Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 21


    "అంటే నీకు చాలా చాలా దూరం చేశానని ఆరోపిస్తున్నావా?"
    "నేను ఎవరిమీదా ఏదీ ఆరోపించను. తలుచుకొంటే పాపను న్యాయస్థానంనుండి హక్కులతో తీసుకెళ్ళగలను. పాప నీకే దక్కకుండా చెయ్యగలను. కానీ, అంత రాక్షసుణ్ణి కాదలుచుకోలేదు. పాపను నీ దగ్గిరే ఉంచుకో! నెలకు రెండు రోజులు మాత్రం నా దగ్గిర ఉంచుకోనీ!"
    ఎప్పుడూ అతి గంభీరంగా ఉండే రావు కళ్ళు చెమ్మగిల్లటం చూసి వణికిపోయాను.
    అంతకంటే అతని మాటలు మరింత వణికించాయి. సోఫాలో కూలిపోయాను.
    "అంటే? నువ్వు ...." వాక్యం పూర్తి చెయ్యలేక పోయాను.
    రావు స్థిరంగా నా ముఖంలోకి చూశాడు.
    "కొన్నాళ్ళు పరిమళ దగ్గిరే ఉండదలుచుకున్నాను."
    "కొన్నాళ్ళంటే?"
    "ఇప్పుడు చెప్పలేను."
    "రావ్! నే నేం తప్పు చేశానని నా కీ శిక్ష? నన్ను క్షమించు. నన్ను వదిలి వెళ్ళకు." ఏడ్చేశాను.
    నేను స్థిమితపడి కళ్ళు తుడుచుకునే వరకూ రావు మౌనంగా కూర్చున్నాడు.    
    తరవాత మృదుస్వరంతో, "ఇందులో క్షమాపణల ప్రసక్తి లేదు, శారదా! ఇక్కడ నా అవసరం లేదు. పరిమళకు నా అవసరం ఉంది. నా అవసరం నీకు కలిగినవాడు తప్పకుండా వస్తాను" అన్నాడు.
    "ఇక్కడ నీ అవసరం లేదని ఎవరన్నారు?"
    "నా అంతరంగం. నే నెప్పుడూ అది చెప్పినట్లే నడుచుకొంటాను."
    తిరుగులేని మాట! వాద ప్రతివాదాల కతీతమైన మాట!    
    బొమ్మలా కూర్చున్నాను.
    "పాపను నువ్వే నాతో పంపించు. పాపకు జ్ఞానం వస్తోంది. దాని కేమీ తెలియనియ్యకు. దాని భవిష్యత్తు కోరి చెపుతున్నా నీ మాట!"
    రావు మాటలేమీ నా మెదడు కెక్కలేదు. రావు నన్ను విడిచి పోతున్నాడనే ఆలోచనతో అది మొద్దు బారిపోయింది. రావును ఎలా ఆపి ఉంచాలో అర్ధం కాలేదు.
    "రావ్!"
    ఏమిటన్నట్లు చూశాడు రావు.
    రావు ఆత్మాభిమానం తెలిసినా అడగకుండా ఉండలేకపోయాను.
    "పరిమళ దగ్గిరి కెళితే నీ కెలా జరుగుతుంది?"
    రావు ముఖంలో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం తెరలా జారిపోయి అతని మనసులోని ఆందోళన అంతా ఒక్క క్షణం ముఖంలో ప్రతిఫలించింది. ఆ ముఖం చూడలేక పోయాను.
    "పరిమళ పొలం పనులూ, ఇంటి పనులూ ఒక్కర్తే చూసుకోలేక పోతోంది. దానికి పొలం పనులు చూసి పెడితే కాస్త తిండి పెట్టదంటావా?"
    ఇంక భరించగలిగే శక్తి నాకు లేకపోయింది.
    రావు కున్న నిగ్రహశక్తి నాకు ఎన్నడూ లేదు. కూర్చున్న చోటునుంచి లేచిపోయి అతని పాదాల ముందు కూలబడి, చేతులతో అతన్ని చుట్టి ఒళ్ళో తల పెట్టుకుని, "వద్దు, వీల్లేదు" అంటూ ఏడ్చేశాను.
    ఆవేగపు పొంగు అణగిన తరవాత కళ్ళు తుడుచుకుని అతని ముఖంలోకి చూసిన నాకు, అతని నిర్ణయం మారలేదని అర్ధమయిపోయింది.
    "నాకు చెప్పటం దేనికి? నువ్వు చెయ్యదలుచుకున్నది నాకోసం మానవుగా!"    
    "నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి పనీ చేస్తాను. అందుచేత చెయ్యదలుచుకున్నది మానవలసిన అవసరం రాదు. ఇంక నీకు చెప్పటం సంగతి-మనం భార్యాభర్తలం, శారదా! భర్తగా నేను చెయ్యదలుచు కున్నది నీకు చెప్పాను. పొరపాటు చేశానా?"
    "మనం భార్యాభర్తలం, శారదా!'
    రావు మాటలు చెవుల్లో తిరిగి తిరిగి ధ్వనించాయి.కళ్ళలో నీళ్ళు నిండుగా, సర్వమూ మరిచి అతని ముఖం లోకే చూస్తూ కూర్చున్నాను.
    "పిచ్చి శారదా!"
    రావు నవ్వాడు. ఆ నవ్వులో ఆప్యాయతను శంకించలేను.
    తన ప్రయత్నం మానుకుంటాడేమోనని ఆశ పడ్డాను.
    "అనవసరంగా మనసు పాడుచేసుకోక చక్కగా నవలలు వ్రాసుకో! నువ్వు రచయిత్రిగా రాణించాలని మనసారా కోరుకుంటున్నాను."
    ఇవి వీడ్కోలు మాటలు! రావు ఆగడు! నేను ఆపలేను.
    "పాపను నాతో తీసుకెళుతున్నాను. నాలుగు రోజు లలో తీసుకొచ్చి దిగబెట్టేస్తాను."
    "ఒక్క షరతు! పాప అక్కడ అవస్థలు పడటానికి వీల్లేదు. పాప కయ్యే ఖర్చు నువ్వు తీసుకుతీరాలి!"
    నన్ను చూసి జాలిపడుతున్నట్లు నవ్వాడు రావు.
    "అలాగే!"
    అప్పటికప్పుడు నాలుగు వందలు అతని చేతుల్లో పెట్టాను.
    రావు అంత ఎందుకంటాడనీ, నేను బలవంత పెట్టవలసి వస్తుందనీ అనుకున్నాను.
    కానీ, రావు మాట్లాడకుండా ఆ డబ్బు జేబులో పెట్టుకున్నాడు.
    "పాపా!" అని పిలిచాడు.
    "నేను రెడీ, నాన్నగారూ!" పాప పరుగెత్తు కుంటూ వచ్చింది.
    "వెళుతున్నా నమ్మా!"
    టాటా చెప్పింది పాప.
    గంభీరంగా రావు, సంబరం వెల్లివిరుస్తూన్న ముఖంతో పాప ఇల్లు దాతుతూంటే చూస్తూ ఉండిపోయాను.
    ఏదీ చెయ్యలేకపోయినా, రావుకు ఆర్ధికంగా సహాయ పడగలిగాననే సంతృప్తి మాత్రం మిగిలింది నా గుండెలో!

                                                        28

    రావునూ, పాపనూ చూసి పొంగిపోయింది పరిమళ. పాపను హృదయానికి హత్తుకుంటూ, "వదిన చాలా మంచిది. పాపను పంపింది" అంది చెమ్మగిల్లిన కళ్ళతో.
    "అవును చాలా మంచిది నెలకు నాలుగు రోజులు నా దగ్గిర ఉంచటానికి ఒప్పుకుంది." చిరునవ్వుతో అన్నాడు రావు.
    పాపను చుట్టిన పరిమళ చేతులు సడిలిపోయాయి. దిగ్భ్రాంతితో రావు ముఖంలోకి చూసింది.
    రావు అలాగే చిరునవ్వుతో నించున్నాడు.
    క్రమంగా పరిమళ ముఖంలో పాండురత కరిగిపోయి తనూ చిరునవ్వు నవ్వింది.
    "నువ్వెంత మంచివాడిని, అన్నయ్యా! నాకు సహాయం చెయ్యటానికి వచ్చావా?"
    "నాకు మరో ఉద్యోగం దొరికేవరకూ ఇదే ఉద్యోగం! నీకు అభ్యంతరం లేకపోతే ..."
    "ఇలా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నావు?" కోపంతో చురచుర చూస్తూ అంది పరిమళ.
    రావు పకపక నవ్వాడు. పరిమళ తనూ నవ్వింది.
    ఇద్దరినీ చూసి, ఏమీ అర్ధం కాకపోయినా పాప కూడా నవ్వింది.
    రావు తన దగ్గిరున్న నాలుగు వందలూ పరిమళ కందిస్తూ, "మీ వదిన పాప ఖర్చులకోసం ఇచ్చింది" అన్నాడు.
    పరిమళ ఆ నోట్లు అందుకోలేదు. కొన్ని క్షణాలు తనను తను నిగ్రహించుకొంటున్నదానిలా మాట్లాడకుండా ఊరుకొని, "మంచిదేగా, అన్నయ్యా! వదిన పాపకోసం ఇచ్చింది" అంది.
    రావు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు.
    ఆ చూపులకు నవ్వుకొని, "ఆ డబ్బు బాంక్ లో పాప పేరా డిపాజిట్ చేసి, బాంక్ బుక్ వదిన దగ్గిర జాగ్రత్త చెయ్యి" అంది.
    పరిమళను ఆర్ద్రంగా చూస్తూ ఆ డబ్బు జేబులో పెట్టుకున్నాడు.
    కాంతమ్మ, రాఘవ రావు రాకకు చాలా సంతోషించారు. రాఘవ పట్టించుకోకుండా ఊరుకున్నా, కాంతమ్మ వదలలేదు.
    "అయితే, నువ్వు మా దగ్గిరే ఉంటావా?"
    "ఉంటాను."
    "శారద?"
    "అక్కడే ఉంటుంది."
    "మీరు పోట్లాడుకున్నారా?"
    "లేదు."
    "మరి?"
    "మరి?!"
    "అది కాదయ్యా! అమ్మా యక్కడ, నువ్విక్కడ ఎలా ఉంటారు?"
    "మామూలుగా అన్నం తింటూ, పడుకొంటూ..."
    "భలేవాడివే! అది కాదు నే ననేది..."
    "ఏమిటంటావో అను!"
    "శారద నిన్ను విడిచిపెట్టి ఉండగలదా?"
    "ఉండలేకపోతే ఇక్కడికి వస్తుంది. పెద్ద దూరం కాదుగా!"
    "నువ్వు శారదను వదిలి ఉండగలవా?"    
    "ఉండలేకపోతే వెళతాను. నువ్వు వద్దనవుగా!"
    "బాగుందయ్యోయ్! నే నెందుకు వద్దంటాను? విసిగించక అసలు విషయం చెప్పు."
    "అసలూ, కొసరూ కలిపి విషయమంతా ఇంతే!"
    రావుతో గెలవలేక ప్రశ్నలూ, సమాధానాలూ తనే చెప్పుకుంటూ కాంతమ్మ వెళ్ళిపోయింది...
    పాపతో బొమ్మలాట ఆడుతున్న పరిమళను చూసి, "పాపను తయారు చెయ్యి, పరిమళా! శారద దగ్గిరకు తీసుకెళ్ళాలి!" అన్నాడు రావు.
    "ఉండండి, నాన్నగారూ! ఇంకా పెళ్ళి పూర్తి కాలేదు." అచ్చు పెళ్ళి పెద్దలా చెప్పింది పాప.
    పరిమళ దీనంగా, "అప్పుడే నాలుగు రోజులూ అయి పోయాయా?" అంది.
    రావు జాలిగా నవ్వాడు.
    పరిమళ పాపను తయారుచేసింది. ఒక సంచీనిండా రకరకాల తినుబండారాలు పెట్టి రావు కందించింది.
    "నేను ఇక్కడికే వస్తానుగా! ఇవి దేనికి?" అన్నాడు రావు.    
    "నీకు కాదు, అన్నయ్యా! వదినకి!"
    "వద్దులే, పరిమళా! దాచెయ్యి."
    "అన్నయ్యా! వదినమీద నాకు కోప మనుకుంటున్నావా?"
    "పిచ్చిపిల్లా! క్రిందటిసారి నువ్వు పంపించిన పిండివంటలన్నీ నే నొక్కడినే తిన్నాను."
    పరిమళ చిన్న నిట్టూర్పు విడిచి, అన్నీ లోపల పెట్టే సింది.
    పాప ఇచ్చిన స్వీట్ బాక్సులన్నీ తీసుకుని అపురూప మైన సంపదలా తన పెట్టెలో దాచుకుంది.
    పాపకు రకరకాల బిస్కట్ పాకెట్స్ కొని ఇచ్చింది. పాలకోవా బిళ్ళలు స్వయంగా తయారుచేసి, సీసాలో వేసి ఇచ్చింది.
    పాపకు చిన్నతనం. ప్రయాణమంటే సరదా! తండ్రితో కలిసి తిరిగి బస్సు ప్రయాణం చెయ్యబోతున్న సరదాలో పరిమళకు "టా!టా!" చెప్పింది. పరిమళ దుఃఖం నిగ్రహించుకోలేక లోపలికి వెళ్ళిపోయింది.
    పాపకేం తోచిందో తనూ లోపలికి వెళ్ళింది. పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్న పరిమళ చుట్టూ చేతులు వేసి, "అత్తా! ఇక్కడే ఉండిపోనా?" అంది.    
    ఉలిక్కిపడింది పరిమళ. గబగబ కళ్ళు తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తూ, "వద్దమ్మా! అక్కడ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకోదూ!" అంది.
    "ఉహుఁ! బెంగపెట్టుకోదు. అమ్మ వ్రాసుకుంటుంది."
    "వ్రాసుకున్నా నీ కోసం బెంగపెట్టుకుంటుంది. నువ్వు లేకపోతే 'పాపా! పాపా!' అని ఏడుస్తుంది."
    పాప కదిలి పోయింది. "సరే, అత్తా! అమ్మ దగ్గిరకి వెళ్ళి మళ్ళీ వస్తాను."
    "బంగారు పాప! నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను."
    "టాటా!"    
    పరిమళ చిరునవ్వుతో చెయ్యి ఊపింది.

                                     29

    వ్రాయబోయే నవలలోని ఇతివృత్తపు అల్లికను గురించి దీక్షగా ఆలోచంచుకొంటూ అటు ఇటు పచారులు చేస్తున్నాను.
    పాప వచ్చిందనీ, పరుగెత్తుకొంటూ నా దగ్గిరకి వచ్చి నాతో ఏదో సంబరంగా చెప్పబోయిందనీ, నా ఆలోచనలో నే నుండి దాని నసలు పట్టించుకోలేదనీ, అది చిన్నబోయి వెళ్ళిపోయిందనీ నాకు తెలియనే తెలియదు. ఇతి వృత్తానికి బిగువైన అల్లిక కుదిరేలా ప్రణాళిక తయారు చేసుకున్న ఉత్సాహంలో క్రిందకు వచ్చేసరికి, రావు సోఫాలో కూర్చుని ఏదో పత్రిక చదువు కొంటున్నాడు.
    రావు నొక్కడినే చూసేసరికి ఒళ్ళెరగని కోపం వచ్చింది నాకు.    
    "పాపను తీసుకురాకుండా నువ్వొక్కడివే వచ్చావు కదూ! నాకు తెలుసు. నన్నెలాగయినా ఏడిపించటమే నీ ధ్యేయం. పాపకోసం రోజూ పరితపించి పోతున్నాను. అయినా, నువ్వు పాప నక్కడ వదిలి ..."
    "అమ్మా!...."
    భయంగా నా ధోరణికి అడ్డు తగిలింది ఆయా.
    "ఏం?"
    "పాప ఇప్పుడే పడుకుంది, అమ్మగారూ! ఇప్పుడు లేచిందంటే తెల్లవార్లూ నిద్రపోదు."
    గతుక్కుమన్నాను. నిద్రలో ఒకసారి మెలకువ వస్తే మళ్ళీ నిద్రపట్టక పోవటం నా అలవాటే! అది పాపకూ వచ్చింది. పాపలో చాలావరకు నా పోలికలే!
    "పాప వచ్చిందా?" ఆశ్చర్యంగా అడిగాను. అంతలో కోపమూ వచ్చింది.
    "పాప వచ్చినా నాకు చూపించకుండా పడుకో బెట్టేశారా?"
    అడుగుతున్నది ఆయానే అయినా, రావు వంక చూస్తూ అన్నాను. బహువచనం వాడాను.
    రావు సమాధానం చెప్పకుండా నవ్వాడు.
    ఆయా చెప్పింది. "పాప రావటమే మీ దగ్గిరకు పరుగెత్తుకుంటూ వచ్చిం దమ్మగారూ! మీ రసలు పాపను చూడనైనా చూడకుండా ఏదో ఆలోచించు కుంటున్నారు. రోషంతో వచ్చేసింది. అన్నం తినిపించే సరికి బ్రహ్మాండమయింది. చాలాసేపటివరకూ పరిమళమ్మ ఇచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుని, ఇప్పుడిప్పుడు నిద్రపోయింది."
    ఇంత పసివయసులోనే ఆ పౌరుషమూ, ఆత్మాభిమానమూ రావు దగ్గిర నుండి వారసత్వంగా తెచ్చుకుంది పాప.
    హృదయమంతా ఆందోళనతో కలగినట్లయింది. నిద్రపోతున్న పాప దగ్గిరకి వెళ్ళాను.
    పాప కనుకొలకులలో రెండు నీటిబిందువులు ఇంకా అలాగే ఉన్నాయి.
    నా పైట కొంగుతో జాగ్రత్తగా ఆ తడి అద్దాను నా గుండెల నిండుగానూ ఏదో దుఃఖం పేరుకొంది. పాపంటే నాకు ప్రేమ లేదా? లేకపోతే నా మన సెందుకింత పరితపిస్తూంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS