Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 18


    శతవిధాల ప్రయత్నించీ రావును నా డబ్బు అంగీకరించేలా చెయ్యలేకపోయాను.
    ఉక్రోషం పట్టలేక "నెలకు యాభై రాస్తే ఎన్నాళ్ళకు పరిమళకు పెళ్ళి చెయ్యగలవు? మీ అందరికోసమే నే నింత కష్టపడుతున్నాను" అన్నాను హేళనగా.
    రావు సమాధానం చెప్పలేదు. కానీ, అతని ముఖం బాగా సడిలిపోయింది.
    ఆ మరునాడే పరిమళ తన మేనత్త దగ్గిరకి వెళ్ళింది.
    వారం తిరక్కుండా శుభలేఖ పంపింది.
    అశాంతితో నిరీక్షిస్తున్న నాకు - "అమ్మాకి" అన్న పాప పిలుపు చెవులలో అమృతం పోసినట్లయింది. పరుగెత్తి రావు చేతుల్లో నుండి పాప నందుకున్నాను.    
    ఎంత శాంతి! ఎంత ఆనందం!
    చిరునవ్వులో నన్నూ, పాపనూ చూస్తున్నాడు రావు.
    అతని ముఖంలో అలాంటి చిరునవ్వు చూసి ఎన్నాళ్ళయిందీ?

                                    24

    నన్నిలా చల్లగా అవమానించిన పరిమళకు ప్రతీ కారం చేసి తీరాలని నిర్ణయించుకున్నాను. నేను చెయ్య గల ప్రతీకారం ఒక్కటే!

                                 
    పాపను పరిమళ దగ్గిరికి పంపకపోవటం! పరిమళ పాపను చూడకుండా ఉండలేదు. చచ్చినట్లు తనే నా దగ్గిరకు వస్తుంది. అప్పుడు పాప ముఖమైనా చూడనియ్యకుండా వెనక్కు పంపుతాను. అప్పటికికాని నా కడుపుమంట చల్లారదు.
    పరిమళ దగ్గిర నుండి వచ్చిన మరునాడే పాప అత్త దగ్గిరకు వెళతానని పేచీ మొదలుపెట్టింది.
    "నువ్వు అత్తయ్య దగ్గిరకు వెళ్ళటానికే వీల్లేదు." తీక్షణంగా అన్నాను.
    అంతవరకూ కుటుంబంలో ఎవరి దగ్గిరనుండీ తీక్షణమైన మాటలకు అలవాటుపడని పాప బిత్తర పోయింది. అయినా ఎదిరించలేదు. ముద్దుగా- "పోనీ, అత్తనే ఇక్కడకు రమ్మను" అంది.
    "మీ అత్తను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను." నా కసినంతా కంఠంలో ధ్వనింపచేస్తూ అన్నాను.
    అప్పటి పాప చూపులు వర్ణించలేను.
    స్వయంగా చూశాను కనక కాని అయిదేళ్ళ పసి పిల్లలో అంత రోషం ఉంటుందని ఎవరైనా చెప్పినా నమ్మలేను.
    నాకు దగ్గరగా కూర్చుని గారాలుపోతూ మాట్లాడుతున్నది చటుక్కున లేచి దూరంగా జరిగింది.
    "నువ్వు చాలా చెడ్డదానిని" అంది కోపంగా. పాప చెంప చెళ్ళుమనిపించాను.
    ఆ దెబ్బ పాపకు తగలలేదు. సమయానికి అడ్డు వచ్చిన రావుకు తగిలింది.
    నా గుండె గుభిల్లు మంది. రావు క్షణకాలం నా కళ్ళలోకి చూసి నిరసనగా నవ్వి, ఏడుస్తున్న పాప నెత్తుకుని వెళ్ళిపోయాడు.
    ఏదో ఆవేదనతో విలవిలలాడిపోయాను. నేను ఉద్రేకాని కెందు కింతగా బానిస నవుతున్నాను? ఉద్రేకాలను జయించగలిగే సంయమనశక్తి ఎలా సాధించగలను? ఏ దివ్యశక్తితో ఎలాంటి పరిస్థితుల్లో నయినా రావు, పరిమళ స్థిరంగా నిలబడి నిండుగానవ్వగలుగుతున్నారు?
    చిరునవ్వులు చిందిస్తూన్న పాప చెయ్యి పట్టుకుని లోపలికి వస్తున్న రావు ముఖం చూడలేకపోయాను.
    "అమ్మ! నా బెలూన్లు చూడు! నాన్నగారు తీసిపెట్టారు."
    సంతోషంతో నాకు చూపిస్తూంది పాప! పసిపిల్లలు జరిగినది ఎంతలో మరిచిపోగలరు?
    కానీ, నే నెలా మరిచిపోగలను?
    రావు చెక్కిలి ఇంకా ఎర్రగానే ఉంది.    
    "నన్ను క్షమించు, రావ్..." ప్రాధేయపడుతూ ఏదో అనబోయాను.
    "పాప నీ దగ్గరికి వచ్చింది. దగ్గిరికి తీసుకుని లాలించు."
    హెచ్చరిస్తూన్నట్లుగా నా మాటలను మధ్యలోనే తుంచేసి సంభాషణ పొడిగించటం ఇష్టంలేని వ్యక్తిలా వెళ్ళిపోయాడు.
    కృంగిపోయాను. నేను అపరాధివే! కానీ, తప్పు ఒప్పుకుంటున్నప్పుడు కూడా క్షమించకూడదా?
    నేను దగ్గిరగా రావాలని ప్రయత్నించినా దూరంగా వెళ్ళిపోతున్నాడు రావు.
    "అమ్మా! చూడు, చూడు, ఎంత పెద్దగా ఊదానో!" బెలూను చూపిస్తూ అంది పాప.
    "చాలా బాగుంది" అన్నాను.
    రావు హెచ్చరిక దృష్టిలో ఉంచుకుని యాంత్రికంగా అన్నానే కాని, ఆ బెలూన్ మీద దృష్టి ఉంచి చూడనే లేదు. రావు తిరస్కారానికి మనసంతా మరిగిపోతూంది.
    పాప కేమి అర్దమయిందో, ఏమనుకుందో తన బెలూన్లలో నా దగ్గిరనుండి రావు దగ్గిరకి వెళ్ళి పోయింది.    
    మరుక్షణంలో పాప నవ్వులతో కలిసిపోయి రావు నవ్వులు నా గుండెలు బద్దలు చేస్తూ వినిపించాయి.    
    నే నెంత క్షోభపడుతున్నాను! రావుకు ఏమీ కష్టంగా లేదా? ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నాడు?
    పాప పరమళ కోపం ఏడుస్తుందనీ, సముదాయించటం నాకు చాల కష్టమవుతుందనీ అనుకున్నాను.
    కానీ, పాప నీ సమయంలోనూ నా దగ్గిర మళ్ళీ 'అత్త దగ్గిరకి వెళతా' నని అనలేదు.
     ఆ ఆత్మాభిమానానికి నివ్వెరపోయాను. పరిమళ పాప కోసం ఆరాటపడుతూ రానూ లేదు.
    నేను సాధించదలుచుకున్న ప్రతీకారం అలా అసంపూర్ణంగా మిగిలిపోయి ఎదురు నన్నే క్షోభపెట్టింది.
    తరచు పాప వీథి గుమ్మంలో నించుని వీథి చివరి వరకూ పరిశీలించి చూడటం చాలాసార్లు గమనించాను. మొదట్లో అంత పట్టించుకోలేదు కాని రాను రాను చాలా ఆశ్చర్య మనిపించి, "పాపా! ఏం చేస్తున్నా వమ్మా!" అన్నాను.
    పాప ఉలికిపడినట్లయింది.
    బెదురుగా నా ముఖంలోకి చూస్తూ, "అత్త వస్తుందేమోనని చూస్తున్నానమ్మా!" అంది దీనంగా.
    నా గుండెల నెవరో పిండినట్లయింది.
    అందుకు కారణాలు మూడు.
    ఒకటి - పాప ముఖంలోని దైన్యం.
    రెండు- పాపా పరిమళల ఆత్మీయత సహించలేక పోవటం.
    మూడు-నా కన్న కూతుర్ని నేనే దగ్గిర చేసుకోలేని నిస్సహాయత.    
    "అమ్మా!"
    నా దగ్గిరగా వచ్చి నా చుట్టూ చేతులు వేసింది పాప. పరవశించి పోయాను. నేను పాపను ఎంత ప్రేమిస్తున్నాను! ఆప్యాయంగా పాప చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నాను.
    "అమ్మా! అత్తను లోపలికి రమ్మనను." నా కళ్ళ లోకి భయంగా చూస్తూ అంది పాప.
    నయాన్నో భయాన్నో పాప పరిమళకు దూరమవుతూందని సంతోషించాను.    
    "బయటే ఉండి మాట్లాడుతాను. నా కొత్త బొమ్మకు ఏం పేరు పెట్టాలో అడగాలి! అత్తకోసం దాచిన స్వీట్స్ అలాగే ఉండిపోయాయి. అవన్నీ అత్త కివ్వాలి."
    అత్తను గుర్తు చేసుకోగానే తనను తను మరచి మాట్లాడేస్తూంది పాప.
    కొరడాతో చరిచినట్లయింది.
    ఉద్వేగాన్ని అణుచుకొంటూ, "పాపా! నువ్వు నా కెప్పుడయినా స్వీట్స్ ఇచ్చావా?" అన్నాను.    
    తన తప్పును ఎవరైనా ఎత్తిచూపిస్తే ప్పా ముఖం ముడుచుకుపోతుంది.
    కానీ, ఇప్పుడలా ముడుచుకుపోలేదు. నన్నే సంజాయిషీ అడుగుతున్నట్లు, "నీ కిస్తే బల్లమీద పెట్టేస్తావుగా, అమ్మా!" అంది.
    ఆశ్చర్యపోయాను.
    నా ప్రతి చర్యా పాప ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తుందో, దాని ప్రభావం పాపమీద ఎంత ఉందో అర్ధమయింది.
    ఊరంతా వ్యాపించిన ఫ్లూ పాపకు కూడా వచ్చింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలవంతాన అణుచుకున్న అత్త మీది మమత జ్వరంలో విజ్రుంభించింది.
    అహర్నిశమూ-"అత్తా!" అని కలవరింత. పాప మీద నాకు చాలా ప్రేమ! నా ప్రేమ పాపకు కూడా అర్ధమవుతుంది.
    పాపను ముద్దు పెట్టుకుంటాను. స్వీట్స్ కొంటాను. బట్టలు కొంటాను. అడిగినదల్లా ఇస్తాను. కానీ, నేనూ ఒక చిన్న పిల్లలా నటిస్తూ పాపకు స్నేహితురాలిని కాలేను.
    ఆ కారణంచేత పాప మనసు మిగిలిన ఆలోచనలు మరిచిపోయేలాగ ఆకర్షించలేను.    
    ఆ శక్తి రావుకు ఉంది.
    రావు దగ్గిర కూర్చుని కబుర్లు చెబుతున్నంతసేపూ పాప అత్తను స్మరించదు.
    రావు ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా పాప దగ్గరే కూర్చున్నందుకు సంతోషపడ్డాను. అయినా ఊరుకోలేక "కంపెనీకి వెళ్ళవా?" అన్నాను.
    "పాప శారీరకంగా జబ్బుపడింది. ఇలాంటప్పుడు మానసికంగా బెంగపడటం మంచిది కాదు."
    "మరి నీ ఉద్యోగం?"
    "ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకోవటం, కొత్త దానికోసం ప్రయత్నించటం అలవాటేగా నాకు!"
    గురిచూసి విసిరిన రావు వాగ్భాణం నన్ను బాధించక పోలేదు. అయినా, ఏదో సంతృప్తి కలిగింది.
    ప్రస్తుత పరిస్థితుల్లో రావుకు ఉద్యోగం ఉన్నా ఉండకపోయినా పెద్ద తేడా లేదు.
    రావుకు ఉద్యోగం లేకపోతేనే నయమేమో! అప్పుడిక నా మీద ఆర్ధికంగా ఆధారపడక తప్పనిసరి అయి మా మధ్య దూరం తరిగిపోతుందేమో!
    రావుకు దగ్గిర కావాలని నేను చేస్తున్న ప్రయత్నాలు అతనికి నన్ను మరింత దూరంగా విసిరేస్తున్నాయని ఊహించలేకపోయాను ఆ క్షణంలో.

                                25

    మరీ పెద్దది, మరీ చిన్నదీ కాని అందమైన బంగళా ముందు ఆగింది లతీఫ్ కారు.
    తను దిగి, రావునూ, నన్నూ దిగమన్నాడు లతీఫ్.
    ఇద్దరమూ ఆశ్చర్యపోతూ దిగి, లతీఫ్ వెంట ఆ ఇంట్లోకి నడిచాము. కొత్త ఇల్లు, ఎంతో అందంగా ఉంది. ఆ మాటే అన్నాను. లతీఫ్ చిరునవ్వుతో, "మీకు నచ్చిందా?" అన్నాడు.
    "చాలా చాలా నచ్చింది." ఇల్లంతా కలయజూస్తూ అన్నాను.
    "నీ సంగతేమిటి, రావ్?"
    రావు లతీఫ్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు.
    "నాకు నచ్చినా నచ్చకపోయినా ఒకటే! ఈ ఇల్లు గురించి అలా నే నెందుకు ఆలోచిస్తాను?"
    "పోనీ, ఇప్పుడాలోచించి చెప్పు. ముందు ముందు ఉండవలసినవాడివి నువ్వే!"
    నేనూ. రావూ-ఇద్దరమూ ఒక్కసారిగా ఉలిక్కిపడి పడ్డాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS