Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 19


    "ఏమిటి, లతీఫ్? నే నీ ఇంట్లో ఎందుకుంటాను?" కరుగ్గా అడిగాడు రావు.
    ఆ తిరస్కారాన్ని లక్ష్యపెట్టకుండా నవ్వేశాడు లతీఫ్.
    "నీ ఇంట్లో నువ్వు ఉండవా?"
    "నా ఇల్లా?"
    "అవును మీకోసమే ఈ ఇల్లు కొన్నాను. శారద గారి పేర రిజిస్టర్ చేయించాను."
    "మరి, నా ఇల్లంటావేం?"
    సంతోషంతో తలమునక లవుతూన్న నేను రావు మాటలలో వ్యంగ్యం పట్టించుకోలేదు.
    ఈ సారి ఇల్లంతా మరొక్కసారి కలయ తిరిగాను. ఇల్లు చాలా అందంగా ఉండటమే కాక, ఫర్నిచర్ కూడా అమర్చి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను.
    అంతలో ప్రధానమైన ధర విషయం గుర్తు కొచ్చింది.
     "ఎంత ఖరీదు ఈ ఇల్లు?"
    "యాభై వేలు!" అతి మామూలుగా అన్నాడు లతీఫ్.
    నా గుండె ఝల్లుమంది.
    "హమ్మనాయనోయ్! అంత డబ్బే! నా దగ్గిరెక్కడిది?"
    "ప్రస్తుతం నే నిచ్చేశాను. ఆ తరవాత మీ కివ్వ వలసిన రాయల్టీ లోంచి ప్రతి నెలా మినహాయించుకొంటాను."
    "అంటే?! ఇంకమీద నాకు నెలా నెలా వెయ్యి రూపాయలు ఇవ్వరా?"
    గట్టిగా నవ్వాడు లతీఫ్.
    "భయపడకండి. ఈమధ్య మీ నవలల మీద విపరీతంగా లాభాలు సంపాదించుకుంటున్నాను. ఆ కారణంగ మీకు నెలకు మరో అయిదు వందలు ఇద్దామనుకున్నాను. ఆ డబ్బు ఇంటి ఖరీదు క్రింద మినహా యించుకొని, మామూలుగా మీ వెయ్యి మీ కిస్తాను. ఇల్లు నచ్చినట్లేనా?"
    "ఎంతో అందంగా ఉంది. జ్ఞానం వచ్చినప్పటి నుండీ ఇలాంటి ఇంట్లో ఉండాలని ఆశ. ఇన్నాళ్ళకు ఫలించింది."
    "థాంక్స్!"
    "నేను మీకు చెప్పాలి."
    మళ్ళీ నవ్వేశాడు లతీఫ్.
    "ఆల్ రైట్? ఇది వ్యాపారం. ఇందులో ఎవరూ ఎవరికీ ఏమీ చెప్పుకోనక్కరలేదు. సరే! మీ రిక్కడే ఉండండి. మీ సామాను తెప్పిస్తాను."
    "అప్పుడేనా?"
    "ఏం?"
    "గృహప్రవేశం జరుపుకొని అప్పుడు దిగాలి."
    "ఓ! పార్టీ ఇయ్యాలనుకొంటున్నారన్న మాట! సరే! ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను."
    "థాంక్స్."
    "చెప్పక్కర్లేదని చెప్పాను. రండి. మీ ఇంటి దగ్గిర దింపేస్తాను."
    "మా ఇంటి దగ్గర అనకండి. అద్దె ఇంటిదగ్గిర అనండి. ఇకముందు ఇదే మా ఇల్లు!"
    లతీఫ్ మరోసారి గట్టిగా నవ్వాడు.
    అతనలా చీటికీ మాటికీ గట్టిగా నవ్వటం నాకు ఇష్టంలేకపోయినా ఏమీ అనలేకపోయాను.
    ఆ ఇల్లు చూసి వచ్చిన తరవాత మా అద్దెకొంప మరీ వికృష్టంగా కనిపించసాగింది. ఆ ఇల్లు ఎప్పుడెప్పుడు విడిచిపోదామా అని మనసు ఆత్రపడసాగింది.
    లతీఫ్ సూచించిన ఫ్లాట్ ననుసరించి చకచక నవల వ్రాసేస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు రావు.
    రావు తనంత తాను నా దగ్గిరకి రావటం అపురూప మైన విషయం అయిపోయింది ఇటీవల.
    పెన్ క్రిందపెట్టి ఆశ్చర్యంగా చూశాను.
    "నిన్ను డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించు. నీతో కొంచెంసేపు మాట్లాడటానికి వీలవుతుందా?"
    ఎవరో పరాయి వ్యక్తిలా రావు అలా అడుగుతూంటే మనసంతా కలిచినట్లయింది. దానికితోడు అశాంతి తాండవించే రావు ముఖం చూడలేకపోయాను. ఆ ముఖాన్ని నా హృదయానికి హత్తుకుని ఓదార్చాలను కున్నాను. కానీ, అశాంతితోపాటు ఔదాసీన్యమూ, ఈ రెంటినీ మించి గాంభీర్యమూ తాండవమాడుతున్న రావు ముఖం చూస్తూ అతడిని సమీపించలేకపోయాను.
    "నాతో మాట్లాడటానికి ప్రత్యేకం అడగాలా?" ఆర్ద్ర స్వరంతో అన్నాను.
    "నువ్వు ఆ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నావా?"
    "లతీఫ్ కొనేశాడుగా!"
    "నువ్వు ఆ దానాన్ని అంగీకరిస్తావా?"
    "ఇది దానంకాదు. వ్యాపారం! నాకు రావలసిన దానిలోంచి లతీఫ్ మినహాయించుకొంటానన్నాడుగా!"
    రావు సూటిగా నా ముఖంలోకి చూశాడు.
    "నిజం చెప్పు! నువ్వెప్పుడయినా లతీఫ్ ముంద నీకు పెద్ద ఇల్లంటే ఇష్టమనీ, అలాంటిది కోరుకుంటున్నాననీ అన్నావా?"
    ఉలికిపడ్డాను!
    అవును! దగ్గిర దగ్గిర పదిహేను రోజల క్రిందట లతీఫ్ రాగానే కూర్చోవటానికి కుర్చీ వేశాను.
    అతను కూర్చోగానే కుర్చీకాలు సరిగ్గా లేక కుర్చీ ఒరిగి పడబోయాడు.
    అతను నవ్వేసి స్టూలుమీద కూర్చున్నాడు. కాని, నాకు చాలా చిన్నతన మనిపించింది.
    'వెధవ ఇల్లు! అందమైన ఫర్నిచర్ తో ఉన్న పెద్ద ఇల్లు నా కెప్పటికైనా వస్తుందో, రాదో?' నిస్పృహగా అన్నాను.
    'పెద్ద ఇల్లంటే అంత ఇష్టమా మీకు' చిరునవ్వుతో అన్నాడు.
    'ఎవరి కిష్టం ఉండదు? చుట్టూ కాంపౌండ్ వాల్ తో, అందమైన డిజైనులున్న కటకటాలతో డాబుగా కనిపించే ఇళ్ళు చూసినప్పుడల్లా మనసుకు ఏదో సన్నని కోత కలుగుతుంది. ఈ జన్మలో తీర్చుకోలేను ఆ కోరిక....'
    'ఎందు కా నిరాశ? ఇంత చిన్న కోరికలు తీరవా?'
    'ఇది చిన్న కోరికా?'    
    'చాలా చిన్నది!'
    'మీలాంటి వాళ్ళ కలాగే అనిపిస్తుంది.' నిష్టూరంగా అన్నాను.
    లతీఫ్ నవ్వేశాడు.
    ఇప్పుడు రావు రెట్టించి అడిగేవరకూ ఆ విషయమే గుర్తు లేదు.
    రావుతో అబద్ధాలాడగలిగే సాహసం నాకు లేదు. నా ముఖం చూస్తూనే నేను మాట్లాడుతున్నది నిజమో, అబద్ధమో గుర్తించగలడు రావు.
    "యథాలాపంగా ఎప్పుడైనా అన్నానేమో?"
    "అని ఉంటావని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు అర్ధంకాలేదా?"
    నా మనసు వణికింది.
    "ఏముంది అర్ధమయ్యేందుకు?"
    "ఏమీ లేకపోతే నీ కంఠం అలా వణకదు. సరే! నేనే చెపుతున్నాను. ఆ ఇల్లు లతీఫ్ ని రచనలకు కట్టిన వెల కాదు. నీ సౌందర్యానికి కట్టిన వెల!"
    అదిరిపడ్డాను.
    "ఏమంటున్నావ్? లతీఫ్ కూ, నాకూ అక్రమ సంబంధం ఉందనీ ..."
    "శారదా!" విసుగ్గా అడ్డు తగిలాడు రావు. "అలాంటి మాటలు నేను అనను. కానీ, ఒక్కటి రూఢిగా చెప్పగలను. లతీఫ్ కు నీ మీద వ్యామోహం ప్రబలిపోయింది. ఈ ఇల్లు కొనటానికి కారణం కేవలం నీకు ఆనందం కలిగించటమే!"    
    తేలిగ్గా నిట్టూర్చాను.
    "అందుకు నేనేం చెయ్యగలను? నే నెన్నడూ అక్రమంగా ప్రవర్తించను."
    "లతీఫ్ సంగతి నాకు తెలుసు. అతను సినిమా విలన్ లాగ బలాత్కారాలు చెయ్యడు. కానీ, శారదా, ఈ ఇల్లు ఇవ్వటంలో అతని ఉద్దేశం అర్ధమయ్యాక కూడా తీసుకోదలుచుకున్నావా?"
    "అతని ఉద్దేశం ఏదయితే నాకేం? కాని పని జరగ నంతవరకూ నాకేం నష్టం?"
    "శారదా! నా అభిప్రాయంలో ఆచరణ కంటే దాని వెనక ఉన్న ఉద్దేశమే ప్రధానం. ఈ దానం నువ్వు అంగీకరించటం నిన్ను నువ్వు హీనపరచుకోవటం."
    "మళ్ళీ దాని మనకు. ఇది వ్యాపారం."
    "ఆ పదం మరీ అసహ్యంగా ఉంది. వ్యాపారమన్నానంటే ఈ ఇంటికి బదులుగా నువ్వు మరొకటి అతని కిచ్చి ఉండాలి. అది నీ రచన కావడానికి వీల్లేదు. దీని కంత శక్తి లేదు కనక!"
    "రావ్!" అరిచాను.
    "ఆవేశపడకు, శారదా! చివరిసారి నిన్ను హెచ్చరించాను."
    రావు వెళ్ళిపోయాడు.
    క్షణకాలం మనసంతా అల్లకల్లోల మయింది. కానీ, అందమైన ఇల్లు, ఇంట్లో పొందికగా అమర్చబడిన ఫర్నిచర్ నా మనసును అతి తేలికగా వశపరుచుకుని నా నిశ్చయాన్ని దృఢతరం చేశాయి.

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS