Next Page 
అగ్ని కెరటాలు  పేజి 1


                        అగ్నికెరటాలు

                                                __పోల్కంపల్లి శాంతాదేవి


                            సౌభాగ్యం


    వసారాలో తెల్లటి గుడ్డ కప్పి  పడుకోబెట్టి వుంది ఒక మానవాకృతి. అతడి తల దిక్కున వెలుగుతూన్న దీపం మరణ సంకేతాన్నిస్తూంది. గ్లాసులోపోసిన బియ్యంలో గుచ్చబడిన అగరొత్తులు బూడిదగా మిగిలాయి.

    ఒకాయన ఇంట్లోకి వచ్చి, తలకి తువాలుచుట్టుకొంటూ శవాన్ని ఎత్తడానికి సమాయత్త మౌతుంటే చుట్టూ కూర్చున్న ఆడవాళ్లు గొల్లుమన్నారు.

    "నా తండ్రే నీకప్పుడే నూరేళ్లు నిండాయిరా!...... ఈ గర్బశోకం ఎలా భరించను దేవుడో!" తల్లి రాగం తీసింది.

    నిన్న కడుపునొప్పంటూ గిలగిల్లాడుతూంటే హాస్పిటల్ కంటూ బయల్దేరారు. దారిలోనే చనిపోయాడు చంద్రం.
 
    అతడికి శంకరితో పెళ్లయి ఆరు నెలలే అయింది! అంతమంది ఆడవాళ్లు గోలుగోలున ఏడుస్తూంటే శంకరి మాత్రం స్తబ్దంగా, కళ్ళల్లో నీళ్లు లేనట్టుగా  అతడి తల దగ్గర కూర్చొని వుంది! శవాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుండి అదే తీరు.
 
    "మగడు చస్తే ఏడవదేమమ్మా? ఇది ఆడదా? రాయా? కనీసం కళ్లు చెమ్మగిల్లను కూడా లేదు!" వచ్చిన వాళ్లలో వ్యాఖ్యానం.

    "కొంతమందికి గుండెలో దావానలం మరుగుతూన్నా ఏడుపు రాదు. కళ్లకి నీళ్లు రావు.  పాపం! కట్టిన తాళి ఆరు నెలలు తిరగకుండా పుటుక్కున తెగితే ఏ ఆడదాని గుండె బ్రద్దలైపోదూ? ఆ చూపుల్లో ఏమైనా జీవం వుందా? రాయిలా ఎలా కూర్చుందో చూడు!"

    "నిన్నటిదాకా ఎంతో ఆరోగ్యంగా వున్నవాడు.  ఒక గంట కడుపునొప్పని ఆయాసపడి, డాక్టరు దగ్గరికంటూ బయల్దేరివెళ్లి పావుగంటలో శవమై ఇంటికి తిరిగి వస్తే ఆ భార్య ఏం కావాలి?"

    వీళ్ల విమర్శలతో, సమాధానాలతో ప్రమేయం, లేకుండా నలుగురు మగవాళ్లు  ముందుకు వచ్చి  శవం మీద కప్పిన గుడ్డ తొలగించారు.

    "వద్దు! నా కొడుకును బూడిద చేయొద్దు. చూడండి. నిద్రపోయి లేస్తాడన్నట్టుగా వుంది ఆ ముఖం!" తల్లి అతడి చెంపలు నిమురుతూ బోరున ఏడవసాగింది.

    ఆ దుఃఖం తరిగేది కాదు! ఇంకా ఎంతసేపని పెట్టుకొంటారు  శవాన్ని?  ఇప్పటికే ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి.

    ఇధ్దరు ఆడంగులు తల్లిని పట్టుకోగా, శవాన్ని బయటికి తీసికెళ్లి ఇడుపున కూర్చోబెట్టి స్నానం వగైరా కానిస్తూంటే.

    ఒకాయన అన్నాడు "భార్యని బయటికి తీసుకురండి. ఇడుపున కూర్చోబెట్టి పూలుకుంకుక ఇచ్చి చేయాల్సిన తతంగం ఏదో పూర్తుచేయండి!"

    ఎవరెంత పిలిచినా శంకరి బయటికి రాలేదు.

    ఇంటి ముందు నుండి శవం వెళ్లిపోయాక తలారా స్నానం చేసి, నుదుట యధావిధిగా బొట్టు దిద్దుకొని పక్కమీద కల్లుమూసుకు పడుకొంది శంకరి. తిండిలేక కడుపూ, నిద్ర లేక  కళ్లూ భగ భగ మండిపోతున్నాయి. కళ్లలో ఇసుక పడ్డట్టు మంట.

    చాలా సేపటికి ఎవరో వచ్చి,  భోజనానికి లేపారు. వెళ్లి విస్తరి ముందు కూర్చొంటే కాని పిడచకట్టుకుపోయిన నోటికి అన్నం సహించలేదు.  కడుపులో ఆకలిగా వున్నా తినలేక పోయింది. రెండుముద్దలు బలవంతంగా తిని, చెంబుడు నీళ్లు గటగటా త్రాగి చెయ్యి కడుక్కుని మళ్లీ వచ్చి పడుకొంది.

    మరురోజు స్నానం చేసి యధావిధిగా బొట్టుదిద్దు కొంటున్న కోడల్ని చూసి రామచంద్రం తల్లి పద్మమ్మ ఉండబట్టలేకపోయింది. "మైలలో బొట్టు పెట్టుకోకూడదు. అసలు బొట్టు పెట్టుకొనే అర్హతేముంది నీకు? బొట్టు పెట్టుకొన్నంత మాత్రాన ముండవి ముత్తయిదువువి కావు కదా?"

    నిర్భయంగా చెప్పింది శంకరి "ఈ బొట్టు నా జన్మ హక్కు. ఇది ఆయనతో రాలేదు. ఆయనతో పావడానికి. ఈ మాంగల్యం, ఈ మట్టెలూ ఇవి మాత్రమే ఆయనతో వచ్చినవి ఇవి పదవరోజు  వరక్కూడా నా ఒంటిమీద మోయనక్కర లేదు. కావాలంటే ఇవి ఇప్పుడే తీసి వేస్తాను!"

    "పద్దతి ప్రకారం పదవ రోజున బావి గట్టున చాకల్ది గాజులు పగులగొట్టి, పుస్తె తెంపి, నుదుట కుంకుమ చెరిపేస్తుంది. ఆ పని నువ్వే నట్టింట్లో చేసి, ఇంటికి ఆ అరిష్టం తీసుకురావాలనుకొంటున్నావు?" పద్మమ్మ కోపంగా అడిగింది.

    "నేనేం తప్పు చేశానని ఇప్పుడీ అరిష్టం జరిగింది? ఇంతకు మించి జరిగేది ఏముంది?" మెడలో పుస్తెల తాడూ, కాళ్ల మట్టెలూ తీసి శంకరి తన పెట్టెలో వేసుకొంటుంటే అత్తగారు నోరు నొక్కుకుంది "అవ్వ! అంతా అప్రాచ్యపు పనులు. దీని బుద్దికి తగ్గట్టే దీని నుదుట ముండరాత రాశాడు దేవుడు!"

    తొమ్మిదో నాటి వరకు చుట్టాలందరూ వచ్చేశారు.

    శంకరి అన్నగారు కృష్ణమాచారి చెల్లెలికి తెల్ల సైన్సు బట్టా,వెండి గాజులూ తీసుకువచ్చాడు. తమపద్దతి ప్రకారం తెల్లవారుఝామున చాకల్ది బావి గట్టుకు తీసికెళ్లి గాజులు పగులగొట్టి, నుదుట కుంకుమ  చెరిపి, మెడలో తాళి పుటుక్కున తెంపుతుంది తరువాత ఆమె బావిలో మునిగి ఇంటికి వచ్చి ఆమె కోసం పుట్టింటి వాళ్లు తెచ్చిన తెల్ల సైనుబట్ట  చుట్టుకొని, వెండి గాజులు తొడుక్కొని, గదిలో ఒక మూలన ఎవరికీ తన పాపిష్టి ముఖం చూపకుండా కూర్చోవాలి! అదంతా తలుచుకొంటుంటే ఆచారికి గుండెల్లో దేవుతున్నట్టుగా వుంది.

    "పెళ్లయి ఆరు నెలలైనా కాలేదు. నిండా ఇరవయ్యేళ్లు లేవు. అప్పుడే చెల్లెలికి వైధవ్యమా? ఆ వైధవ చిహ్నాలను తన చేతులతో తీసుకురావడమా? ఎంత దురదృష్టకరమైన సంఘటన  ఇది!"  ఆచారి చెల్లెలి ముందుకు వస్తూ నోట్లో గుడ్డ కుక్కుకున్నాడు.

    శంకరి కళ్లలో మొదటిసారిగా కన్నీరుబికింది.  తనకి ప్రాప్తించిన వైధవ్యానికి కాదు! ఇరవయ్యేళ్లకే అంతా అయిపోయినందుకు కాదు!  అన్నగారిని అంత విషాదంలో చూస్తున్నందుకు!

    "పసుపు, కుంకుమలిచ్చి, పంపాల్సిన అన్నయ్య ఇవాళ తెల్లసైనుబట్టా, వెండి గాజులూ తెచ్చాడమ్మా, ఎంత దౌర్భాగ్యమమ్మా ఇది నాకు!" గుండె బ్రద్దలైపోతున్నట్టుగా ఏడిచాడు.

    తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి నాలుగేళ్ల క్రిందట పోయింది. ఈ  అన్నగారే శంకరి మంచీ చెడ్డా చూశాడు. పెళ్లిచేసి అత్తవారింటికి సాగనంపాడు. ఇప్పుడు... .ఆరు నెలలైనా తిరక్కముందే.... ఇంత పనీ జరిగింది.


                      *    *    *    *

   
    ఇంకొక గంటలో తెల్లవారుతుందనగా రామచంద్రానికి అత్తవరుసయిన ఒకామె, శంకరి పడుకొన్న చోటికి నిశ్శబ్దంగా వచ్చి లేపింది. "శంకరమ్మా! లే! చాకలిది వచ్చింది! ఎవరూ లేవకముందే బావి గట్టున ఆకాస్తా తతంగం పూర్తి చేసుకు వచ్చెయ్యి!"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS