Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 9


    "అదికాదమ్మా! ఆయన దగ్గర పనిచేసేటప్పుడు మంచి చెడ్డలు తెలుసుకొని చెయ్యడం మంచిది. అయినా - చలపతిరావుగారున్నారుగా! ఆయనతో ఈ విషయం చెప్పి ఆయన అభిప్రాయం కూడా అడుగు శ్రీశ్రీ గారి విషయాలు కూడా తెలుసుకో!" అన్నారు.
    నాన్నగారు చెప్పింది నిజమేననిపించింది.
    అమ్మని తీసుకొని చలపతిరావుగారింటికి వెళ్ళాను.
    ఆయన ఎవరితోనో మాట్లాడుతూండటం చూసి, సరాసరి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికే చాలా పొద్దుపోయింది.
    "ఏమిటే ఈ టైమప్పుడోచ్చేవు? ఏమిటి సంగతి?" అని అడిగారావిడ. జరిగిందంతా చెప్పాను.
    "చంపేవు ఫో! మంచి చిక్కేవచ్చింది. ఏం చేద్దామనుకుంటున్నావు?" అని అడిగారు.
    "భలేవారే వదినా! ఏం చెయ్యాలని మిమ్మల్ని అడగడానికి నేనొస్తే. తిరిగి మీరే నన్నడుగుతున్నారా?' అన్నాను.
    ఇంతలో చలపతిరావుగారక్కడికి వచ్చారు.
    "అన్నపూర్ణా! మంచి కాఫీపెట్టు" అని నావైపు చూసి, "సరోజ కూడా వచ్చిందే! రా - కూర్చో ఊరికే రావులే అందులోనూ, ఈ టైమప్పుడు ఏమిటి విశేషాలు?"
    "మీ పన్లన్నీ అయినట్టేనా? మధ్యలో మళ్ళీ ఎవరైనా వస్తారా" అన్నాను. "రారులే. ఎవరొచ్చినా ముందు నీ మాట వింటాను. చెప్పు" అన్నారు - శ్రీశ్రీగారు వచ్చిన సంగతి, వివరాలు అన్నీ చెప్పి "మీ ఉద్దేశం ఏమిట"ని అడిగాను.
    "మీ వదినతో చెప్పావా?".
    "ఆఁ - చెప్పాను"..
    "ఏమంది?"..
    "ఏం చెయ్యదలచుకున్నావని తిరిగి నన్నే అడుగుతోందన్నా" అన్నాను. "నిజమే. శ్రీశ్రీ దగ్గర పనేమిటమ్మా! ఇరవై నాలుగ్గంటలూ తాగుతాడు. పైగా స్త్రీలోలుడు" అన్నారు.
    "మరి నన్ను ఆయనకు పరిచయం చేసినప్పుడు ఈ విషయాలేవీ మీకు తెలియవా? ఏదైనా పనివుంటే ఇమ్మని మీరేకదా వారికి నన్ను పరిచయం చేశారు" అని అడిగేశాను.
    "అది కాదమ్మా! ఏదో అడపాదడపా స్క్రిప్ట్ పని అయితే చెయ్యవచ్చని అడిగాను. కానీ పెర్మనెంట్ గా అసిస్టెంట్ పనని చెప్పలేదు కదా! చూడు. ఆలోచించుకో తాటిచెట్టు కింద కూర్చొని పాలు తాగినా, కల్లనే అంటారంతా. శ్రీశ్రీ దగ్గర పనిచేస్తే నీకు మంచి పేరుండదు. అప్పుడు పనివేరు - ఇప్పుడు పనివేరు ఆయనతో వూరికి వేరే వెళ్ళాలంటున్నావు కాబట్టి ఉన్నమాట చెప్పాను.
    శ్రీశ్రీ చాలా గొప్పవాడు - మహాకవి. అందులో సందేహం లేదు. కానీ ఊర్లమ్మట వెళ్ళి ఆయన దగ్గర పెర్మనెంట్ గా సెటిల్ అయ్యావనుకో - ఎవ్వరూ నిన్ను మంచిగా మాత్రం అనుకోరు. పైగా ఎర్రగా బుర్రగా వున్నావు. నిన్ను వూరికే వదుల్తాడా - వదిలేడని నువ్వంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా? ఇది నీ జీవిత సమస్య. తొందర పడకు. నా దగ్గర పని నీకు ఎప్పుడూ వుంటుంది. ఆలోచించుకో" - అన్నారు.
    ఏమిటి - శ్రీశ్రీ గారి గురించి సవాల్ లా సమస్యలు ఎదురౌతున్నాయి?
    నాలో పట్టుదల పెరిగింది. ఈ సంగతేమిటో తేల్చుకోవాలనిపించింది.
    అంతా విని, చివరికి చలపతిరావుగారితో ఓ మాటన్నాను.
    "శ్రీశ్రీగారి దగ్గర పనిచేస్తే ప్రపంచం నన్ను చెడ్డగా అన్నప్పుడు మీ అందరి దగ్గరా చేస్తే మాత్రం అనకుండా ఊరుకుంటుందా? శ్రీశ్రీగారు పెద్దవాళ్ళు. కానీ చూడడానికి అతి సామాన్యంగా తరచూగమాసిన బట్టల్తో కనిపిస్తారు. మీరంతా సూటూ బూతూ వేస్తున్నారు. పైగా శ్రీశ్రీగారి కన్నా చిన్నవాళ్ళు. వారి దగ్గర పనిచేస్తేనే అపార్ధం చేసుకున్న లోకం, మీ దగ్గర చేస్తే ఊరుకుంటుందా? మీరంటే మీరనేకాదు. అశ్వత్దామగారు కానీండి, రాజేశ్వరరావుగారు కానీండి.
    శ్రీశ్రీ గారి దగ్గర పనిచేయడానికి అదే రీజన్ కాకూడదు. వారి విషయాలు మాకు అసలు తెలియవు. మీకన్నా సన్నిహితులేవరున్నారని, మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకున్నా మీరిచ్చిన సలహా కేవలం నా మీద, నా కుటుంబం మీద మీకుండే గౌరవాభిమానాల్ని తెలియజేస్తోంది. నేను శ్రీశ్రీగారికన్నా చిన్నదాన్ని చూసిన వాళ్ళకి తండ్రీ కూతుళ్ళమనే భావమైనా కలుగుతుంది. ఆయన విషయంలో సమర్ధించుకోడానికైనా నాకు అవకాశం వుంటుంది.
    ఫీల్డుకి వచ్చింది మొదలు నేనూ అందరి విషయాలు తెలుసుకుంటూనే వున్నాను. అందరూ చలపతిరావుగార్లూ, అన్నపూర్ణమ్మలూ అయిపోరన్నయ్యా! ఇప్పుడు నా కళ్ళముందు మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇంకా టైముంది కదా! ఆలోచిద్దాం!" అన్నాను.
    "నువ్వు ఎవరిదగ్గర పనిచేసినా నాకేం అభ్యంతరం లేదు. మంచి చెడ్డలు అడిగావు చెప్పాను. ఆలోచించుకొని నీకు ఏదిమంచిదని తోస్తే అది చెయ్యి మీ కుటుంబం మీరూ బాగుండడమే నా కోరిక" అన్నారు.
    ఆ తరువాత చాలామందిని అడిగాను. అందరూ, "శ్రీశ్రీ దగ్గర నీలాంటి అమ్మాయి పనిచేయడం అంతమంచిగా తోచడం లేదమ్మా ఆయన మహానుభావుడే! ఎక్కడుంటాడో తెలీదు. సరయిన అడ్రస్సు లేదు - వున్నా దొరకడు" - అంటూనే, అనేక విధాలుగా, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు.
    శ్రీశ్రీగారి క్యారెక్టర్ గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పలేదు. వాటిల్లో ఎంతవరకూ నిజం వుందీ అన్న విషయం మనకి తెలీదు. నాలో ఒక గుణం వుంది - చెప్పుడు మాటలు వినడం అంటే నాకు పరమ అసహ్యం. ఏ మాటయినా చెవులారా వినాలి. ఏదైనా కళ్ళారా చూడాలి. అప్పుడే నిజం అని నమ్ముతాను.
    ఎంక్వయిరీ లతో కాలం హరించుకుపోతోంది.
    ఇవన్నీ వింటున్న మా అమ్మగారు "మనకెందుకొచ్చిన గోలే తల్లీ! మన బాధలేవో మనం పడదాం. ఎవర్నడిగినా ఆయన దగ్గర పనివద్దన్న మాటే. అందుకే మిగిలిన ఆలోచనలన్నీ మానేసి మృదంగం కోర్స్ అన్నావుగా - అవి చదువు చాలని అంది".
    నేను, నాన్నగారు అర్దరాత్రి దాకా ఈ విషయం గురించే చర్చించేవాళ్ళం.
    ఆ రోజు రాత్రి నాన్నగారు "చూడు సరోజా! నువ్వేం చిన్న పిల్లవికావు. నీ మీద నాకు నమ్మకం వుంది. నీకు మూడు అవకాశాలు వచ్చాయి. నీకెలా తోస్తే అలా చెయ్యి" - అని గోడమీది పిల్లివాటంలా సమాధానం చెప్పారు.
    
                            *    *    *
                           
    నాన్నగారి సమాధానాలతో నిరుత్సాహపడ్డాననే చెప్పాలి. నిర్ణయం తీసుకునే బాధ్యత అందరూ నామీదే వదిలేశారు.
    వెంటనే శ్రీశ్రీగారు రాకపోవటం ఓ విధంగా మంచిదే అయ్యింది. ఆలోచించుకోడానికి కాస్త టైం చిక్కింది.
    ఈ మధ్యకాలంలో రిహార్సల్స్ కీ, రికార్డింగ్ లకి యథాప్రకారం వెళ్తున్నాను. పాటలమీదకన్నా శ్రీశ్రీగారి గురించి తెలుసుకోవడం మీదే దృష్టి కేంద్రీకరించాను.
    పని కట్టుకొని అందర్నీ అడగడం, వాళ్ళు చెప్పిన సమాధానాలు వినడం ఇదే రోజూ జరుగుతోంది.
    "ఆయనకేమిటమ్మా మహానుభావుడు! అటువంటి కవి ఏడీ! ఆ తాగుడొక్కటే ఆయన్ను నాశనం చేస్తోంద"ని కొందరు -
    "ఇంట్లో అతని గురించి పట్టించుకునేటట్టు లేర"ని కొందరు -
    "స్థిరత్వం లేద"ని కొందరు "ఎక్కడుంటారని పట్టుకోవడం" అని కొందరు "ఎప్పుడు చూసినా రోడ్లమ్మట పిచ్చివాడిలా తిరుగుతాడని కొందరు. "ఆడవాళ్ళని చూస్తే వదలడ"ని కొందరు -
    ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అభిప్రాయాలూ చెప్పుకొచ్చారు.
    "అంతా నిజం కాకున్నా, కొంతైనా వుండొచ్చు" అనిపించింది. నాలో పట్టుదల మరీ ఎక్కువైంది.
    అంత గొప్ప వ్యక్తికి ఈ చెడ్డ పేరేమిటి? ఈ తాగుడేమిటి? స్త్రీ వ్యసనం ఏమిటి? ఆయన దగ్గర పనిచేస్తే నిలబడగలమా? ఏటికెదురీత అవుతుందేమో? ఏం చేయాలి? నేను తీసుకునే నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి వుంటుంది. "సినీ ఫీల్డు లోనే స్థిరపడాలి" అనుకున్నప్పుడు ఎవరిదగ్గరియితేనేం మిగతావాళ్ళతో సరిపోల్చుకుంటే అన్నివిధాలా శ్రీశ్రీగారి దగ్గరే మెరుగనిపించింది.
    ఇకపోతే - కష్టాలు ...! అవి ఎక్కడున్నా తప్పవు.
    అదీగాక శ్రీశ్రీగారిని తలుచుకుంటే నాకు చాలా బాధా, జాలీకూడా కలిగాయి.
    ఇంత గొప్ప వ్యక్తికి అండగా వుండి 'నా బొందో' అని పాటుపడేవాళ్ళు ఒక్కరుంటే ఎంత బావున్ననిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS