Previous Page Next Page 
విశిష్ట పేజి 39

    నిందితుడికి ఆరువందల రూపాయల జరిమానా, నెలరోజుల ఖైదూ విధిస్తూ! ఈలోగా ఆ పిల్ల పడిన మానసిక వేదనకు అది సరైన పరిహార మంటారా?

    బాధితులకు న్యాయం జరగడం ఆలస్యమైనకొద్దీ వాళ్ళు పడే మానసిక క్షేభను ఎవరు వర్ణించగలరు? అందుకే నాకు పోలీసులన్నా, చట్టాలన్నా సదభిప్రాయం లేదు."

    "బాధ్యతాయుతమైన పదవిలో వుండి కోర్టులనూ, చట్టాలనూ విమర్శించడం తగునా?" ఒక విలేఖరి చురుగ్గా అడిగాడు.

    "విమర్శ కాదు. ఉన్న విషయం చెప్పుకోవడం అంతే! మీకు నిజంగా కోర్టుల మీద, చట్టాల మీద అంత నమ్మకం వుంటే ఈమెను చెరచడానికి ప్రయత్నించిన మన హోంమినిస్టరు కొడుకును వెంటనే అరెస్ట్ చేయమనండి. మన హోంమనిస్టరుగారిని నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా ఇమ్మని డిమాండ్ చేయండి."

    "హోంమినిస్టర్ డౌన్ డౌన్! హోం మినిస్టర్ పదవికి రాజీనామా యివ్వాలి."

    ప్రజల్లోంచి నినాదాలు మొదలయ్యాయి.

    వేదికమీదే వున్నాడు హోంమినిస్టరు. అతడి ముఖం అప్పటికే నల్లబడిపోయింది.

    అయినా చింత చచ్చినా పులుపు చావనట్టుగా.

    "మీరిదంతా నమ్ముతున్నారా? ఇదంతా ప్రతిపక్షాలు పన్నిన కుట్ర. నన్నూ, నా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి. ఆడిస్తున్న నాటకం ఇది! దీనవ్వ లాకప్ లోవేసి నాలుగు తగిలిస్తే దీని వెనుకున్న కుట్రదారులెవరో బయటపడతారు."

    "యాసిడ్ పడి కాలిపోయిన మీ కొడుకు ముఖం చూసినప్పుడైనా మీరు నిజం ఒప్పుకొంటారా?" కోపంగా అడిగింది విశిష్ట.   

    "నీదంతా నాటకమని చెబుతున్నాగా?"

    ఎవరో ఎస్సై గబగబా వచ్చి హోం మినిస్టర్ చెవిలో ఏదో చెప్పాడు. అతడి ముఖం మరింత మాడిపోయింది. గాబరాగా వేదిక దిగి కారెక్కబోయాడు.

    "విషయమేమిటో తేలకుండా మీరిక్కడినుంచి కదలటానికి వీల్లేదు" చుట్టుముట్టారు విలేఖరులూ, జనాలూ.

    "నేనిక్కడ వుంటే మాత్రం విషయం ఎలా తేలుతుంది? నాకవతల అర్జంటుపని వుంది. నన్ను వెళ్ళనివ్వండి."

    "ఆ అర్జంటు పని ఏమిటో మాకు చెప్పండి మహాశయా! చెప్పేదాకా కదలనివ్వం."

    అతడికి కన్నీళ్ళ పర్యంతమైంది.

    "అవతల నా ఒక్కగానొక్క కొడుకు చావుబ్రతుకుల మధ్య వున్నాడయ్యా! దయచేసి నన్ను వదిలిపెట్టండి"

    "ఏమైంది మీ కొడుక్కి?"

    "తెలీనట్టు అడుగుతారేం? ఈ దుర్మార్గురాలు ఇందాకే చెప్పిందికదా నా కొడుకు ముఖం మీద యాసిడ్ పోసి వచ్చానని? వాడి ముఖం కాలిపోయి హాస్పిటల్ కి తీసుకెళ్ళారట. పరిస్థితి చాలా సీరియస్ గా వుందట. నన్ను వెళ్ళనివ్వండి" చేతులెత్తి దండం పెట్టాడు.

    "ఇందాక నాటకమన్నారుగా? ఎవరో పన్నిన కుట్ర అన్నారుగా?"

    "అంతా నిజమే. మహాజనులారా! ఇది నా కొంప ముంచింది" ఉన్మాదిలా అరిచాడు.

    "మీరు రాజీనామా చెయ్యందే మిమ్మల్ని వెళ్ళనివ్వం. ముందు రాజీనామా పత్రం రాసి సంతకం పెట్టండి" అని చుట్టూ వున్నవాళ్ళు డిమాండ్ చేశారు.

    మాధవరావు దవడలు ఆగ్రహంతో బిగుసుకున్నాయి. ఒక విలేఖరి చేతిలోని ప్యాడ్ ని విసురుగా లాక్కొని దానిమీద బరబరాగీకి సంతకం పెట్టి సి.ఎం చేతికిచ్చి కన్నీళ్ళతో దండం పెట్టి కదిలాడు.

    ఈసారి అడ్డుపెట్టలేదెవరూ.

                                             *    *    *

    "ఎంతో సాహసంతో ఒక దుర్మార్గుడి అంతుచూసిన  ఈ కాలేజీ యువతికి మీరు కల్పిస్తున్న రక్షణ ఏమిటి సార్?"

    "ఆమె రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకుంటాం. ఈ సభ అయిపోగానే కింది అధికారులకు నా ఆదేశాలు అందుతాయి. ఆ విషయంలో అందరూ నిశ్చింతగా వుండండి. ఎంతో ధైర్యంతో ఒక దుర్మార్గుడికి తగిన బుద్దిచెప్పి వచ్చి విశిష్టను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

    ఆడపిల్లలు ఈమెను చూసి నేర్చుకోవలసింది ఎంతో వుంది. ఎవరో ఆకతాయి ప్రేమలేఖ రాశాడనో, అల్లరి పెట్టాడనో కాలేజీ మానేసి ఇంట్లో కూర్చునే అమ్మాయిలను ఎందరినో చూశాను.

    చదువుకోడానికనో, ఉద్యోగం చేయడానికనో బయటికి వచ్చే ఆడవాళ్ళు కొందరు మగవాళ్ళ వేధింపులకు గురౌతూనే వుంటారు. చాలామంది మూగగా భరిస్తే కొద్దిమంది మాత్రమే ప్రతిఘటిస్తారు. అతి కొద్దిమంది మాత్రమే మానమర్యాదలనూ, ప్రాణాలను పణంగాపెట్టి దుర్మార్గులకు గుణపాఠం నేర్పడానికి సిద్దపడతారు.

    అలాంటి అరుదైన వాళ్ళలో చేర్చదగిన ఆదర్శయువతి ఈ విశిష్ట. ఈమెను నేను మనస్పూర్తిగా అభినందించడమే కాదు - దుర్మార్గులనుంచి ఈమెకు కావలసిన భద్రత కూడా మన ప్రభుత్వం సమకూర్చగలదని నేను హామీ యిస్తున్నాను"

    ప్రెస్ మీట్ లో చెప్పాడు. సి.ఎం. విశిష్టతో కలిసి ఫోటో కూడా తీయించుకున్నాడు.

    మరుసటి రోజు పత్రికల్లో ఫ్రంట్ పేజీలోనే వచ్చేసిందా వార్త. సి.ఎం.తో దిగిన ఫోటో కూడా వేశారు.

    విశిష్టను అభినందనల పరంపర వెల్లువెత్తింది.

                                             *    *    *

    హాస్పిటల్లో పృధ్వీ ముఖానికి బ్యాండేజీ వేస్తున్న నర్సుకు కడుపులో తిప్పుతున్నట్లుగా అవుతోంది. అంత వికృతంగా మారింది అందమైన పృధ్వీ ముఖం.

    ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. మరొక కంటిచూపు అనుమానాస్పదంగా వుంది.

    ముఖం యాసిడ్ పడ్డచోటల్లా ఎలుకలు కొరికినట్టుగా అయింది. ఆ గుంటల్లో ఉడికిన మాంసం వికృతంగా కనిపిస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS