ఆరోజు శుక్రవారం. మా నాన్నగారు యింట్లో లేరు. అమ్మ ఆఖరి చెల్లెల్ని స్కూలుకి దిగబెట్టడానికి వెళ్ళింది. పెద్ద చెల్లి రమోలా రికార్డింగ్ కి వెళ్ళిపోయింది.
అప్పుడు మేము మైలాపూరులో మద్దాల నారాయణ వీధిలో వుండేవాళ్ళం. ఇంటి అద్దె మూడు వందల రూపాయలు. అది అయ్యర్ల ఇల్లు, మేడమీద కాబట్టి చిన్న ఇల్లయినా గాలీ, వెలుతురూ వుండేది. లేకుంటే భూతగృహమే!
తలుపులన్నీ బిగించేసి, ఒంటినిండా బాగా పసుపు పూసుకొని స్నానం చేశాను. దమ్మిడీ అంత బొట్టు పెట్టుకుని తలకి తువ్వాలు చుట్టేసుకొని దేవుడి ముందు కూర్చున్నాను. ఒక్కదేవుడ్ని కూడా వదలలేదు. అందరు దేవుళ్ళనీ ఆరాధించాను. మహాలక్ష్మికి మంగళహారతి యిస్తూ, 'పవనామా సుతుడు బట్టు' అనే త్యాగరాజు కీర్తన పాడుకొని గంట వాయించాను. ఆ గంట చప్పుడులో వీధి తలుపు కొడుతున్న చప్పుడు వినిపించలేదు. దాంతో వచ్చిన వారెవరో గానీ విసిగిపోయి గట్టిగా బాదుతున్నారు.
'అమ్మ అయివుంటుంది' అనుకోని 'వస్తానుండమ్మా అంత గట్టిగా తలుపు కొట్టకు" అని లోపల్నుండే అరుస్తున్నాను.
నామాటకి సమాధానం లేదుగానీ తలుపు మాత్రం చప్పుడవుతూనే వుంది. సాష్టాంగ నమస్కారం తర్వాత చేద్దాంలే అనుకోని త్వరగా వెళ్ళి తలుపు తీశాను. పై ప్రాణాలు పైకే పోయినట్టనిపించింది.
నిజమా? కలా?
ఏం తోచలేదు. నన్ను నేను నిలదొక్కుకోలేకపోయాను.
ఎదురుగా శ్రీశ్రీగారు!
ఒకవైపు సంతోషం - ఇంకోవైపు గాభరా!
రండిసార్! లోనికి రండి. రండిరండి" అని సంధి పేలాపనలా ఏం మాట్లాడాలో నాకే తెలియకుండా ఆహ్వానించాను.
చిరుచెమట్లు పట్టాయి. సంభాళించుకున్నాను.
కూర్చోండి. రండి" - అంటూ జంభుఖానా తీయబోయాను.
దానిమీదున్న పరుపులన్నీ కిందపడ్డాయి.
ఆయన తిన్నగావెళ్ళి పడిపోయిన పరుపులమీదే కూర్చుండిపోయారు.
పిన్ డ్రాప్ సైలెన్స్!
సిగరెట్టు దమ్ము లాగే చప్పుడు తప్ప మరేంలేదు.
"సార్! టిఫిన్ చేస్తారా! ఇడ్లీ, కొబ్బరి చట్నీ" అన్నాను.
"నేను చేసే వచ్చాను" అన్నారు.
"అలా అనకండీ. మొదటిసారి మా యింటికి వచ్చారు. మీరేదైనా పుచ్చుకోకపోతే నేనొప్పుకోను. హార్లిక్స్ - పాలు - టీ - కాఫీ ఏం కావాలో చెప్పండి.
అంతవరకూ ఇదిగో రెండే ఇడ్లీలు పెట్టాను తినండి." - అంటూ, ఇడ్లీ ప్లేటు ఆయన ముందు పెట్టేను.
"టిఫిన్ వద్దన్నానుగా కొంచెం కాఫీ వుంటే ఇవ్వు" అన్నారు.
కాఫీ ఎప్పుడూ సిద్దంగానే వుంటుంది కనుక అట్టే ఆలస్యం కాలేదు.
గబగబా వేడిచేసి ఇచ్చాను తాగేశారు.
మళ్ళీ రెండువేళ్ళ మధ్యా సిగరెట్ వెలిగింది.
"మీ వాళ్ళెవరూ లేరా?".
"లేరండీ - బైటకి వెళ్ళారు".
"నేను వచ్చిన విషయం చెప్తాను. నాకు టైంలేదు. వెళ్ళిపోవాలి"
"చెప్పండి."
"నాకు మైసూరు నుండి టెలిగ్రాం వచ్చింది. మహాత్మా పిక్చర్స్ వారు 'గంధర్వకన్య' సినిమా తీస్తున్నారు. నన్ను మాటలు, పాటలు రాయమని బుక్ చేసుకున్నారు. స్క్రిప్ట్ అక్కడికి వెళ్ళే రాయాలి. ఏదైనా పనివుంటే యిప్పించమని ఆ రోజు కార్లో అడిగావుకదా! అవకాశం ఇప్పుడొచ్చింది. అందుకే అడగాలని వచ్చాను. నాకు అసిస్టెంట్ కావాలి. స్క్రిప్టు అంతా ఫేర్ చెయ్యాలి. ఆర్టిస్ట్ లందరికీ పోర్షన్లు రాసి ఇవ్వాలి. డబ్బింగ్ జరుగుతూ వుంటే నాతోపాటూ థియేటర్లలో ఫాలో అవుతూ వుండాలి. ఏమంటావ్ - నీకిష్టమేనా?"
"తప్పకుండా చేస్తానండి. కానీ మీరు చెప్పిన పనుల్లో ఏ ఒక్కదాంట్లోనూ నాకు అనుభవం లేదు. అసిస్టెంట్ అని మీరే అంటున్నారు. మీకు ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను."
"నేను నీకు ట్రయినింగ్ ఇస్తాలే. నువ్వేం భయపడొద్దు. కానీ చాలా అల్లరి పిల్లలా వున్నావు. నేను చెప్పినట్లు చెయ్యాలి. ఎవరు చెప్తే నాకిష్టం వుండదు అన్నారు "అలా చెయ్యను. కానీ చిన్న విషయం."
"ఏమిటి?"
"మైసూరే వెళ్ళాలా?"
"అవును"
"నాతో మా అమ్మగారు కూడా వస్తారండి. లేకుంటే నేను రావడం కుదరదు"
వారు వెంటనే - 'చూడు నాకు వాళ్ళిచ్చేవే మూడువేలు. అందులోనే నాకు రానుపోను ఖర్చులు పెట్టుకోవాలి. భోజనాలు, ఇల్లూ వాళ్ళే ఇస్తారనుకో అసిస్టెంట్ గా చేసినందుకు నీకు ఖర్చులుగాక ఎంతో కొంత ఇవ్వాలి కదా. నువ్వొక్క దానివీ అయితే ఫరవాలేదు కానీ మీ అమ్మగారికి కూడా నేనెక్కడ ఖర్చులు పెట్టగలను? నావల్ల కాదు".
"అయితే అసిస్టెంట్ గా నన్ను మీరీ జాబ్ కి పిలిచికూడా లాభం లేదు సార్"
"ఏం?"
"మా నాన్నగారు ననొక్కదానిని పంపరు. మా అమ్మగారు తోడురావాల్సిందే"
"అయితే మరెలా?"
"మీరేమీ అనుకోనంటే నా అభిప్రాయం చెప్తాను"
"-చెప్పు"
"నేను పనిచేసినందుకు ఎంతోకొంత పారితోషికం ఇస్తారు కదా! ఆ డబ్బుతో మా అమ్మగారికి రానుపోనూ ఖర్చులు నేను పెట్టుకుంటాను. నా ఖర్చులు మీరు పెడతారు'
"నేనెంత ఇస్తానని అనుకుంటున్నావు?"
"ఆ విషయం నేను ఆలోచించలేదండి"
"మూడువందల రూపాయలే ఇస్తాను. అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను" అన్నారు.
"సరేలెండి అందులోనే మా ఆమ్మగారికి టిక్కెట్లు పెట్టుకుంటాను. అలా అయితేనే నేనురావడానికి వీలుపడుతుంది. లేకుంటే లాభంలేదు" అన్నాను. "నువ్వొక్కదానివీ రావడానికి వీలుకాదన్నమాట. సరే ఇంకా టైం వుంది. నేను తర్వాత వస్తాను. ఈలోగా మీరు ఆలోచించుకొని ఏ విషయమూ నాకు చెప్పండి. మీరిద్దరూ వస్తానంటే నేనూ ఆలోచించాలి" అని వెళ్ళిపోయారు.
గుమ్మందాకా వెళ్ళాను. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
* * *
శ్రీశ్రీ గురించి నే విన్నది
జరిగినదంతా కలలా వుంది.
నిజంగానే శ్రీశ్రీగారు మా యింటికి వచ్చారా?
ఏమైనా - మనిషికి శుభ్రం తక్కువేనేమో అనిపించింది. బట్టలు మాసిపోయిన్నాయి. సెంటువాసన లేకున్నా దని బాబులాగా సిగరెట్టు కంపు మాత్రం వుంది.
ఇకపోతే - నా సమస్య?
అమ్మ ఇంకా రాలేదు. నాన్నగారు సాయంకాలానికి గానీ రారు. అన్ని విషయాలూ నాన్నగారితోనే చెప్పి మాట్లాడాలి.
ఓవైపు మ్యూజిక్ అసిస్టెంట్ గా అవకాశాలు - మరోవైపు కర్ణాటక మ్యూజిక్ కాలేజీవారి మృదంగం కోర్స్ స్కాలర్ షిప్ - ఇంకోవైపు శ్రీశ్రీగారి దగ్గర స్క్రిప్టు రైటింగ్ అసిస్టెంట్ గా అవకాశం....
ఈ మూడింట్లో దేనిని ఎంచుకోవాలి? అన్న ఆలోచనతో అప్పుడే బుర్ర వేడెక్కడం ప్రారంభమయ్యింది. ఏం తోచలేదు. దేవుడి పూజ బ్యాలన్స్ వుండిపోయింది. వెళ్ళి సాష్టాంగపడి "స్వామీ! ఏం చేస్తావో నీదే భారం!" "మా కష్టాలు తీరాలి. మేం బాగుపడాలి-" అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను.
మంచి సంగతులున్నప్పుడు చెప్పుకోడానికి ఎవరూ లేకుంటే, ఆ ఒంటరి తనంలో కలిగే బాధా, ఆందోళనా వుంటాయే - అవి అనుభవించినవాళ్ళకి కానీ అర్ధంకాదు.
ఇంతలో - "సరోజా!" - అన్న అమ్మ పిలుపు వినిపించింది. 'అమ్మయ్య' - అనుకున్నాను.
అమ్మతో జరిగినదంతా చెప్పాను. ఆలోచించుకోవాల్సింది నేనూ, అమ్మా నాన్నగారేకదా!
"నాకేమీ తెలీదు. నీ యిష్టం - మీ నాన్నగారిష్టం" - అని వూరుకుంది అమ్మ. ఒట్టి అయోమయలోకం!
ఇంక నాన్నగారే ఈ సమస్యకి ఓ మార్గం చూపించాలి!
ఎలాగో - సాయంత్రం దాకా కాలక్షేపం చేశాను. నాలుగు గంటలైంది. నాన్నగారు వచ్చారు.
జరిగిందంతా నాన్నగారితో చెప్పాను.
ఉలకలేదు - పలకలేదు.
ఆలోచనలో పడ్డారనుకున్నాను.
కొంతసేపాగాక - "చెప్పండి నాన్నగారూ!" అన్నాను.
"శ్రీశ్రీగారు చాలా పెద్ద మనిషి! పేరు పొందిన కవి! అంతవరకే మనకు తెలుసు. ఇంకా మిగిలిన విషయాలు తెలుసుకోవద్దా" అన్నారు.
"ఎలాంటి వారైతే మనకేం నాన్నగారూ!" అన్నాను.
