26
ఒక సంచీ నిండా కూరగాయలూ, మరొక సంచీ నిండా మిఠాయిలూ, జంతికలూ మొదలైన తిను బండారాలూ మోసుకుని వచ్చాడు, పరిమళ పంపిన పాలేరు.
అవన్నీ చూసి మండిపడుతూ, "ఆ ముష్టి బహు మానాలు నాకేం అక్కర్లేదు. తిప్పి పంపెయ్యి" అన్నాను.
"ప్లీజ్! శారదా! అతను వెళ్ళిపోయాక అవన్నీ మురికికాలువలో పారెయ్యి. ఒక పాలేరు ముందు కుటుంబం గుట్టు బయట పెట్టి, నిన్ను నువ్వు నవ్వుల పాలు చేసుకోకు!"
ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు రావు.
ఆ పాలేరుని అటునుంచి అంటే వెళ్ళగొట్టి పరిమళను అవమానించాలని ఎంత ఆవేశపడినా, అశాంతితో, ఆవేదనతో వడిలిపోయిన రావు ముఖంలోకి చూస్తూ అతని మాటలను ఎదిరించలేకపోయాను.
"ఓ యబ్బో! ఇల్లు మా బాగుందండి!" అన్నాడు పాలేరు సంబరంగా.
రావు ప్రయత్నపూర్వకంగా నవ్వి, "సరేలే! అక్కడి విశేషాలు చెప్పు. అందరూ బాగున్నారా?" అన్నాడు.
"పరిమళమ్మ ఆ ఇంట అడుగు పెట్టినాక బాగుండకేటండీ! ఆ యమ్మకి దేవుడెంత ఓపికిచ్చాడో, ఎంత తెలివిచ్చాడో ఆశ్చర్య మవుతాదండి. ఇప్పుడు పొలం పనులన్నీ అరే స్వయంగా సూసుకుంటున్నారండి. మల్లా ఇంట్లో వంటా గట్రా కూడా అరే సేసు కుంటారు. పొద్దుట మూడు గంటలకి లెగిస్తే, రేత్తిరి ఒంటి గంటకే పడుకోటం! కాంతమ్మగారు కోడల్ని తలుసుకుని మురవని గడియ లేదు."
తన ముఖంలో ఏ భావమూ కనిపించనియ్యకుండా శాంతంగా విన్నాడు రావు.
"పరిమళ ఆరోగ్యం బాగుందా?"
"ఏం బాగులెండి! నానాటికీ బక్కచిక్కి పోతన్నారు. ఇంత చాకిరీ మాటలా మరి? అయినా, అట్టాగే ఈడ్పు కొస్తన్నారు."
రావు ఏ సమాధానమూ చెప్పలేకపోయాడు. పాలేరు కొన్ని క్షణాలాగి, "అమ్మాయిగా రేరండీ?" అన్నాడు. "ఆడుకొంటూంది. ఉండు, పిలుస్తాను."
రావు వెళ్ళి లాన్ లో ఆడుకొంటూన్న పాపను పిలుచుకొచ్చాడు.
తన సంచీలోంచి కర్ర లక్కపిడతల సెట్ తీసి పాప కిచ్చి, "మీ అత్తమ్మగారు ఇయ్యమన్నారండి!" అన్నాడు.
"అత్త వచ్చిందా? ఏది?"పాప సంభ్రమంగా అడిగింది.
"ఆరు రాలేదండి. ఆరి కెక్కడ తీరతాది? మీరే రావాల!"
"వస్తాను. తీసుకెళతావా?"
"నాన్నగారి నడగండి. ఆరు తీసుకెళ్ళ మంటే మారాజులా తీసుకెల్తాను. మీ అత్తమ్మగారు మిమ్మల్ని తలవని క్షణం లేదు."
"నాన్నగారూ! వెళ్ళనా?"
"నిన్ను తరవాత నేను తీసుకెళతా నమ్మా!"
"తప్పకుండా తీసుకెల్తారా?"
"తప్పకుండా! ఇతను వెంటనే వెళ్ళిపోవాలి! మనం అన్నీ సర్దుకుని వెళదాం."
పాప లోపలకు పరుగెత్తి వెంటనే తన ఆయాను పిలిచింది. ఇటీవల నేను పాపకోసం ప్రత్యేకంగా అయాను, వంటమనిషినీ పెట్టుకున్నాను. నా అదృష్టం! ఆ ఆయా ఏదో జీతంకోసం అన్నట్లు కాక పాపను మనసారా అభిమానిస్తూంది.
"ఆయా! వెంటనే నా బట్టలన్నీ సర్దెయ్యి. మేం అత్తయ్య దగ్గిరికి వెళుతున్నాం. చాలా బట్టలు సర్దు. అక్కడ అత్తయ్యతో ఆడుకోవాలి. నా స్వీట్ బాక్సులన్నీ పెట్టు. అత్తయ్యకోసమే దాచాను."
అచ్చు నేను ఆజ్ఞాపిస్తున్నట్లే ఆజ్ఞాపిస్తూంది పాప.
పాప తన స్వీట్ బాక్సులన్నీ తెచ్చి ఆయా ముందు పెట్టే వరకూ, పాప అవన్నీ తినకుండా దాచిందనీ, పరిమళకోసం దాచిందనీ నాకు తెలియనే తెలియదు. అయా అన్నీ సర్దుతూ, "పాపా! నన్ను కూడా తీసుకెళ్ళవా?" అంది బేలగా.
"సరే! చక్కగా పనిచేస్తే తప్పకుండా తీసుకెళతాను."
పాప ముఖంలో డిగ్నిటీ చూస్తే అంతటి ఉక్రోషంలోనూ నాకు నవ్వాగలేదు. ఆయా పకపక నవ్వేసి పాప నెత్తుకుని గిరగిర తిప్పింది.
పాలేరు వెళ్ళిపోయాడు.
రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు.
అతని ముందున్న రెండు సంచుల వంకా నిరసనగా చూశాను.
వంట మనిషిని పిలిచాను. వణికిపోతూవచ్చింది.
"చూడూ! ఈ సంచీలో కూరలన్నీ దూరంగా అవతల పారెయ్యి" అన్నాను.
వంటమనిషి సంచీలోని కూరలన్నీ బోర్లించి చూసింది.
"అమ్మగారూ! లేత కూరలు. తాజా కూరలు. ఇలాంటివి కొందామన్నా మనకి దొరకవు. ఎందుకండీ పారెయ్యటం?"
"నోరు మూసుకుని చెప్పినది చెయ్యి." గర్జించాను.
"సరేనండి! పోనీ, మీ కిష్టంలేకపోతే నేను పట్టుకు పోతానండీ!"
"పట్టుకుపో! ఉద్యోగంలోంచి కూడా పో!" కఠినంగా అన్నాను.
"క్షమించడమ్మా! ఈ ఉద్యోగం పోతే ఇంట్లో చాలా కష్టమవుతుంది."
"వెంటనే ఈ కూరలు చెత్త కుండీలో పారెయ్యి."
"చిత్తం!"
వంటమనిషి కూరలు తీసుకు వెళ్ళిపోయింది.
రావు నా మాటలకు బాధపడతాడనీ, నా చేష్టలకు అడ్డువస్తాడనీ అనుకున్నాను. కానీ, రావు అలా చూస్తూ ఉండిపోయాడు.
"ఆ తినుబండారాలన్నీ కూడా పారెయ్యి." కోపంగా అన్నాను.
"ఉహుఁ! అవి పారెయ్యడానికి వీల్లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను తింటాను." ఆ సంచీ తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు రావు.
"ఆకలివేస్తే ఇంట్లో కావలసినన్ని రకాలు చేయించుకు తిను. ఆ ముష్టి వస్తువులు తినక్కర్లేదు."
"ముష్టి వస్తువుల మీద నాకేనాడూ వ్యామోహం లేదు, శారదా! ఇవి నా చెల్లెలు ప్రేమతో పంపినవి. వీటిని వదులుకోను."
రావు మాటల్లో వ్యంగ్యం నన్ను గుచ్చింది. మండి పడుతున్న నా ముఖంలోకి చూస్తూ అదొక మాదిరిగా నవ్వాడు రావు.
వంట మనిషి వచ్చి వివరించే వరకూ ఆ నవ్వులో భావం బోధపడలేదు నాకు.
"అమ్మా! అయ్యగారు నాలుగు రోజుల నుండి ఇంట్లో అన్నం తినటం లేదు. రెండు రోజులు హోటల్ లో తిన్నారు. నిన్న పొద్దున్న డబుల్ రొట్టి కొనుక్కుని తిన్నారు. రాత్రి ఏమీ తినలేదు. నే నెంత బ్రతిమాలినా మెతుకు ముట్టుకోలేదు."
నిర్ఘాంతపోయాను. రావు ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాను. మరొక్క సారి నవ్వాడు రావు. అప్పుడు బాగా అర్ధమయింది.
రావు ఉద్యోగం పోయింది. నా సంపాదన నుండి తిండి కూడా తినదలుచుకోలేదు రావు.
ఎందుకు మానేశావని అడగగలిగే శక్తి కూడా నాలో లేకపోయింది. అడిగితే వచ్చే సమాధానం నాకు తెలుసు. విని భరించలేను.
పరిమళ పంపిన తినుబండారాలు ఆప్యాయంగా తింటున్నాడు రావు.
పాపకు తిండిమీద ధ్యాస తక్కువ. ఏ పూట కా పూట అన్నం తినిపించేసరికి ఆయా చాలా అవస్థ పడవలసి వస్తుంది.
పరిమళ పంపిన కర్ర లక్కపిడతలను చూసుకుని మురిసిపోతూంది.
ఇంత సంపాదిస్తున్నాను. పాపకు లక్కపిడతలు కొనాలని నాకు స్ఫురించనే లేదు.
ఎప్పుడూ నా మనస్సును దహించివేసే భయంకర మైన భావం - నేను ఒంటరిదాన్ననే భావం - నా మనసును కాల్చసాగింది.
నా గదిలోకి శారీరకంగానూ, పుస్తకాలలోకి మానసికంగానూ పారిపోయాను.
27
ప్రయాణానికి సిద్ధమవుతూన్న రావును చూసి ఆశ్చర్యపోతూ, "ఎక్కడికైనా వెళుతున్నావా?" అన్నాను.
"అవును పరిమళ దగ్గిరకి!"
"అంటే?! నిజంగానే పాపను పరిమళ దగ్గిరకి తీసుకెళుతున్నావా?"
"అవునమ్మా! నేనూ, నాన్నగారూ అత్త దగ్గిరకి వెళ్ళిపోతున్నాం!" సంబరంగా చెప్పింది పాప.
"పాప నా కూతురు!" తీక్షణంగా అన్నాను.

"నా కూతురు కాదనవు కదా!" హేళన నిండిన చిరునవ్వుతో అన్నాడు రావు.
"ఛీ! ఛీ! చివరికి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు?"
"నీ మాటలే తిరిగి అంటున్నాను. అవి ఎంత వికారంగా వినిపిస్తున్నాయో, నీకూ అర్ధమవ్వాలని...."
"ఏమయినా పాపను తీసుకెళ్లనివ్వను."
"శారదా! ఇంతవరకూ నీతో సభ్యత తప్పి మాట్లాడ లేదు నేను. నాలో ఆ సంస్కారాన్ని కూడా దూరం చెయ్యకు."
