Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 14


    "ఏమీ అనుకోకే, శారదా! ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంట్లోనే ఉండి, నీకు రకరకాల వంటలూ, పిండివంటలూ రుచి చూపిస్తాను. పాపం! ఉద్యోగాలకు పోయేవాళ్ళు! ఏం వండుకుంటారు? ఏం తింటారు? రోజురోజుకీ ఎలా చిక్కిపోతున్నావో? ఈ మాయదారి ఉద్యోగాలొచ్చి ఆడవాళ్ళ అందాన్నీ, ఆరోగ్యాన్నీ, సహనాన్నీ - అన్నింటినీ తినేస్తున్నాయి. ఆనాటి మనుష్యులే వేరు...."
    "అమ్మా! నువ్వూరుకుంటావా? లేదా?" కసిరాడు రాఘవ.
    "ఫరవాలేదు లెండి. ఆవిడన్నదానిలో తప్పేముందీ?" అన్నాను విసుగుతో తల బద్ధలవుతున్నా.
    రాఘవ ముఖ కవళికలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. నా మాటలకూ, అవి పలికినప్పటి నా స్వరంలోని మెత్తదనానికీ రాఘవకు చాలా ఆశ్చర్యం కలిగింది.    
    నన్ను గురించి రాఘవ అభిప్రాయమేమిటో స్పష్టంగా తెలియజెప్పిం దా ఆశ్చర్యం.
    ఎక్కడినుండో అప్పుడే వచ్చాడు రావు. నన్ను చూడ గానే ఆశ్చర్యపోయాడు.
    క్షణకాలం ఏదో సంతోషంతో అతని కళ్ళు మెరిశాయి.
    "రాఘవను చూడటానికి వచ్చావా, శారదా? ఇల్లు తేలిగ్గా గుర్తు పట్టగలిగావా?" ఆప్యాయంగా అడిగాడు.
    గతుక్కుమన్నాను. ఇంతవరకూ రాఘవ కెలా ఉందనైనా అడగలేదు నేను. రావు కళ్ళలో తళుక్కుమన్న సంతోషానికి కారణం అర్ధమయింది.
    లోలోపల లజ్జ పడ్డాను.        
    "పాపం, అక్కయ్యగారు నన్ను చూడటానికి శ్రమ తీసుకు వచ్చారా?"
    నొచ్చుకుంటున్నట్లు అన్నాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం లాంటి భావ'మేదో కనిపించింది.
    మరింత ముడుచుకుపోయింది అంతరంగం.
    "ఎలా ఉంది మీ ఒంట్లో?"
    "ఒంటికేం? రాయిలా ఉంది. కళ్ళు మాత్రమే లేవు..."
    "దిగులు పడకండి. ఆపరేష నయితే వచ్చేస్తాయిగా!"
    "నీ అమ్మ కడుపు చల్లగా -నీ అత్త కడుపు చల్లగా ఎంత చల్లని మా టన్నావే, తల్లీ!" పొంగిపోతూ అంది కాంతమ్మ.
    ఆపరేషన్ గురించీ, ఎవరెవరి కళ్ళు ఆపరేషన్ వల్ల ఎప్పుడెప్పుడొచ్చాయో, అప్పుడు ఏయే వింతలు జరిగాయో వివరంగా చెప్పుకుపోతూంది కాంతమ్మ.
    రావు ఆవులిస్తూ వాలుకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు. పరిమళ పాపతో ఆడుకుంటూ వింటున్నట్లు నటిస్తూంది. నేను - 'ఊఁ! ఊఁ!' అంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నాను, పరిమళ దగ్గిర పాపను ఎలా ఉంచాలా అని.    
    పరిమళ పాపను ఉంచమని ప్రాధేయపడితే, పరిమళ మాట కాదనలేక ఉంచేసినట్లు నటించవచ్చు.
    పాప రానని ఏడిస్తే?
    పాప ఏడుస్తూందని ఉంచెయ్యవచ్చు.
