"ఏముందీ? ఇంకో గంటలో రావు ఆఫీస్ నుంచి వస్తాడన్నాను. ఇప్పుడు నాలుగయింది."
"రావుకు ఆఫీసేమిటీ? అతని ఉద్యోగం పోయిందిగా!?"
ఈ సారి లతీఫ్ చేతిలో నుంచి బంతి క్రిందకు జారిపోయింది. బొమ్మలా కొన్ని సెకన్లు నిలబడి, "అసంభవం ఉద్యోగం ఊడేటంత బాధ్యతా రహితంగా అతనెన్నడూ ప్రవర్తించడు" అన్నాడు.
సిగ్గుతో నా తల వాలిపోయింది.
"కానీ, రావు కిప్పుడు ఉద్యోగం లేదు. ఇది నిజం..." అన్నాను.
"ఎందుకు పోయింది?"
"నేను మాట్లాడలేదు.
"సారీ! చెప్పదగిన కారణమైతే నాతో రావు ఎప్పుడో చెప్పి ఉండేవాడు. దీనికి తాతలాంటి ఉద్యోగం చూపించేవాడిని..."
లతీఫ్ మాటల్లో మొదటి వాక్యం నాకు కలిగించిన వ్యధ రెండో వాక్యం మరిపింపజేసింది.
"మీరు రావుకి ఉద్యోగం చూసి పెట్టగలరా?" ఆశగా అడిగాను.
"క్షణంలో! రెండు మూడు కంపెనీలకు నేను డైరెక్టర్ని ..."
"ప్లీజ్! రావుకు వెంటనే ఒక ఉద్యోగం చూసి పెట్టండి."
"కొన్ని కొన్ని సార్లు అతి తేలిక విషయాలే అసంభవా లవుతూ ఉంటాయి."
"అంటే?"
"రావుకు నేను ఉద్యోగం చూపిస్తే రావుకు ఆర్ధికంగా మేలు జరుగుతుంది. నిజమే! కానీ, అంతకంటే విలువైనది పోగొట్టుకుంటాడు. నే నా పని చెయ్యలేను."
"నాకు అర్ధం కావటం లేదు."
"మీరు రచయిత్రులని విన్నాను..."
నా ముఖం వెలిగింది.
ఎవరైనా నన్ను రచయిత్రిగా సంభావించినా, నా రచనలను ప్రశంసించినా నాకు ఒళ్ళు తెలియదు. నేను వ్రాసిన రచనలు అవి ఎంతగా ప్రఖ్యాతి కొచ్చాయో, ఎవరెవరు ఎంతగా మెచ్చుకున్నారో చెప్పసాగాను.
మధ్యలో అడ్డుపడి, "మరి ఇంత చిన్న విషయం అర్ధం కాదా?" అన్నాడు.
అప్పటి కర్ధమయింది.
రావు వెన్నెముక ఆత్మాభిమానం. అది వంచుకోలేడు. లతీఫ్ స్నేహాన్ని ఏ విధంగానూ ఉపయోగించుకో కుండా సగర్వంగా అతని ముందు నిలవగలిగినప్పుడే రావు ముఖంలో చిరునవ్వు నిలుస్తుంది. ఆ నవ్వులో కాంతి రేఖ మెరుస్తుంది. ఒకరి ముందు చెయ్యిజాపిన మరుక్షణం రావు అస్థిత్వమే లేదు.
నా ముఖం పాలిపోయింది.
"ఈ ప్రస్తావన రావు ముందు తేకండి. నే నేదో ఆలోచిస్తాను. కాఫీ తీసుకోండి..."
యథాప్రకారం పాపతో బంతి ఆటలో మునిగి పోయాడు లతీఫ్.
19
ఆ రోజు నన్ను చూసి లతీఫ్ ఎలాంటి అనుభూతి చెందాడో నే నెప్పుడూ అడగలేదు. అతను చెప్పమా లేదు. కానీ, ఆ తరవాత జరిగిన సంఘటనలను బట్టి అప్పటి లతీఫ్ ఆలోచనలు ఊహించగలను.

లతీఫ్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నా, అతడు ఒంటరివాడు కాడు. అతనికి ఇద్దరు కొడుకులూ, ఇద్దరుకూతుళ్ళూ ఉన్నారు. కూతుళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని అత్తవారిళ్ళలో ఉన్నారు. కొడుకుల్లో ఒకడు రష్యాలో, ఒకడు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భార్య చాలా రోజుల కిందటే పోయింది. వ్యాపారపు మెలకువలు అతనికి బాగా తెలుసు. స్మగుల్ద్ బంగారంతో బంగారు నగల షాపు నడిపిస్తున్నాడు. అది కాక అనేక ప్రఖ్యాత వ్యాపారసంస్థలతో అతనిని చాలా లావాదేవీలు ఉన్నాయి.
మొదటినుండీ అతను విషయలాలసుడే! భార్య బ్రతికి ఉన్న రోజులలో సహితం ఎప్పుడో తప్ప ఆవిడ ముఖం చూసేవాడు కాడు. అయితే ఎంతటి విషయ లాలసుడో, అంతటి విజ్ఞుడు. అతనికి జీవితంలో అన్నిటికన్న ప్రధమం అతని వ్యాపారం. ఆ తరవాత అతని సరదాలు. ఎవరినీ నమ్మడు. ఎవరితోనూ నిజమైన స్నేహం చెయ్యడు. అతనికి నిజమైన స్నేహితుడు రావు ఒక్కడే! డబ్బుతో సంబంధంలేని స్నేహం చెయ్యగలిగే శక్తి రావుకు ఉందని తెలిశాకే అతని స్నేహాన్ని మనసారా స్వీకరించాడు. ఆ తరవాత రావు కోసం ఏదైనా చెయ్యగలిగేటంత గాఢంగా అభిమానించాడు.
మనుష్యులను చూస్తూనే వాళ్ళను పుస్తకంలా చదివెయ్యగలిగే శక్తి అతనికి సహజంగా వచ్చింది. వంచిన తల ఎత్తకుండా ఎదుటివాళ్ళను ఆపాద మస్తకమూ పరిశీలించగలడు.
ఆ రోజు అతని కారులో రావటానికి నేను సిద్ధపడినప్పుడే-నాకె తెలియకుండా నా మనసులో బుసలు కొట్టే ఐశ్వర్యకాంక్ష అతనికి అర్ధమయిపోయింది. 'చాలా అందమైనది. కానీ, రావ్ అదృష్టవంతుడు కాడు' అనుకున్నాడు మనసులో.
ఎంత ఉద్రేకమో అంత నిగ్రహంగల లతీఫ్ తల ఎత్తి నావైపు మరోసారి చూడకపోయినా, అప్పటికే అతని మనసు నా సౌందర్యం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యసాగింది. నేను రావు భార్యననే స్పృహ కొరడాదెబ్బలా చురుక్కుమనగానే అతని మనసు మగతలోంచి తెప్పరిల్లి, హెచ్చరిక పొందింది. అయినా, ఎంత ప్రయత్నించినా లతీఫ్ నిర్లక్ష్యం నటించగలిగాడే కాని, తన మనసును నిగ్రహించుకోలేకపోయాడు-చాంచల్యానికి ఆలవాలమయిన మన సది! ఆపరేషన్ జరిగింది. కానీ, రాఘవకు కళ్ళు రాలేదు. కాంతమ్మ, రాఘవ చాలా కుంగి పోయారు. నిరాశతో వాళ్ళు స్వగ్రామానికి వెళ్ళి పోయారు. రావు, పరమళ మళ్ళీ మామూలుగా నా దగ్గిరికి వచ్చేశారు. ఎన్నోసార్లు రావుతో అనబోయాను: "లతీఫ్ నడిగి ఉద్యోగం వేయించుకోరాదా?" అని. లతీఫ్ హెచ్చరిక గుర్తుకొచ్చి ఆగిపోయేదానిని.
అన్ని సంఘటనలూ నేను ప్రత్యక్ష్యంగా చూడక పోయినా, ఊహించి వివరించగలను.
ఆ తరవాత, రావు లతీఫ్ ని కలుసుకుని, తన వాళ్ళు అన్ని రోజులుగా అక్కడున్నందుకు డబ్బియ్యబోయాడు.
"నన్ను పరాయివాడిగా చూసి డబ్బిస్తున్నావా?" కష్ట పెట్టుకుంటున్నట్లు అన్నాడు లతీఫ్.
"పరాయివాడిగా చూస్తే అసలు నా వాళ్ళని నీ ఇంటికి తీసుకురాకపోదును. మనం ఇంతవరకూ మిత్రులం నన్ను యాచకున్నిగా మార్చకు."
బాధతో బొమలు ముడుచుకున్న రావు ముఖం లోకి ఒకసారి, రావు చేతులో ఉన్న డబ్బువంక ఒకసారీ చూసి లోలోపల జాలిపడ్డాడు లతీఫ్.
"నా సంగతి తెలుసుగా, రావ్! ఖర్చు మనిషిని. నీ దగ్గరే ఉండనియ్యి. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను."
ప్రాధేయపడుతున్నట్లు అడిగాడు లతీఫ్.
"లతీఫ్! మనం ఒకరితో ఒకరం అబద్దాలాడుకొని ప్రయోజనం లేదు. ఇంద! తీసుకో!"
"నువ్వు నాతో అబద్దాలాడలేదా?"
"నే నా? ఏం అబద్దాలాడాను?"
ఆశ్చర్యంగా అడుగుతున్న రావు ముఖంలోకి క్షణకాలం చూసిన లతీఫ్ అనబోయిన మాటలు ఆపేశాడు.
"నా మాట విను, రావ్! ప్రస్తుతం నీ దగ్గిర ఉంచు. పోనీ, నీకు వెసులుబాటు అయినప్పుడు ఇద్దువు గాని..."
"ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉందని ఎవరన్నారు?"
లతీఫ్ మాట్లాడలేదు. రావు ఆ డబ్బు బల్లమీద పెట్టి వచ్చేశాడు.
పరిమళ చెవులు బోసిగా ఉండటం గమనించి "దుద్దులేమయ్యా"యని అడిగాను.
పరిమళ సమాధానం చెప్పలేదు.
"అమ్మేశాను." ఏ ఉద్వేగమూ లేకుండా అన్నాడు రావు. అదిరి పడ్డాను.
"ఎందుకు?"
"లతీఫ్ కు ఇవ్వవలసి వచ్చింది."
"అతనంత డబ్బున్నవాడు కదా! నిన్ను బాకీ తీర్చమని ఒత్తిడి చేశాడా? ఇదెక్కడి స్నేహం?"
"లతీఫ్ ఒత్తిడి చెయ్యలేదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగల మనిషి కావటంవల్లనే లతీఫ్ ఇంత డబ్బు కూడబెట్టగలిగాడు. నేనే ఇచ్చాను. స్నేహాన్ని నిలుపుకొనే పద్ధతి ఇదే!"
"ఉన్నప్పుడియ్యవచ్చు. పరిమళ దుద్దులమ్మి ఇయ్య వలసినంత తొందరేమొచ్చింది?"
"ఇంక ఈ విషయం వదిలెయ్యి." శాంతంగా అన్నాడు.
అయినా, అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించాను. ఎంతో కోపం వచ్చినప్పుడూ, భరింపరాని విసుగు కలిగినప్పుడూ మాత్రమే రావు సంభాషణ అలా తుంచేశాడు.
నేనూ, రావూ ఇద్దరమూ సంపాదిస్తున్నప్పుడే ఏ నెల కా నెల కటకట లాడేవాళ్ళం. ఇప్పుడు రోజులు మరీ గడ్డుగా గడుస్తున్నాయి. రోజు రోజుకీ నాలో అసహనం పేరుకు పోసాగింది. రోడ్డుమీద మెత్తగా సాగిపోయే కార్లను చూసినా, స్కూటర్లమీద భర్త నడుంచుట్టూ చెయ్యివేసి కూర్చున్న స్త్రీలను చూసినా, తీర్చిదిద్దిన అంగసౌష్టవానికి నేర్పుగా చేసుకున్న అలంకరణ తోడుకాగా కుందనపుబొమ్మల్లా లైబ్రరీకి వచ్చే కాలేజీ అమ్మాయిలను చూసినా నాకు తెలియకుండానే విషపుటూర్పులను వదులుకునే దానిని.
అపురూపమైన అందమూ, అసాధారణమైన తెలిసే (నా కుండని అనుకునేదాన్ని) ఉన్న నేను, సాధరణ స్త్రీలలాగ అతి సామాన్యంగా బతకవలసి వచ్చినందుకు కుమిలిపోయేదాన్ని.
అందరిలో నే నేదో ప్రత్యేకమైన దాన్ననీ, అందరూ నన్ను ఆరాధించాలనీ, అందరికంటే ఉన్నతమయిన స్థాయిలో జీవించాలనీ ఆరాటపడిపోయేది మనసు. నవలలు వ్రాసేదాన్ని. రెండు మూడు ప్రచురింప బడ్డాయి. పొగుడుతూ ఉత్తరాలుకూడా వచ్చాయి. పారితోషికమూ వచ్చింది. అంతలో ఖర్చయిపోయింది. ప్రచురణ కర్తలు పెట్టే చికాకులు కొద్దికొద్దిగా అనుభవంలోకి రాసాగాయి. కొందరు ప్రత్యేకం ఇంటికి వచ్చి అడ్వాన్సుకూడా ఇచ్చి, పుస్తకం వ్రాతప్రతి తీసుకువెళతారు.
అంతే! ప్రచురించరు!
మరికొందరు ప్రచురిస్తారు. కానీ, ఇస్తామని వాగ్ధానం చేసిన రాయల్టీ ఇవ్వరు.
అందుచేత నాకు శ్రమా, ఏదో వ్రాశానన్న సంతోషమూ దక్కుతున్నాయి. కాని ఆర్ధికంగా ఏమంత లాభం కలగటం లేదు.
ఇలాంటి పరిస్థితులలోనే నే నొక పని చేశాను. ఆ పని ఎందుకు చేశానో, నా అంతరాలలో ఏ భావం ఆ పని చెయ్యటానికి ప్రేరేపించిందో ఈనాటికీ నేను చెప్పలేను.
నా సరికొత్త నవల నా సంతకంతో లతీఫ్ కి పోస్ట్ చేశాను.
20
లతీఫ్ రావులు పదేళ్ళ నుండీ ప్రాణస్నేహితులు. కానీ, ఎన్నడూ లతీఫ్ రావు ఇంటికి రాలేదు. రావు ఎన్నడూ ఆహ్వానించనూ లేదు.
వీధిముందు కారాగిన చప్పుడయినా, మా ఇంటికి కారులో వచ్చేవాళ్ళెవరనుకొని మాలో ఎవరమూ కదలలేదు.
తలుపు దగ్గర చిన్నగా తట్టిన చప్పుడూ, "రావ్!" అన్న లతీఫ్ కంఠస్వరమూ విని, రావు సంభ్రమంగా లేచి, ఆశ్చర్యంతో తల మునకలవుతూనే లతీఫ్ ను లోపలి కాహ్వానించాడు.
లతీఫ్ లోపలికి వస్తూనే పరిమళకూ, నాకూ మర్యాదగా నమస్కారాలు చేశాడు.
ప్రతినమస్కారం చేసి, పరిమళ లోపలికి వెళ్ళిపోయింది. పాప లతీఫ్ ను చూడగానే ఎగిరి ఒళ్ళో కూర్చుంది. లతీఫ్ పాపను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని స్వీట్ బాక్స్ దాని చేతిలో పెట్టి, "స్వీట్ బేబీ" అన్నాడు. ఆ మాట అంటూ అతను నా వైపు చూసిన చూపు, రావు గమనించాడో లేది చెప్పలేను కాని, నాకు మటుకు అర్దమయిపోయింది. గర్వంతో నా మనసు పొంగిపోయింది. నా గర్వాన్ని మరింత చేస్తూ అతని చేతిలో నా పుస్తకం కనిపించింది.
