"వచ్చావా డాక్టర్ గారు ఏమన్నారు? ఎన్నాళ్ళలో కళ్ళు వస్తాయన్నారు? మళ్ళీ మా ఊరికి ఎప్పుడెళ్ళి పోవచ్చు?"
ఆవిడకు ప్రశ్నలు వెయ్యటమే తెలుసు కాని, సమాధానాల కోసం ఆగటం తెలియదు.
"ఈ వేళ పరీక్ష చేశారు, అత్తయ్యా! ఎల్లుండి రమ్మన్నారు ఆపరేషన్ చేసేదీ, లేనిదీ చెపుతామన్నారు."
"హమ్మ బాబోవై! ఎల్లుండిదాకా ఆగాలా? ఎల్లుండయినా చెపుతారా? ఇంకా పది రోజులు ఆగమంటారా? అప్పటికయినా చెపుతారా?"
"అబ్బబ్బ! ఊరుకో, అమ్మా! ఎల్లుండివరకూ ఏ సంగతీ తేలదు." విసుగ్గా తల్లికి అడ్డుపడ్డాడు రాఘవ.
కాంతమ్మగారి దగ్గిర విషయాలకు కొదవలేదు. ఆవిడ మాట్లాడకుండా ఉండలేదు.
ఆపరేషన్ లో నుండి వంకాయకూరలోకి మారి పోయింది ప్రసంగం.
"ఈవేళ గుత్తివంకాయకూర నేనే చేశాను. ఒరేయ్ చిట్టీ! (ఆవిడ రావును 'చిట్టీ!' అని పిలుస్తుంది) ఎంత బాగా కుదిరిందనుకున్నావ్? అంతా నా గొప్ప కాదనుకో! కాయలు లేతవి. కాదనను. కానీ, చెయ్యటంలోకూడా ఉంటుందిగా! ఏ మాట కామాట చెప్పుకోవాలి. పాడి పరిమళ బాగా నూరింది. పొడినిబట్టికూడా రుచి వస్తుందిగా! చింతపండూ అవీ నేనే వేశాను. నూనెమాత్రం బాగా పడుతుందిరా! మన బోటివాళ్ళం రోజూ చేసుకోలేం!"
తల్లి మాట్లాడుతున్నంతసేపూ రాఘవ మధ్య మధ్య మూలుగుతూనే ఉన్నాడు. కానీ, రావు మాత్రం శ్రద్దగా వింటున్నట్లే నటించాడు.
"అబ్బ! నోరూరుతూంది, అత్తయ్యా! నీ వంకాయకూర తలుచుకుంటే లేని ఆకలి పుట్టుకొస్తుంది" అన్నాడు. ఆవిడ పొంగిపోయి, "రండి! రండి! వడ్డిస్తాను" అంది.
రావు నన్నుకూడా రమ్మన్నాడు.
"నేను పరిమళతో తరవాత తింటాను"- విసురుగా అన్నాను. రాఘవ ముఖం వడిలిపోయింది. కాంతమ్మ మాత్రం, "మా తల్లే! ఏం వినయం! చదువుకున్న ఆడదంటే అలా ఉండాలి. మొగవాడు తిన్న తరవాత తినాలి" అంటూ పొంగిపోయింది.
నా చిరాకు అర్ధం చేసుకున్న పరిమళ, కాంతమ్మను కూడా కూర్చోబెట్టి వడ్డించేసింది. తింటున్నంత సేపూ ఆవిడ పటపట వాగుతూనే ఉంది. రాఘవ విసుక్కొంటూనే ఉన్నాడు. రావు శ్రద్దగా వింటున్నట్లు నటిస్తూనే ఉన్నాడు.
వాళ్ళ భోజనాలయ్యాక పరిమళ మా ఇద్దరికీ వడ్డించింది.
"ఎన్నాళ్ళుంటారు వీళ్ళిక్కడ?" కసిగా అడిగాను.
"ఏమో వదినా! వచ్చినవాళ్ళని ఎలా వెళ్ళమనగలం?" తల వంచుకుని అంది పరిమళ.
ఎలాగో భోజనం ముగించుకుని ఇవతల పడ్డాను. కాంతమ్మ గట్టిగా పెంకులెగిరిపోయేలా మాట్లాడే స్తూంది. ఈ రణగొణధ్వనిలో ఎలా వ్రాసుకోను? దేవుడా! వ్రాయాలనే తపన ఎక్కువవుతూన్నకొద్దీ నా కిలా ఆటంకాలు ఎదురవుతూన్నకొద్దీ నా కిలా ఆటంకాలు ఎదురవుతున్నా ఏమిటీ?
ఎప్పటికో కబుర్లు ముగిసి, నా దగ్గిరికి వచ్చాడు రావు.
పై కప్పు వంక చూస్తూ పడుకున్న నన్ను చూస్తూ, "ఇంకా నిద్ర పోలేదా?" అన్నాడు అనునయంగా.
"ఎలా పడుతుందీ?"
"శారదా!"
దగ్గిరగా తీసుకోబోయాడు. విదిలించి కొట్టాను. దెబ్బతిన్నట్లయి అంతలో సర్దుకున్నాడు.
"శారదా! ప్లీజ్! కొంచెం రోజులు ఎలాగో సర్దుకో! తల్లీ, తండ్రీలేని అనాథల్ని మమ్మల్ని పెంచి పెద్దచేసింది."
"నా కధంతా తెలుసు. ఎవరు, ఎవరికి ఎంత చేశారో కూడా తెలుసు."
"ఎంత చేశారన్నది ప్రధానం కాదు, శారదా! ఎంత అభిమానంతో చేశారన్నది ప్రధానం."
"ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మరో ఇద్దరిని భరించగలమా?"
"మన పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళు వస్తారా? ఏదో అవస్థ పడాలి."
"అవును అవస్థ పడాలి. అన్ని అవస్థలూ పడటానికి నేను ఉన్నాను. నేను సంపాదించి పోస్తూంటే నువ్వు అభిమానాలు గుమ్మరించగలవు."
ప్రాధేయపూర్వకంగా పలుకుతూన్న రావు కంఠం అకస్మాత్తుగా మూగబోయింది. ఎందుకో వణికాను.
"రావ్!"
"ఏం, శారదా?"
అతి ప్రశాంతంగా ఉంది రావు స్వరం. మంచులా చల్లగా...
"కొంచెం రోజులయితే ఫరవాలేదు కాని..." ఏదో అనబోతున్నాను. గట్టిగా నవ్వాడు రావు.
"అవేవీ ఆలోచించకుండా సుఖంగా పడుకో, శారదా! నీకే ఇబ్భందీ రాకుండా నేను చూసుకుంటాను." మెత్తగా అన్నాడు రావు.
ఆ మెత్తదనం నా మనసును చుట్టుకుని మెలిపెట్టింది.
రావును దగ్గిరగా కౌగలించుకుని పడుకోవాలని పించింది. కనీ, ఒక్కసారి రావు చేతులను విదిలించాక, కనీసం ఆ నాటికి రావును సమీపించలేనని నాకు తెలుసు.
రావు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నాకు నిద్ర రాదు. శాంతి లేదు. తృప్తి లేదు. సుఖం లేదు.
ఈ పేదరికంలోంచి విముక్తి ఎలా వస్తుంది? అయ్యో! నా రచన!
15
ఇల్లంతా సందడిగా ఉన్నప్పుడు వ్రాయలేకపోయాను ఇప్పుడు ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది. అయినా, కలం కదలటం లేదు.
గుండెలనిండా పేరుకున్న ఈ బరువును ఎలా తొలగించుకోగలను?
పరిస్థితులతో రాజీ పడగలిగే సహనం లేదు.
ఎదురు తిరిగి నా స్వార్ధం మాత్రమే చూసుకునే క్రౌర్యమూ లేదు.
అందుకే 'నేను, నలిగిపోయి, ఎదటివాళ్ళను క్షోభ పెడుతున్నాను.
ప్రశాంత సమయం దొరికితే వ్రాసుకోవాలని తహతహలాడిన నేను, అలాంటి సమయం దొరగగానే వ్రాసుకోడానికి మారుగా బల్లమీద తల ఆనించి ఏడుస్తున్నాను.
ఎవ్వరూ లేరు నన్ను చూడటానికి! నా అంతరాంతరాల్లో కల్మషమంతా కన్నీళ్ళ రూపంలో స్వేచ్చగానే ప్రవహిస్తూంది.
ఏవో రెండు సుతిమెత్తని చేతులు నా కన్నీళ్లు తుడిచాయి.
ఉలికిపడి తల ఎత్తాను. పాప బిత్తరపోయి నన్ను చూస్తూంది. నా కన్నీళ్ళతో తడిసిన పాప లేతచేతుల్ని ముద్దుపెట్టుకుని పాపను ఎత్తుకున్నాను.
నా ఆవేదన శాంతించినట్లయింది. అప్పుడు స్ఫురించింది, పాప ఒక్కర్తే ఎలా వచ్చిందని!
పాపను ఎత్తుకుని హాల్లోకి వచ్చాను. పేము కుర్చీలో కూర్చుని ఏదో పత్రిక తిరగేస్తున్న రావు నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు.
రావు నవ్వు ఎంత అందంగా ఉంటుందీ! హేళనగా, తిరస్కారంగా, గంభీరంగా, విషాదంగా-ఎలా నవ్వినా రావు నవ్వు అందంగానే ఉంటుంది.
అప్పటి రావు నవ్వులో జాలీ లేదు. తిరస్కారమూ లేదు. ఆప్యాయత నిండి ఉంది. అందుకే మరింత అందంగా ఉంది.
నా రావు, నా పాప ఉండగా నేను ఒంటరి నెలా అవుతాను?
ఎందు కీ అజ్ఞాతభయం నాకు?
నా అంతరాంతరాల్లో నాకే తెలియకుండా అణిగిన చీకటి తలపుల మరో రూపమా ఈ భయం?
ఒక్క మాట మాట్లాడితే ఆ వాతావరణంలో సౌందర్యం చెదిరిపోతుందేమో అన్నట్లు రావు చిరునవ్వు చూస్తూ కూర్చున్నాను.
"ఏమిటలా చూస్తున్నావు, శారదా!" చిరునవ్వుతో అడిగాడు.
నేను సమాధానం చెప్పలేదు. చెప్పక్కర్లేదు. రావుకు సమస్తమూ తెలుసు. నే నేమిటో, నా ఆలోచనలేమిటో నా కంటే బాగా తెలుసు.
అప్పుడప్పుడు నా అశాంతికి కారణమేమిటో రావునే అడగాలనిపిస్తుంది. రావుకీ తెలిసి ఉంటుందని గాఢ విశ్వాసం నాకు.
కానీ, నా ముందే నేను నిర్భయంగా పరుచుకోలేని నా మనసును రావుముందు ఎలా విప్పగలను?
ఒక్కసారి రావు నెర్వస్ గా గొంతు సర్దుకున్నాడు. ఏదో అవాంఛనీయ విషయాన్ని చెప్పబోతున్నా డన్న మాట!
నా కేదీ వినాలని లేదు. అలా పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, రావును చూస్తూ కూర్చోవాలనిపించింది.
"శారదా! అత్తయ్యనూ, రాఘవనూ, నా స్నేహితుడు లతీఫ్ ఇంట్లో ఉంచాను. హాస్పిటల్ కి లతీఫ్ ఇల్లు దగ్గిర. మన చుట్టాలను మన ఇంట్లోనే ఉంచుకోవటం సభ్యత అనుకో! కానీ, సభ్యత కోసం పాపం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేముగా! లతీఫ్ చాలా మంచివాడు. పెద్ద ఇల్లు. మన వాళ్ళంతా ఉన్నా అతనికే ఇబ్బందీ ఉండదు. పరిమళ అక్కడే ఉంది. నేను వస్తూ పోతూ ఉంటాను."
ఎటో చూస్తూ పాఠం అప్పజెప్పినట్లు గబగబ చెప్పేస్తున్నాడు రావు.
నాకు అర్ధమయి పోయింది.
తన బంధువులు మా ఇంట్లో ఉండటం నేను సహించలేకపోయాను. అందుకని రావు ఏనాడూ చెయ్యనిపని-తన స్నేహితుణ్ణి బ్రతిమాలి వాళ్ళింట్లో పెట్టాడు.
భార్యనయిన నా కంటే ఒక స్నేహితుడు రావుకు సహాయపడగలిగాడు.
తన మనసును కోసే ఈ విషయాన్ని చిరునవ్వుతో, సాధ్యమయినంత మృదువుగా అతి సాధారణంగా చెప్పుకు పోతున్నాడు రావు.
నా మూర్ఖత్వానికి క్షమాపణ కోరుకోవాలనిపించింది. వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడే ఉంచమని ప్రాధేయపడాలనిపించింది.
కానీ, ఏదీ చెయ్యలేక పోయాను.
రావు నన్ను దూషించి ఉంటే, 'నా బంధువులు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదా?' అని దెబ్బలాడితే, అతనిని క్షమాపణ కోరటం నాకు సుకర మయ్యేది.
ఆప్యాయంగా మాట్లాడుతూ, ఎదురు నన్నే క్షమాపణలు కోరుతున్న ధోరణిలో వాళ్ళ అనుకూలం కోసమే వాళ్ళు మరోచోట ఉన్నట్లు మార్చి చెపుతూంటే క్షమార్పణలకు ప్రసక్తి ఎక్కడ? అయినా, ప్రయత్నం మానలేకపోయాను.
"ఇక్కడే ఉండమను. రావ్! ఫరవాలేదు." తల వంచుకుని అన్నాను. రావు నవ్వాడు.
"లతీఫ్ వాళ్ళ కప్పుడే అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. ఆ ఇల్లు వదిలి నువ్వు రమ్మన్నా వాళ్ళు రారు."
"లతీఫ్ అంటే..."
అనుమానంగా తల ఎత్తి చూశాను.
రావు నిర్లక్ష్యంగా నవ్వాడు.
"అందరూ చెప్పుకొనే ఆ లతీఫ్ ఇంట్లోనే..."
క్షణంసేపు మాట్లాడలేకపోయాను. ఆ లతీఫ్ గురించి రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. అతని తల్లి ఆంగ్లో ఇండియన్. తండ్రి మహమ్మదీయుడు ఏదో రాజవంశీకు డంటారు. త్రాగుబోతు, జూదరి. వ్యభిచారి అని చెప్పుకుంటారు. బాగా డబ్బు, అంతకు మించిన పలుకుబడి కలవాడనీ, పబ్లిక్ గా ఇంటికే వ్యభిచారి ణులను పిలిపించుకొంటాడనీ, పోలీసు అధికారులూ, పై ఆఫీసరులూ-అందరూ తెలిసినవా రవటంచేత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనీకూడా విన్నాను.
"ఆ లతీఫ్ నీకు స్నేహితుడా?"
"అవును చాలా దగ్గిర స్నేహితుడు."
"అలాంటి నీచులతో స్నేహం చేస్తున్నానా?"
"అతడు నీచుడు కాడు."
"కాడూ?! త్రాగుబోతని విన్నాను."
"అవును. త్రాగుతాడు. అప్పుడప్పుడు శృతిమించి త్రాగుతాడు."
"పచ్చి వ్యభిచారి."
"అవును స్త్రీలోలుడు."
"మరి, ఇంకా నీచుడు కాడంటా వేమిటి?"
"అతని వ్యక్తిత్వంలో ఇవి రెండూ బలహీనతలు. అంతమాత్రాన నీచుడని అనగలమా? మన అందరి లోనూ ఏవో బలహీనతలు ఉంటోనే ఉంటాయి".
"ఇలాంటి దుర్మార్గుడితో నువ్వు స్నేహం చెయ్యటం నా కిష్టం లేదు."
"నీతో పరిచయం కాకముందునుంచీ మేం స్నేహితులం."
"స్నేహ మనకు! అతని డబ్బుకు అమ్ముడుపోయానను!"
కసిగా అన్నాను.
గట్టిగా నవ్వాడు రావు.
"పిచ్చి శారదా!" అన్నాడు జాలిగా నన్ను చూస్తూ.
నాకు ఒళ్ళు మండిపోయింది.
"పిచ్చిదానిని కనకనే నీ కిలాంటి స్నేహాలున్నాయని కనిపెట్టలేక పోయాను. ముందు మనవాళ్ళ నిక్కడకు తీసుకొచ్చేసి, ఆ తరవాత అతని గడప తొక్కకు."
రావు తల అడ్డంగా తిప్పాడు.
"అహా! నే నా పని చెయ్యలేను. అలా చేస్తే లతీఫ్ కు కష్టం కలుగుతుంది."
"చెయ్యకపోతే నాకు కష్టం కలుగుతుంది."
కొన్ని క్షణాలు రావు మాట్లాడలేదు. ఆ తరవాత అతి నెమ్మదిగా, "నీకు కష్టం కలిగించే పని చెయ్యటం నా తరం కాదు, శారదా! అందుకే వాళ్ళను లతీఫ్ ఇంట్లో ఉంచాను. ఇంక ఆ విషయం వదిలెయ్యి" అన్నాడు.
మెత్తని దెబ్బ! అయినా, పదునైనది!
రావు లేచి నించుని, "నేను వెళ్ళాలి. పాపను ఉంచనా? తీసుకెళ్ళనా?" అన్నాడు.
"అప్పుడే వెళ్ళిపోతావా?"
"భోజనానికి వస్తాను."
రావు వెళుతూంటే పాప ఏడవటం మొదలు పెట్టింది. "పసిపిల్లలకు బయట తిరగటం ఇష్టం. ఎటైనా తీసుకెళ్ళు. నాకోసం పేచీ పెట్టదు."
పాపకు "టా! టా!" చెప్పి వెళ్ళిపోయాడు రావు.
పాప ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. గబగబ చెప్పులు వేసుకుని, ఇంటికి తాళం పెట్టుకుని బయట పడ్డాను.
వచ్చేపోయే కార్లనూ, బస్సులనూ, జనాన్ని చూస్తూ పాప పేచీ మరిచిపోయింది.
* * *
