్వు పంపగానే చదివాను."
"ఎలా ఉందీ?"
"కొత్తదారి తొక్కావు."
"పాఠకులలో చాలామందికి నచ్చలేదు."
"ఆశ్చర్యం లేదు."
"చూశావా, మరి! కొత్త ప్రయోగాలు, కొత్త ప్రయోగాలు అంటావు! సాహసించి వ్రాసేసరికి ఓటమి ఎదుర్కోవలసి వచ్చింది."
"నువ్వు ఓటమిని ఎదుర్కొన్నది కొత్త ప్రయోగం చేసినందువల్ల కాదు, శారదా! కళాకారుడికి ఓటమి అనేదే లేదు. తన సృష్టి సమస్తమూ రసాత్మకం కావించగలిగిన సమర్దుడే కళాకారుడు."
"అంటే? ఏమిటి నువ్వనేది?"
"నీకు ఉద్రేకం ఎక్కువ. అప్పుడే గట్టిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడేం వద్దు. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం!"
నాకు మరో మాటకు అవకాశ మివ్వకుండా పరిమళ ఇంటి వ్యవహారాల్లోకి సంభాషణ మార్చేశాడు రావు.
31
భోజనం చేస్తున్నా నన్న మాటేకానీ, దృష్టంతా రావు మాటలమీదే ఉంది.
"చక్కని స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొట్టడానికీ, నడిసముద్రంలో ఈతకొట్టడానికీ ఎంత తేడా ఉందో శృంగార రసాత్మకమైన ఇతివృత్త ప్రాధాన్యపు నవలలు వ్రాయడానికీ, విభిన్న ప్రయోగాలు చెయ్యటానికీ అంతే భేదం ఉంది. స్విమ్మింగ్ ఫూల్ లో దిగాలన్నా, సముద్రంలో దిగాలన్నా ప్రధానమైనది ఈత నేర్చి ఉండటం. అయితే, స్విమ్మింగ్ ఫూల్ లో ఈదటానికి ఒక మోస్తరు ఈతగాడయితే చాలు. నడిసముద్రంలో దూకటానికి గజ ఈతగాడై ఉండాలి. స్విమ్మింగ్ ఫూల్ లో ఈదులాడటం వలన మానసికోల్లాసం మాత్రమే లభిస్తుంది. రత్నాకరుని నడిగర్భాన ఏయే రత్న మాణిక్యాలు దాగి ఉన్నాయో ఇప్పటికీ ఎవ్వరూ సంపూర్ణంగా ఊహించలేరు. స్విమ్మింగ్ ఫూల్ లో ఈదులాడే వ్యక్తి అప్రమత్తుడై ఉండవలసిన అవసరం లేదు. యథేచ్చగా విహరించవచ్చు, ముందే సమస్తమూ ఏర్పరింపబడి ఉంటాయి కనక. నడిసముద్రంలో దిగిన వ్యక్తి అనుక్షణమూ అప్రమత్తుడై ఉండాలి.