    కాంతమ్మ వాక్ప్రవాహం ఆగటం లేదు.
    "అమ్మా! లేచి అక్కయ్యగారికి కాస్త కాఫీ పెట్టు" అన్నాడు రాఘవ, తల్లి మాటలు ఆపాలని ప్రయత్నిస్తూ.
    "అయ్యో! నా మతి మండ! మరిచేపోయాను..." అంటూ కాంతమ్మ హడావిడిగా లేవబోయింది. వీళ్ళందరూ నా బంధువులు! న్యాయానికి నేను చేసిపెట్టవలసింది వీళ్ళందరికీ! నేను కాదనటం వల్లనే పరాయి పంచలో తల దాచుకోవలసి వచ్చింది. ఎదురు నాకే కాఫీ ఇచ్చి, మర్యాద చేస్తానంటూంటే భరించలేకపోయాను.
    "ఇప్పుడేం వద్దండీ! ఇంక ఇంటి కెళ్ళాలి. వస్తాను" అంటూ లేచి నించున్నాను.
    రావు కళ్ళు తెరిచి చూశాడు. నిద్రపోవటం లేదన్నమాట!
    "నన్నూ రమ్మంటావా?"
    "నీ ఇష్టం!"
    రావు లేచి చెప్పులు తొడుక్కున్నాడు.
    "పరిమళా! వెళ్ళొస్తాను" అన్నాను.
    పరిమళ పాపను తన దగ్గర ఉంచమని ప్రాధేయ పడలేదు. ఒక్కసారి గట్టిగా హృదయానికి హత్తుకుని, రెండు చెక్కిళ్ళూ గట్టిగా ముద్దు పెట్టుకుని నా చేతికి ఇచ్చేసింది.
    పాప నా దగ్గిరికి రానని ఏడవలేదు. నా చేతుల్లోకి దూకి పరిమళకు 'టా! టా!' చెప్పింది.
    పసిపిల్లలు తల్లిని ఎంత బాగా గుర్తించగలరు!
    ఏం చెయ్యాలిప్పుడు?
    కాసేపు తటపటాయించి, "పరిమళా! పాప నా దగ్గిర ఉండనని పేచీ పెడుతూంది. ఏం చెయ్యను?" అనేశాను.
    రావు ఉలిక్కిపడినట్లయ్యాడు. అతని కళ్ళలో కనిపించిన సంతోషం కరిగిపోయింది. నిశితంగా నన్ను పరీక్షించి ఒక్క నిట్టూర్పు విడిచాడు.
    "నీ ఇష్టం, వదినా! నువ్వేం చేసినా నాకు సంతోషమే!"
    మామూలుగా అనటానికి ప్రయత్నించినా, పరిమళ ముఖంలో సంతోషం స్పష్టంగా ప్రతిఫలించింది.
    ఇప్పటికయినా తన నోటితో తను 'పాపను నా దగ్గరే ఉంచు' అనలేదు పరిమళ. ఎంత అభిమానం!
    "పోనీ, పాపను నీ దగ్గర ఉంచుకుంటావా?"
    "సంతోషంగా!"
    పాపను పరిమళ కందించాను.
    పాప రానని ఏడ్చింది.
    "బయటికి వెళుతున్నాను కదూ! అందుకని నాతో వస్తానని ఏడుస్తోంది. తీరా ఇంటికెళ్ళాక నీ కోసం ఏడుస్తుంది." పేలవమైన చిరునవ్వుతో అన్నాను.
    "ఇలా ఇయ్యి వదినా! పాపను నేను మరిపించగలను. నువ్వింటి కెళ్ళి వ్రాసుకో!"
    గతుక్కుమన్నాను. అదొక మాదిరిగా నవ్వాడు రావు.
    రావుకూ, పరిమళకూ కూడా అర్ధమయిపోయింది.
    పాపను తీసుకువెళ్ళిపోయింది పరిమళ. మరో నిమిషానికి పాప నవ్వులు వినిపించాయి.    
