Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 13

                               16

    పాప ఆకలికి ఏడుస్తూంది. ప్రతి రోజూ వంట బాధ్యత పూర్తిగా పరిమళ తన మీద వేసుకోవటంతో ఆ విషయమే మరిచిపోయాను. పాప ఆకలికి ఏడుపు మొదలుపెట్టేవరకూ వంట చెయ్యాలనే విషయమే గుర్తు రాలేదు.
    ఏడ్చే పాపను సముదాయించాలో. వంటచెయ్యాలో తెలియక, రెండూ చెయ్యలేక తికమక పడుతున్నాను.
    ఆ సమయంలో వచ్చాడు రావు.    
    "పాప ఏడుస్తోంది. అన్నం పెట్టెయ్యి" అన్నాడు.
    లజ్జతో ముడుచుకుపోయాను.
    "అన్నం వండలేదు. మరిచిపోయాను. వండాలి" అన్నాను.
    రావు ఏం దెప్పుతాడో నని భయపడ్డాను.
    హుషారుగా నవ్వాడు రావు.
    "మతిమరుపు గొప్పవాళ్ళ లక్షణం. ఇంక చూసుకో! నువ్వు నిజంగా గొప్ప నవలలు వ్రాసేస్తావు. పాపను నేను ఆడిస్తాను. త్వరగా వంట పూర్తి చెయ్యి."
    పొంగిపోయాను. రావు సహృదయతను లోలోపల ఎంతో మెచ్చుకున్నాను.
    వంట కాగానే పాపకు నేనే అన్నం తినిపించాను. పాప పెద్దదవుతూంది. పేచీలు లేకుండా వెంటనే నిద్రపోయింది.
    రావూ, నేనూ చాలా సరదాగా గడిపాం ఆ రోజు. ఆ మరునాడు రావు తయారవుతూంటే, "ఎక్కడికి?" అన్నాను.    
    "లతీఫ్ ఇంటికి! రాఘవను హాస్పిటల్ కి తీసు కెళ్ళద్దూ?"
    నేనేం మాట్లాడలేదు. నా ముఖంలో అప్రసన్నత అర్ధం చేసుకున్నాడు రావు.
    అనునయిస్తున్నట్లుగా అన్నాడు: "బాగుండదు, శారదా! వీలైతే నువ్వూ ఒక్కసారి రా! నువ్వు వాళ్ళందరినీ ఇక్కడికే రమ్మన్నావని చెప్పాను. అత్తయ్య పొంగి పోయింది."
    అప్పటికీ మాట్లాడలేదు నేను.
    "రావూ?" బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు.
    "వస్తాను." వెంటనే అనేశాను.
    అపరాధ భారంతో కుంచించుకుపోతున్న నాకు, రావు లాలన ఏదో మహరాశీర్వాదంలా తోచింది. ఇంకా అతని మనసు కష్టపెట్టగలిగే శక్తి లేకపోయింది. అందుకే వాళ్ళ మధ్యకి వెళ్ళటం ఎంత ఇష్టంలేక పోయినా 'నా' వని అనలేకపోయారు.
    "పాపను ఇక్కడ ఉంచనా? తీసుకెళ్ళనా?"
    "ఇక్కడే ఉంచు. పాప కూడా లేకపోతే ఒక్కదానికీ నాకేం తోచదు."
    రావు ఏదో అనబోయి, ఆగిపోయి సందేహిస్తున్నట్లుగా నా ముఖంలోకి చూడసాగాడు.
    "ఏమిటీ?"
    "పాప ఇంకా పసిపిల్ల. ఒక మనిషి ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి."
    "నేను చూసుకోలేనా?" రోషంగా అన్నాను.
    "కన్నతల్లి తరవాతే ఎవరైనా కాని-"
    "కాని -?"

                                   
    "మరి - మరి - నీకు సెలవు దొరుకుతుందా?" చెళ్ళున తగిలింది.
    పాలిపోయిన ముఖంతో రావు ముఖంలోకి చూశాము.
    అది భరించలేనట్లు, "నీ కెలా తోస్తే అలా చెయ్యి ఒకవేళ పాపను పరిమళ కప్పగించాలనిపిస్తే లతీఫ్ ఇంటికి రా మీ ఫ్రెండ్ శాంత ఇంటి సందులోనే! ఆ సందులో ఉన్న లేత నీలంరంగు మేడ! తేలిగ్గానే గుర్తు పట్టగలవు" అనేసి గబగబ వెళ్ళిపోయాడు.
    రావు వెళ్ళిన ఎంతో సేపటికి గాని కోలుకోలేక పోయాను.
    ఫాన్ ఉన్న పొరుగింటికే వెళ్ళి డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను - సి. ఎల్. కావాలని.
    ఇదే మని ఇంతకుముందు చేసి ఉంటే? నిక్షేపం లాంటి రావు ఉద్యోగం పోయి ఉండేది కాదు. వచ్చీరాని పాప తొక్కు పలుకులు వినటం, పాపతో ఆడుకోవటం కొంతసేపటివరకూ చాలా హాయిగా అనిపించింది. ఆ తరవాత నా మనసు నా కాగితాల మీదకు పరుగెత్త నారంభించింది.
    పాప ముందు లక్క పిడతలు పడేసి వ్రాసుకోవటం మొదలు పెట్టాను. మధ్యలో ఎందుకో తలఎత్తి చూసే సరికి పాప లక్కపిడతల ముందు లేదు. కంగారుగా ఇల్లంతా చూశాను.
    వంటింట్లో పాప చేస్తున్న పని చూసేసరికి నవ్వాగలేదు.
    నా నవ్వు విని పాప కూడా ఇటు తిరిగి నవ్వింది. పెన్ లో సిరా పోసుకుని, సిరా బుడ్డి మూత వెయ్యటం మరిచిపోయాను. పాప ఆ సిరా తన ఒంటినిండా పోసుకుంటూ, ఆ బుడ్డీ వంటింట్లోకి తీసుకెళ్ళి పాలల్లో కొంచెం సిరా, అన్నంలో మరి కొంచెం సిరా పోసి, ఇంకా ఏం ఉన్నాయో అవి వెతుకుతూంది.
    మొదట పాప చిలిపి అల్లరికి నవ్వు వచ్చినా, మళ్ళీ చెయ్యవలసిన పనులు తలుచుకునేసరికి నీరసం వచ్చిన ట్లయి విసుగేసింది.
    పాపకు మళ్ళీ స్నానం చేయించాను. చచ్చినట్లు మళ్ళీ అన్నం వండాను.
    పాపముందు మరిన్ని బొమ్మలు పడేసి, సిరా బుడ్డి గట్టిగా మూతపెట్టి పైన పడేసి, వంటింటి తలుపులు గట్టిగా వేసేసి మళ్ళీ వ్రాయటానికి కూర్చున్నాను.
    "పాపా! అదేం పని?"
    అన్న రావు ఆందోళన స్వరం విని ఉలికిపడి తల ఎత్తాను.
    బాత్ రూమ్ ముందు నిలుచుని ఉన్న రావును చూసి త్వరగా అక్కడికి వెళ్ళాను. పాప చన్నీళ్ల డ్రమ్ లో మునిగి ఆ నీళ్ళను తపతప చేతులతో కొడుతూంది.
    రావు గబగబ పాపను లేవదీసి, బట్టలు మార్చి తల తుడిచాడు.
    "ఇప్పుడే కాస్త వ్రాసుకోబోయాను. అంతలో ..."    
    కోపంతో, తిరస్కారంతో బాకుల్లా గుచ్చుకొంటున్న రావు చూపులకు నోట్లో మాట ఆగిపోయింది.
    "భోజనం చేస్తావా?"
    "చేసేశాను."
    "అక్కడెందుకు చేశావ్?"
    "పరిమళ ఊరుకోదు."
    "హుఁ! పరిమళ నువ్వు తినకపోతే కష్టపెట్టు కొంటుంది. నేను కష్టపెట్టుకోను. కదూ!"
    "నువ్వు ఇంట్లో ఉన్నావని తెలిస్తే, పరిమళ నేను అడిగినా అన్నం పెట్టకుండా ఇక్కడికే పంపేది. కానీ, పరిమళ కా సంగతి తెలియదు."
    "ఎందుకు తెలియదు?"
    "నేను చెప్పలేదు!"
    "ఎందుకు చెప్పలేదు!"
    "పరిమళ దృష్టిలో నిన్ను చులకన చెయ్యటం ఇష్టంలేక...."
    రోషంగా ఎత్తిన నా తల వాలిపోయింది.
    కొన్ని క్షణాలు మాట్లాడలేక పోయాను.
    "పాప సంగతి అడగలేదా పరిమళ?"
    "అడిగింది."
    'ఏమని చెప్పావు మరి?"
    "ఆయను కుదిర్చానని చెప్పాను. అందుకే పాప ఎలా ఉందో చూసి రమ్మని నన్ను పంపింది. మంచి సమయానికి వచ్చాను కదూ!"
    మరో దెబ్బ! తట్టుకున్నాను.
    "పాపను తీసుకు రమ్మని అడగలేదా పరిమళ?"
    "తన గుండెలు పగిలిపోతున్నా పరిమళ మరొకరిని ప్రాధేయపడదు."
    మా మధ్య మళ్ళీ మాటలు కరువయ్యాయి. రావూ, నేనూ దగ్గిరగా వచ్చినట్లే వచ్చి అంతలో దూరమయి పోతున్నాం.
    కొంచెంసేపు పాపతో ఆడుకొని రావు వెళ్ళిపోయాడు.
    ఏడుస్తున్న పాపను సముదాయించేసరికి తాతలు దిగి వచ్చారు.
    పాపతో గంట, రెండు గంటలు ఆడుకోవటం నాకు చాలా హాయిగా ఉంది. కానీ, నా సమయమంతా పాపతో గడపాలంటే మాత్రం ఇబ్బందిగా ఉంది. పాప నా కర్మాన నన్ను ఆలోచించుకో నివ్వదు. ఎప్పుడూ నా దృష్టి తనే ఆక్రమించుకోవాలని చూసేది. తనను లక్ష్యపెట్టక పోతే పెద్దగా ఏడుపు మొదలుపెట్టేది. రావు పాపను తీసుకు వెళ్ళిపోతే బాగుండు ననిపించింది. కానీ, అనలేకపోయాను.
    ఆ మరునాడు భరించలేక పాపను తీసుకుని బయలు దేరాను. ఇల్లు తేలికగానే గుర్తుపట్టగలిగాను.
    ఎదురుగా వస్తున్న పురుషమూర్తిని చూసి క్షణ కాలం ఆగిపోయాను.
    పూర్తి మహమ్మదీయ వేషంలో ఉన్నాడు. దగ్గిర అగ్గిర అరవై సంవత్సరాల వయస్సు ఉంటుంది. పెదవులు నవ్వుతున్నాయి. కాని, ఆ నవ్వు ఎవరినో వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. కళ్ళు కోసుగా ఉన్నాయి. వాటిలో విషయలాలస నాట్యం చేస్తూంది. ఏదో నిర్మలత్వమూ కనిపిస్తూంది. పెట్టుకున్న టోపీ లోంచి నెరసిన జుట్టు కనిపిస్తూంది.
    నెరసిన జుట్టూ, చెక్కిళ్ళ దగ్గర ముడతలూ-ఇవి మాత్రమే అతని వృద్ధాప్యాన్ని సూచిస్తున్నాయి. మిగిలిన శరీరమంతా దృఢంగా ఉంది.
    ఇతడేనా లతీఫ్?
    నేను అతన్ని పరిశీలించిన దానికంటే రెండు రెట్లు నన్నతడు పరిశీలించాడని అర్ధమయింది. మెరుపులా నన్ను దూసుకుపోయి, వీథిలో ఉన్న ఖరీదైన కారులో కూర్చున్నాడు.
    లోపలికి నడిచాను. పరిమళ ముఖం మమ్మల్ని చూడ గానే వికసించింది. నన్ను పలకరించనైనా పలకరించాకుండా పాపవైపు తిరిగి చేతులు జాపింది. పాప ఆ చేతుల్లోకి ఉరికింది. కొన్ని యుగాలు ఎడబాసిన వాళ్ళలా వాళ్ళిద్దరూ ఒకరి నొకరు అల్లేసుకొంటే నా హృదయం ఏదో బాధతో మూలిగింది.

                                  17

    కాంతమ్మ మాట్లాడటం మొదలుపెట్టింది. అంటే ఇంక అప్పట్లో ఆగడనీ అర్ధం! అరగంటవరకూ తలనొప్పి తగ్గదని అర్ధం!
    "అమ్మాయ్! ఎంత మంచిదానివే! పాపం! మమ్మల్ని స్వయంగా తీసుకువెళదామని వచ్చానా? నాకూ రావాలనే ఉందే! ఏం చెయ్యను? ఆయన - మన కులం కాదనుకో! అయినా, ఎంత మర్యాదస్థుడని! మా కే లోటూ రాకుండా చూస్తున్నాడు. అన్నట్లు పాప కులాసాగా ఉందా? ఈవేళ వంకాయ కూర వండాను. కాస్త రుచి చూపిస్తాను, ఉండు. అన్నట్లు నా మతి మండా! అయిపోయినట్లుందే! అమృతంలా కుదిరింది కదూ! అందరూ ఊదేశారు.  ఆయన ఇంట్లో మనిషి లానే ఉన్నాడు. ఎంత ఆప్యాయంగా తిన్నాడనుకున్నావ్? తినటం నేను చూడలేదనుకో! ఎంతయినా మరీ కులం పోగొట్టుకోలేంగా! అయితే, ఎలా తెలిసిందంటావా? అతనే చెప్పాడు. అలాంటి కూర ఇంతకు ముందెప్పుడూ అతను తినలేదట! అంత రుచికరమయిన కూరలు ఉంటాయని కూడా తెలియదట..."
    "అమ్మా!" విసుగ్గా రాఘవ మూడోసారి అడ్డుకున్నాడు.
    కాంతమ్మ వినిపించుకోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS