రావు ఆశ్చర్యంగా నా నవలవంక చూసి, "నువ్వు నవలలు చదవటం మొదలు పెట్టావా?" అన్నాడు లతీఫ్ తో.
లతీఫ్ నవ్వి, "సాధారణంగా చదవను. కానీ, ఈవిడ పంపారని చదివాను" అన్నాడు.
రావు నావై పొకసారి ప్రశ్నార్ధకంగా చూశాడు.
నేను లతీఫ్ కు పుస్తకం పంపినట్లు రావుకు చెప్పలేదు. రావు చూపులు లక్ష్య పెట్టకుండా లతీఫ్ ను ఉద్దేశించి, "నా నవల ఎలా ఉంది?" అన్నాను.
అంతలో-పరిమళ ట్రేలో అందరికీ కాఫీ తీసుకు వచ్చింది. లతీఫ్ కాఫీ అందుకుని, పరిమళకు థాంక్స్ చెప్పి, కాఫీ సిప్ చేస్తూ రావుతో క్రికెట్ మాచ్ గురించి కబుర్లు మొదలుపెట్టాడు.
నా ప్రశ్నకు సమాధానం రానేలేదు. నాకు భగ్గుమంది. అక్కడనుంచి లేచిపోబోయాను. లతీఫ్ చటుక్కున నా వంక తిరిగి, "వెళ్ళకండి. నేను రావుతో మాట్లాడబోయే మాటలు మీరూ వినాలి" అన్నాడు.
రావూ, నేనూ ఇద్దరమూ ఆశ్చర్యపోయాము.
కుతూహలంగా చూస్తున్న నా చూపులు తప్పించు కొని రావును ఉద్దేశించి, "రావ్! నువ్వు నాకు సహాయం వెయ్యాలి" అన్నాడు లతీఫ్.
రావు నవ్వుతూ, "నేను సహాయం చెయ్యాలా? చెప్పు" అన్నాడు, అదేదో వేళాకోళం కింద జమ కడుతూ.
"నేను మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టాలను కుంటున్నానోయ్!"
"శుభం! వ్యాపారంలో నీ కంటే ప్రజ్ఞాశాలి ఎవ్వడు? ఇందులో నేను చెయ్యగలిగిన సహాయం ఏముందీ?"
నాకు విసుగనిపించింది. పోబోతున్న నన్ను ఉండమని వ్యాపారం గురించి మాట్లాడతాడేమిటి?
"ఇప్పుడు నేను చేయబోతున్న వ్యాపారానికి నీ సహకారం తప్పకుండా కావాలి. నేను పుస్తక ప్రచురణ ప్రారంభించా లనుకుంటున్నాను."
రావు ఉలిక్కిపడి తీక్షణంగా లతీఫ్ ముఖంలోకి చూశాడు. లతీఫ్ నన్నెందుకు ఉండమన్నాడో అర్ధమయింది అప్పటికి. లతీఫ్ గట్టిగా నవ్వుతూ, రావు భుజం తట్టి, "అలా చూడకు. నీకు నా సంగతి తెలుసు. ఆర్ధిక లాభం లేకుండా నేనేపనీ చెయ్యను. నువ్వు బుర్ర పాడుచేసుకోవలసిందేమీ లేదు" అన్నాడు.
రావుకూడా నవ్వేసి, "అయితే, నేను చెయ్యవలసిన సహాయం ఏమిటో చెప్పు. నీ ప్రచురణకు పుస్తకాలను ఎన్నిక చేసి పెట్టమంటావా?" అన్నాడు.
"నీ ఎన్నిక నాకు తెలుసు. అవి సాహిత్య ప్రమాణాల దృష్ట్యా విలువైనవే కావచ్చు. కాని, చాక్ లైట్లలా అమ్ముడు పోవు. వ్యాపారానికి పనికిరావు."
పకపక నవ్వాడు రావు.
"గుడ్! ఇంకా అడుగు పెట్టీపెట్టకుండానే ప్రచురణ వ్యాపారంలో మెలుకువలు నేర్చేసుకున్నావు. నూరు శాతం వ్యాపారిని. ఇంక నేను చెయ్యగలిగే సహాయం ఏముంది?"
"నేను శారదగారి నవల చదివాను. అక్కడక్కడ బాగుంది."
ఇప్పటికీ నా వైపు చూడకుండా రావునే చూస్తూ అంటున్నాడు. అతని మాటలు నన్ను పొగిడినట్లో, వెక్కిరించినట్లో అర్ధం కాలేదు నాకు. రావు ఏ సమాధానమూ చెప్పకుండా వింటున్నాడు.
లతీఫ్ రావు కొక సిగరెట్ అందించి, లైటర్ తో తన సిగరెట్ అంటించుకొని, రావు సిగరెట్ కూడా అంటించాడు.
"శారదగారి నవలలు చదివితే నా కొక విషయం తోచింది. ఎక్కడెక్కడ సన్నివేశంలో బిగి వస్తుందో, అక్కడ ఆవిడ రచన రాణించింది. తక్కినచోట్ల పేలవంగా ఉంది..."
ఆశ్చర్యంతో కుతూహలంగా వింటున్నాను అతని మాటలు. ఆనందమూ, ఆవేదనా-రెండూ కలిగి స్తున్నాయి అతని మాటలు.
"చిక్కని ఇతివృత్తం ఎన్నుకొంటే ఈవిడ ఆమూలాగ్రమూ అందంగా వ్రాయగలరు. ఇప్పటి నవలల్లో అక్కడక్కడ కనిపించే పేలవత్వానికి కారణం ఇతి వృత్తంలో అక్కడక్కడ కనిపించే పేలవత్వానికి కారణం ఇతివృత్తంలో బిగువైన అల్లిక లేకపోవటమే!"
"కానీ, లతీఫ్...."
ఏదో చెప్పబోతున్న రావును చే సైగతో వారించి లతీఫ్ చెప్పుకుపోసాగాడు:
"ఈవిడ రచనా విధానం నాకు నచ్చినా, ఎన్నుకున్న ఇతివృత్తాలు నాకు నచ్చలేదు. సర్వజనాసక్తికరమైన ఇతివృత్తాలు నేను సూచించగలను. వాటిని ఆధారంగా తీసుకుని ఈవిడ నవలలు వ్రాస్తే, నేను ప్రచురిస్తాను. నెలకు వెయ్యి రూపాయ లిస్తాను."
"నెలకు వెయ్యి రూపాయలా?" అప్రయత్నంగా అనేశాను. సంభ్రమమూ, సంతోషమూ నా కంఠంలో నాట్యం చేశాయి.
అప్పటికే లతీఫ్ నా వైపు తిరగలేదు.
"కానీ, ఒక్క షరతు. నవల నేను చెప్పినట్లుగా వ్రాయాలి. మార్చమన్న చోట మార్చాలి. కూర్చమన్న చోట కూర్చాలి. ఇందుకు శారదగారు ఒప్పుకోక పోవచ్చు. నువ్వే ఒప్పించాలి. ఈ సహాయమే నేను కోరింది."
రావు ముఖం వడిలిపోయింది. "వ్రాసేది శారద. తననే అడుగు. నా అభిప్రాయాలు బలవంతాన ఒకరి నెత్తిన రుద్దటం నా కెంత మాత్రం ఇష్టంలేదని నీకు తెలుసుగా?"
"తెలుసు అందుకే స్తిమితంగా మీ రిద్దరూ ఆలోచించుకొని మీ అభిప్రాయం నాకు తెలియజెయ్యండి. వస్తాను."
లతీఫ్ లేచి పరిమళకూ, నాకూ నమస్కారం చేసి, పాపను ముద్దుపెట్టుకొని వెళ్ళిపోయాడు.
లతీఫ్ ఆ అభిప్రాయం అప్పుడే అడిగి ఉంటే, ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా అతను విధించిన షరతులన్నీ నా కిష్టమేనని ఒప్పేసుకునేదాన్ని.
అకస్మాత్తుగా రావూ, నేనూ ఒకరి నొకరం చూసుకున్నాము.
సో ముఖంలో వికాసం అతన్నీ, అతడి ముఖంలో పాండురత నన్నూ విభ్రాంతుల్ని చేసింది.
21
పసిపిల్లలకు మనం ఏమీ తెలియదనుకుంటాము. మనకు తెలిసిన లౌకిక విషయాలు వాళ్ళకు తెలియక పోవచ్చు కాని, మన మేధ కందని అతీంద్రియ జ్ఞానమేదో ఉంటుంది.
లతీఫ్ ఇచ్చిన చాక్ లెట్ తీసి రావు నోటికందిస్తూ, "నాన్నా! తిను!" అంటూంది పాప వచ్చీరాని మాటలతో.
రావు దృష్టి తన వైపు తిప్పుకోవాలని పాపచేసే ప్రయత్నమూ, రావును అనునయించాలని పడే తాపత్రయమూ గమనించాక స్ఫురించింది నాకు, రావు చాలా కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడని.
ఎంతటి చికాకులోనైనా పాపను చిన్నబుచ్చలేడు రావు.
పాప అందించిన చాక్ లెట్టందుకుని చిరునవ్వుతో పాపను ముద్దు పెట్టుకున్నాడు.
తండ్రి చిరునవ్వు చూశాక సంతృప్తి పడినదానిలా తన బొమ్మలలో మునిగిపోయింది పాప.
రావు ముఖకవళికలు గమనిస్తూనే లతీఫ్ సూచించిన విధానం రావు కెంతమాత్రం నచ్చలేదని అర్ధమయి పోయింది నాకు.
రావుకు నచ్చినా, నచ్చకపోయినా లతీఫ్ కోరినట్లు వ్రాసితీరాలని నిర్ణయించుకున్నాను.
నా ముఖంలో - రావు నా మనసును చదివి ఉంటాడు. విరక్తిగా ముఖం తిప్పుకున్నాడు.
"పరిమళా!" అని పిలిచాడు.
ఆ పిలుపులో అంత కటుత్వంతో, ఆ ముఖభంగిమలో అంత కాఠిన్యం, ఆ ఊర్సులో అంత వడి నే నెన్నడూ గమనించలేదు.
పరిమళ పాలిపోయిన ముఖంతో వణుకుతూ వచ్చి నిలుచుంది.
"పరిమళా! నా ఉద్యోగం పోయిన సంగతి లతీఫ్ కు చెప్పావా?"
రావు తన మాటల్లో పలికించిన....... ఆ మనసును కోసింది. అవ్యక్తమైన ఆవేదనతో సంచరించే అతని కనుపాపలు నా మనసును ఒకటి రెండు క్షణాలు కదిలించాయి.
అన్న ప్రదర్శించే కాఠిన్యానికి పరిమళ తట్టుకోలేక పోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
అయినా, ఆ అన్నకు చెల్లెలు పరిమళ.
దారుణమైన అభిమానంతో మనసు గాయపడినా, ఉదాసీనంగా, "నేను ఎవ్వరితోనూ శ్రుతిమించి మాట్లాడనని నీకు తెలియదా, అన్నయ్యా!" అంది.
రావు తన తొందరపాటు త్వరలోనే తెలుసుకున్నాడు.
"అవును నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ నువ్వు పెదవి కదపనని నాకు తెలిసినా, చికాకులో నన్ను నేను మరిచిపోయాను."
ఈ సంభాషణలకు నా మనసు లజ్జతో ముడుచుకుపోయింది. ప్రయత్నించినా పెదవి విప్పలేకపోయాను.
"ఇందులో నువ్వు చికాకు పడవలసినది ఏముంది, అన్నయ్యా!"
ఓదారుస్తున్నట్లు అంది పరిమళ.
నీరసంగా నవ్వాడు రావు.
"నాకు లతీఫ్ బాగా తెలుసు. ఎలాగో నా ఉద్యోగం పోయిన సంగతి అతనికి తెలిసి ఉంటుంది. నా అభిమానం గాయపడకుండా నాకు సహాయం చేసే ఉద్దేశమే ఇది!"
ఇది నేను సహించలేకపోయాను.
"ఏం కాదు. ఎక్కడైనా బావకాని వంగతోటలో బావకాదు. స్నేహం కోసం ఎవరూ అంతంతడబ్బు సహాయం చెయ్యరు. అతనికి నా రచన వచ్చింది. నా పుస్తకాలు అమ్ముకుని డబ్బు చేసుకోగలననే నమ్మకమూ కుదిరింది. అందుకే పనికట్టుకుని వచ్చాడు".
"ఎంత మూర్ఖురాలివి నువ్వు!" లేచి నించున్నాడు రావు.
ఇంత ఆవేశం ఉందా రావులో!
"ప్రతిభ లేశమాత్రమూ, వ్యుత్పత్తి శూన్యమూ అయిన రచయిత్రివి నువ్వు. నీ అదృష్టవశాన నీ కంటేదద్దమ్మలు చాలామంది కలం పట్టి రచనావ్యాసంగానికి సాహసించటంవల్ల నువ్వూ ఒక రచయిత్రిగా చలామణి అవుతున్నావు. ఎంత తపస్సు చేస్తే రచయిత్రివి కాగలవు నువ్వు?"
రావు ఎన్నడూ ఇంత బ్లన్ట్ గా మాట్లాడలేదు నాతో. అంతకుముందు నన్ను పెద్దగా ప్రశంసించక పోయినా, ఇలా నన్ను తీసిపారెయ్య లేదు. పై పెచ్చూ నాలో 'ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్' రాకుండా జాగ్రత్త పడుతూ ప్రోత్సహించేవాడు.
అలాంటి రావు ఇంత కట్టె విరిచినట్లు మాట్లాడాడంటే ఆ మాటల వెనక అతని మనసు ఎంత మధన పడి ఉంటుందో ఊహించవలసింది నేను!
అందుకు మారుగా రావుకు రెట్టింపు ఆవేశ పడ్డాను.
నేను రచయిత్రినే కాననీ, అతి ప్రయత్నం మీద నైనా విజయం అనుమానాస్పదమనీ రావు వెలిబుచ్చిన అభిప్రాయం నా మనసును దహించివేసింది. పిచ్చి దానిలా అయిపోయాను.
"నువ్వు వట్టి కుళ్ళుబోతువి. నా అభివృద్ధి ఏ మాత్రం సహించలేనివాడిని. లతీఫ్ సహకారంతో నేను పైకొస్తానేమోనని నీకు భయం. అన్నివిధాలా నీ కంటే అధికురాలినయిపోతానేమోనని హడల్! శతవిధాల నన్ను అణిచి ఉంచాలని నీ తాపత్రయం. కానీ, తెలుసుకో! నన్ను ఎవ్వరూ శాసించలేరు. నా ఇష్టం వచ్చింది నేను చేసితీరతాను."
ఎన్నడూ మా సంభాషణలలో కల్పించుకోని పరిమళ, ఆత్రతతో, "వదినా! నువ్వు ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నావు" అంది.
రావు కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. మరొకప్పు డయితే ఆ చూపులకు వణికిపోయేదానిని. కానీ, ఆ సమయంలో నాలో ఏదో పైశాచికావేశం విజ్రుంభించింది. నిర్లక్ష్యంగా అతని చూపులను ఎదుర్కొన్నాను.
"శారదా! ఇందాకటినుంచి నేను చెప్పటానికి సాహసించలేని మరో విషయం ఉంది. ఇప్పుడు తప్పనిసరి అయి చెప్పుతున్నాను."
"చెప్పదలుచుకున్నవన్నీ చెప్పు."
హేళన చేస్తున్నట్లు అన్నాను.
క్షణకాలం రావు చూపుల్లో విరక్తి నిండుకుంది. నా ఎదట నిలవలేని వ్యక్తిలా నాలు గడుగులు ద్వారం వైపు వేసి, అంతలో తెచ్చిపెట్టుకున్న నిగ్రహంతో గంభీరంగా కూర్చున్నాడు.
బలవంతాన గొంతు పెగల్చుకుని, "లతీఫ్ తాగుబోతూ, వ్యభిచారీ అని అందరికీ తెలుసు. ఎన్నడూ లేనిది అతను ప్రచురణలు ప్రారంభించటం; ఏ ప్రచురణకర్తా, ఏ రచయిత్రికీ ఇవ్వనంతటి రాయల్టీ నీ కియ్యటం ..... సంఘంలో నీ మీద అపవాదులు ప్రచారం కావటానికి కారణమవుతాయి" అన్నాడు.
"ఛీ! ఛీ!" గర్జించాను రోషంతో. "ఏ దారీ దొరక్క చివరికి ఈ దారి తొక్కావా? నేను అటువంటి దాన్ననుకున్నావా?"
"అనుకొంటే ఈ విషయం చెప్పవలసి వచ్చేదే కాదు."
"మరి? ఎవరో ఏదో వాక్కుంటే నాకేం నష్టం?"
"శారదా! సంఘంలో అప్రతిష్ట కోరి కొనితెచ్చుకుంటానంటావా?"
"నా బాగు నేను చూసుకుంటా నంటున్నాను. ఈ ప్రయత్నంలో వచ్చే అవాంతరాలను లక్ష్యపెట్టనంటున్నాను. లతీఫ్ మరొకరి కెవరికైనా ఇలాంటి ఆఫర్ ఇస్తే ఏవేవో శంకలతో వద్దనే రచయిత్రులు కాని, రచయితలుకాని ఒక్కరుకూడా ఉండకని ఘంటా పధంగా చెప్పగలను. నే నెందుకు వదులుకోవాలి?"
"నిన్ను ఐశ్వర్యకాంక్ష ఆవహించింది. నే నేం చెప్పినా అర్ధం కాదు." విరక్తిగా అన్నాడు రావు.
"అవునేమో! నీ కా ఉద్యోగం లేదు. నా జీతం ఇల్లు గడవటానికి కూడా సరిపోవటం లేదు. ఈ జీవితాలు ఎప్పటికీ ఇంతేనా? పాపను దర్జాగా పెంచు కోవాలని ఉన్నా వీలవుతుందా? ఇప్పట్లో పరిమళకు పెళ్ళి చెయ్యగలవా?"
"హుఁ! నువ్వు చెయ్యబోయే పనివల్ల పాపకు మేలే జరుగుతుందని నమ్మకమా?" ఈసడింపుగా అన్నాడు.
అతని ఈసడింపు, నిరసన, హేళన నన్ను మరింత మొండిదాన్నిగా చేశాయి.
"తప్పకుండా మేలే జరుగుతుందది. ఈ పూట ఉంటే ఆ పూటకి తడుముకునే సంసారంలోకంటే నూరు రెట్లు మేలు జరుగుతుంది. ముఖ్యమైనది, ఈ పరిస్థితుల్లో పరిమళకు పెళ్ళి చెయ్యగలననే అనుకొంటున్నావా?"
పరిమళ అంటే రావు కెంత ఆపేక్షో నాకు తెలుసు. నేను ఆశించినట్లే అతని ముఖం వడిలి పోయింది. బాధను అణుచుకొంటున్నవాడిలా నుదురు రెండు చేతులతోనూ పట్టుకున్నాడు.
పరిమళ ఇంక భరించలేకపోయింది.
"వదిన! నా మీద నీ కెందుకమ్మా ఇంత ప్రేమ! ఒకప్పుడు నా కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో సహితం అన్నయ్యను చేసుకో నన్నావు. ఈనాడూ-నా కోసమే చేసుకున్న అన్నయ్యకి ఎదురు తిరుగుతున్నావు. ఇంత ప్రేమ నేను భరించలేక పోతున్నా నమ్మా!"
కన్నీళ్లు ఆపుకోలేక అక్కడినుండి వెళ్ళిపోయింది.
'అబ్బబ్బ! వీళ్ళతో పడలేకపోతున్నాను." పెద్ద ఆరిందాలా వచ్చి తండ్రితో ముద్దుగా అంది పాప.
ఎంతటి చికాకులో ఉన్నా, చిరునవ్వుతో పాపను పలకరించగలగటం రావు కెలా సాధ్యమో అర్ధమేకాదు నాకు.
"ఏవిటమ్మా?" అన్నాడు.
"చూడండి! పెళ్ళి చెయ్యాలనుకున్నావా? అప్పుడే వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఇంక పెళ్లెలా చెయ్యను?" పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ బొమ్మలను చూపించి పెద్ద బెంగపడినదానిలా తల చేతులతో పెట్టుకు కూర్చుంది-అచ్చురావు కూర్చున్నట్లే.
రావు పకపక నవ్వుతూనే అర్ధయుక్తంగా నా వైపు చూశాడు.
నా మనసూ కలత పడింది.
కానీ, ఈ చికాకులన్నింటికీ పూర్తి బాధ్యత రావుదే ననిపించింది.
22
"వదినా!
అన్నయ్యకు వ్యతిరేకంగా ఏ పనీ చెయ్యవద్దని నిన్ను ప్రార్దించే చనువు కానీ, ఆజ్ఞాపించే అధికారం కానీ-రెండూ లేవు నాకు! అయినా, నే నొక్క పని చెయ్యగలను. నా కోసమే లతీఫ్ తో చేతులు కలుపుతున్నా ననుకొనే ఆత్మవంచన నుండి నిన్ను తప్పించగలను. అదుకే ఈ ఆహ్వానం పంపుతున్నాను. దయ ఉంచు.
నీ మరదలు
పరిమళ."