    రావుతో కలిసి బయటకు నడిచాను.
    లతీఫ్ ఎదురు వచ్చాడు.
    "హలో! రావ్! ఎక్కడికి వెళుతున్నావ్! నేను డ్రాప్ చెయ్యనా?"
    "థాంక్స్! వద్దులే! మా శ్రీమతికి బస్ ప్రయాణమే ఇష్టంట!"
    "అదేం కాదు. కారులోనే ఇంకా సుఖంగా ఉంటుంది." చటుక్కున అనేశాను.
    రావు నా వంక విచిత్రంగా చూశాడు. అంత క్రితం లతీఫ్ గురించి నేను మాట్లాడిన మాటలను బట్టి లతీఫ్ కారులో రావటం నా కిష్టంలేదని భావించి ఉంటాడు రావు.
    అందంగా ఉన్న ఆ కారులో కొంచెంసేపైనా కూర్చోవాలని ముచ్చటపడింది మనసు.
    మెత్తగా రోడ్డుమీద సాగిపోయే ఆ కారులో కూర్చున్నాక బస్ కోసం గంటల తరబడి బస్ స్టాప్ లో వేచి ఉండటం గుర్తుకొచ్చి ఏదో విసుగుదల తోచింది. సునాయాసంగా స్టీరింగ్ పట్టుకుని క్షణాలలో మైళ్ళు దాటిస్తూన్న లతీఫ్ ను చూస్తూంటే ఆ క్షణంలో నిగ్రహించుకోరాని అసూయ మనసులో బుసలు కొట్టింది.
    ఇంటి ముందు కారాగగానే క్రిందకు దిగి అతనికి థాంక్స్ చెప్పబోయాను. నా వైపు తల తిప్పి చూడకుండా మెరుపులా దూసుకుపోయాడు.
    అవమానంతో భగ్గుమంది నా మనసు.
    "నా దంతే! ఫార్మాలిటీస్ అసలు పట్టవు."
    నా మనసు గ్రహించి నన్ను ఓదారుస్తున్నట్లు అన్నాడు రావు.
    ఆ నాటికి ఎంత ప్రయత్నించినా అందమైన ఆ కారును మరిచిపోలేకపోయాను.

                                   18

    నా మనస్థితి నాకే అర్ధం కావటం లేదు. పాప లేకపోతే తోచటంలేదు. ఉంటే సమర్దించుకోలేక పోతున్నాను. ఇలాంటి మాటలు పైకి చెపితే అందరూ నన్ను 'ఛీ' అంటారని తెలుసు. కానీ, ఏం చెయ్యను? వివేచనా జ్ఞానం మేధ కున్నా, నిగ్రహశక్తి మనసుకు లేక పోతూంది. దాన్ని నియమించటం నా తరం కావటం లేదు. నియమించాలనే ప్రయత్నమూ చెయ్యటం లేదు. పాపను చూడాలనిపించి లతీఫ్ ఇంటికి బయలుదేరాను. విశాలమైన ఆ ఇల్లు, ఇంట్లో అడుగడుగునా ప్రత్యక్షమవుతున్న ఐశ్వర్యపు ఛాయలు - నా మనసులో ఏవో విషవాయువులను నింపుతున్నాయి. ఇల్లంతా కలయ దిరిగినా నాకు ఎవ్వరూ కనబడలేదు. వరండాలోకి వచ్చాను. పాపను ఉయ్యాలలో కూర్చో బెట్టీ ఊపుతూ ఆడిస్తున్నాడు లతీఫ్. పాప నన్ను చూడగానే. "అమ్మ....అమ్మ...." అని చప్పట్లు కొట్టింది. ఉయ్యాల తాళ్ళు వదిలి చప్పట్లు కొట్టిన పాపని పడబోయే లోగానే నేర్పుగా పట్టుకుని ఎత్తుకున్నాడు లతీఫ్. నేను చేతులు జాపాను. లతీఫ్ చేతుల్లోంచి నా చేతుల్లోకి దూకింది పాప.
    "వీళ్ళంతా ఎక్కడి కెళ్ళారు?" అన్నాను ఇంగ్లీష్ లో.
    "హాస్పిటల్ కెళ్ళారు."
    స్వచ్చమైన తెలుగులో సమాధానం చెప్పి అదొక మాదిరిగా నవ్వాడు.
    ఆ నవ్వులో హేళన స్పష్టంగా ప్రతిఫలించింది.
    "మీకు తెలుగు రాదనుకుని ఇంగ్లీషులో మాట్లాడాను." రోషం అణుచుకుంటూ అన్నాను.
    అతనేమీ సమాధానం చెప్పలేదు. పాపవైపు చేతులు జాపి, "రా!" అన్నాడు.
    లతీఫ్ వైపు దూకుతూన్న పాపను చూసి ఆశ్చర్యపోయాను.
    "కూర్చుంటారా?" మర్యాదగా సోఫా చూపిస్తూ అన్నాడు.
    అతని వయసు దగ్గిర దగ్గిర అరవై ఉంటుంది. నెరసిన తల తప్ప శరీరంలో ఏ కోశానా వృద్ధాప్యపు జాడలేదు. అతనిని గూర్చి రకరకాలుగా విన్నాను. ఎవరూ లేని సమయంలో అతనితో కూర్చోవటం ఇష్టంలేకపోయింది.
    "వెళతాను. పాపను చూడటానికి వచ్చాను" అన్నాను. నా చేతుల్లోంచి లతీఫ్ స్వతంత్రంగా పాపను రమ్మన గలిగాడు. మళ్ళీ పాపను నా దగ్గిరకు పిలవాలంటే ఏదో సంకోచం కలిగింది. నా అంతరంగ మెందుకలా ముడుచుకుపోయిందో నాకే అర్ధం కాలేదు.
    "పాపకు మీ దగ్గర బాగా చనువనుకుంటానేం?' అన్నాడు పాపతో ఆడుకుంటూనే నా వైపు చూడకుండా.
    ఇతడు పచ్చి వ్యభిచారి అని విన్నాను. నా అందచందాల ప్రస్తావన కూడా చాలా మంది నోట విన్నాను. ఇత నొక్కసారైనా నా వైపు ప్రశంసాపూర్వకంగా చూడడేం?
    "నా దగ్గిర చనువు లేకుండా ఎలా ఉంటుంది? ఎంతైనా తల్లిని కదా?"
    గిర్రున తిరిగి లతీఫ్ నా వైపు తేరిపార చూశాడు. అతని చూపులలో నా సౌందర్యం పట్ల ప్రశంస లేదు. ఆశ్చర్యం ఉంది. కొద్దిగా నిరసన కూడా తోచింది.
    "సారీ!" అన్నాడు.
    "దేనికి?"
    "పాప పరిమళగారి కూతురనుకున్నాను."
    "ఎలా అనుకున్నారు? పరిమళకు పెళ్ళి కాలేదుగా!"
    "అవన్నీ నా కెలా తెలుస్తాయి?"
    "రావు చెప్పలేదా?"
    లతీఫ్ నవ్వాడు, నా వెర్రితనం చూసి నవ్వుతున్నట్లు.
    "ఇలాంటి కబుర్లు మగవాళ్ళ మధ్య రావు."
    "పోనీ, పరిమళను చూసినా తెలుస్తుందిగా!"    
    అతను లజ్జపడినట్లు ముఖమంతా ఎర్రబడింది. ముఖం పక్కకు తిప్పుకుని, "అంత పరిశీలనగా చూడలేదు" అన్నాడు.
    నాకు ఒళ్ళుమండింది .... పె....ద్ద ఋష్యశృంగుడి లాగ పోజు - అనుకున్నాను.
    "పాపం! మీరు ఆడవాళ్ళను తల ఎత్తి చూడ రనుకుంటాను." కావాలని వ్యంగ్యంగా అన్నాను.
    అతను విసురుగా తల ఎత్తి, అంతలో కోపాన్ని నిగ్రహించుకొని నా కళ్ళలోకి చూసి చిలిపిగా నవ్వాడు.
    నా గుండె ఝల్లుమంది.
    అతను నా వంక అలా చూడటం, నవ్వటం అదే మొదటిసారి. అతని చిరునవ్వులో ఏదో 'సెన్స్యుయా లిటి' ఉందని అప్పుడే గమనించాను నేను.
    "ఎందుకు చూడమా? చూస్తాను. కానీ, నేను చాలా తెలివిగలవాడిని. ఎవరి దగ్గర ఎలా మసులు కోవాలో తెలుసు."
    మరొక్కసారి పెంకెగా నవ్వి, అంతలో పశ్చాత్తాప పడుతున్నట్లు గిర్రున తల తిప్పుకున్నాడు.
    తల తిరిగింది. అహంతో అతనిని వెక్కిరించబోయి నేనే అపహాస్యాల పాలయ్యాను.
    కొంచెం సేపటివరకూ మాట్లాడలేకపోయాను. అతనే మృదుస్వరంతో, "పాపను తీసుకెళ్ళడానికివచ్చారా?" అన్నాడు.
    తడబడ్డాను.
    "తీసుకెళ్ళాలని రాలేదు. చూడాలని వచ్చాను. పాపకు పరిమళ దగ్గర బాగా చనువు. నా దగ్గిర ఉండదు."
    లతీఫ్ నా వంక విచిత్రంగా చూసి గట్టిగా నవ్వాడు.
    "ఎందుకు నవ్వుతున్నారు?"
    "అబద్ధాలు విన్నప్పుడల్లా నాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది. ఇది నా బలహీనత." నవ్వు ఆపుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.
    "ఇప్పుడు అబద్దా లెవరాడారు?"
    "మీరు! ప్రొద్దుటి నుండీ పాప నా దగ్గర హాయిగా ఆడుకొంటూంది. మీ దగ్గిర ఉండదా? అసలు విషయం చెప్పటాని కిష్టంలేకపోతే ఊరుకో వచ్చుగా! అబద్దాలెందుకు? సంజాయిషీలు అంతరంగంలోని మకిలి మూలలకు వ్యాఖ్యానాలు."
    "శ్రుతి మించి మాట్లాడకండి..."
    "నా శ్రుతి ఎప్పుడూ ఇదే! సమయానుకూలంగా దాన్ని సర్దుకోవటం నాకు చేతకాదు. ఆ అవసరమూ లేదు... పాపా! బంతి గట్టిగా విసరాలి..." అతను నా వైపు చూడటం లేదు. పాపతో బంతి ఆడుతున్నాడు. అతని దృష్టంతా బంతిమీదే ఉంది. ఏదో చేతకాని పౌరుషంతో ఉడికిపోయింది నా మనసు.
    "ఇంతకూ రావు నవాలి! ఇలాంటి ఇంట్లో తన వాళ్ళని ఉంచి నందుకు...."
    సాధారణ సభ్యతా సంస్కారాలను మరిచి అన్నాను. నా మనసులోతిక్క ఏమిటో నాకే అర్ధం కావటంలేదు.
    పాపతో బంతి ఆడుతూ తల తిప్పకుండానే, "కూర్చోండి. ఇంకో గంటలో ఆఫీస్ నుంచి వస్తాడు. అప్పుడు అందురుగాని. ఈలోగా కాఫీ, ఫలహారాలు తీసుకోండి" అంటూ బల్లమీది ఏపిల్ పళ్ళు, చాకు, ప్లేటు నాముందు ఉంచి, మళ్ళీ పాపతో బంతి ఆటలో మునిగిపోయాడు.
    ఉలికిపడ్డాను అతని మాటలకు.
    "ఏమన్నారు?" అన్నాను సంభ్రమంగా.
    నా సంభ్రమానికీ, ఉలికిపాటుకూ అతను ఆశ్చర్యపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS