Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 17


    -ఆ ఉత్తరంతోపాటు శుభలేఖ-చి.సౌ. పరిమళా దేవిని రాఘవరావుకు ఇచ్చి...
    ఆ ఉత్తరం చాలాసార్లు చదివాను. ఆ శుభలేఖ పదేపదే చూశాను.
    రావు బొమ్మలా కూర్చున్నాడు.
    అతని ముఖం చూడగానే తీవ్రంగా బాధపడుతున్నాడని అర్ధమయిపోయింది.
    తన నిర్ణయం-పరిమళ రావుకుకూడా చెప్పలేదు.
    చెపితే రావు ఒప్పుకోడనే భయంతో కావచ్చు. తెలిసి ఉంటే రావు ఏం చేసేవాడో?
    పరిమళను మందలించి తీసుకొచ్చే వాడా? లేక, దగ్గిర ఉండి పెళ్ళి జరిపించేవాడా?
    పది రోజుల క్రిందట పరిమళ కాంతమ్మగారి పల్లెటూరికి బయలుదేరింది.
    "ఇప్పుడెందుకు, పరిమళా?" అన్నాడు రావు.
    "ఒక్కసారి అత్తయ్యను చూడాలని ఉందన్నయ్యా!
    ఎందుకో పరిమళ కంఠం గద్గదమయింది. ఆ గాద్గద్యానికి కారణం అప్పట్లో తెలియక పోవటంవలన రావు కదిలిపోయాడు.
    "సరే! వెళ్ళిరా!" అన్నాడు వాత్సల్యంగా.
    ఇంటికి సబంధించిన మిగిలిన విషయాలన్నింటిలో లాగే ఉదాసీనంగా ఉండిపోయాను నేను.
    పాపకూడా పరమళతో ప్రయాణమయింది. పరిమళ ఎక్కడికి వెళ్ళినా, పాపకూడా బయలుదేరటం అలవాటే!
    ఎప్పుడూ సంతోషంగా పాపను తనతో తీసుకువెళ్ళే పరమళ, ఆ రోజు పాపను ఇంటి దగ్గిరే ఉండిపొమ్మంటూంటే ఆశ్చర్యపోయాను.
    కాని, పాప పేచీపెట్టేసరికి తీసుకెళ్ళిపోయింది.
    కాంతమ్మ పరిమళను చూసి ఎంత పొంగిపోయిందో అంత ఆశ్చర్యపోయింది.
    "ఇదేమిటే! కార్డు ముక్కన్నా లేకుండా వచ్చిపడ్డావ్!" అంది ఆప్యాయంగా.
    "ఏం? రాకూడదా?"
    "అయ్యో! రాకూడదని ఎవరన్నారే! నా రాత బాగుండక వాడి కా కళ్ళు పోయాయి కాని, లేకపోతే మీ అన్నయ్యతో దెబ్బలాడయినా నిన్ను మా ఇంటికి తెచ్చుకునేదాన్నికానూ!"
    తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పటమా అని లజ్జతో సతమతమవుతున్న పరిమళకు, కాంతమ్మ మాటలు మార్గం ఏర్పరిచాయి.
    "అమ్మా!"
    మందలిస్తున్నట్లుగా అన్నాడు రాఘవ.
    'ఏం, బావా! ఇప్పుడు అత్తయ్య అంత అనరాని మాటలేం అంది?"
    "అదీ, అలా బుధ్ది చెప్పు?"
    మెచ్చుకొంటున్నట్లుగా అంది కాంతమ్మ.
     "మనం పసివాళ్ళం కాముగా, పరిమళా! ఇంత వయసొచ్చాక కూడా వట్టి వట్టి పెళ్ళిమాటలు మాట్లాడుకోవటం బాగుంటుందా?"
    "వట్టి వట్టి మాటలని ఎందుకంటున్నావు? నాకు చదువు రాదు. అందమూ అంతగా లేదు. అయినా, నీకూ, అత్తయ్యకీ చాకిరీ చేసిపెట్టడానికి పనికిరానా?"
    "పరిమళా!"
    కాంతమ్మ, రాఘవ-ఇద్దరూ ఒక్కసారిగా అన్నా, అన్న తీరుమాత్రం ఒక్కటి కాదు.
    కాంతమ్మ పిలుపులో మెచ్చికోలు ఉంది.    
    రాఘవ సంబోధనలో దిగ్భ్రాంతి నిండింది.
    "ఏమిటే, పరిమళా! నిజంగా మా రాఘవను చేసుకుంటావుటే! నీ అమ్మకడుపు చల్లగా, నీ అత్తకడుపు చల్లగా..."
    "పరిమళా! బావతో దెబ్బలాడి వచ్చావా నువ్వు?"
    ప్రవాహంలాంటి కాంతమ్మ వాగ్దోరణి అడ్డు కొంటూ గంభీరంగా అడిగాడు రాఘవ.
    "నేను అన్నయ్యతో దెబ్బలాడతానా?...." నీరసంగా, నిస్పృహతో అంది పరిమళ.
    "బావ ఈ పెళ్ళికి ఒప్పుకోడని నాకు తెలుసు..."
    "అది నిజమే! పిచ్చిఅన్నయ్య! అన్నీ తనకే తెలుసు ననుకుంటాడు. కానీ, బావా! ఇది నా నిర్ణయం. అన్నయ్యకు తెలియకుండా నేను నాకై చేసుకున్న నిర్ణయం."
    "పరిమళా! ఎందుకింత త్యాగం చేస్తున్నావు?"
    "త్యాగమా? నీ కర్ధం కాదు, బావా! నేను చేస్తున్నది ప్రార్ధన. నువ్వూ, అత్తయ్యా నన్ను మీలో ఒక దాన్నిగా చేసుకోండి. నా మీద కనికరించండి."
    "ఛ! అలా మాట్లాడకు, పరిమళా! నువ్వు ఈ అంధుడి అండన నిలబడటానికి సిద్ధపడితే నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. కానీ, నా అంతరంగం ఏదో ఆకార్యం చెయ్యబోతున్నట్లు ముడుచుకుపోతూంది. సరే! బావకూడా రానీ..."
    "అది కుదరదు. అన్నయ్య రాడు. అన్నయ్యకు తెలియడానికి వీల్లేదు."
    "బావకు తెలియకుండా నిన్ను నేను పెళ్ళి చేసుకోలేను. తరవాత బావ ముఖం చూడనవసరం లేకుండా దేవుడు కళ్ళయితే పోగొట్టాడు కాని, అంతరంగంలో చైతన్యం మిగిల్చే ఉంచాడు."
    "ఏమిటిరా, రాఘవా? అది తనంత తను చేసుకుంటా నంటూంటే నువ్వే వద్దంటున్నావా?"
    ఆందోళన నిండిన ఆత్రస్వరంతో అంది కాంతమ్మ.
    "నీకు తెలియదమ్మా!...."
    రాఘవ ఇంకేదో మాట్లాడబోతుండగానే పరిమళ కన్నీళ్ళతో అతని పాదాలమీద వాలిపోయింది.
    "నీకే ఏం తెలియటం లేదు, బావా! నువ్వు ఈ నిర్భాగ్యురాలిమీద దయ తలిచి ఆశ్రయం చూపించక పోతే-నేను నా కెంత మాత్రం ఇష్టంలేని పని ఆత్మహత్య చేసుకోవలిసి వస్తుంది...."
    పరిమళ కన్నీళ్లు తన పాదాలమీద వెచ్చగా తగిలేసరికి కదిలిపోయాడు రాఘవ.
    ఏదీ అర్ధం చేసుకోలేకపోయాడు.
    ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు.
    పాప ఆడుతూ కిందపడినట్లుంది.
    కెవ్వున కేక పెట్టి ఏడ్చింది.
    తన జీవితంలో అత్యంత ప్రధానమైన సమస్యను కూడా మరిచి పాప దగ్గిరికి పరుగెట్టి, లేవనెత్తి దుమ్ము దులిపి, రెండు చాక్ లెట్లిచ్చి, తన పక్కన కూర్చోబెట్టుకుంది పరిమళ.
    "పాపకూడా వచ్చిందా?"
    ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ.
    "పాప నన్ను ఎప్పుడూ వదలదు."
    "అయితే , నువ్వు మీ అన్నా, వదినలతో దెబ్బలాడి రాలేదన్నమాట!"
    "నన్ను నమ్ము, బావా! నే నెన్నడూ ఎవ్వరితోనూ దెబ్బలాడను."
    అప్పటికి నమ్మకం కుదిరింది రాఘవకు.
    "మరి బావకు తెలియకుండా మనం పెళ్ళి చేసుకుంటే బావకు కోపం రాదా?"
    "నేను చేసిన ఏ పనికీ అన్నయ్యకి కోపం రాదు."
    తరవాత తనలో తను అనుకుంది. 'బాధపడవచ్చును.'    
    పరిమళకన్నీటి వెచ్చని స్పర్శ మరొక్కసారి రాఘవ హృదయాన్ని తాకింది.
    అయోమయంగా నవ్వుతూ, "సిరి రా మోకా లొడ్డుతారా ఎవరైనా? నీ ఇష్టం. తరవాత ఎప్పుడైనా పశ్చాత్తాపపడినా నా ముందు ప్రకటించకు అన్నాడు.
    పరిమళ ఉల్లాసంగా నవ్వింది.
    "పశ్చాత్తాప పడవలసిన అవసరం ముందు ముందు మీకే రావచ్చు. ఈనాడు నాతో ఇంత కఠినంగా మాట్లాడినందుకు."
    రాఘవకు కళ్ళులేని లోటు విధాత అతని మనసును తీవ్ర చైతన్యవంతం చెయ్యటంలో తీర్చాడు.
    పరిమళ నవ్వులో ఉల్లాసమూ, కంఠంలో మార్దవమూ-పరిమళ తనను మనసారా అంగీకరిస్తున్నదని రాఘవకు విప్పి చెప్పాయి.
    నాకూ, రావుకూ, పెళ్ళి జరిగిపోయాక కాని విషయం తెలియలేదు.
    పెదవి కదపకుండా, ఒక్క ఛీత్కారమైనా చెయ్యకుండా నాకు ఛెళ్ళున చెంపదెబ్బ కొట్టింది పరిమళ.

                              *    *    *

                                   23

    బట్టలు సర్దుకొంటూన్న నన్ను చూసి అతి శాంతంగా "ఎక్కడికి?" అన్నాడు రావు.
    నాకు ఒళ్ళు మండింది.
    "ఏం పట్టనట్లూ, ఏం తెలియనట్లూ అలా అడుగుతావేం? పరిమళ దగ్గిరకే! అడగవలసిన నాలుగూ అడిగి పాపను తీసుకొస్తాను."
    "అన్నీ తెలిసినవాడిని కనకనే ఇంత శాంతంగా అడిగాను. నీ ప్రయత్నం మానుకో! అంతా జరిగి పోయాక అడగవలసిందేం లేదు. చేతనైతే ఆశీర్వదించి రావటమే!"
    "హుఁ! నేను వెళ్ళి ఆశీర్వదించి రావాలి. ఇదిగో, తను పంపిందిగా ఆశీర్వాదాలు!" పరిమళ వ్రాసిన ఉత్తరం రావు మీదికి విసురుతూ అన్నాను.
    "నా మాట విను, శారదా! అంతా అయిపోయాక ఇప్పుడు నువ్వు పరిమళను నిందించటం బాగుండదు!"
    "పరిమళ ఏ గంగలో కలిస్తే నాకేం? నేను వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకుంటాను."
    "అందుకైనా నువ్వు వెళ్ళి ప్రయోజనం లేదు."
    "ఏం? పరిమళ పంపనందా? తనెవరు పంప ననటానికి? ఆ ముష్టి కొండలో పాప ఉండగలదా?"
    "తను ఎవరినీ కానని తెలుసుకున్నాకే పరిమళ వెళ్ళి పోయింది. పరిమళ పంపనని అనలేదు. కానీ, పాప రానని అనగలదు. ఆ ముష్టికొంపలో పాప కే మహాభాగ్యం దొరికిందో నువ్వెలా ఊహించగలవు?"
    "నాన్సెన్స్! పసిపిల్లల కేం తెలుస్తుందీ? తీసుకొచ్చేస్తాను."
    "నిజమే. ఏం తెలియదు. పదిమందిలో తన కన్న తల్లి దగ్గరకు తానేరానని పేచీ పెట్టి ఏడిస్తే తన తల్లికి అవమానమని పాపకు తెలియదు. కానీ, అలాంటిది నీ కెంత అవమానమో నీకు తెలుసు."
    నా ముఖం పాలిపోయింది.
    విషయం పూర్తిగా అర్ధమయింది.
    ఏదో కసితో భగ్గుమంది మనసు.    
    నిస్సహాయంగా బుసలు కొడుతూ, "ఇంతకూ ఏమిటి నువ్వనేది? పాపను అక్కడ ఉంచెయ్యమనా?" అన్నాను.
    "ఎంతమాత్రం అలా అనను. నేను వెళ్ళి ప్రస్తుతం పాపను తీసుకొస్తాను."
    నేను వెళితే పాప రాదు! రావు వెళితే వస్తుంది.
    పాపకు నే నొక్కదాన్నే పరాయిదాన్ని!
    "ప్రస్తుతం తీసుకొస్తాను' అంటే?"
    "పాప పసిపిల్ల కాదు. అయిదో ఏడు వచ్చింది. పరిమళ ప్రేమలో పెరిగిన పాప మనసును పరిమళ నుండి మరపించటం ఎలాగో నువ్వు చూసుకోవాలి. ఈ విషయంలో నేను నీకేం సహాయం చెయ్యలేను."
    చివరి మాటకు ఒళ్ళు మండింది.
    "పెద్ద - మిగిలిన అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు! నీ రెండు వందలతోనే ఇల్లు గడుస్తుందనుకున్నావా?"
    రావు అతి కష్టంమీద ఇటీవలే రెండు వందల రూపాయల జీతానికి ఏదో కంపెనీలో స్టెనోగా కుదిరాడు.
    ఒక్క క్షణం రావు ముఖం పాలిపోయినా అంతలో నవ్వేశాడు.
    "నేను మరీ అంత తెలివితక్కువవాడిని కాను, శారదా!"
    నాకు మరోమాటకు అవకాశ మియ్యకుండా రావు వెళ్ళిపోయాడు.
    ఈ మధ్య మా సంసారం చాలా హాయిగా జరుగుతూంది. నెలకు వెయ్యి రూపాయ లిస్తానని లతీఫ్ వాగ్ధానం చేసినా, ఇస్తాడో ఇయ్యడోనని భయపడ్డాను నేను. కానీ మొదటి తేదీకల్లా నా చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు లతీఫ్.
    చాలా సంతోషించినా అంత డబ్బు తీసుకోవటానికి ఏదో సంకోచం కలిగింది.
    "భలే వ్యాపారం చేస్తున్నారు! మీకు నష్టంతప్ప లాభం ఉండదు." ముడుచుకుపోయే నా అంతరంగాన్ని కమ్ముకునే ప్రయత్నంలో అన్నాను.
    "ఇంతకు నాలుగింతలు నేను లాభం సంపాదించు కున్నాను. నేను డబ్బుదగ్గిర చాలా గట్టివాణ్ణి."
    మొదట్లో లతీఫ్ రావుతో మాట్లాడి నన్ను తప్పుకు తిరిగేవాడు.
    నా పుస్తక ప్రచురణకు సంబంధించిన విషయాల్లో రావు చాలా ముభావంగా ఉండటంవల్లా, నేను కల్పించుకుని పలకరించటం వల్లా, ఇప్పుడిప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు.
    "నిజంగానా?' ఆశ్చర్యంగా అన్నాను.
    "నిజం! వ్యాపారం చేసుకోవాలనే ఉబలాటానికి తోడు సామర్ధ్యం కూడా ఉంటే నష్టమనేది రాదు."
    నా నవల బాగా అమ్ముడుపోయిందని సంతోషించబోతున్న నన్ను హెచ్చరించాయి చివరి మాటలు!
    లతీఫ్ ఆ నవల గురించి చేసిన ప్రచారం ఇంతా అంతా కాదు. నవల ప్రచారానికి గాను అతను కూర్చిన వాక్యాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
    'భర్తే తనసర్వస్వం అని నమ్ముకుందా ముగ్ధ! ఆవిడంటే అతనికీ పంచప్రాణాలు!
    విధివైపరీత్యం!
    ఒకరి కొకరు కాకుండా పోయారు.
    ఇందులో దోష మెవరిది? వారి భవిష్యత్తు ఏమవుతుంది?'
    ప్రఖ్యాత చిత్రకారులతో గీయించిన ముఖచిత్రం.చూడగానే ఆకట్టుకొనేలా ఉంది. ధర కూడా సరసంగా పెట్టాడు.
    ప్రణయాన్నే ప్రధానంగా తీసుకుని అడుగడుగునా పాఠకుల ఉత్కంఠ పోషించే విధంగా ఇతివృత్తాల్ని అల్లి, నాకిచ్చేవాడు లతీఫ్! నన్ను నవలగా పెంపొందించి వ్రాయమనేవాడు. లతీఫ్ ఇచ్చిన ఫ్లాట్ ప్రకారం అతి సునాయాసంగా నవల పూర్తిచేసేదానిని. ఏ మాత్రం కష్టపడవలసి వచ్చేది కాదు. ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు.
    నా నవలను ఒక రకం పాఠకులు - ముఖ్యంగా తరుణ వయస్కులు, వయసు వచ్చినా ఎదగని పెద్ద వారు - వెర్రిగా చదివేవారు. అసంఖ్యాకంగా నాకు వచ్చే ఉత్తరాలనుబట్టే నా నవలలు పొందుతూన్న ప్రచారం నాకు అర్ధమయ్యేది.
    "ఇప్పుడేమంటావ్, రావ్? నే నెంత పైకి వచ్చానో చూశావా?" గర్వంగా అన్నాను రావుతో.
    "నాకు చూడటం చేతనయినంత వరకూ నువ్వు పైకి వచ్చిందేమిటో నా కర్ధం కావటం లేదు."
    "పైకి రాలేదా? ఇంత పాపులారిటీ ..."
    "పాపులారిటీ? ! .... కొందరు పొగడుతున్నారు, నిజమే! కానీ, విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గమనించలేదా?"
    "ఈ విమర్శలు ఎప్పుడూ తప్పవు. అంతటి రామాయణం, భారతాలకే దిక్కులేకుండా పోతోంది."
    "భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. కాదనను. నువ్వు సాధించినది సాధారణ పాఠకుల ప్రశంస. కానీ, సాధించవలసింది మేధావి వర్గాల మెప్పు. మొదట మేధావులను మెప్పించు. అప్పుడు గొర్రెల మందలా అర్ధమయినా కాకపోయినా-అందరూ 'ఓహోహో!' అంటారు. సాధారణ పాఠకుణ్ణి అలరించి డబ్బు చేసుకోవటమే నీ ప్రధానోద్దేశంగా పెట్టుకున్న వాడు ఆ స్థాయి నుండి నువ్వెన్నటికీ పైకి రాలేవు."
    నిరుత్సాహంతో నాలో తిక్క రేగింది. "చూస్తున్నాగా! నీలో నా మీద బాగా ఈర్ష్య పేరుకుపోతోంది. నన్ను నువ్వు ఒక్క నాటికీ మెచ్చుకోలేవు."
    రావు నా మాటలకు కోపం తెచ్చుకోలేదు. ఉదాసీనంగా నవ్వుతూ, "నిన్ను మెచ్చుకొనేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా, శారదా! నీకు నష్టం ఏముందీ?" అన్నాడు.
    "ఏం లేదు. ఏం ఉండదు." విసురుగా అన్నాను.
    నేను ఇంత సంపాదిస్తున్నా, రావు నా సంపాదనలో నుండి ఒక్క పైస అయినా ఖర్చు పెట్టడు. తన రెండు వందలతోనే గడుపుకొంటున్నాడు. నెలకు యాభై రూపాయలు బాంక్ లో వేసుకుంటున్నాడు. ఆ డబ్బుతో పరిమళ పెళ్ళి చెయ్యాలని సంకల్పం కాబోలు! పాపం! పరిమళ ఇలా చేస్తుందని అతనికేం తెలుసు?
    మా బాంక్ అకౌంట్లు వేరయ్యాయి.
    మా ఆలోచనలూ వేరు వేరయ్యాయి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS